విద్యుత్ సంక్షోభం: కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి తగ్గించాలని అంతకు ముందే అనేక ప్రతిపాదనలు వచ్చాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా థర్మల్ విద్యుత్ తయారీని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి.
సోలార్, విండ్ పవర్‌తో పాటుగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం జరగడం లేదు. బొగ్గు సంక్షోభ సమయంలో ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఫలితాన్ని ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కి బొగ్గు గనులు లేకపోవడంతో సమస్య వచ్చిందని భావిస్తున్న నేపథ్యంలో.. గ్యాస్ తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పవర్ ప్లాంట్లు మూతపడుతున్నాయన్నది చర్చనీయాంశం అవుతోంది.
గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన ఎంత?
ఆంధ్రప్రదేశ్‌లో 8,075 మెగావాట్ల విద్యుత్ సోలార్, విండ్ వంటి సహజ వనరుల ద్వారా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీసీతో కలుపుకుని ఏపీలో 12,290 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉంది. 1820 మెగావాట్ల హైడల్ పవర్ కూడా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది.
ఏపీలో స్థాపించిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 7,217 మెగావాట్లు.
ప్రస్తుతం అందులో 20 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి పెరుగుతుండడం వల్ల గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల ఉత్పత్తి నిలిచిపోయినా పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సమస్య రావడంతో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి కూడా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన కోసం కేంద్రానికి విన్నవించారు. ప్రధానికి రాసిన లేఖలో కేజీ బేసిన్‌లోని గ్యాస్ పవర్ ప్లాంట్లకు అవసరం మేరకు ఇంధనం అందించాలని కోరారు.

ఫొటో సోర్స్, www.apgpcl.org
అన్నీ ప్రైవేటు ప్లాంట్లే
దేశవ్యాప్తంగా 24899 మెగావాట్ల విద్యుత్‌ను గ్యాస్ ఆధారితంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరా లేకపోవడంతో అనేక పవర్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించకుండానే మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17 గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు స్థాపించారు. అందులో కేవలం విజ్జేశ్వరం పవర్ ప్లాంట్ ప్రభుత్వ వాటాతో నడుస్తోంది. మిగిలినవన్నీప్రైవేటు సంస్థలవే.
అందులో సామర్లకోటలో రిలయన్స్ ఆధ్వర్యంలో అనిల్ అంబానీ నిర్మించిన పవర్ ప్లాంట్ సామర్థ్యం 1870 మెగావాట్లుగా అంచనా వేశారు.
ఇక జీఎంఆర్, జీవీకే, ల్యాంకో వంటి సంస్థలు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పవర్ ప్లాంట్లు స్థాపించాయి. కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు డ్రిల్లింగ్ చేస్తుండడం, భారీగా గ్యాస్ నిక్షేపాలున్నాయని రూఢీ కావడంతో పవర్ ప్లాంటులన్నీ ఈ ప్రాంతంలో వెలిశాయి.
ప్రారంభం కాకుండానే తరలింపు
ప్రైవేటు యాజమాన్యాలు స్థాపించిన పవర్ ప్లాంట్లలో వేమగిరి వద్ద ఉన్న జీఎంఆర్, జేగూరుపాడు వద్ద జీవీకే ప్లాంట్, కొండపల్లిలోని ల్యాంకో పవర్ ప్లాంట్లు వంటివి మాత్రమే ఉత్పత్తి ప్రారంభించాయి.
సామర్లకోట వద్ద రిలయన్స్ భారీ పెట్టుబడితో స్థాపించిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయింది. అరకొరగా గ్యాస్ లభించడంతో ప్లాంట్ మూతపడింది. రెండు మూడేళ్ల క్రితమే ఈ ప్లాంట్‌ని అనిల్ అంబానీ నేరుగా బంగ్లాదేశ్‌కి తరలించేశారు.
కాకినాడ తీరంలో జీఎంఆర్ స్థాపించిన బార్జ్ మౌంటెడ్ పవర్ ప్లాంట్ పరిస్థితి కూడా అదే. వివిధ కారణాలతో జీఎంఆర్ సంస్థ ప్లాంట్ కూడా బంగ్లాదేశ్ తరలిపోయింది.
దీనిని తొలుత మంగుళూరులో ప్రతిపాదించగా, చివరకు 2010లో కాకినాడలో స్థాపించారు. కానీ కొంతకాలం మాత్రమే ఉత్పత్తి జరగ్గా, ఆ తర్వాత ఈ ప్లాంట్‌లో ఉపయోగపడే సామాగ్రిని తరలించేశారు.
మరికొన్ని ప్రైవేటు ప్లాంట్ల పరిస్థితి కూడా దాదాపు అంతే. మొత్తం ఉత్పత్తి సామర్థ్యంతో ఒక్క ప్లాంట్ కూడా ప్రస్తుతం పని చేయడం లేదంటే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, www.ongcindia.com
ముడిసరుకు సమస్యే..
గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు భారీగా గ్యాస్ సరఫరా అందుబాటులో ఉంటుందని అనేక మంది అంచనా వేశారు. కానీ తీరా చూస్తే కేజీ బేసిన్ డీ6 బావి నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయాల్సిన రిలయన్స్ సంస్థ వివిధ కారణాలతో దానిని సకాలంలో చేయలేక పోయింది.
2018 నుంచి గ్యాస్ అందుబాటులోకి వస్తుందని తొలుత ప్రకటించినా ప్రస్తుతం 2023 నాటికి అవసరాలకు తగ్గట్టుగా గ్యాస్ అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
"స్థానికంగా గ్యాస్ లభించడం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గ్యాస్ ఖరీదు అమాంతంగా పెరిగిపోయింది. వంట గ్యాస్ ధరలే గడిచిన రెండేళ్లలో ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలుసు. ఖరీదైన గ్యాస్ కొనుగోలు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తే బొగ్గు, హైడల్ పవర్‌తో పోలిస్తే యూనిట్ విద్యుత్ ఖరీదు చాలా ఎక్కువ అవుతోంది'' అని వేమగిరి పవర్ ప్లాంట్‌లో మేనేజర్‌గా పనిచేసిన ఆర్.జగదీశ్వర రావు బీబీసీతో అన్నారు.
సోలార్, విండ్ పవర్‌తో పోటీ పడే అవకాశమే లేదని, గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు లాభాల మాట అలా ఉంచితే నిర్వహణ కూడా భారమైందని జగదీశ్వర రావు అన్నారు.
పర్యావరణపరంగానూ, భవిష్యత్ రీత్యా ప్రయోజనకరమని అంతా భావిస్తున్నా గ్యాస్ సరఫరా మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగానూ ఈ సమస్య ఉంది..
గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన వ్యయం పెరిగిందని ఏపీ జెన్‌కో అధికారి పి.రమేశ్ కుమార్ బీబీసీతో అన్నారు. కేజీ బేసిన్ గ్యాస్ ఆశించిన స్థాయిలో లభించడం లేదని ఆయన తెలిపారు.
"పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం కేజీ బేసిన్ నుంచి 2023 ఆర్థిక సంవత్సరాంతానికి రోజూ 30 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు (mscmd) దేశీయ సహజ వాయువు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. దానిలో కొంత భాగం విద్యుత్ ప్లాంట్ల కోసం కేటాయించేందుకు నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్లాంట్లు నడవడం లేదు'' అన్నారు రమేశ్.
''కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లోని అల్ట్రా డీప్ వాటర్ గ్యాస్ ఫీల్డ్‌లు దేశీయ గ్యాస్ ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు సేకరిస్తాయి. కాబట్టి దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గట్టెక్కవచ్చని ఓ అంచనా. గ్యాస్ కొనుగోలు ధర పెరగడం, రవాణా భారం కావడంతో నిర్వహణ చేయలేక యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి'' అని రమేశ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, www.ongcindia.com
డిమాండ్ ఉంది..కానీ సరఫరా లేదు
రిలయన్స్‌తో పాటుగా, భారత్ పెట్రోలియం సంస్థ కూడా 2018 డిసెంబర్ నుంచే కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ రెండు సంస్థలూ ఇప్పటికీ పూర్తిగా గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురాలేక పోయాయి.
ఫలితంగా బహిరంగ మార్కెట్లో ప్రస్తుత ధరలను బట్టి వెయ్యి బ్రిటిష్ థర్మల్ యూనిట్ల (ఎంబీటీయూ)కు 5 అమెరికన్ డాలర్లకు పైగా వెచ్చించాల్సి వస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రేటు మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
రవాణా, నిర్వహణ ఖర్చులు కూడా కలిపి ఒక ఎంబీటీయూకి ధర 6 డాలర్లలోపు ఉంటేనే గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు మనుగడ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం అది చాలా ఎక్కువగా ఉందన్నది వారి వాదన.
"ఉత్పత్తి అయ్యే దేశీయ గ్యాస్‌ను బిడ్డింగ్ ద్వారా కేటాయించవచ్చు. కానీ మొత్తం గ్యాస్ కేటాయింపుల్లో విద్యుత్ రంగానికి ప్రత్యేక కేటాయింపులు కనిపించడం లేదు. నిర్దిష్ట పరిణామంలో గ్యాస్‌ని విద్యుత్ రంగానికి కేటాయించాల్సి ఉంది. అది జరగకపోతే గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగం ఇక కోలుకునే అవకాశం లేదు" అని అంటున్నారు గ్యాస్ పవర్ ప్లాంట్ నిర్వాహకుడు ఎం.అర్జున్.
స్థానికంగా లభించే గ్యాస్ ఇక్కడి ప్లాంట్లకు ఇవ్వకుండా గుజరాత్ వంటి రాష్ట్రాలకు తరలించుకుపోతుండడం వల్ల ఏపీలో గ్యాస్ ప్లాంటులన్నీ మూసేయాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్‌లో గ్యాస్ ఆధారిత ప్లాంట్లు తమ సామర్థ్యం పెంచుకుంటుండగా ఏపీలో రానురాను పడిపోతున్న స్థితిని గమనించవచ్చని అర్జున్ వివరించారు.
2017-18 సమయంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేసే సగటు దేశీయ గ్యాస్ రోజుకు 25.71 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (MMSCMD) మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అవసరాల్లో ఇది కేవలం 30 శాతంలోపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది మరింత తగ్గిపోయిందని మార్కెట్ వర్గాల అభిప్రాయం. 2009-10 నుండి 43 శాతం నుంచి 2017-18లో 24 శాతానికి తగ్గిందని అంటున్నారు.

ఫొటో సోర్స్, www.lntsnl.com
రిలయన్స్ గ్యాస్ కేటాయింపులు అవసరం..
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులో స్థానిక ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన కేటాయింపులుండాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది.
రాయల్టీ కోసం గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రానికి పలు లేఖలు కూడా రాశారు. అయినా ఫలితం లేదు.
"దేశవ్యాప్తంగా 31 గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు నిలిచిపోయాయి. అందులో 42శాతం ఏపీలోనే ఉన్నాయి. ఏపీలోనే గ్యాస్ వెలికి తీస్తున్నారు. రిలయన్స్‌తో పాటుగా ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు గ్యాస్ సేకరిస్తున్నాయి. కేటాయింపుల విషయంలో ఓఎన్జీసీ, గెయిల్ నుంచి కొద్ది మేరకు దక్కుతోంది. కానీ రిలయన్స్ మాత్రం ప్రాధాన్యతనివ్వడం లేదు'' అని విద్యుత్ రంగ నిపుణుడు, మాజీ ఇంజనీర్ టీఎల్ఎన్ రావు బీబీసీతో అన్నారు.
టీఎల్‌ఎన్ రావు చెప్పిన దాని ప్రకారం... కేజీ బేసిన్ డీ6 ఫీల్డ్ నుంచి విద్యుత్ ఉత్పాదనకు సరఫరా చేసే గ్యాస్‌ను పూర్తిగా తగ్గించేశారు. 2009 చివరి నాటికి డీ6 బావి నుంచి 80 MMSCMD సహజ వాయువుని విద్యుత్ తయారీకి అందిస్తారని ప్రకటించారు. 2010-11లో దాన్ని 55.35 MMSCMDకి తగ్గించేశారు. 2017-18 నాటికి అది 5.5 MMSCMDకి పడిపోయింది. ప్రస్తుతం దాదాపు లేనట్టే మారిపోయింది.
''మార్కెట్లో ఎక్కువ లాభాలకు అమ్ముకునేందుకు కాకుండా గ్యాస్ ఆధారిత ప్లాంట్లు నడిచేందుకు కనీస మొత్తంలో కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉంది" అని రావు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, @YSJAGAN/TWITTER
‘‘ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’
చమురు, సహజ వాయువులన్నీ కోనసీమ ప్రాంతంలో కేంద్రీకరించి ఉన్నాయి. తవ్వకాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. కానీ, కోనసీమలోనే ఉన్న పవర్ ప్లాంట్లు మూతపడుతుండంతో స్థానికుల ఉపాధి కూడా దెబ్బతింది.
దీనిపై ఏపీ ప్రభుత్వం తరపున తాము చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బీబీసీతో అన్నారు.
"ముఖ్యమంత్రి కూడా లేఖ రాశారు. గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు ఇంధనం అవసరం. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 14 నుంచి రూ. 20 వరకూ వెచ్చిస్తున్నాం. అదనంగా బొగ్గు కేటాయింపులతో పాటు గ్యాస్ పవర్ ప్లాంట్లు పని చేసేందుకు సహకరించాలని ప్రధానమంత్రిని సీఎం కోరారు'' అని బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు సహజ వాయువు కేటాయింపు విధానాన్ని పునః పరిశీలించాలని 2015లోనే ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ, అది జరగక పోవడంతో ప్రస్తుత సమస్యకు అది కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 మూలం ఎక్కడ? తేల్చడానికి ‘ఇదే చివరి అవకాశం’ - డబ్ల్యూహెచ్ఓ
- తెలంగాణ: న్యూడ్ చాట్లకు ఆహ్వానిస్తారు.. వీడియోలు తీసి బెదిరిస్తారు..
- కొన్ని హిందూ ఆలయాల్లో మద్యం, మాంసాలను నైవేద్యంగా ఎందుకు పెడతారు
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
- భర్తలను ఎంచుకోవడంలో పొరపాటు వల్లే మాకు, పిల్లలకు ఈ గతి - ఐఎస్ తీవ్రవాదుల భార్యలు
- 'భార్యల సంపాదన, భర్తల సంపాదన కన్నా ఎందుకు తక్కువ'.. కొత్త అధ్యయనం ఏం తేల్చింది?
- బైసెక్సువల్ సూపర్ మ్యాన్
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19 వ్యాక్సీన్: మొత్తం టీకాల్లో సగానికిపైగా చైనా నుంచే వచ్చాయా
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








