కరోనా వైరస్: ఏడాదిలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని డాక్టర్... గడ్డు రోజులకు ఎలా ఎదురు నిలిచారు?

కరోనా వైరస్
ఫొటో క్యాప్షన్, కరోనా కాలంలో ఏడాదిగా సెలవు లేకుండా సేవలు అందించిన విజయ శేఖర్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం...

కోవిడ్‌ తొలి వేవ్‌ నుంచి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వైద్యరంగంలో ఉన్న వారు విశేషంగా సేవలు అందిస్తున్నారు. వైరస్‌ సోకిన వారి దగ్గరకు వచ్చేందుకు సొంత వారే సంకోచిస్తున్న సమయంలో అన్నీ తామై విధులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ శేఖర్ అలాంటి వారిలో ఒకరు.

ఏడాది కాలంగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా కోవిడ్ విధులు నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.

సొంత పనులకు కూడా ఆయన సమయం వెచ్చించింది చాలా తక్కువని, పూర్తి సమయం ఆసుపత్రిలోనే గడిపారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

కరోనా వైరస్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ విజయ శేఖర్

అందరూ విధులకు దూరమవుతున్నా...

గత ఏడాది మార్చి 11న ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కోవిడ్ కేసు నెల్లూరు జిల్లాలో నమోదయ్యింది. ఆ తర్వాత ఒక్కో జిల్లాలోనూ కరోనా సోకుతున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

మార్చి 24 అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. ఏపీలో వైద్య సేవలను 'ఎస్మా' పరిధిలోకి తీసుకొచ్చారు.

'ఎస్మా' ప్రకారం వైద్య సిబ్బంది పూర్తిగా అత్యవసర సేవల్లో ఉండాలి. దానికి అనుగుణంగా పిఠాపురం ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ శేఖర్ తన విధి నిర్వహణను మలచుకున్నారు.

లాక్‌డౌన్ కారణంగా చాలా రకాల వృత్తులకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది విధులకు దూరమయ్యారు. కొందరు వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు పరిమితమైతే...అత్యధికులు ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది.

అలాంటి సమయంలో వైద్య సిబ్బంది సహా ఫ్రంట్‌లైన్ వారియర్స్ పూర్తి స్థాయి విధుల్లో ఉన్నారు.

సిబ్బందిలో ధైర్యం నింపేందుకే తాను విధుల్లో ముందుండటం అలవాటు చేసుకున్నట్టు డాక్టర్ విజయ శేఖర్ చెబుతున్నారు.

2019 మార్చి 21 నుంచి ఇప్పటి వరకూ...గడిచిన 13 నెలల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన విధుల్లో ఉన్నారని తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గౌరీశ్వరరావు బీబీసీతో అన్నారు.

వాస్తవానికి కోవిడ్ విధులు నిర్వహించిన వైద్యులకు వారంలో రెండు రోజుల నుంచి అవసరాన్ని బట్టి మరిన్ని రోజులు క్వారంటైన్‌కు అవకాశం ఇచ్చారు.

సాధారణంగా ఐదు రోజులు కోవిడ్ బాధితులకు సేవలందించిన వారికి రెండు రోజుల విరామం దక్కేది. అంతేగాకుండా ఇతర వీక్లీ ఆఫ్‌లతో పాటు..నవంబర్ తర్వాత కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో సెలవులు తీసుకునేందుకు కూడా కొందరికి అవకాశం దక్కింది.

కానీ, విజయ శేఖర్ మాత్రం ఎటువంటి సెలవులు తీసుకోకుండానే, విధులు నిర్వర్తించారు.

వారాంతాల్లో కూడా ఆస్పత్రికి వచ్చి రోగులను చూసి, సేవలందించడం సుమారు ఏడాది కాలంగా తన దైనందిన కార్యక్రమంగా మార్చుకున్నారు విజయ శేఖర్.

విజయ శేఖర్ ఇతర వైద్యులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవడంతో పాటు పీడియాట్రిషియన్‌గా బాధ్యతలను నిర్వహిస్తుంటారు. వీటితో పాటు కోవిడ్ సమయంలో బాధితులకు ఉపశమనం కల్పించేందుకు అవసరమైతే కొందరు బాధితుల ఇళ్లకు వెళ్లి, వారితో మాట్లాడి వారిలో కోవిడ్ భయాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

కరోనా వైరస్

విదేశాల నుంచి వచ్చిన వారికి ఊరట

గత ఏడాది కరోనా ప్రారంభకాలంలో విదేశాల నుంచి వచ్చినవారన్నా, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారన్నా గ్రామాల్లో భయాందోళనలు ఉండేవి.

వాటిని తగ్గించడానికి తాను కొన్ని గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించినట్టు డాక్టర్ విజయ శేఖర్ బీబీసీకి తెలిపారు.

పిఠాపురం ఆస్పత్రి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తే, జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి కోవిడ్ బాధితులను రిఫరల్ సెంటర్‌గా ఉంది.

కోవిడ్ సమయంలో అన్నిచోట్లా బెడ్స్ కొరత ఏర్పడిన నేపథ్యంలో స్వల్ప లక్షణాలున్న కోవిడ్ బాధితులు కొందరికి పిఠాపురం ఆస్పత్రిలోనే వైద్యం అందించారు.

ఆస్పత్రిలో రోగులను చూసుకుంటూనే గ్రామాల్లో భయాల్ని తగ్గించే ప్రయత్నం చేసినట్టు విజయ శేఖర్ తెలిపారు.

''కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చేవారికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశాం. ఎక్కువ మందికి సాధారణ లక్షణాలే కాబట్టి ఇక్కడే చికిత్స అందించాం.

ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమున్న వారిని మాత్రం కాకినాడ పంపించాల్సి ఉండేది. అలాంటి సమయంలో వారి పరిస్థితిని గమనించడం, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం సవాల్‌గా ఉండేది.

ప్రారంభంలో పీపీఈ కిట్లు, ఇతర ఏర్పాట్లు అందుబాటులో ఉండేవి కాదు. అయినప్పటికీ ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే అన్నింటకీ సిద్ధమయ్యాం.'' అని విజయ శేఖర్ వెల్లడించారు.

''పిఠాపురం ప్రాంతానికి యూఎస్, యూకే, గల్ఫ్ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 120 మందికి కరోనా సోకింది. వారికి అవసరమైన వైద్యం అందించడం, అదే సమయంలో వారి గ్రామాల్లో ఉన్న భయాందోళనలను తగ్గించడం కోసం ఇంటింటికి వెళ్లాం. ప్రాథమిక కాంటాక్ట్ ట్రేసింగ్‌కి అది ఉపయోగపడింది.'' అని ఆయన వివరించారు.

కరోనా వైరస్

ఓవైపు టెస్టులు, మరోవైపు వ్యాక్సినేషన్

అక్టోబర్ తర్వాత కరోనా కొంత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ డాక్టర్ విజయ శేఖర్ మాత్రం విశ్రాంతి తీసుకోలేదు.

కరోనా వ్యాప్తి వేగం తగ్గిన సమయంలో కూడా ఆయన ఎప్పటిలాగే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో దానిని కూడా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్న కరోనా అనుమానితులకు ఓవైపు పరీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు వ్యాక్సీన్ వేసే ప్రక్రియను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

''ఉదయం 9గం.లకే ఆస్పత్రికి వస్తాను. మధ్యాహ్నం 2గంటల వరకూ ఇక్కడే ఉంటాను. మళ్లీ సాయంత్రం 5గం.లకి ఆస్పత్రికి వచ్చి అన్నింటినీ చూసుకోవడం, వార్డులకు వెళ్లి రోగులను పరీక్షించడం అలవాటుగా మారిపోయింది. రాత్రి 10, 11 గంటల వరకూ ఆస్పత్రిలో ఉంటాను. కొన్నిసార్లు అర్థరాత్రి కూడా దాటుతుంది.'' అన్నారాయన.

''సందేహాలతో చాలామంది 24 గంటలూ ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలపై అనుమానాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. అవగాహనతోనే మహమ్మారిని ఎదుర్కోగలమనే అభిప్రాయం వచ్చింది'' అని ఆయన బీబీసీతో అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, STATES OF JERSEY

ఫొటో క్యాప్షన్, కరోనా సేవల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ ‌ది కీలక పాత్ర

రోగులు, వారి బంధువుల ప్రేమాభిమానాలే బలం

డాక్టర్ విజయ శేఖర్ భార్య కూడా వైద్యవృత్తిలో ఉన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో ఆమె వైద్యురాలు. వారి పిల్లలు కూడా వైద్య విద్య చదువుకుంటున్నారు.

''ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. స్టాఫ్ బాగా సహకరిస్తున్నారు. అందుకే మానసికంగా ఒత్తిడి ఉన్నా ఎదుర్కోగలుగుతున్నాను. శారీరకంగా కూడా చాలా అలసట ఉంటుంది. అయినా ప్రజల ప్రాణాలు కాపాడడమే కర్తవ్యం కాబట్టి సిద్ధపడాల్సి వస్తోంది.'' అన్నారాయన.

''ఆస్పత్రికి వస్తున్న రోగులకు భరోసా కల్పించినప్పుడు వారి స్పందన ఉత్సాహాన్నిస్తుంది. కొందరు రోగులు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చూపించే ప్రేమ బోలెడంత శక్తినిస్తుంది. ఇదే రీతిలో ఈ కష్టకాలం నుంచి గట్టెక్కే వరకూ సేవలందించాలనే సంకల్పంతో ఉన్నాను.'' అని తెలిపారు విజయ శేఖర్.

కరోనా వైరస్

అర్థరాత్రి కూడా వచ్చి ప్రాణాలు కాపాడారు..

పిఠాపురం ఆస్పత్రిలో విజయ శేఖర్‌తో పాటు పనిచేస్తున్న వారు ఆయన అంకితభావం, సహనం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

''రోజూ సమయానికి ఆస్పత్రికి రావడం, రోగులను చూడడం, అవసరమైన జాగ్రత్తలు మా అందరికీ చెప్పడం...ఇదే ఆయన పని.

కొన్నిసార్లు మందులు, ఇతర అవసరాలు కొరత ఉన్న సమయంలో కూడా ఆయన టెన్షన్ పడకుండా జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మా విధులను సజావుగా నిర్వహించడానికి తోడ్పడతారు.'' అని అదే ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ మొబీనా బీబీసీతో అన్నారు.

జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాం..

తమ బిడ్డ కష్టకాలంలో రోగులకు రక్షణగా నిలవడం తమకు సంతృప్తినిస్తోందని డాక్టర్ విజయ శేఖర్ తల్లి సరస్వతి అంటున్నారు.

''ఈ కరోనా కాలంలో అప్పుడప్పుడూ మా దగ్గరికి వచ్చేవాడు. మా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాడు. ఆ సమయంలో అనేక జాగ్రత్తలు పాటించాం. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుతాడనే అనుకున్నాను.నిజమైన వైద్యుడిగా ప్రజలకు అండగా ఉండడం చూసి గర్వపడుతున్నాం.'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)