తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రియాక్షన్ ఇదీ.. - BBC Newsreel

తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉంటే, టీఆర్ఎస్‌కు 110 స్థానాలు ఉన్నాయని ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.
ఉప ఎన్నికలు వస్తుంటాయని, వాటిలో కొన్ని గెలిస్తే, కొన్ని ఓడుతుంటామని.. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుకూ, ప్రబుత్వ వ్యతిరేకతకూ సంబంధం లేదన్నారు. అలాగైతే, దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని, మరి ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లేనా? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్‌లో ఏదో ప్రళయం బద్దలైనట్లు మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు.
ఆదివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యనే జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించామని అన్నారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్థానంలో కూడా తమ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు.
దళిత బంధు పథకాన్ని తాను బతికి ఉన్నంతకాలం హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తాను ఏవిధంగా చెప్పానో ఆ విధంగా కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.
రాష్ట్రంలో యాసంగిలో వరి వేయొద్దని రైతులకు చెప్పడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్లనే తాము రైతులకు వరి కాకుండా వేరే పంటలు వేయాలని సూచించామన్నారు.
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేస్తామంటే తాము ఎందుకు వద్దంటామని అన్నారు.
''నాకు ఇంత మంట ఎందుకు మండుతోందంటే.. వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను మాట్లాడలేదు. రైతాంగం బతుకులతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టి, రైతులు మునగకుండా కాపాడాలి కాబట్టే నేను మాట్లాడుతున్నా'' అని కేసీఆర్ అన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో ప్రజలు, రైతాంగం సంతోషంగా ఉన్నారని చెప్పారు.
పంజాబ్‌లో మొత్తం ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మాత్రం ఎందుకు చేయదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక తీరుగా ప్రవర్తిస్తుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసిందన్నారు.
పెట్రోలు ధరల విషయంలో సైతం కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ తాము పార్లమెంటులో సహకరిస్తూ వచ్చామని, ఇకపై కొట్లాడతామని చెప్పారు.
'కష్టపడి తెలంగాణ తెచ్చా.. ఇష్టపడి అభివృద్ధి చేశా. తెలంగాణను సాధించిన వ్యక్తిని, అద్భుతమైన శక్తిగా నిలబెట్టిన వ్యక్తిని' అని కేసీఆర్ అన్నారు. ఎన్నో విధాలుగా ఇప్పుడు తెలంగాణ దేశంలోనే ముందుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాక్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి, సురక్షితంగా తప్పించుకున్న ముస్తఫా
తన ఇంటిపై జరిగిన డ్రోన్ దాడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకున్నట్లు ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా అల్ కథిమి చెప్పారు.
బాగ్దాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్‌లో ముస్తఫా ఇల్లు ఉంది. ప్రధాని నివాసం పరిసరాల్లో ఎన్నో ప్రభుత్వ భవనాలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్నాయి.
పేలుడు పదార్థాలతో కూడిన ఒక డ్రోన్ ప్రధాని ఇంటిలోకి దూసుకొచ్చిందని, అది పేలడంతో ఆరుగురు బాడీగార్డులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ప్రధాని హత్యకు డ్రోన్ దాడితో కుట్ర పన్ని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రధాని ముస్తఫా అల్ కథిమి పిలుపునిచ్చారు.
ఇటీవల ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తర్వాత ప్రధాని నివాసంపై ఈ డ్రోన్ దాడి జరిగింది.
అమెరికా, ఇరాన్ ఈ దాడిని ఖండించాయి.
ఈ దాడి తమ పనేనని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌గా పని చేసిన ముస్తఫా గతేడాది మేలో ప్రధాని పదవి చేపట్టారు.
ఇరాన్ అనుకూల రాజకీయ గ్రూపులకు చెందిన మద్దతుదారులు కొందరు ఇటీవల గ్రీన్ జోన్‌లో ఆందోళనలు చేపట్టారు.
గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాళ్లు ఆరోపిస్తున్నారు.
గత వారం హింసాత్మక ఆందోళనల్లో, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో సుమారు వంద మంది గాయపడ్డారు.

ఫొటో సోర్స్, EPA
'ఇరాక్ నడిబొడ్డున ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు అనిపిస్తోంది' అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రిన్స్ అన్నారు.
ఈ ఘటనపై విచారణకు అమెరికా సాయం చేస్తుందని ఆయన చెప్పారు.
టెర్రరిస్టులు, ఆక్రమిత శక్తులను సృష్టించి, వాటికి కొన్ని విదేశీ థింక్ ట్యాంకులు సాయం చేస్తున్నాయంటూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీ ఆరోపించారు. వాటివల్ల ఇరాక్‌లో అస్థిరత్వం, అసమ్మతి, అభద్రత వస్తోందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువను బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోకుండా అమెరికా ఎలా అడ్డుకుంది?
- ‘నా వయసువారు చూడకూడని వీడియోలు ఉంటాయి అక్కడ’
- సూర్య 'జై భీమ్' తెర వెనుక అసలు కథ ఏంటి? రియల్ హీరో ఎవరు?
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువు
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- కోవిడ్ టీకా: రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)















