స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో 387 మంది పేర్ల తొలగింపుపై వివాదం, అసలు ఏం జరిగింది?

మప్పిల తిరుగుబాటు

ఫొటో సోర్స్, TOPICAL PRESS AGENCY/GETTYIMAGES

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

స్వాతంత్ర్య సమరయోధుల జాబితా నుంచి 387 పేర్లు తొలగించడంతో కేరళలో రాష్ట్రంలో కొత్త వివాదం రాజుకుంది.

టిప్పు సుల్తాన్ విషయంలో చరిత్రకారులు ఎలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, ఇప్పుడు ఈ అంశంలో కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది.

మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను కొందరు హిందూ వ్యతిరేకిగా వర్ణిస్తే, మరికొందరు ఆయన హిందూ ఆలయాలను నిర్మించారని చెబుతుంటారు.

అయితే కేరళలో ఇప్పుడు టిప్పు సుల్తాన్ స్థానంలో మప్పిలా నాయకుడు వరియామకునాథ్ కుంజాహమ్మద్ హాజీ గురించి చరిత్రకారుల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మక్కాకు వలస వెళ్లి, అక్కడే జీవించడానికి బదులు ఆంగ్లేయుల చేతుల్లో మరణించడానికే సిద్ధపడిన వరియామ్‌కునాథ్ కుంజాహమ్మద్‌ హాజీని కేరళలో భగత్ సింగ్ లాగే గౌరవిస్తారు.

హాజీ, ఆయన సహచరుడు అలీ ముసలియార్‌కు కేరళలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో చాలా గౌరవం ఉంది. వీరిద్దరూ 1921లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మలబార్ తిరుగుబాటులో స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించారు.

కానీ, హాజీ, ముసలియార్, వారి సహచరులైన మరో 387 మంది పేర్లను డిక్షనరీ ఆఫ్ మార్టియర్ ఆఫ్ ఇండియాజ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 2015 నుంచి తొలగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్ఆర్) త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది.

మప్పిల తిరుగుబాటు స్వాతంత్ర్య పోరాటంలో భాగం కాదని భావించిన కమిటీ ఈ సిఫారసులు చేసింది.

టిప్పు సుల్తాన్

ఫొటో సోర్స్, GEORGIOSART/GETTY

ఫొటో క్యాప్షన్, టిప్పు సుల్తాన్

పేర్లు ఎందుకు తొలగించారు

ఐసీహెచ్ఆర్ త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సీఐ ఐజాక్ బీబీసీతో మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా వారికి వ్యతిరేకంగా ఉన్న అన్ని చార్జిషీట్లను పరిశీలించానని చెప్పారు.

"హాజీపై వచ్చిన దాదాపు అన్ని ఆరోపణల్లో హిందువులను బలవంతంగా మత మార్పిడి చేశారని, ఆలయాలు అపవిత్రం చేసారని, ప్రజా ఆస్తులు దోచుకున్నట్లు ఉన్నాయి. ఆయన స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేయలేదు. హిందూ సమాజాన్ని మార్చడమే ఆయన ఉద్దేశం" అని ఐజాక్ అన్నారు.

త్రిసభ్య కమిటీ ఒక సీల్డ్ కవరులో తమ సిఫారసులను అందించిందని, దానిని అక్టోబర్ లేదా డిసెంబర్‌లో ఐసీహెచ్ఆర్ బోర్డు ఎదుట ఉంచుతామని ఐసీహెచ్ఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఓం జీ ఉపాధ్యాయ్ బీబీసీకి చెప్పారు.

గత వారం సీపీఎం నేతృత్వంలోని ఎల్టీఎఫ్ ప్రభుత్వం మప్పిలా తిరుగుబాటుకు వందేళ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు నిర్వహించిన సమయంలోనే ఐసీహెచ్ఆర్ త్రిసభ్య కమిటీ సిఫారసులు వెలుగులోకి రావడం విశేషం.

కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేష్ మప్పిలా తిరుగుబాటు వందేళ్ల వేడుకల సందర్భంగా హాజీని భగత్ సింగ్‌తో పోల్చారు.

అదే రోజు తిరుగుబాటు బాధితుల జ్ఞాపకార్థం నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ నేత రాం మాధవ్ "ఈ ఉద్యమం భారత్‌లో తాలిబాన్ మనస్తత్వానికి మొదటి ఉదాహరణ" అన్నారు. మిగతావారు ఆ తిరుగుబాటును "హిందువులు ఊచకోతకు గురైన రోజు"గా వర్ణించారు.

మప్పిలా తిరుగుబాటులో పాల్గొన్నవారిని డైరెక్టరీ ఐదో విభాగంలో చేర్చడానికి సంఘ్ పరివార్ సభ్యులు, చరిత్రకారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో, ఐసీహెచ్ఆర్ ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది..

అలీ ముసలియార్

ఫొటో సోర్స్, BETTMANN/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, అలీ ముసలియార్

అసలు కథ ఏంటి?

చరిత్రకారులు తమ పరిశోధనలో ఎన్నో అంశాలపై పరస్పరం విభేదిస్తుంటారు. కొందరు చరిత్రకారులు మప్పిల తిరుగుబాటును ఒక వ్యవసాయ ఉద్యమంగా చెబుతున్నారు.

మరికొందరు మాత్రం అది ఖిలాఫత్ ఉద్యమంతో ప్రభావితమైన స్వాతంత్ర్య పోరాటమేనని, అది వ్యవసాయ పోరాటానికి ఒక కొత్త ఊపునిచ్చిందని అంటున్నారు.

మప్పిల తిరుగుబాటు పూర్తిగా మతమార్పిడి ఆధారంగా జరిగిన హింస, మత ఘర్షణలు తప్ప వేరే ఏదీ కాదని ప్రొఫెసర్ ఐజాక్, మరికొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు.

వాస్తవానిది ఇది ప్రధానంగా జమీందార్ నంబూద్రి సమాజం, నాయర్ సమాజానికి, తర్వాత ముస్లింలలోని మప్పిల అనే ఒక చిన్న సమాజం మధ్య జరిగింది.

ముస్లింలు, వెనుకబడిన సమాజాల్లో ఎక్కువ మంది రైతులు, వ్యవసాయ కూలీలుగా జీవించేవారు. జమీందార్ల పాలనా అధికారాలు(ముఖ్యంగా పన్ను వసూళ్లు), బ్రిటిష్ అధికారులతో వారికి ఉన్న సాన్నిహిత్యం ఈ ఘర్షణలకు ప్రధాన కారణం అయ్యింది.

ఆంగ్లేయ అధికారులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఎంతోమంది హిందువులపై దాడులు జరిగాయనే విషయాన్ని కూడా ఎవరూ కొట్టిపారేయలేరు. 1850కి ముందు కూడా అలాంటి దాడులు జరిగాయి అని కేరళ విశ్వవిద్యాలయం ప్రొపెసర్ అష్రఫ్ కడక్కల్ బీబీసీతో అన్నారు.

వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో మప్పిలా ముస్లింలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినట్లు ప్రముఖ చరిత్రకారులు సుమిత్ సర్కార్ తన 'మాడర్న్ ఇండియా 1885-1947' అనే పుస్తకంలో రాశారు.

"ఈ తిరుగుబాటు వలసవాదం, భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల ప్రతిచర్య. అప్పట్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉండేది. ఆంగ్లేయులు జమీందార్లనే వెనకేసుకొచ్చేవారు" అని కేరళ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అధ్యక్షులు ప్రొఫెసర్ కేఎన్ పనిక్కర్ బీబీసీకి చెప్పారు.

వీడియో క్యాప్షన్, అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ వారిని గడగడలాడించిన తెలుగు వీరుడు

కాలికట్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రొఫెస్ కేఎన్ గణేష్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో మూడు కోణాలు ఉన్నట్లు తనకు అసలు అనిపించలేదన్నారు.

"మప్పిల తిరుగుబాటు వెనుక మూడు కోణాలేం లేవు. ముఖ్యంగా భారత దేశం అంతటా వ్యవసాయ పోరాటాలు జాతీయ స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. దానికి దన్నుగా నిలిచాయి. బిర్సా ముండా తిరుగుబాటు, దక్కన్ తిరుగుబాటు, మిగతా తిరుగుబాటులకు ప్రధాన కారణం వలసవాదం వ్యతిరేక పోరాటాలే. ఈ తిరుగుబాట్లు రైతులు, సాగుదారులపై దారుణాలకు పాల్పడిన జమీందార్లకు వ్యతిరేకంగానే జరిగాయి" అన్నారు.

మప్పిల ముస్లింలకు అప్పటి పాలకులతో వరుసగా జరిగిన హింసాత్మక యుద్ధాలకు కూడా మరో కారణం ఉంది. ఆంగ్లేయులు రాకకు ముందే ఆ ముస్లింలు మలబార్ తీరంలో వ్యాపారులు, మధ్యవర్తుల మొత్తం నెట్‌వర్క్‌తోపాటూ కలిసి వ్యాపారం చేస్తూ బాగా అభివృద్ధి చెందారు.

"బ్రిటిష్ వాణిజ్య సంబంధాలతో అదంతా మారిపోయింది. ఈస్టిండియా కంపెనీ మధ్యవర్తులు భిన్నంగా ఉండడంతో ముస్లింలు తప్పనిసరి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సి వచ్చింది. దాంతో, అప్పటివరకూ బాగా బతికిన వ్యాపారులు తిరిగి బలవంతంగా తమ గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలుగా మారాల్సివచ్చింది. బ్రిటిష్ వారిపట్ల వ్యతిరేక భావన కలగడానికి ప్రదాన కారణం అదే. చాలా మంది చెబుతున్నట్లు దీని వెనుక మతపరమైన భావనలు ఏవీ లేవు" అని గణేష్ చెప్పారు.

కానీ ఆంగ్లేయులు రైతుల కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకువచ్చారని, వ్యవసాయం చేసేవారికి ప్రయోజనాలు అందించాలనుకున్నారని ప్రొఫెసర్ ఐజాక్ చెబుతున్నారు.

"అక్కడ వ్యవసాయంలో ఎలాంటి సమస్యలూ లేవు. జమీందార్లు ఎవరూ ఏ రైతునూ తరిమికొట్టలేదు. మప్పిల ముస్లింలలో ఒక్కరు కూడా జమీందార్లపై దాడులు చేయలేదు" అని తెలిపారు.

మప్పిల తిరుగుబాటు

ఫొటో సోర్స్, BETTMANN/GETTYIMAGES

అసలు పథకం ఏంటి?

ఖిలాఫత్ ఉద్యమం వ్యాప్తి పాలకులు, రైతులు, వ్యవసాయ కూలీల మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది.

"అప్పటివరకూ అది వ్యవస్థీకృత తిరుగుబాటు కాదు. కానీ, అది కచ్చితంగా అలాంటి పరిస్థితులు ఏర్పడేలా చేసింది. దాంతో, అలీ ముసలియార్, నారాయణ్ మీనన్, గోపాల్ మీనన్, ఖిలాఫత్, కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా గుంపులను నియంత్రించలేకపోయారు" అని ప్రొఫెసర్ అష్రఫ్ చెప్పారు.

"సరిగ్గా అదే సమయంలో మలబార్ స్పెషల్ పోలీస్(ఎంఎస్‌పీ) కూడా ప్రారంభించారు. దాంతో ఆ ఆగ్రహం మరింత పెరిగింది. అది తర్వాత స్వతంత్ర సంగ్రామానికి ఒక నిప్పు రవ్వలా పనిచేసింది" అంటారు ప్రొఫెసర్ గణేష్.

ఉద్యమం సాయుధ తిరుగుబాటుగా మారడంతో, హిందూ ముస్లింలలో ఒక వర్గం ఎరానంద్, వలువనాడ్ తాలూకాల నుంచి పారిపోయింది.

"స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ఇవ్వనందుకు హాజీ హిందువులనే కాదు, ముస్లింలను కూడా శిక్షించారు. ఆయన తర్వాత వెంటనే స్వతంత్ర మలయాళ నాద ప్రకటించారు. తమ సొంత కరెన్సీని కూడా విడుదల చేశారు. దానితోపాటూ సొంత చట్టాలను కూడా ప్రారంభించారు" అని ప్రొఫెసర్ అష్రఫ్ చెప్పారు

"స్థానిక భాషలో మలయాళ నాద అంటే మలయాళం మాట్లాడే వారి భూమి. ఆయన దానిని ఖిలాఫత్ అనలేదు. ఆయన షరియా చట్టాన్ని కోరుకునేవారు. కానీ ఆ ప్రాంతంలో ఉండే హిందువులపై అది అమలు కాదు. అది చాలా వరకూ ఒక సలహా లాంటిది" అని ప్రొఫెసర్ అష్రఫ్ అన్నారు.

అయితే, "అప్పట్లో ప్రధానంగా బలహీన హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. వారిని చంపేశారు. సంపన్నులైన హిందువులు మలబార్ నుంచి మొదటే వెళ్లిపోయారు. వారు నిరాయుధులైన పేద హిందువులను చంపేశారు" అని ప్రొఫెసర్ ఐజాక్ చెప్పారు.

మరోవైపు ప్రొఫెసర్ గణేష్ మాత్రం ఆలయాలను అపవిత్రం చేశారనేది నిజం కాదు అన్నారు.

కానీ, అసెంబ్లీ స్పీకర్ రాజేష్ మాత్రం మప్పిల ముస్లింల తిరుగుబాటుకు ప్రధాన కారణం వ్యవసాయమే, కానీ, దానివో కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి అన్నారు.

"అది మొదట ఒక వర్గ పోరాటంలా మొదలైంది. కానీ అందులో మతపరమైన ధోరణులు కూడా ఉన్నాయి" అని డీఎంఎస్ నంబూద్రినాథ్ 1946లో రాశారు.

మలబార్‌లో ఒక మసీదు

ఫొటో సోర్స్, PRINT COLLECTOR/GETTYIMAGES

హాజీకి భగత్ సింగ్‌తో పోలిక

హాజీని భగత్ సింగ్‌తో పోల్చిన కేరళ అసెంబ్లీ స్పీకర్ ప్రసంగంలో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

"ఆంగ్లేయులను హాజీని క్షమాపణ అడగమన్నారు. అడిగితే, నిన్ను మక్కా పంపించేస్తామని చెప్పారు. కానీ హాజీ తన మరణాన్నే ఎంచుకున్నారు. ఆయన ఆంగ్లేయులతో మక్కా అంటే నాకు ఇష్టమే. కానీ క్షమాపణకు బదులు నేను నా జన్మభూమిలోనే మరణించాలనుకుంటున్నా అన్నారు. దాంతో ఆంగ్లేయులు ఆయన్ను కాల్చి చంపాలని నిర్ణయించుకున్నారు. హాజీ తన కళ్లకు గంతలు కట్టడానికి ఒప్పుకోలేదు. ఇదంతా భగత్ సింగ్ ఎలా రాశారో అలాగే జరిగింది. హాజీని ఉరి తీయలేదు. కాల్చి చంపారు అన్నారు".

కానీ, మప్పిలా తిరుగుబాటులోనే అత్యంత ఘోర విషాదం 1921 నవంబర్ 10న జరిగింది. దానిని 'వాగన్ ట్రాజెడీ' అంటారు. ఆ సమయంలో ఆంగ్లేయులు అదుపులోకి తీసుకున్న వంద మందిని ఇరుకుగా ఉన్న ఒక రైలు బోగీలో బంధించారు. వారిని తిరూర్ నుంచి బెళ్లారికి తరలిస్తున్నారు. ఆ సమయంలోవారిలో 64 మంది ఊపిరాడక చనిపోయారు. మిగిలిన వారు ఒకరి మూత్రం ఇంకొకరు తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నారు.

కానీ ప్రొఫెసర్ ఐజాక్ మాత్రం పోలీసుల చర్యల వల్ల 160 మందే చనిపోయారు. జైళ్లలో ఉన్న ఎక్కువ మంది కలరా, ఇతర వ్యాధుల వల్ల మరణించారని తెలిపారు.

చివరికి ఎవరు ఏమన్నారు

"ఇది ప్రధానంగా ఒక వ్యవసాయ పోరాటం, దానికి ఒక మతం రంగు పులిమారు" అని ప్రొఫెసర్ పనిక్కర్ చెప్పారు.

"ఇది అంగ్లేయుల కల్పిత కథ. తిరుగుబాటుకు మతం రంగు పులిమిన టోటెనహమ్ రిపోర్ట్ నుంచి అది మొదలవుతుంది" అని ప్రొఫెసర్ గణేష్ అన్నారు.

"వ్యవసాయ తిరుగుబాటు, స్వాతంత్ర్య ఉద్యమం, మత ఘర్షణలు అనే ఈ మూడు కోణాల మధ్య అసలు వాస్తవాలు ఎక్కడో ఉన్నాయి" అంటున్నారు ప్రొఫెసర్ అష్రఫ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)