భారత్‌లో కోవిడ్ వ్యాప్తి మే చివరి నాటికి తగ్గుతుందన్న డాక్టర్ గగన్ దీప్ కాంగ్

డాక్టర్ గగన్‌దీప్ కాంగ్

ఫొటో సోర్స్, FB/Mukti

ఫొటో క్యాప్షన్, డాక్టర్ గగన్‌దీప్ కాంగ్

భారత్‌లో మే చివరికి కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుందని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ అన్నారు.

బుధవారం ఆమె భారత మహిళా ప్రెస్ కోర్ సభ్యులతో ఒక వర్చువల్ చర్చలో మాట్లాడారు.

"మేం చూస్తున్న మోడల్‌ను బట్టి, బట్టి మే మధ్య నుంచి నెల చివరి నాటికి కరోనా ప్రభావం తగ్గిపోతుంది. కొన్ని మోడల్స్ చూస్తుంటే జూన్ ప్రారంభంలో కేసులు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. కానీ మాకు ఇప్పుడు కనిపిస్తున్న దాని ప్రకారం మే చివరికి కేసులు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది" అన్నారు.

డాక్టర్ గగనదీప్ కాంగ్ రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారత మహిళా శాస్త్రవేత్త.

వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను అడ్డుకోడంపై జరిగిన ఇంటర్-డిసిప్లినరీ రీసెర్చి ద్వారా కాంగ్ పేరు సంపాదించారు. ఆమె ప్రస్తుతం పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సలహాదారుగా ఉన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి సాయం చేస్తున్నారు.

భారత్ కరోనా సెకండ్ వేవ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ప్రస్తుతం వేస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ప్రబావం గురించి వస్తున్న ప్రశ్నలపై ఆమె ప్రజల సందేహాలను దూరం చేశారు. వీలైనంత తొందరగా భారత్‌లో ప్రత్యామ్నాయ టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

"వ్యాక్సీన్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. వాటి నుంచి రక్షణ అందిస్తుంది. దానితోపాటూ మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది. మనకు ఇన్ఫెక్షన్ రాలేదంటే, మనం అది వేరేవారికి వ్యాపించేలా చేయలేం. అందుకే తీవ్రమైన వ్యాధులపై వ్యాక్సీన్ ఎప్పుడూ సమర్థంగా పనిచేస్తుంది" అన్నారు.

కానీ, వ్యాక్సీన్ వ్యాప్తిని అడ్డుకోలేదని కూడా ఆమె చెప్పారు. వ్యాధి ప్రభావాన్ని కచ్చితంగా తగ్గించగలదని అన్నారు.

డాక్టర్ గగన్‌దీప్ కాంగ్

ఫొటో సోర్స్, Twitter/G Kang

ఫొటో క్యాప్షన్, డాక్టర్ గగన్‌దీప్ కాంగ్

దేశంలో మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరించడమే కరోనా సెకండ్ వేవ్‌ తీవ్రతకు కారణం అని కాంగ్ అన్నారు. ఫస్ట్ వేవ్ వచ్చినపుడు అలా జరగలేదని అన్నారు.

వరల్డ్ ఇన్ డేటా వెబ్‌సైట్‌ గణాంకాలను షేర్ చేసుకున్న కాంగ్, గతంతో పోలిస్తే ఈసారి మనకు కనిపిస్తున్న కేసులు మూడు, మూడున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

"ఇది ఎంత వేగంగా వ్యాపిస్తే, అంతే వేగంగా తగ్గుతుంది కూడా. టెస్టింగ్ తగ్గిపోయినప్పటికీ ఇప్పుడు మనం కేసుల పీక్ చూస్తున్నాం. ప్రతి రోజూ నాలుగు నుంచి నాలుగున్నర లక్షల వరకూ కొత్త కేసులు వస్తున్నాయి" అన్నారు.

లాక్‌డౌన్ కష్టాలు

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తే అన్న ప్రశ్నకు సమాధానంగా...

"మనం మరో రెండు మూడు వారాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గించాలని అనుకుంటుంటే, లాక్‌డౌన్ కచ్చితంగా సహకరిస్తుంది. మనం ఈరోజే లాక్‌డౌన్ పెట్టాలి. దానివల్ల ఒకటి మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. రాబోవు రోజుల్లో కొత్త కేసులు తగ్గిపోవడం మొదలవుతుంది"

"కానీ, మనం అది విధించే పరిస్థితిలో ఉన్నామా అనేదే ప్రశ్న. మనం అలా చేస్తే గత ఏడాది లాక్‌డౌన్ విధించడం వల్ల ఎదురైన మానవతా విషాధాన్ని తప్పించడానికి ఏం నేర్చుకున్నామనేది, మనం చూపించాల్సి ఉంటుంది. అలా మరోసారి జరగదని గ్యారంటీ ఇస్తే, ప్రజలు ఉండడానికి సురక్షిత ప్రాంతాలు, ఆహారం అందిస్తే. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూసుకుంటే దేశంలో లాక్‌డౌన్ విధించవచ్చు" అన్నారు.

కరోనాతో ప్రమాదం ఎక్కువగా ఉన్న వృద్ధులు, ఇప్పటికే షుగర్, బీపీ లాంటి వ్యాధులు ఉన్నవారితో పోలిస్తే.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి దీని వల్ల ముప్పు చాలా తక్కువని డాక్టర్ కాంగ్ చెప్పారు.

ఎవరికి అత్యంత అవసరమో, వారికి మొదట టీకా వేయడానికి వీలుగా, అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ను వివిధ దశలుగా విభజించారని గగన్‌దీప్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)