కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పబ్లో ఉచోవా, వెట్ తాన్
- హోదా, బీబీసీ న్యూస్
పేద దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెరపైకి తీసుకొచ్చిన కోవాక్స్ కార్యక్రమంలో చైనాలోని రెండు ప్రధాన వ్యాక్సీన్ తయారీ సంస్థలు భాగస్వాములయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా 11 కోట్ల డోసుల చైనా వ్యాక్సీన్లను(సినోవ్యాక్, సినోఫార్మ్) కూడా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సీన్ అండ్ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) తెలిపింది.
2022నాటికి 200 కోట్ల డోసుల వ్యాక్సీన్లను పేద దేశాలకు అందించేందుకు 11 ప్రధాన వ్యాక్సీన్ తయారీ సంస్థలతో జీఏవీఐ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు సినోఫార్మ్‌తోపాటు సినోవ్యాక్‌కు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా డజనుకుపైగా దేశాల్లో ఈ రెండు వ్యాక్సీన్లను ఇస్తున్నారు.
అయితే, ఈ చైనా వ్యాక్సీన్ల గురించి మనకు ఏం తెలుసు. ఇతర వ్యాక్సీన్ల కంటే ఇవి ఎలా భిన్నమైనవి?

ఫొటో సోర్స్, Getty Images
సినోవ్యాక్ ఎలా పనిచేస్తుంది?
చైనాలో తొలి వ్యాక్సీన్‌ను బీజింగ్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సినోవ్యాక్ అభివృద్ధి చేసింది. దీన్ని కరోనావ్యాక్‌గా పిలుస్తున్నారు. అచేతనం చేసిన వైరస్ సాయంతో ఈ వ్యాక్సీన్‌ను తయారుచేశారు.
అంటే నిర్వీర్యంచేసిన వైరస్ భాగాల సాయంతో ఈ వ్యాక్సీన్ మనలో రోగ నిరోధక స్పందనలను క్రియాశీలం చేస్తుంది. దీని వల్ల తీవ్రమైన కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు తగ్గుతుంది.
మోడెర్నా, ఫైజర్ వ్యాక్సీన్లు ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సీన్లు. అంటే కరోనావైరస్ జెనిటిక్ కోడ్ సాయంతో వీటిని తయారుచేస్తారు. వీటిని ఎక్కించిన వెంటనే, మన శరీరం వైరల్ ప్రోటీన్ల ఉత్పత్తిని మొదలుపెడుతుంది. ఫలితంగా వైరస్‌తో ఎలా పోరాడాలో రోగ నిరోధక వ్యవస్థకు అవగాహన వస్తుంది.
‘‘సంప్రదాయ విధానాల్లో కరోనావ్యాక్‌ను అభివృద్ధి చేశారు. రేబిస్ లాంటి చాలా వ్యాక్సీన్లను ఇలానే తయారుచేశారు’’అని నాన్యంగ్ టెక్నొలాజికల్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ల్యూవో దహాయ్ చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లానే దీన్ని కూడా నిల్వ చేయడం చాలా తేలిక. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నడుమ ఈ టీకాలను నిల్వ చేయొచ్చు. ఆక్స్‌ఫర్ వ్యాక్సీన్‌ను చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే వైరస్‌లో జన్యు మార్పులుచేసి తయారుచేశారు.
మోడెర్నా వ్యాక్సీన్‌ను మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఫైజర్ వ్యాక్సీన్ అయితే మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి.
అల్పాదాయ దేశాల్లో ఇలాంటి కనిష్ఠ ఉష్ణోగ్రతల నడుమ భారీ స్థాయిలో టీకాలను నిల్వ చేయడం చాలా కష్టం. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో సినోవ్యాక్, ఆక్స్‌ఫర్డ్ టీకాలు చక్కగా ఉపయోగపడతాయి.

ఫొటో సోర్స్, EPA
సామర్థ్యం ఎంత?
సినోవ్యాక్ వేసుకుంటే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకే ముప్పు 51 శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేపట్టిన అధ్యయనంలో తేలింది. తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యే ముప్పును ఈ టీకా 100 శాతం అడ్డుకోగలదని రుజువైంది. 18ఏళ్లకు పైబడిన వారిపై జూన్‌లో ఈ అధ్యయనం చేపట్టారు.
అయితే, ఈ అధ్యయనంలో 60ఏళ్లకు పైబడిన వారు కొద్దిమందే పాల్గొన్నారు. దీంతో 60ఏళ్లకు పైబడిన వారిపై ఈ టీకా ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పష్టమైన సమాచారం లేదు.
ఈ టీకా 65.9 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని చిలీలో చేపట్టిన అధ్యయనంలో రుజువైందని ద ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. ఆసుపత్రి పాలయ్యే ముప్పును 87.5 శాతం, మరణ ముప్పును 86.3 శాతం తగ్గిస్తుందని తెలిపింది.
అయితే, డెల్టా వేరియంట్‌పై ఈ టీకా ఎలా పనిచేస్తుందో ఎలాంటి సమాచారమూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సినోఫార్మ్ వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుంది?
చైనా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్, సినోఫార్మ్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి. దీన్నే బీఐబీపీ అని కూడా పిలుస్తున్నారు.
దీన్ని కూడా సినోవ్యాక్‌లానే అచేతనం చేసిన వైరస్ భాగాలతో తయారుచేశారు.
శరీరంలోకి ఎక్కించే ముందే ఈ వైరస్‌ను నిర్వీర్యం చేస్తారు. దీంతో దీన్ని తీసుకున్న తర్వాత కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకదు.
‘‘ఈ వ్యాక్సీన్ తీసుకుంటే ఆసుపత్రి పాలయ్యే ముప్పు 79 శాతం వరకు తగ్గుతుంది. అన్ని వయసుల వారినీ కలిపి అధ్యయనం చేపట్టినప్పుడు ఈ ఫలితాలు వెలువడ్డాయి’’అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఇప్పటికే చైనాలో 100 కోట్ల డోసులకుపైనే వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది.
చైనాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణలోకి వచ్చింది. చాలాచోట్ల ఆంక్షలను కూడా సడలించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏఏ దేశాల్లో చైనా వ్యాక్సీన్లు ఇస్తున్నారు?
చైనా తయారుచేస్తున్న వ్యాక్సీన్లను 80కిపైగా దేశాల్లో ప్రజలకు ఇస్తున్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఆసియా దేశాల్లోనూ ఈ వ్యాక్సీన్లు ఇస్తున్నారు.
అయితే, భారీ స్థాయిలో ప్రజలకు చైనా వ్యాక్సీన్లు ఇచ్చిన కొన్ని దేశాల్లో ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.
ఉదాహరణకు చిలీ తీసుకుందాం. ఇక్కడ 70 శాతం కంటే ఎక్కువ మందికి రెండు డోసుల వ్యాక్సీన్లు ఇచ్చారు. వీరిలో ఎక్కువ మందికి సినోవ్యాక్ వ్యాక్సీనే ఇచ్చారు.
అయితే, వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ కేసులు ఇక్కడ పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ చాలాచోట్ల కర్ఫ్యూ విధిస్తున్నారు. ప్రయాణ ఆంక్షలను కూడా అమలులోకి తీసుకొచ్చారు.
తక్కువ జనాభా ఉండే మంగోలియా, సీషెల్స్‌లోనూ తలసరి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రెండు దేశాల్లోనూ ఎక్కువ మందికి సినోఫార్మ్ వ్యాక్సీన్ ఇచ్చారు. సీషెల్స్‌లో 68 శాతం మందికి, మంగోలియాలో 55 మంది రెండు డోసుల వ్యాక్సీన్లు ఇచ్చారు. అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయి.
మరోవైపు థాయ్‌లాండ్ వ్యాక్సీన్ విధానంలో మార్పులు చేసింది. రెండు డోసుల సినోవ్యాక్ తీసుకున్నప్పటికీ ఇక్కడ వందల సంఖ్యలో వైద్య సిబ్బందికి కరోనావైరస్ సోకింది. దీంతో ఇప్పుడు సినోవ్యాక్, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్లను కలిపి ఇస్తున్నారు.
ఇండోనేసియాలో రెండు డోసుల సినోవ్యాక్ తీసుకున్నప్పటికీ 30 మంది ఆరోగ్య సిబ్బంది మరణించినట్లు దేశ వైద్యులు, నర్సుల సంఘం తెలిపింది.
దీంతో రెండో డోసు కింద వేరే వ్యాక్సీన్ ఇవ్వాలని ఇక్కడ ప్రణాళికలు రచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్లు సరిగా పనిచేయడం లేదా?
ఈ దేశాల్లో కేసులు పెరగడానికి వ్యాక్సీన్లను కారణంగా చూపకూడదని నిపుణులు అంటున్నారు.
మరోవైపు కొత్త వేరియంట్లపై వ్యాక్సీన్ల సామర్థ్యం తగ్గుతోందని, పాత వేరియంట్లపై పనిచేసినంత సామర్థ్యంతో కొత్త వేరియంట్లపై వ్యాక్సీన్లు పనిచేయడంలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు అదనంగా బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతులు జారీచేయాలని అమెరికా ప్రభుత్వాన్ని ఫైజర్ కోరింది.

ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images
వేరే కారణాలూ ఉన్నాయి..
దేశంలో పెద్దయెత్తున వైద్య సిబ్బంది మరణించడానికి ఇతర అనారోగ్యాలూ ఒక కారణమని ఇండోనేసియా వైద్యుల సంఘం తెలిపింది.
మరోవైపు ఇక్కడ రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వారు జనాభాలో 5 శాతం మంది కూడా లేరు.
ఒక డోసు వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత సామాజిక దూరం పట్టించుకోకుండా తిరగడం వల్లే చిలీలో కేసులు పెరిగాయని నిపుణులు అంటున్నారు.
తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షణ కల్పించడంలో సినోవ్యాక్, సినోఫార్మ్ చక్కగా పనిచేస్తున్నాయని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజీ అండ్ బయోస్టాటిస్టిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ బెన్ కౌలింగ్ అన్నారు.
‘‘అంటే ఇప్పటికే ఈ వ్యాక్సీన్లు చాలా మంది ప్రాణాలను కాపాడాయని మనం అర్థం చేసుకోవాలి.’’

ఫొటో సోర్స్, EPA
కొత్త వేరియంట్లతో ఎలా?
వూహాన్‌లో మొదట్లో వ్యాపించిన వైరస్‌పై సినోవ్యాక్, సినోఫార్మ్ చక్కగా పనిచేస్తున్నాయని మొదట్లో చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. అయితే, కొత్త వేరియంట్లపై ఈ వ్యాక్సీన్లు ఎలా పనిచేస్తున్నాయో స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.
అచేతన వైరస్ భాగాలతో తయారుచేసిన వ్యాక్సీన్లు డెల్టా సహా కొత్త వేరియంట్లపై 20 శాతం తక్కువ సామర్థ్యంతో పనిచేయొచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలినట్లు కౌలింగ్ చెప్పారు.
దక్షిణాఫ్రికాలో భారీగా చెలరేగిన బీటా వేరియంట్‌పై మరింత తక్కువ సామర్థ్యంతో ఈ వ్యాక్సీన్లు పనిచేస్తాయని ఆయన అన్నారు. వూహాన్‌లో తొలి నాళ్లలో చెలరేగిన వైరస్ కంటే ఈ వేరియంట్ చాలా భిన్నమైనది.
డెల్టా సహా కొత్త వేరియంట్లపై చైనా వ్యాక్సీన్ల సామర్థ్యం తగ్గుతుందని ముందే ఊహించినట్లు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జిన్ డాంగ్ యాన్ అన్నారు.
‘‘సినోఫార్మ్, సినోవ్యాక్ మంచి వ్యాక్సీన్లే. ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే వ్యాక్సీన్లు అందుబాటులో లేనప్పుడు వీటిని తీసుకోవచ్చు.’’
అయితే, రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నప్పటికీ, సామాజిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలను పాటించాలని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








