కోవిడ్: ప్రపంచంలో 50 లక్షలు దాటిన కరోనావైరస్ మరణాలు.. వాస్తవ సంఖ్య ఎక్కువే ఉంటుందన్న ఆరోగ్య నిపుణులు - Newsreel

కరోనావైరస్ మృతులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మరణాలు 50 లక్షలు దాటాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా వెల్లడించింది.

అయితే, వాస్తవానికి మరణాల సంఖ్య ఇంత కంటే చాలా ఎక్కువే ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా దేశాల్లో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత, మళ్లీ ఇటీవల పెరగడం మొదలైంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మందికిపైగా ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

అధికారిక సమాచారం కంటే రెండు నుంచి మూడు రెట్లు మరణాలు ఎక్కువగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా అంచనా వేసింది.

అమెరికాలో ఇప్పటివరకు కరోనావైరస్‌తో 7,45,800 మందికిపైగా మరణించారు. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్‌లో కోవిడ్-19తో 607,824 మంది మరణించారు.

కోవిడ్ వ్యాక్సీన్లతో మరణాలు చాలా వరకు తగ్గాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే, ఇంకా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి పూర్తికాలేదని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సంస్థ సూచించింది.

హుజురాబాద్

హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఉత్కంఠను రేపిన తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఈ రోజు(02.11.2021) వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ ఉప ఎన్నికలు ఫలితాలను కూడా ఈ రోజే ప్రకటిస్తారు.

కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

మరోవైపు బద్వేల్ ఓట్లను బద్వేల్ బాలయోగి గురుకుల పాఠశాలలో లెక్కించనున్నారు.

మధ్యాహ్నంలోగా తుది ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఈటల దంపతులు
ఫొటో క్యాప్షన్, ఈటల దంపతులు

ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఆయన బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.

గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింగ రావు అభ్యర్థిగా ఉన్నారు.

ఈ ముగ్గురు కాకుండా మరో 27 మంది పోటీలో ఉన్నారు. అంటే మొత్తం 30 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

స్థానిక పరిస్థితులను బట్టి ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే ఉండబోతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

హుజూరాబాద్‌లో అక్టోబరు 30న పోలింగ్ జరిగింది. మొత్తంగా 86.33 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

బద్వేల్‌లో ఇలా..

కడప జిల్లా బద్వేలు నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు.

కడప జిల్లా బద్వేల్‌ని 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రిజర్వుడు కేటగిరీలో చేర్చారు. ఎస్సీలకు ఈ స్థానం రిజర్వ్ చేశారు.

గడిచిన మూడు ఎన్నికలను పరిశీలిస్తే 2009లో కాంగ్రెస్ విజయం సాధించగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు.

ఎన్నికల ఫలితాలు

ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా దివంగత వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ పోటీచేశారు.

టీడీపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన ఓబుళాపురం రాజశేఖర్‌ని మరోసారి బరిలో దించారు.

అక్టోబరు 30న జరిగిన పోలింగ్‌లో ఇక్కడ 68.12 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)