ఆంధ్రప్రదేశ్: కుప్పం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న వైసీపీ

కుప్పం మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ కౌన్సిలర్ సుధీర్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ సుధీర్ పేరును వైసీపీ ప్రకటించింది.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అధికార వైసీపీ పాగా వేయగలిగింది. 1989 నుంచి ఇక్కడ పట్టు నిలుపుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది.

మొత్తం 25 వార్డులకు గానూ టీడీపీ 6 వార్డులతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. 1 వార్డు ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 24 వార్డుల్లో వైసీపీకి 18 వార్డులు దక్కాయి. దాంతో ఆ పార్టీకి చెందిన డాక్టర్ సుధీర్ కుప్పంలో తొలి మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం దక్కించుకున్నారు.

పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రతిపక్ష టీడీపీ పలు ఆరోపణలు చేసింది. ఎస్‌ఈ‌సీకి ఫిర్యాదులు కూడా చేసింది. అయినా స్పందన లేదంటూ విమర్శలు గుప్పించింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రారంభం నుంచి వైసీపీకే ఆధిక్యం కనిపించింది. తొలి రౌండ్‌లో 16 వార్డులు, ఆ తర్వాత మిగిలిన వార్డులు లెక్కించారు.

మొత్తంగా వైసీపీ మెజార్టీ సాధించడంతో ఆపార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ జగన్
ఫొటో క్యాప్షన్, కుప్పం మున్సిపల్‌ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జిల్లా పార్టీ నేతలను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌

కొండపల్లిలో ఆసక్తికర రాజకీయం

కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.

తుది ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి.

మొత్తం 29 వార్డులున్న ఈ నగర పంచాయతీలో మ్యాజిక్ ఫిగర్ 15కాగా ఎవరూ దానిని చేరుకోలేదు.

దాంతో ఇండిపెండెంట్‌గా 10వ వార్డు నుంచి గెలిచిన అభ్యర్థి ఎవరికి మద్ధతిస్తారన్నది ఆసక్తిగా మారింది. దాంతో చైర్మన్ సీటు కోసం ఇక్కడ ఇరు పార్టీలు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.

చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరిన కొండపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్రీ లక్ష్మి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కొండపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్రీలక్ష్మి

మరోవైపు, చంద్రబాబు సమక్షంలో కొండపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్రీ లక్ష్మి టీడీపీలో చేరారు.

ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీ కండువా కప్పుకోవడం, ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్‌అఫీషియో మెంబర్ హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కొండపల్లిలో టీడీపీకి మొగ్గు కనిపిస్తోంది.

ఆ పార్టీ బలం 16కి చేరుతుంది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ నేతలు కొండపల్లి మీద ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో తమ చేతుల్లోకి మరో మునిసిపాలిటీ వచ్చినట్టేననే అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)