ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
''నా పేరు కొండపల్లి భవానీ. మా ఆయన ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. జీవితం బాగానే గడిచిపోయేది. కానీ ఆయనకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. కుటుంబ భారమంతా నా పైనే పడింది. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తుందంటే 2017లో డీడీ కట్టాం. ఇళ్లు పూర్తయ్యాయి. కానీ మాకు అప్పగించలేదు. అద్దె ఇళ్లల్లో ఉంటూ, ఆ భారం భరించలేక ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు ఒకసారి, జగన్ వచ్చి ఒకసారి పట్టా చేతిలో పెట్టారు తప్ప, ఇంటిని మాత్రం అప్పగించలేదు.''
రాజమహేంద్రవరానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం పరిస్థితి. ఇలా ఇబ్బందులు పడుతున్నది కొండపల్లి భవానీ మాత్రమే కాదు. రాష్ట్రంలో చాలా కుటుంబాలు ఇళ్లు అలాట్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాయి.
అత్యధికులు అప్పులు చేసి హౌసింగ్ కోసం తమ వాటా కింద చెల్లించాల్సిన మొత్తం కట్టారు. ఇప్పుడా అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతోందని వాపోతున్నారు. సొంతింటి కల నెరవేరుతుందని ఆశించినవారు అది ఎప్పుడన్నది తెలియక తల్లడిల్లుతున్నారు.
దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టినట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. కానీ వాటిని లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయలేకపోయింది.
ఇక నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా లబ్దిదారులకు అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దానికి సాంకేతిక కారణాలు చూపుతున్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్కారు మాత్రం బ్యాంకు రుణాల ఆలస్యంతోనే ఇంకా అప్పగించలేదని అంటోంది.
మొత్తం రెండున్నర లక్షల పైబడిన వాటిలో వచ్చే మార్చి నాటికి సగం ఇళ్లయినా అర్హులకు అందించే దిశలో అడుగులు వేస్తున్నామని చెబుతోంది.

‘టిడ్కో’ ఇళ్ల పథకం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలనే టిడ్కో ఇళ్లు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద కేటాయించిన ఇళ్ల నిర్మాణానికి టిడ్కోని రాష్ట్ర స్థాయి నోడల్ ఏజన్సీగా నిర్ణయించారు.
మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి, వాటికి ఫైనాన్సింగ్ చేయడం, అమలు చేయడం వంటి బాధ్యతను టిడ్కోకి అప్పగించారు.
లబ్ధిదారులకు 300, 365, 430 చదరపు అడుగుల చొప్పున విస్తీర్ణంలో మూడు మోడళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కోసం 2016లో ఏపీ టిడ్కో బాధ్యత తీసుకుంది.

మొదట అంచనా ప్రకారం 2018 నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. దానికి లబ్దిదారులు వాటాగా ఇంటి విస్తీర్ణాన్నిబట్టి రూ. 25వేల నుంచి రూ. లక్ష వరకూ తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
జి +3 అపార్ట్‌మెంట్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో 5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వివిధ పట్టణాల్లో సుమారు 2.62 లక్షల ఇళ్ల ప్రాథమిక నిర్మాణం పూర్తయింది.
భూసేకరణ పెండింగ్‌లో ఉండడం వంటి ఇతర సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన 2.4 లక్షల ఇళ్ల పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
ఆయా పట్టణాలు, నగరాలకు సమీపంలో వాటిని నిర్మించడానికి పూనుకున్నారు. ఈ టిడ్కో టౌన్‌షిప్‌లలో మౌలిక సదుపాయాల కోసం రూ .3,000 కోట్ల వ్యయంతో కూడిన పనులు జరగాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకూ అవి పూర్తికాకపోవడంతో లబ్దిదారులకు ఇళ్లు అప్పగించే ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

అసలేం జరిగింది...
మొత్తం 2.62 లక్షల ఇళ్లకు గానూ అందులో సుమారు 1.43 లక్షల మంది లబ్ధిదారులు 300 చదరపు అడుగుల లోపు వర్గానికి చెందినవారు. 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో 44,300 యూనిట్లు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 74,300 యూనిట్లు ఉన్నాయి.
300 చదరపు అడుగుల దిగువన ఉన్న ఫ్లాట్లను కేవలం ఒక్క రూపాయికే అప్పగిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రకటించారు. దాని కోసం ప్రభుత్వం సుమారు రూ.3,805 కోట్లు ఖర్చు చేస్తుందని ప్రకటించారు.
మిగతా రెండు వర్గాలకు చెందిన లబ్ధిదారులకు రూ.482 కోట్లు కేటాయించడం ద్వారా లబ్ధిదారులు చెల్లించాల్సిన అడ్వాన్స్‌లో సగం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటి ఖరీదు రూ.4 లక్షలుగా నిర్ణయించారు. 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని రూ.4.65 లక్షలుగా ప్రకటించారు.
వాటి నిమిత్తం లబ్ధిదారులు ఒక్కొక్కరు 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికయితే రూ.50 వేలు చొప్పున చెల్లించారు.
430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి రూ .1 లక్ష చెల్లించారు. పీఎంఏవై ద్వారా లభించే మొత్తంతో పాటుగా ఇంటి నిర్మాణానికి అవసరమైన మిగిలిన మొత్తానికి బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రుణాలకు ప్రయత్నించారు.

మౌలిక వసతుల కల్పనే మిగిలింది...
రాష్ట్రంలో అనేక చోట్ల 2018 చివరి నాటికే టిడ్కో ఇళ్లకు ఓ రూపం వచ్చింది. కొన్ని చోట్ల ఎన్నికలకు ముందు హడావిడిగా గృహ ప్రవేశాలు కూడా చేశారు. కానీ ఆయా టిడ్కో టౌన్ షిప్పులలో మౌలిక వసతుల కల్పన మాత్రం జరగలేదు.
తాగునీరు, రోడ్లు, విద్యుత్ , డ్రైనేజ్‌తో పాటుగా ఎస్టీపీ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ దానికి అవసరమైన నిధుల విడుదలలో జాప్యమే సమస్యకు మూలం అనే విమర్శలున్నాయి.
‘‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పట్టణ పేదలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణం కూడా ఇంతకాలం సాగదీయడం బాధాకరం. ఎన్నికల ముందు వరకూ ఆలస్యం చేసి చివరిలో హడావిడి చేసి నిర్మాణం పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమయ్యింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా పేదలకు అప్పగించడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. లబ్దిదారులున్నారు. ఇళ్లు ఉన్నాయి. కానీ, వాటిలో తుప్పలు మొలుస్తున్నాయి'' అని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సి.హెచ్. బాబూరావు.
సొంతిల్లు వస్తుందనే ఆశతో అప్పులు చేసి తమ వాటా చెల్లించిన లబ్దిదారులు వడ్డీలు కట్టలేక ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమని బాబూరావు బీబీసీతో అన్నారు.

''రంగులు మార్చడమే తప్ప...''
''పేదల కోసం నిర్మించిన ఇళ్లను అప్పగించాలనుకున్న సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయడంలో కొంత ఆలస్యం. ఈలోగా ప్రభుత్వం మారినా పేదలకు ఫలితం దక్కడం లేదు. పట్టణాలకు సమీపంలో దేశానికే రోల్ మోడల్ గా ఈ టిడ్కో ఇళ్లు నిర్మించాం. అనేక మంది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రశంసించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బయట వైపు తమ పార్టీ రంగులు వేసుకోవడం మినహా ఎటువంటి ప్రయోజనం పేదలకు కల్పించలేకపోయింది'' టీడీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
పూర్తయిన ఇళ్లను కూడా అప్పగించకుండా తాత్సారం చేయడంలో అర్థం లేదని ఆయన బీబీసీతో అన్నారు.
ఇప్పటికే టిడ్కో ఇళ్ల సమస్య మీద ప్రతిపక్ష టీడీపీ, వామపక్షాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. పేదలకు ఆయా ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశాయి.

ఫొటో సోర్స్, UGC
బ్యాంకు రుణాల వల్లనే ఆలస్యం...
లబ్దిదారుల వాటా చెల్లించినప్పటికీ బ్యాంకుల నుంచి రావాల్సిన రుణం రాకపోవడం వల్లనే టిడ్కో హౌసింగ్ ప్రయోజనం లబ్దిదారులకు చేర్చలేక పోయినట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఈ డిసెంబర్ నెలాఖరులోగా 40వేల ఇళ్లను అప్పగించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఏపీ టిడ్కో ఎండీ సి.హెచ్. శ్రీధర్ బీబీసీకి తెలిపారు.
''బ్యాంకు లోన్ల ఆలస్యానికి కరోనా, వర్షాలు తోడయ్యాయి. ఇళ్లు పూర్తయినా మౌలిక వసతుల కల్పన జరగకపోవడంతో పేదలకు అప్పగించ లేకపోయాం. వాటిని త్వరలో అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఎస్టీపీల నిర్మాణం ప్రధాన సమస్యగా ఉంది. వాటి మీద దృష్టి కేంద్రీకరించాం. డిసెంబర్‌లో కొందరికి, మార్చిలో కొందరికి ఇళ్లు అప్పగించే లక్ష్యంతో ఉన్నాం'' అని శ్రీధర్ వెల్లడించారు.
నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల ముంగిట ప్రభుత్వం హడావిడిగా టిడ్కో ఇళ్ల పంపిణీ చేపట్టినట్టు కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగిలిన పట్టణ పేదలు మాత్రం తమ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఓవైపు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించి ప్రణాళికలు వేస్తున్న ప్రభుత్వం పూర్తయిన ఇళ్లను అప్పగించేందుకు సిద్ధం చేయడంలో జాప్యం చేయడం తగదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఈసారైనా ప్రభుత్వం చెబుతున్న ప్రకారం అప్పగించాలని లబ్దిదారులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- డేవిడ్ బ్యూక్: ‘లక్షల కోట్ల కంపెనీకి ఆద్యుడు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చనిపోయాడు’
- సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడిగించాలన్న ప్రధాని మోదీ నిర్ణయంపై వివాదం ఎందుకు
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
- భూమికి అతి సమీపంలో తిరుగుతున్న భారీ రాతి ముక్క.. ఇది చంద్రుడిదేనా? మరి ఎర్రగా ఎందుకు ఉంది?
- ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు కోట్లాది హిట్లు ఎలా కొట్టేస్తున్నారు..
- భారత్‌తో విభేదాలు కోరుకోవడం లేదు - బీబీసీ ఇంటర్వ్యూలో తాలిబాన్ విదేశాంగ మంత్రి
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








