కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి సినిమా థియేటర్లకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ''ఈనాడు'' పేర్కొంది.
''ధరల పెంపు నిమిత్తం థియేటర్ల యజమానులు పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సినిమా టికెట్ ధరలకు సంబంధించిన వివాదం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని... చివరిసారిగా గడువు ఇస్తున్నామని, కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
గురువారం విడుదల కానున్న అఖండతో పాటు ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, పుష్ప, రాధేశ్యామ్ సినిమాల ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వానికి సమర్పించిన దరఖాస్తులను అనుమతించేలా ఆదేశించాలంటూ లలిత, చంద్రకళ, శశికళ తదితర థియేటర్లు హైకోర్టును ఆశ్రయించాయి.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టినట్లు'' ఈనాడు తెలిపింది.

ఉత్తరాంధ్ర వైపు ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను?
ఉత్తరాంధ్ర వైపు తీవ్ర తుఫాను ముంచుకొస్తోందని, నాలుగో తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుందని భారత వాతావరణ శాఖ (ఐఎంపీ) తెలిపినట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో తెలిపింది.
''థాయ్‌లాండ్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం అండమాన్ సముద్రం మధ్య ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారంకల్లా వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
ఆ తర్వాత 24 గంటల్లోనే(శుక్రవారానికి) తుఫాన్‌గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో వాయవ్యంగా పయనించి నాలుగో తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుందని ఐఎండీ తెలిపింది.
ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపైఎక్కువ ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో అసాధారణ వర్షాలు, తూర్పు గోదావరిలో అతిభారీ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో 3వ తేదీ ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుంది.
3, 4 తేదీల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాను ఉత్తరాంధ్ర తీరం దిశగా రానున్న నేపథ్యంలో మూడో తేదీ అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, గాలుల తీవ్రత పెరిగే క్రమంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
తీవ్ర తుఫానుతో భారీ నష్టం ఉంటుందని ప్రభుత్వ శాఖలను ఐఎండీ అప్రమత్తం చేసింది.
తీవ్ర తుఫాన్ విశాఖకు అతి సమీపంగా వచ్చి, తరువాత దిశ మార్చుకుంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వారి అంచనా ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర తుఫాన్ విశాఖ, కాకినాడ మధ్య తీరానికి 40-50 కిలోమీటర్ల దూరంలోకి రానుంది. ఆ తరువాత ఉత్తరంగా, ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరానికి ఆనుకుని పయనిస్తుంది.
గోపాలపూర్, పూరి పరిసరాల్లో తీరం దాటుతుంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుంది. ఒకవేళ తీవ్ర తుఫాన్ మధ్య బంగాళాఖాతంలో ఉన్నప్పుడే మరింత బలపడితే మాత్రం...తీరానికి దగ్గరగా రాకముందే దిశ మార్చుకుంటుందని చెబుతున్నారు.
తీవ్ర తుఫాన్ తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చేసరికి మరింత బలపడుతుందని కొన్ని మోడల్స్ చెబుతున్నాయి. దీనిపై గురువారం నాటికి మరింత స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నట్లు'' ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

తెలంగాణలో భారీగా ఆర్టీసీ చార్జీల మోత
రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెం చేందుకు రంగం సిద్ధమైంది. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా కష్టాలు, భారీ నష్టాల నేపథ్యంలో భారీ మొత్తంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదించినట్లు 'సాక్షి' పేర్కొంది.
''ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసల చొప్పున, మిగతా కేటగిరీ బస్సుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది.
దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ఈ వివరాలను ప్రకటించడం గమనార్హం.
కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ దుస్థితిపై చర్చించారు. చార్జీల పెంపు అనివార్య మన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశంలో సీఎం చేసిన సూచనల మేరకు మేరకు చార్జీలపై ఆర్టీసీ కసరత్తు మొదలుపెట్టింది.
సీఎం కేసీఆర్ 2015లో ఆర్టీసీ కార్మికులకు భారీగా 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. దానితో సంస్థపై వార్షికంగా ఏకంగా రూ.850 కోట్ల భారం పడింది.
దానితో ఆ తర్వాతి ఏడాది 2016 జూన్‌లో ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా సవరించింది. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, ఆ తర్వాత స్టేజీకి రూ.2 చొప్పున చార్జీలు పెంచారు. సుమారు 5 శాతం ధరలు పెరిగాయి.
మిగతా కేటగిరీ బస్సుల్లో 10 శాతం పెంచారు. దానితో సుమారు ఏటా రూ.350 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది.
తర్వాత 2019 అక్టోబర్‌లో 53 రోజుల సుదీర్ఘ సమ్మె, ఆర్టీసీకి తీవ్ర నష్టాల నేపథ్యంలో చార్జీలు సవరించారు. ఆ ఏడాది డిసెంబర్‌లో సగటున కిలోమీటర్‌కు 20పైసల చొప్పున పెంచారు. దానితో ఆర్టీసీకి సాలీనా రూ.550 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరింది.
రెండేళ్ల కింద కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినప్పుడు ప్రజలపై రూ.550 కోట్ల భారం పడింది. ప్రస్తుత ప్రతిపాదనల మేరకు రూ.685 కోట్లు భారం పడుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ భారం రూ.850 కోట్లకుపైనే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో చార్జీలు పెంచుతుండటం ఇది మూడోసారి కానున్నట్లు'' సాక్షి రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కోతులకు కు.ని. ఆపరేషన్లు
రాష్ట్రంలో పంటలను నాశనం చేస్తున్న కోతులకు విరివిగా సంతాన నిరోధక ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించినట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.
''అలాగే కోతులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కోతుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సూచనలు ఇచ్చేందుకు అటవీ, వెటర్నరీ, వ్యవసాయ నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఆయన బీఆర్కే భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోతులు, అడవి పందుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలు సూచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం కోతుల బెడద నివారణకు వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్‌రివ్యూ
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








