ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి

పేలుళ్లతో వణికిపోయిన ఉగాండా ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పేలుళ్లతో వణికిపోయిన ఉగాండా ప్రజలు

ఉగాండా రాజధాని కంపాలాను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్లు దాడులు చేశారు. కనీసం ముగ్గురు మరణించారని, 30 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం దగ్గర, పార్లమెంటు సమీపంలో మోటార్‌ బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉగాండాలో బాంబు దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించినట్లు అక్కడి మీడియా సంస్థ అమాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

మూడు నిముషాల వ్యవధిలో దాడులు జరిగాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని బాంబులు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

"మరిన్ని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏడీఎఫ్ తయారు చేసిన ఆత్మాహుతి బాంబు స్క్వాడ్‌లోని సభ్యులు పలుచోట్ల నక్కి ఉన్నారని భావిస్తున్నాం" అని పోలీస్ ప్రతినిధి ఫ్రెడ్ ఎనంగా తెలిపారు.

వీడియో క్యాప్షన్, పేలుుడు తరువాత మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

నాల్గవ దాడికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసామని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరణించిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. 33 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది.

దాడుల నేపథ్యంలో, పార్లమెంటులో సభా కార్యక్రమాలను రద్దుచేశారు. ఎంపీలు భవనం వద్దకు రావొద్దని సూచించారు.

పార్లమెంటు సమీపంలో పార్క్ చేసిన కారు పేలిపోయి మంటలు వ్యాపించగా, పోలీసు స్టేషన్ దగ్గర జరిగిన దాడిలో అద్దాలు పగిలిపోయాయి.

ఈ దాడికి పాల్పడ్డట్టు ఐఎస్ తమ టెలిగ్రాం ఛానెల్‌లో ప్రకటించింది. అనంతరం, అమాక్ న్యూస్ ఏజెన్సీ ఈ వార్తను ప్రచురించింది.

2019లో ఐఎస్‌కు అనుబంధ సంస్థగా ప్రకటించుకున్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) ఈ దాడులకు కారణమని అధికారులు ఆరోపిస్తున్నారు.

ఉగాండాలో పుట్టి, ప్రస్తుతం డీఆర్ కాంగో నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడీఎఫ్, ఐఎస్ పేరుతో దాడులు చేయడం పెరుగుతోంది.

ఇటీవల వారాల్లో అనేక బాంబు పేలుళ్లు జరిగాయి. గత నెలలో నగరంలో ఓ బార్ షాపులో ఉంచిన పరికరం పేలడంతో 20 ఏళ్ల వెయిట్రెస్‌ మరణించారు.

కొద్ది రోజుల తరువాత, కంపాలా సమీపంలో ఒక బస్సులో ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో అనేకమంది గాయపడ్డారు.

ఈ రెండు దాడులూ తామే నిర్వహించినట్లు ఐఎస్ ప్రకటించింది.

అయితే, ఈ దాడులకు ఏడీఎఫ్‌కు సంబంధాలు ఉన్నాయని, బస్సులో ఆత్మాహుతికి పాల్పడ్డ వ్యక్తి ఏడీఎఫ్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)