ఉగాండా: 35 ఏళ్లు దేశాన్ని ఏలినా ఈయనకు అధికార దాహం తీరట్లేదు.. ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పేషెన్స్ అటుహేర్
- హోదా, బీబీసీ న్యూస్, కంపాలా
ఉగాండా జనాభాలో మూడొంతుల జనం వయసు 35 ఏళ్ల లోపే ఉంటుంది. వారందరికీ తెలిసిన దేశాధ్యక్షుడు ఒకే ఒక్కరు.
యొవేరీ ముసెవేని 1986లో సాయుధ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చారు. ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న వారిని కూలదోసిన రాజకీయ సూత్రాలు ఆయనను ఏమీ చేయలేకపోయాయి.
యొవేరీ వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. ఆయన పాలనలో సుదీర్ఘ శాంతి, భారీ అభివృద్ధి మార్పులు జరిగాయి. అందుకు చాలా మంది కృతజ్ఞులుగా ఉన్నారు.
కానీ ఆయన అధికారంపై తన పట్టు నిలుపుకోవడానికి వ్యక్తి పూజను ప్రోత్సహించటంతో పాటు.. ఆశ్రిత పక్షపాతం పాటించటం, స్వతంత్ర సంస్థలను బలహీనపరచటం, ప్రత్యర్థులను తప్పించటం వంటి విధానాలను అమలుచేశారు.
ఐదేళ్ల కిందట జరిగిన గత ఎన్నికల సందర్భంలో తాను వైదొలిగే అంశం గురించి ఆయన మాట్లాడారు. ‘‘నేను నాటిన అరటి తోట ఇప్పుడే కాయలు కాయడం మొదలైంది. ఈ సమయంలో నేను ఎలా తప్పుకోగలను?’’ అని ప్రశ్నించారు.
ఈ విప్లవకారుడికి పంట ఇంకా పూర్తి కాలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అధ్యక్షుడితో నా పరిచయం 1990ల్లో స్కూలులో వేసిన ఒక నాటకం రూపంలో జరిగింది. మిల్టన్ ఒబోట్, ఈదీ అమీన్‌ల కాలంలో సంక్షోభాలను ఆ నాటకంలో ప్రదర్శించారు.
యుద్ధాలకు, మతిలేని హననాలకు చరమగీతం పాడుతూ.. 1986 జనవరి 26న ముసెవేని సారథ్యంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఆర్మీ దేశాన్ని విముక్తం చేయటంతో ఆ నాటకం ముగుస్తుంది.
ఆయన రక్షకుడని, శాంతి పరిరక్షకుడని చెప్పే ఈ ఇమేజ్ తెలుసుకుంటూ ఉగాండా జనం చాలా మంది పెరిగారు. అవకాశం దొరికినపుడల్లా వారికి ఈ ఇమేజ్‌ను మళ్లీ మళ్లీ గుర్తుచేస్తారు.
ఆయన తండ్రి వంటి, తాత వంటి వ్యక్తి కూడా.
చాలా మంది ఉగాండా వాసులు ఆయనను ‘సెవో’ అనే ముద్దుపేరుతో పిలుస్తారు. ఆయన కూడా వారిని ప్రేమగా బజుకులు అని పిలుస్తారు. అంటే లుగాండా భాషలో మనవలు అని అర్థం.
అయితే ఈ కుటుంబ వ్యక్తి తనను తాను వయసు మీదపడుతున్న పెద్ద మనిషిగా, పిల్లలు, మనవల మధ్య పడక కుర్చీలో విశ్రాంతి తీసుకునే తాతగా పరిగణించరు.
ఆయన ఆరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం గత ఎన్నికలు ముగిసిన వెంటనే మొదలైనట్లుగా అనిపిస్తుంది. ఆయన దేశమంతా సంచరిస్తున్నారు. ఫ్యాక్టరీలను, కొత్త మార్కెట్లను, రోడ్లను ప్రారంభిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మాజీ పాప్ స్టార్ బాబీ వైన్ ఈ ఎన్నికల్లో ముసెవేనిని సవాల్ చేస్తున్నారు. బాబీ వయసు 38 సంవత్సరాలు. ఆయనతో పోల్చినపుడు తను ఎంత చురుకుగా ఉన్నానో చూపాలనేది ముసెవేని తాపత్రయంగా కనిపిస్తోంది.
గత ఏప్రిల్‌లో లాక్‌డౌన్ సమయంలో వ్యాయామాన్ని ప్రోత్సహించటం కోసం తాను ఫుష్-అప్స్ చేస్తున్న వీడియోలను ప్రసారం చేశారు. ఈ కసరత్తును పలుమార్లు పునఃప్రదర్శించారు. గత నవంబర్‌లో కేరింతలు కొడుతున్న విద్యార్థుల ముందు కూడా ప్రదర్శించారు.
దేశంలో ఒక ప్రధాన ఆందోళనగా ఉన్న యువత నిరుద్యోగం అంశం గురించి మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే.. ఆయన మిమ్మల్ని సాధికారం చేయాల్సి ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో.. మేం స్కూలు చదువు ముగించేటప్పటికి మాకు ఉద్యోగాలు లభించేలా సెవో చూస్తారు’’ అంటున్నారు 25 ఏళ్ల ఏంజెలా కిరాబో.
ఆమె ఎకానమిక్స్ గ్రాడ్యుయేట్. తను సెవోకు ముజుకులు (మనవలు) అని గర్వంగా చెప్తారు. అధికార నేషనల్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ (ఎన్ఆర్ఎం) పార్టీ యూనివర్సిటీ విభాగానికి వైస్-చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ముసెవేని 35 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇంకా చాలా చేయగలరని ఆమె నమ్ముతున్నారు.
జనం తనకు విశ్వాసపాత్రులుగా ఉండేలా స్ఫూర్తి కలిగించటానికి ఒక కారణం ముసెవేని నిస్వార్థపరత్వం అంటారు ఆయన సన్నిహిత మిత్రులు, సలహాదారుల్లో ఒకరైన జాన్ నాగేంద. ఆయన వయసు 82 సంవత్సరాలు.
‘‘ఉగాండా కోసం ప్రాణాలివ్వటానికి ఆయన సిద్ధపడ్డారు. ఆయన ఉండటం చాలా అదృష్టం అంటాను’’ అని పేర్కొన్నారు. ముసెవేని తన కోసం కాకుండా దేశం కోసం, ఆఫ్రికా ఖండం కోసం అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. 1995 నాటి రాజ్యాంగంలోని అసలు నిబంధనల ప్రకారం.. దేశాధ్యక్షుడు 2005 సంవత్సరం తర్వాత మళ్లీ అధికారం కోసం పోటీ చేయకూడదు.
నిజానికి అప్పుడు అందరూ కూడా.. ఆయన అధికారంలో కొనసాగటానికి వ్యతిరేకుడనే అనుకున్నారు. ఆయన తిరిగి ఇంటికి వెళ్లి వ్యయసాయం చేసుకుంటాననీ చెప్పారు.
1990ల్లో ఒక విందు కార్యక్రమంలో దేశాధ్యక్షుడిని ‘మీరు జీవితాంతం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారా’ అని అడిగినపుడు ఆయన ఎంతో నొచ్చుకున్నారనేది అధ్యక్షుడికి, ఎన్ఆర్ఏకు ఒకప్పుడు చాలా సన్నిహితుడిగా ఉన్న పాత్రికేయుడు విలియం పైక్ తన జ్ఞాపకాల రచనల్లో వివరించారు.
‘‘ముసెవేని ‘లేదు’ అని చెప్పారు. అలా అడగటం తనకు అవమానంగా భావించారు. చాలా ఆగ్రహించారు. అదేమీ నటన కాదు. ఆ సమయంలో ఆయన అధికారంలో కొనసాగాలనే ఆలోచన ఆయనకు నిజంగా లేదు’’ అని పైక్ రాశారు.
కానీ 2004లో ముసెవేని ఆలోచన ఎందుకో మారింది. ఎందుకనేది ఎన్నడూ స్పష్టంగా తెలియదు. అధ్యక్షుడు ఎన్నిసార్లు అధికారంలో ఉండాలనే దాని మీద పరిమితులను విధించే నిబంధనను తొలగించాలన్న ఆలోచనను ఆయన ఎంపీలు ఆమోదించారు.
ఆయనకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకూ కొనసాగటానికి పచ్చ జెండా లభించింది.
మళ్లీ 2017 డిసెంబరులో.. అధ్యక్ష అభ్యర్థి వయసు పరిమితికి సంబంధించి రాజ్యాంగ అవరోధాన్ని కూడా తొలగించారు. ఈ అంశం మీద పార్లమెంటు సమావేశంలో బాహాబాహీ కూడా జరిగింది. పోలీసులు రంగ ప్రవేశానికి సైతం దారితీసింది.
ఇది.. ముసెవేని జీవితాంతం దేశాధ్యక్షుడిగా కొనసాగేలా వీలుకల్పించటానికి ఎన్‌ఆర్ఎం అనుసరించిన పద్ధతిగా చాలా మంది పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, AFP
ఎంపీల్లో చాలా మంది తమకు ఆ పదవులు దక్కినందుకు గాను అధ్యక్షుడికి రుణపడి ఉన్నామని భావించటం వల్లే పార్లమెంటు ఆ మార్పులకు సంసిద్ధత తెలపటానికి కారణంగా కొందరు భావిస్తారు.
ఆశ్రిత పక్షపాతం సమాజంలో చాలా విస్తరించింది. ఇది కొన్నిసార్లు మహిళలు, మార్కెట్ విక్రేతల అభివృద్ది కార్యక్రమాల రూపంలో, ప్రభుత్వ ఉద్యోగాల రూపంలో ఉంటుంది.
యువతలో 15 శాతం మంది నిరుద్యోగులుగా, జనాభాలో 21 శాతం మంది పేదరికంలో జీవిస్తున్న దేశంలో.. సరైన పార్టీతో జట్టుకట్టటం వల్ల మొత్తం గ్రామం దుర్భిక్షం నుంచి బయటపడగలదు.
అయితే.. ముసెవేనికి మరో ఐదేళ్లు అధికారం ఇవ్వటానికి ఒక సానుకూల కారణంగా.. ఉగాండా రూపాంతరం చెందడాన్ని చూపుతున్నారు ఆయన మద్దతుదారులు.
‘‘మీది ఉత్తర ప్రాంతమో, తూర్పు ప్రాంతమో అయినట్లయితే శాంతి విషయంలో సాధించిన భారీ విజయం మీకు అర్థమవుతుంది. ఆ ప్రాంతాలు 20 ఏళ్ల పాటు యుద్ధంలో కూరుకుపోయాయి’’ అని ప్రభుత్వ నేషనల్ యూత్ కౌన్సిల్‌కు సారథ్యం వహిస్తున్న 28 ఏళ్ల జాకబ్ ఐరు పేర్కొన్నారు.
నిరుద్యోగిత ఒక ఆందోళనేనని అంగీకరిస్తూనే.. ‘‘ఆర్థికవ్యవస్థను ప్రాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ పోటీపడేలా’’ ఎన్ఆర్ఎం అభివృద్ధి చేసిందని ఆయన చెప్పారు.
ఈ మార్పులు సాధించినా కానీ.. తన అధికారానికి పెద్దగా సవాళ్లు లేకుండా చూసుకోవటం కోసం దేశంలోని కొన్ని కీలక సంస్థల స్వతంత్రతను ముసెవేని బలహీనపరిచారు.

న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టలేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి విధేయులుగా ఉండే వారిని జడ్జీలుగా నియమించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
జడ్జీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నపుడు కొన్నిసార్లు అధికార వ్యవస్థలతో సంఘర్షణ పరిస్థితులు తలెత్తాయి.
ఉదాహరణకు.. 2005 డిసెంబరు 16న రాజధాని కంపాలాలోని హైకోర్టు.. అనుమానిత పీపుల్స్ రిడెంప్షన్ ఆర్మీ తిరుగుబాటుదారులను దేశద్రోహం అభియోగాల నుంచి విముక్తం చేస్తే.. కాసేపటికే సుశిక్షిత సాయుధ భద్రతా సిబ్బంది హైకోర్టు మీద దాడిచేసి వారిని అరెస్ట్ చేశారు.
‘‘న్యాయాలయాన్ని యుద్ధ వేదికగా మార్చారు’’ అని జస్టిస్ జేమ్స్ ఒగోలా ‘రేప్ ఆఫ్ ద టెంపుల్’ పేరుతో రాసిన ఒక కవితలో అభివర్ణించారు.
ఇక ఎన్నికల ఫలితాలను సవాల్ చేసే విషయంలో.. 2011లో మినహా ప్రతి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్నీ కోర్టులో సవాల్ చేశారు. అన్ని కేసుల్లోనూ ఆరోపిత అవకతవకలు ఫలితాన్ని రద్దు చేయాల్సినంత తీవ్రమైనవి కావని కోర్టులు తీర్పు చెప్పాయి.
మీడియా స్వతంత్రత కూడా ప్రమాదంలో పడింది.
ముసెవేని పాలనలో వందలాది ప్రైవేటు రేడియో, టీవీ స్టేషన్లు, ప్రచురణ సంస్థలు, ఇంటర్నెట్ ఆధారిత సేవలతో పైకి మాత్రం ఉగాండాలో సజీవ మీడియా రంగం ఉన్నట్లు కనిపిస్తుంది.
‘‘తొలి రోజుల్లో ఈ పాలనలో మేధోపరత్వం ఉండింది. అసమ్మతి అభిప్రాయాలను సహించేది. సంవాదాలకు, భిన్నాభిప్రాయాలకు తావుండేది’’ అని నేషన్ మీడియా గ్రూప్‌కు చెందిన జనరల్ మేనేజర్ ఫర్ ఎడిటోరియల్ డానియల్ కలినాకి చెప్పారు.
కానీ ప్రభుత్వ పెద్దల్లో సహనం తగ్గుతూ రావడంతో మీడియా సంస్థలపై పోలీసుల దాడులు, జర్నలిస్టుల నిర్బంధం పెరిగిందని పేర్కొన్నారు.
ముసెవేని సుదీర్ఘ పాలనలో అత్యంత ముఖ్యమైన అంశం.. బహుశా ప్రతిపక్ష శక్తులను నిర్వీర్యం చేసిన విధానం కావచ్చు.

ప్రతిపక్ష మద్దతుదారులపై కాల్పులు
ఇరవై ఏళ్ల కిందట ముసెవేని అధికారంలో కొనసాగుతారన్నది స్పష్టమైనపుడు.. ఆయన మాజీ మద్దతుదారుల్లో కొందరు వేర్పడటం మొదలుపెట్టారు. అప్పుడు భద్రతా బలగాలు తమ తుపాకులను వారిపై ఎక్కుపెట్టాయి.
ముసెవేని మాజీ వైద్యుడు ప్రతిపక్ష ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ చేంజ్ నాయకుడు కిజ్జా బెసీగ్యే మొదటిసారి 2001 ఎన్నికల్లో ముసెవేనికి వ్యతిరేకంగా పోటీచేశారు. ఆయనను నిర్బంధించి.. అత్యాచారం, దేశద్రోహం వంటి అనేక అభియోగాలతో విచారించారు. కానీ ఎన్నడూ దోషిగా నిర్ధారించలేదు.
ఇప్పుడు అధ్యక్షుడి పాలనకు సవాల్ విసురుతున్న గాయకుడు బాబీ వైన్ – ఆయన అసలు పేరు రాబర్ట్ క్యాగులానీ – పోలీసు, సైనిక బలగాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న తాజా రాజకీయ నాయకుడయ్యారు.
మాజీ పాప్ స్టార్ అయిన ఈ ఎంపీ యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. 2018లో అరువా పట్టణంలో సహ నాయకుడి పునరెన్నిక ప్రచారంలో ఉన్నపుడు ఆయనను కిరాతకంగా అరెస్ట్ చేశారు. దేశద్రోహం అభియోగం మోపారు. ఆ తర్వాత ఆ అభియోగాలను ఉపసంహరించారు.
ప్రస్తుత ఎన్నికల ప్రచారం సందర్భంగా.. భారీ ఎత్తున గుమిగూడిన ఆయన మద్దతుదారుల మీద, ఆయన మీద.. కరోనావైరస్ ఆంక్షలను ఉల్లంఘించారంటూ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, కాల్పులు జరిపారు.
నవంబరులో బాబీ వైన్‌ను అరెస్ట్ చేసినపుడు రెండు రోజుల పాటు జరిగిన నిరసనల్లో 54 మంది చనిపోయారు. వారిలో చాలా మంది సైనిక బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఉగాండాలో ప్రభుత్వాన్ని, అద్యక్షుడిని విమర్శిస్తూ బహిరంగంగా మాట్లాడటం చాలా సాహసోపేతమైన చర్య. ముసెవేనిని సవాల్ చేయాలని భావించేవారు తాము ఎదుర్కోబోయే వేధింపుల తీవ్రతను అనుమానించాల్సిన అవసరం లేదు.
ముసెవేని తన 35 సంవత్సరాల పాలనలో.. అధికారం అగ్రభాగాన ఆశీనులయ్యారు. తన నియంత్రణ పూర్తిగా ఉండేలా చూసుకున్నారు. తనను తాను సరికొత్తగా కూడా మలచుకున్నారు.
ఈ నాయకుడు నాలుగు పదుల వయసులో రాజకీయాల్లో ఎదగటం మొదలుపెట్టారు. ఇప్పుడు అదే పాత్ర ఇంకెవరైనా పోషించేట్లయితే ఈయన క్రోధాన్ని చవిచూసే పరిస్థితి.
ఇవి కూడా చదవండి:
- కరోనాతో ప్రపంచం తలకిందులవుతున్న వేళ ఈ ఐదుగురు రూ. 22 వేల కోట్లు వెనకేసుకున్నారు
- కోవిడ్-19 లాక్‌డౌన్: ఫిలిప్పీన్స్‌లో సంతాన విప్లవం - లక్షల సంఖ్యలో అవాంఛిత గర్భాలు
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








