ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?

భాస్కర్ రాజారవీంద్ర

'ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి వెళ్లడం, ఎన్టీఆర్ గారిని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఒక హీరోను నేను కలవడం అదే తొలిసారి. అలాంటిది ఆయనతో కలిసి గేమ్ ఆడటం, స్క్రీన్‌పై కనిపించడం, 15వ ప్రశ్న వరకు వెళ్లడం చాలా ఆనందంగా అనిపించింది' అన్నారు 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో కోటి రూపాయల తొలి విజేత సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రాజా రవీంద్ర.

భద్రాద్రి కొత్తగూడానికి చెందిన భాస్కర్ రాజా రవీంద్ర బీబీసీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు. కోటి రూపాయలు ఎలా గెలిచారో ఆయన మాటల్లోనే విని తెలుసుకోండి.

ప్ర. 1: కోటి రూపాయల ప్రశ్న వరకూ వెళ్తానని అనుకున్నారా?

భాస్కర్ రాజా రవీంద్ర: ''అంతవరకు వెళ్తానని అనుకోలేదు. 15వ ప్రశ్న వరకు వెళ్లి కోటి రూపాయలు గెలవడం అనేది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఇదివరకు నేను ఈ కార్యక్రమం చూసేవాణ్ని. కానీ, అక్కడకు ఎలా వెళ్లాలి? అనేది తెలిసేది కాదు. పైగా ఉద్యోగంతో తీరిక దొరికేది కాదు. ఖాళీ లేకపోవడం వల్ల ఎప్పుడూ ఈ కార్యక్రమానికి వెళ్లాలని ఆలోచించలేదు. ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ గెలిచి హాట్ సీట్లో ఎన్టీఆర్ ఎదురుగా కూర్చుంటే చాలనుకున్నాను. కోటి రూపాయలు గెలుస్తానని ఊహించలేదు.

భాస్కర్ రాజారవీంద్ర

ప్ర. 2: ఈ గేమ్ షోలో పాల్గొనాలనే ఆలోచన ఎలా వచ్చింది?

అయితే, ఈ కార్యక్రమానికి మీరు కూడా వెళ్లొచ్చని నా భార్య ప్రోత్సహించింది. ఇదివరకు మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యారు.. ట్రైచేయొచ్చు కదా అని అడిగింది. అలా ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు పెట్టాను.

నేను గేమ్ ఆడొచ్చు. స్క్రీన్ మీద ఎన్టీఆర్ గారితో కనిపిస్తాను. అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్లాను. ఎంత గెలుస్తాను? ఎప్పటివరకు ఉంటాను? అనే ఆలోచనలపై నేను దృష్టిపెట్టలేదు.

ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్‌లో హాట్‌సీట్‌ వరకు వెళ్లగలిగితే చాలు. అనే ఉద్దేశంతో వెళ్లాను. అదృష్టవశాత్తు ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్‌ను నేను క్లియర్ చేయగలిగాను. ఎనిమిది మంది కంటెస్టెంట్లలో తొలి కంటెస్టెంట్‌గా నేను హాట్‌సీట్‌కు వెళ్లాను. ఆ తర్వాత అలా గేమ్ ఫ్లోలో ముందుకు వెళ్తూ కోటి గెలిచాను.

ప్ర. 3: హాట్ సీట్లో కూర్చోగానే ఏమనిపించింది?

మనపై హాట్‌సీట్ ప్రభావం చాలా ఉంటుంది. మొదటి ప్రశ్న నుంచి గందరగోళంగానే అనిపించింది. రూ.1000 ప్రశ్న అయినా కోటి రూపాయల ప్రశ్న అయినా టెన్షన్ ఒకేలా ఉండేది. ప్రశ్న లెవల్ పెరగొచ్చు కానీ, గెలిచే అవకాశం 25 శాతం మాత్రమే.

ఎన్టీఆర్ మనల్ని ప్రశ్న ప్రశ్నకూ గందరగోళంలో పడేసేందుకు ప్రయత్నిస్తుంటారు. మొదటి ఐదు ప్రశ్నలకు 45 సెకన్ల చొప్పున మాత్రమే ఇస్తారు. ఆ 45 సెకన్లలోనే ప్రశ్నను చదవాలి. అర్థం చేసుకోవాలి. ఎదురుగా ఎన్టీఆర్ ఉంటారు. లైట్లు, సౌండ్ అంతా కొత్తగా అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవం ముందెప్పుడూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కాస్త గందరగోళంగానే అనిపిస్తుంది.

భాస్కర్ రాజారవీంద్ర

ప్ర. 4: తెలిసిన సమాధానాల విషయంలోనూ ఒక్కోసారి గందరగోళంతో తప్పులుచేసే అవకాశం ఉంటుంది కదా? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఎన్టీఆర్ గారిని కలవాలి, మాట్లాడాలి అంటే కచ్చితంగా హాట్‌సీట్‌కు వెళ్లాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? అనేవి మనం ఊహించలేం. నేను ప్రధానంగా దృష్టిపెట్టింది.. ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్ పైనే. ఇంట్లో రోజూ గంట లేదా రెండు గంటలు ప్రాక్టీస్ చేసేవాణ్ని. నా భార్య ప్రశ్నలను పేపర్‌పై రాసి ఇచ్చేది. వాటిని నేను ప్రాక్టీస్ చేసేవాణ్ని.

ఎంత స్పీడ్‌గా నేను ప్రశ్నలను చదవగలుగుతున్నాను. ఎంత స్పీడ్‌గా సమాధానాలు చెప్పగలుగుతున్నాను లాంటివి జాగ్రత్తగా గమనించేవాన్ని. దీంతోపాటు పత్రికలు చదువుతూ కరెంట్ అఫైర్స్‌పై దృష్టి సారించేవాణ్ని.

ఫలితాన్ని పాజిటివ్‌గా తీసుకొని, ముందుకు వెళ్తేనే విజయం వస్తుందని నేను భావిస్తాను. అంతేకానీ ఫెయిల్ అయితే డీలా పడిపోవడం, విజయం వచ్చిందని పొంగిపోవడం లాంటివిచేస్తే, తర్వాత విజయాన్ని చూడలేం.

వీడియో క్యాప్షన్, ఎవరు మీలో కోటీశ్వరుడు: కోటి రూపాయల విజేత రాజా రవీంద్రతో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ప్ర. 5: గెలుచుకున్న ప్రైజ్ మనీతో ఏం చేస్తారు?

షూటింగ్ కాంపిటీషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన దేశానికి ఒలింపిక్స్ పతకాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్‌లో మన దేశానికి పతకాలు తీసుకురావాలి. దీనిపై వర్కవుట్ చేయాలంటే కొంత డబ్బులు అవసరం అవుతాయి. ఈ డబ్బును దాని కోసం ఖర్చుచేస్తాను. ట్రైనింగ్‌తోపాటు కావాల్సిన పరికరాలు సమకూర్చుకుంటాను. అలానే కొంత డబ్బును బాలల సంరక్షణ నిధికి దానం చేస్తాను.

అందరూ నాకు అభినందనలు తెలుపుతుంటే, నేను ఇంత సాధించానా? అని నాకే అనిపిస్తోంది. ఇప్పుడు నా సంతోషం మరింత పెరుగుతోంది''అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)