ఉత్తర కొరియా: పంట పొలాల్లోకి సైన్యం.. ప్రతి బియ్యం గింజనూ సేకరించాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశం

పొలంలో పని చేస్తున్న ఉత్తర కొరియా రైతు (పాత ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పొలంలో పని చేస్తున్న ఉత్తర కొరియా రైతు (పాత ఫొటో)
    • రచయిత, లారా బికర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'ఉత్తర కొరియా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు'.

ఉత్తర కొరియా లోపలి నుంచి, బయటి నుంచి వినిపిస్తున్న హెచ్చరిక ఇది.

ఉత్తర కొరియాలోని తమ బంధువులు ఆకలితో అలమటిస్తున్నారని ఆ దేశం నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో తలదాచుకున్న వాళ్లు మాతో చెప్పారు.

చలికాలం సమీపిస్తుండటంతో నిరు పేదలు కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి రాబోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉత్తర కొరియా వీధుల్లో అనాథ బాలల సంఖ్య పెరగడం, ఆకలి చావులు లాంటి వార్తలు నిరంతరం వెలుగులోకి వస్తూనే ఉన్నాయని డైలీ ఎన్‌కే ఎడిటర్ ఇన్ చీఫ్ లీ సంగ్ యోంగ్ చెప్పారు. ఈ పత్రికకు సమాచారం ఇచ్చేవారు ఉత్తర కొరియాలో ఉన్నారు.

ఉత్తర కొరియాలోని పేద ప్రజల కష్టాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయని లీ చెప్పారు.

ఉత్తర కొరియా నుంచి సమాచారం సేకరించడం చాలా కష్టమైన విషయం. చైనా నుంచి కరోనావైరస్ తమ దేశంలోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆ దేశంతో తన సరిహద్దులను జనవరిలో మూసేసింది ఉత్తర కొరియా.

అంతేకాదు దక్షిణ కొరియాకు పారిపోయిన ఆత్మీయులకు తమ యోగ క్షేమాల సమాచారం తెలియచేయడం కూడా ఉత్తర కొరియాలో ఉన్న వారికి చాలా రిస్కుతో కూడిన విషయం.

అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ వాడుతూ అధికారులకు ఎవరైనా దొరికితే వారిని లేబర్ క్యాంపుల్లో పడేస్తారు. అయినప్పటికీ.. కొందరు ధైర్యం చేసి దక్షిణ కొరియాలో ఉన్న తమ బంధువులకు, వార్తా సంస్థలకు లెటర్లు, వాయిస్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారు.

ఇలా వచ్చిన సమాచారం ఆధారంగా ఉత్తర కొరియాలో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే, ఇలా సమాచారం ఇచ్చిన కొందరు తమ పేరును గోప్యంగా ఉంచారు.

కిమ్ జోంగ్ ఉన్
ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియాలో ఆహార కొరత కొత్తేం కాదు. కానీ కరోనావైరస్ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుత పరిస్థితిని 1990ల్లో వచ్చిన క్షామంతో పోల్చారు. ఆనాడు వచ్చిన కరువులో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు.

కానీ ఇప్పటివరకైతే ప్రస్తుత పరిస్థితి మరీ అంత దారుణంగా లేదు. కొన్ని సానుకూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి.

చైనాతో సరిహద్దులను తిరిగి తెరిచేందుకు ఉత్తర కొరియా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఉత్తర కొరియాను బాగు చేయడానికి ఎంత సాయం, వాణిజ్యం అవసరమన్నది ఇప్పటికింకా స్పష్టత రాలేదు.

ఈ ఏడాది పంట దిగుబడి కీలకంగా మారింది. గతేడాది వరుసగా వచ్చిన తుపాన్ల వల్ల పంటలు ధ్వంసమయ్యాయి. ఉత్తర కొరియాలో కనీసం రెండు, మూడు నెలలకు కావాల్సిన ఆహారం కొరతగా ఉందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

ఈసారి పంట దిగుబడిని సాధ్యమైనంత మేరకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఉత్తర కొరియా. ప్రతి ఒక్క బియ్యం గింజను, మొక్కజొన్నలను సేకరించడానికి సైన్యం సహా వేలాది మందిని పంట పొలాల్లోకి పంపిస్తోంది.

ప్రతి బియ్యం గింజను భద్రపరచాలని, అన్నం తిన్న ప్రతి ఒక్కరు ధాన్యం సేకరణకు సాయం చేయాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్ ఎంత ప్రమాదకరం?

ధాన్యం సేకరించే ప్రక్రియలో వృధా తక్కువగా ఉండేలా చూసేందుకు ఒక ప్లాన్ సిద్ధం చేశారని డైలీ ఎన్‌కే పత్రికకు చెందిన లీ చెప్పారు.

ధాన్యం చోరీ లేదా మోసం చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తామని కూడా హెచ్చరించారు. ప్రజలను ఇది భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన అన్నారు.

దేశంలోని ఆర్థిక పరిస్థితి కారణంగా తాను కత్తి మీద సాము చేస్తున్నానని కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్లు గతవారం ఒక అంతర్గత విచారణలో ఉత్తర కొరియా జాతీయ నిఘా సంస్థ - ఎన్ఐఎస్ పేర్కొందని, ఆ సమయంలో అక్కడున్న కొందరు చట్టసభ సభ్యులు చెప్పారు.

మందులు, నిత్యావసరాల కొరత టైఫాయిడ్ లాంటి వ్యాధులు పెరగడానికి కారణమవుతోందని ఎన్ఐఎస్ నివేదించినట్లు చెబుతున్నారు.

ప్రజల ఆందోళనలను ప్రభుత్వ మీడియా మరింత పెంచింది. పంటలు ధ్వంసం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఆహార ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలను హైలైట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసింది.

దక్షిణ కొరియాలోని లుకవుట్ పాయింట్
ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియాలోని ఈ ప్రాంతం నుంచి ఉత్తర కొరియాను స్పష్టంగా చూడొచ్చు.

ఆధునిక వ్యవసాయం

ఆహార సరఫరాకు సంబంధించి ఉత్తర కొరియా రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటోంది. అందులో ఒకటి సాగు పద్ధతులు.

కొత్త సైనిక టెక్నాలజీ, మిసైల్స్‌పై ఉత్తర కొరియా పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. కానీ పంటలను వేగంగా కోయడానికి, ధాన్యం సేకరించడానికి అవసరమైన ఆధునిక వ్యవసాయ యంత్రాలు దాని దగ్గర లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సాగు పరికరాల కొరత ఆహార ఉత్పత్తిలో తక్కువ దిగుబడికి కారణమవుతోందని కొరియన్ రూరల్ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చోయ్ యోంగో చెప్పారు.

ఈ విషయాన్ని మేము స్వయంగా చూడగలిగాము. ఉత్తర కొరియాలోని హాన్ నది పరిసరాలను మేము స్పష్టంగా చూడగలిగాము. చూడ్డానికి చాలా దగ్గరగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ.. అది చాలా దూరంగా ఉందన్న భావన కలిగింది.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియాలో ఒకరు పారిపోతే మరొకరికి చిత్రహింస

వాళ్లు కూడా సరిగ్గా మనలాగే ఉన్నారని బైనాక్యులర్‌లో చూస్తూ ఒక దక్షిణ కొరియా అమ్మాయి అన్న మాటలు నాకు వినిపించాయి.

వాళ్లు కూడా మనలాగే ఉన్నారంటూ ఆ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లింది.

చాలా మంది గ్రామస్తులు వడ్లను బస్తాల్లో నింపి, వాటిని ట్రాక్టర్‌లో తరలించడానికి బదులు, వీపుపై మోసుకెళ్తూ కనిపించారు.

యంత్రం సాయంతో తన మొత్తం పొలం నుంచి వడ్లను సేకరించడానికి తనకు ఒక గంట సమయం పట్టిందని, ఒకవేళ అదే పనిని ఉత్తర కొరియాలో చేసినట్లు చేయితో చేస్తే ధాన్యం సేకరించడానికే వారం రోజులు పడుతుందని దక్షిణ కొరియాకు చెందిన ఒక రైతు మాతో చెప్పారు. ఉభయ కొరియాలను వేరు చేసే సైనికులు లేని ప్రాంతానికి (డీమిలిటరైడ్జ్ జోన్) దగ్గరగా ఉన్న పజూ గ్రామంలో ఆయన మాతో మాట్లాడారు.

SK harvest
ఫొటో క్యాప్షన్, యంత్రం సాయంతో వడ్లను సేకరిస్తున్న దక్షిణ కొరియా రైతు

సాంకేతిక పరిజ్ఞానం, సాగు యంత్రాల కొరతతో పాటు దీర్ఘకాలంగా ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటోంది ఉత్తర కొరియా.

గ్లోబల్ వార్మింగ్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 దేశాల్లో ఉత్తర కొరియా ఒకటని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉన్నకొద్దిపాటి సాగు భూమి కూడా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రభావితమవుతోందని అవి చెబుతున్నాయి.

ఉత్తరకొరియా ధాన్యాగారంగా పిలిచే పశ్చిమ తీరప్రాంతంలో వరి, మొక్కజొన్న పంటలు నాశనం కావడం సాధారణమైపోయిందని కౌన్సిల్‌ ఆన్ స్ట్రాటజిక్ రిస్క్‌కు చెందిన క్యాథరిన్ దిల్ అన్నారు. 'కన్వర్జింగ్ క్రైసిస్ ఇన్ నార్త్ కొరియా' నివేదికను తయారు చేసిన వారిలో దిల్ ఒకరు.

ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఉత్తర కొరియాకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏడాది వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు పంటలపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అవి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుబడిపై ప్రభావం చూపిస్తాయని చోయ్ యోంగో అన్నారు.

రాను రాను పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, ముఖ్యంగా వరదలు, కరువు వల్ల వరి దిగుబడి తగ్గిపోతుందని కన్వర్జింగ్ క్రైసిస్ నివేదిక చెబుతోంది.

తీవ్రమైన తుపాన్లు ఇప్పటికే ఉత్తర కొరియాపై ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. 2020, 2021లో వచ్చిన తుపాన్లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. సముద్ర మట్టాల పెరుగుదల విషయాన్ని తీసుకుంటే ఉత్తర కొరియా తీరప్రాంతాలకు మరింత ముప్పు ఉందని దిల్ వివరించారు.

ఉత్తర కొరియా వరదలు
ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాకు ప్రకృతి వైపరిత్యాల ముప్పు ఎక్కువ

ఉత్తర కొరియా.. బయటి ప్రపంచంతో పెద్దగా కలవదు. కానీ వాతావరణ మార్పుల అంశంలో మాత్రం మినహాయింపు ఉంటుంది.

ఉత్తర కొరియా.. 2003, 2012లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్-యూఎన్ఈపీతో కలిసి పనిచేసింది. అలాగే క్యోటో ప్రొటోకాల్, పారిస్ ఒప్పందంపై కూడా సంతకం చేసింది. తమ ఆహార ఉత్పత్తిపై పడే వాతావరణ మార్పుల ప్రభావం కారణంగానే ఉత్తర కొరియా ఈ విషయంలో చురుగ్గా పాల్గొనడానికి ఒక కారణం కావొచ్చు.

1918 నుంచి 2000 మధ్య కాలంలో ఉత్తరకొరియాలో ఉష్ణోగ్రతలు సగటున 1.9 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని 2012 నాటి యూఎన్ఈపీ నివేదిక పేర్కొంది. ఆసియాలో అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఉత్తర కొరియా ఒకటి.

2050 నాటికి ఉత్తర కొరియాలో ఉష్ణోగ్రతల్లో వార్షిక సగటు పెరుగుదల 2.8 నుంచి 4.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని గ్రీన్ క్లైమెట్ ఫండ్ నివేదిక చెబుతోంది.

ఉభయ కొరియాలపై ప్రభావం చూపిస్తున్న ఉమ్మడి అంశంపై కలిసి పనిచేసే అవకాశం తమకు వచ్చిందని దక్షిణ కొరియా భావిస్తోంది.

గ్లాస్గో సదస్సులో ఈ విషయంపై ఉత్తర కొరియా పర్యావరణ శాఖ మంత్రితో చర్చిస్తానని దక్షిణ కొరియా పర్యావరణ శాఖ మంత్రి హాన్ జియోంగ్ నాతో చెప్పారు. కానీ అది జరగలేదు.

స్కాట్లాండ్‌లో నిపుణులు చెబుతున్న విషయాలను ఉత్తర కొరియా ప్రతినిధులు కనుక వింటుంటే.. కరోనా భయం తగ్గిన తర్వాత, చైనాతో సరిహద్దులు తెరుచుకుని పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం కూడా ఆ దేశంలో సంక్షోభం ముప్పు మరింత పెరుగుతుంది. అది ఆ దేశ పేద ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. ఉత్తర కొరియా తనను తానుగా ఈ సమస్య నుంచి బయటపడలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)