జల వివాదాలు: ఏది మిగులు జలం, ఏది నికరం? క్యూసెక్, టీఎంసీల లెక్కేంటి

శ్రీశైలం ప్రాజెక్టు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలున్నాయి. కృష్ణ, గోదావరి నదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

నదీజలాల వివాదాలు ఏ ఒక్క రాష్ట్రానికో, ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు.

నిత్యం నీళ్లపై జరిగే చర్చలు, వివాదాలు, కేసుల్లో టీఎంసీలు, క్యూసెక్కులు, నికర జలాలు, మిగులు జలాలు అంటూ ఎన్నో పదాలు వినిపిస్తుంటాయి.

ఇలాంటి పదాలకు అర్థం, వివరం తెలిపేదే ఈ కథనం.

1) టీఎంసీ

టీఎంసీ అంటే నీటి కొలత. మనం లీటర్లలో నీటిని కొలుస్తాం కదా.

అలా పెద్దమొత్తంలో నీటిని కొలవాలంటే టీఎంసీల్లో కొలుస్తారు.

టీఎంసీని టీఎంసీ ఫీట్ అని పిలవాలి. అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్. అంటే వంద కోట్ల ఘనపటుడుగుల నీరు.

ఈ లెక్క లీటర్లలో చెప్పాలంటే సుమారు 2 వేల 381 కోట్ల లీటర్లన్న మాట.

2) క్యూసెక్

దీని ఫుల్ ఫామ్ క్యూబిక్ ఫుట్ పర్ సెకన్. ఇది నీటి ప్రవాహాన్ని కొలిచేది.

ఒక కాలువ లేదా తూము లేదా గేటు నుంచి నీరు వదిలినప్పుడు ఎంత నీరు వెళ్లింది అని లెక్కించడానికి ఇది వాడతారు.

ఒక సెకనుకు ఎన్ని ఘనపుటడుగుల నీరు వెళితే అన్ని క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అని చెబుతారు. ఉదాహరణకు సన్నటి తూములోంచి తక్కువ క్యూసెక్కులు, పెద్ద కాలువలో ఎక్కువ క్యూసెక్కులు ప్రవహిస్తాయి.

అంటే, నీరు నిల్వ గురించి మాట్లాడినప్పుడు టీఎంసీలలో, నీటి ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో గురించి చెబితే క్యూసెక్కులలో చెప్పాలి.

కాలువలను వెడల్పు చేసినా, తూముల పరిమాణం పెంచినా ఎక్కువ క్యూసెక్కులు తీసుకువెళ్లడానికి వీలవుతుంది. పోతిరెడ్డిపాడు విషయంలో ఆంధ్ర తెలంగాణల మధ్య ఈ వివాదం ఉంది.

1969లో కృష్ణ నదీ జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ని ఏర్పాటు చేశారు.
ఫొటో క్యాప్షన్, 1969లో కృష్ణ నదీ జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ని ఏర్పాటు చేశారు.

3) బ్యారేజ్

నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి కట్టే నిర్మాణం బ్యారేజ్. నీళ్లు కొంతలో కొంత నిలుస్తాయి కానీ డ్యాముల్లో మాదిరి ఇక్కడ భారీ స్థాయిలో నీరు నిల్వ చేసే అవకాశం ఉండదు. వీటి లక్ష్యమే అది కాదు.(ఉదా: ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్, జూరాల బ్యారేజ్)

4) డ్యామ్

నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడంతో పాటూ నదిలోనే నీరు నిల్వ ఉండేలా జలాశయం (రిజర్వాయర్) కూడా నిర్మిస్తే దాన్ని డ్యామ్ అంటారు. భవిష్యత్తు అసవరాలకు వీలైన నిల్వ సామర్థ్యం ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. (ఉదా: నాగార్జున సాగర్, శ్రీశైలం, పోలవరం)

5) నికర జలం

ఒక నదిలో సహజంగా ఏడాది మొత్తం పారే నీరు ఎంత అనేది లెక్కిస్తారు. ఏ ఏడాది బాగా వర్షాలొచ్చి వరదలై పారిన ఏడాదా, లేక కరువు ఏడాదా అనే సమస్య వస్తుంది కదా. అందుబాటులో ఉండే డాటాను బట్టి దీర్ఘప్రమాణాన్ని తీసుకుంటారు.

వంద సంవత్సరాలలో కనీసం 75 సంవత్సరాలు సగటున అందుబాటులో ఉండే నీటి ప్రమాణాన్ని తీసుకుంటే అది 75 శాతం డిపెండబిలిటీ అంటారు. ప్రాజెక్టులు పెరిగి నీటి లభ్యత తగ్గే కొద్దీ డిపెండబిలిటీ ప్రమాణాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతుంది. బచావత్ ట్రైబ్యునల్ క్రిష్ణాలో 75 శాతం డిపెండబిలిటీని తీసుకుని కేటాయింపు చేస్తే బ్రజేష్ ట్రైబ్యునల్ వత్తిళ్లకు తలొగ్గి 65 శాతం ప్రామాణికం తీసుకుని అదనంగా మరికొంత జలాలను పంపకాలు చేసింది. బ్రజేష్ తీర్పు వివాదాల్లో ఉందనుకోండి. అది వేరే విషయం.

ఆ సగటు నీటిలో కొంత శాతం తగ్గించి, మిగిలిన దాన్ని జనం వాడుకోవడానికి వీలుగా కొన్ని ప్రమాణాల ప్రాతిపదిక చేసుకుని రాష్ర్టాలకు పంచుతారు. ఇది నికర జలం అవుతుంది.

ఉదాహరణకు ఫలానా నదిపై ఫలానా రాష్ట్రానికి వంద టీఎంసీల నికర జలం కేటాయింపులు ఉన్నాయి అంటే ప్రతీ ఏటా లభ్యతను బట్టి ఆ రాష్ట్రం వారు ఆ నది నుంచి వంద టీఎంసీల నీరు తీసుకోవచ్చన్న మాట.

6) మిగులు జలం

నీరు ఒక్కోసారి ఎక్కువ పారవచ్చు. లేదా ఇతరత్రా కారణాల వల్ల, నికర జలం వాడుకోకపోవడం వల్ల కిందకు రావచ్చు. లేదా వరదల వల్ల అధిక నీరు అందుబాటులోకి రావచ్చు.

ఇదంతా అదనంగా అప్పుడప్పుడు వస్తుంది కానీ, ప్రతీ ఏటా జరుగుతుందని చెప్పలేం.

అందుకే దీన్ని మిగులు జలం అంటారు. అయితే ఈ మిగులు జలాలు అని దేన్ని పిలవాలి?

కేవలం వరద వచ్చిన నీటినే మిగులు అనాలా, లేకపోతే, నికరంగా కేటాయించిన నీరు వాడుకున్న తరువాత మిగిలిన దాన్నే మిగులు అనాలా, లేకపోతే రెండిటినీ కలిపి మిగిలు జలాల అనొచ్చా అనే విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల మధ్య వివాదాల పరిష్కారానికి 1969లో జస్టిస్ బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటైంది.
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల మధ్య వివాదాల పరిష్కారానికి 1969లో జస్టిస్ బచావత్ ట్రైబ్యునల్ ఏర్పాటైంది.

7) పరివాక ప్రాంతం

నది ఏ ప్రాంతంలో పారుతుందో దాన్ని పరివాహక ప్రాంతం అంటారు. అంటే నదికి రెండువైపులా ఉండేది.

8) బేసిన్

కేవలం నదికి రెండు వైపులే కాకుండా, ఇంకా చాలా భూభాగంతో ఆ నదికి సంబంధం ఉంటుంది. ఆ నదికి నీరు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఏఏ ప్రాంతాల్లో కురిసిన నీరు వాగులు, వంకలు, ఉపనదుల ద్వారా ఈ నదికి చేరుతుందో ఆ ప్రాంతాన్ని బేసిన్ అంటారు.

ఆ ఉప నదులు, వాగుల పరీవాహక ప్రాంతం కూడా బేసిన్ లో ఉంటుంది. అంటే ఆ నదికి చాలా దూరంగా ఉన్న ప్రాంతం కూడా ఆ నది బేసిన్ లోకి రావచ్చు. నీటి పంపకాల్లో ఈ బేసిన్ కి ముందు హక్కు ఇవ్వాలనే ప్రమాణం ఉంది.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులను విభజించాలి
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులను విభజించాలి

9) ట్రైబ్యునల్

భారత దేశంలో నది నీటి విషయంలో రాష్ట్రాల మధ్య తగాదాల పరిష్కారానికి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని 1956లో చేశారు. దాన్ని 2019లో సవరించారు. ఈ చట్టం ప్రకారం ఏవైనా రాష్ట్రాల మధ్య నీటి గొడవలు వస్తే కేంద్రం ఒక ట్రిబ్యునల్ వేస్తుంది.

ట్రిబ్యునల్ దాదాపు కోర్టుతో సమానం అన్నమాట. ఈ ట్రిబ్యునల్ వారు నీటిని ఎలా పంచుకోవాలో చెబుతారు. ఆ ట్రిబ్యునళ్లలో అందరూ రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జీలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం.

ఆ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రాలు తమ వాదన వినిపించి తమకు రావాల్సిన నీటి వాటా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. మనం తరచూ వినే బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటే ఇదే. బచావత్ అనే రిటైర్డు జడ్జి నాయకత్వంలోది బచావత్ ట్రిబ్యునల్. బ్రిజేష్ కుమార్ అనే రిటైర్డు జడ్జి ఆధ్వర్యంలోనిది బ్రిజేష్ ట్రిబ్యునల్.

10) ఎత్తిపోతల పథకం

దీనినే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అంటారు. నీరు పల్లమెరుగు అన్న సామెతలో చెప్పినట్టుగా పల్లంగా ఉన్నవైపు సహజంగా నీరు పారుతుంది. పెద్ద పల్లం లేకపోయినా, చదును ఉన్నచోట కూడా నీటి ప్రవాహం వేగంగా వస్తే కనుక పారుతుంది.

కానీ ఎత్తు ఉన్న ప్రాంతాలకు నీరు వెళ్లాలంటే తోడాల్సిందే. చేతితో కాదు, కరెంటు మోటార్లు పెట్టి తోడాలి. పెద్ద పెద్ద కాలువలు, చిన్న చిన్న రిజర్వాయర్లూ నింపడం కోసం నీటిని భారీ కరెంటు మోటర్లు పెట్టి తోడుతారు.

భారీ మోటార్లు అంటే పదుల మెగావాట్ల కరెంటు వాడుతూ, చూడ్డానికి మన ఇల్లంత సైజులో ఉండే మోటార్లతో నీటిని తోడు కాలువల్లో వేస్తారు. దీన్ని ఎత్తిపోతల పథకాలు అంటారు. ప్రస్తుతం తెలంగాణ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు అత్యంత భారీ స్థాయిలోనివి.

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలున్నాయి. కృష్ణ, గోదావరి, వంశధార తదితర నదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఫొటో క్యాప్షన్, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలున్నాయి. కృష్ణ, గోదావరి, వంశధార తదితర నదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అంతర్జాతీయ జల సూత్రాలూ ఉన్నాయి

ప్రపంచంలోని చాలా దేశాల్లో నదీ నీటి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి. కొన్ని నదులు దేశాల మధ్య ప్రవహిస్తాయి. అక్కడ సమస్యలు ఎక్కువ.

దీంతో నది నీటిపై సహజంగా ఎవరికి హక్కు ఉంటుంది, ఎవరికి ఉండదు, ఎవరికి ముందు హక్కు వస్తుంది, ఎవరికి తరువాత హక్కు వస్తుంది, తాగునీటి హక్కు ముందా, సాగునీటి హక్కు ముందా…ఇలా అనేక విషయాలపై సహజ న్యాయ సూత్రాల ఆధారంగా కొన్ని నీటి పంపిణీ సూత్రాలు ఉన్నాయి. వీటి ఆధారంగానే నీటి పంపకాలు చేపడతారు. కాకపోతే ఈ నిబంధనల్లో ఎవరికి తగ్గట్టు వారు సెలెక్టివ్గా తీసుుకంటూ కన్వీనియెంట్గా భాష్యం చెపుతూ తమ వాదనే రైట్ అని వాదిస్తూ ఉంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)