త్రిపుర మత హింస కేసు: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు - Newsreel

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

త్రిపురలో మతహింసకు సంబంధించిన కేసులో ఒక జర్నలిస్టు సహా ఇద్దరు లాయర్లను త్రిపుర పోలీసులు అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంది.

గత నెలలో త్రిపురలో జరిగిన మత కలహాలకు సంబంధించి ఈ ముగ్గురు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో వీరిపై యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం వారి అరెస్టులపై స్టే విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ లాయర్లు ముకేశ్ కుమార్, అన్సరుల్ హఖ్, జర్నలిస్ట్ శ్యామ్ మీరాసింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ముగ్గురు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.

హింస జరిగిన త్రిపుర రాష్ట్రంలో లాయర్లు ముకేశ్, అన్సరుల్ పర్యటించారని, అక్కడ జరిగిన హింసాకాండను ఒక నిజనిర్ధారణ నివేదికలో ప్రచురించారని ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.

దీని తర్వాత త్రిపుర పోలీసులు, క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు.

ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని త్రిపుర పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది.

తాము రూపొందించిన 'నిజ నిర్ధారణ నివేదిక'ను తొక్కిపట్టేందుకే తమపై యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని లాయర్లు ముకేశ్, అన్సరుల్ హఖ్ ఆరోపించారు.

కేవలం 'త్రిపుర కాలిపోతోంది' అని ట్వీట్ చేసినందుకే తనపై యూఏపీఏ కింద కేసు నమోదైందని న్యూస్‌క్లిక్ జర్నలిస్ట్ శ్యామ్ మీరా సింగ్ అన్నారు.

లఖీంపుర్ ఖేరీ కేసు: దర్యాప్తు పర్యవేక్షణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించిన సుప్రీంకోర్టు

లఖింపుర్

ఫొటో సోర్స్, Ani

లఖీంపుర్ ఖేరీ హింస కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం -సిట్‌ను సుప్రీంకోర్టు మళ్లీ ఏర్పాటు చేసింది.

ఈ కొత్త బృందంలో ఎస్‌బీ శిరోద్కర్, దీపిందర్ సింగ్, పద్మజా చౌహాన్ సభ్యులుగా ఉన్నారు.

దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేశ్ కుమార్ జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది.

ఛార్జిషీట్ దాఖలు చేసి, ఈ కేసును పర్యవేక్షించేందుకు నియమించిన రిటైర్డ్ జడ్జి నుంచి నివేదిక వచ్చిన తరువాత సుప్రీంకోర్టు తదుపరి విచారణ జరుపుతుంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నూతలపాటి వెంకట రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేయాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు రాసిన లేఖల ఆధారంగా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును విచారణకు స్వీకరించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన నాలుగు చక్రాల వాహనం రైతుల మీదకు దూసుకెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)