తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు షాక్ తగలనుంది. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వ సబ్సిడీలు సర్దుబాటు చేశాక 2022-23కు సంబంధించిన రూ.10,928 కోట్ల భారీ ఆర్థిక లోటును పూడ్చడానికి భారీగా విద్యుత్ చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేకుండా పోయినట్లు 'సాక్షి' కథనం పేర్కొంది.
''అయితే చార్జీల పెంపు ద్వారా ఎంత మేరకు ఆర్థిక లోటును పూడ్చుకోవాలన్న దానిపై త్వరలో ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది.
వినియోగదారులపై ప్రత్యక్షంగా రూ.2వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.2వేల కోట్ల వరకు చార్జీల పెంపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.
పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లులు భారీగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏఆర్‌ఆర్ నివేదికతో పాటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల (రిటైల్ టారిఫ్ షెడ్యూల్) ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంది.
మంగళవారం ఏఆర్‌ఆర్ నివేదికలు అందజేసిన పంపిణీ సంస్థలు.. చార్జీల పెంపు ప్రతిపాదనలను మాత్రం వాయిదా వేసుకున్నాయి.
దీంతో సాధ్యమైనంత త్వరగా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాలని ఈఆర్సీ చైర్మన్ ఆదేశించారు. డిస్కంలు వీటిని సమర్పిస్తేనే వినియోగదారుల కేటగిరీల వారీగా విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టత రానుంది.
డిస్కంల ప్రతిపాదనలు అందిన తర్వాత నిబంధనల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి చార్జీల పెంపునకు అనుమతిస్తామని శ్రీరంగారావు పేర్కొన్నారు.
2021-22కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లను సైతం డిస్కంలు సమర్పించినా, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న మరో 4 నెలల్లో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఉండదని చైర్మన్ ప్రకటించారు.
2021-22లో రూ.10,624 కోట్ల ఆర్థిక లోటు ఉండనుందని డిస్కంలు అంచనా వేయగా, ట్రూఅప్ చార్జీల ద్వారా దీనిని భర్తీ చేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసినట్లు'' సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
పేదలపై పగ, పాత ఇళ్లకు కొత్తగా వసూళ్లు
ఏపీ సర్కారు పేదలపైనా పగపట్టింది. కాసుల కోసం పేదల గూటిపై దండయాత్ర చేస్తోందని 'ఆంధ్రజ్యోతి' వ్యాఖ్యానించింది.
'' అప్పుడెప్పుడో ఇచ్చిన పాత ఇళ్లకు కొత్తగా 'పైసా వసూల్' చేస్తున్న ప్రభుత్వం... వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) డబ్బులు చెల్లించకుంటే పెన్షన్‌కు కోతపెడతామని హెచ్చరిస్తోంది.
'డబ్బులు కడతారా... పింఛను ఆపేయమంటారా' అంటూ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేస్తున్న ఒత్తిడితో పేదలు తల్లడిల్లుతున్నారు. ఇదేమి ఘోరమని వాపోతున్నారు.
ఈ సర్కారు కొత్తగా ఒక్క ఇల్లూ కట్టలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన, నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న 'టిడ్కో' ఇళ్లనూ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.
కానీ... ఎప్పుడో ఎన్టీఆర్ కాలం నుంచి బలహీన వర్గాలకు కేటాయించిన పేదల ఇళ్లపై ఈ ప్రభుత్వం దండయాత్ర చేస్తోంది.
గత నాలుగు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోని 'బకాయిల' కోసం వేట ప్రారంభించింది.
దీనికి 'జగనన్న సంపూర్ణ గృహ హక్కు' అని ముద్దుగా ఓ పేరు పెట్టి... వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద రూ.10 వేల నుంచి 15 వేలు కట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఇప్పుడు... ఇది పరాకాష్ఠకు చేరింది.
ఓటీఎస్ కింద డబ్బులు కడితేనే సామాజిక పింఛను చెల్లించాలని, లేకపోతే కోత పెట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
''రాష్ట్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఓటీఎస్ చేసుకుంటేనే ఇక పెన్షన్ చెల్లించండి. పెన్షన్‌దారుల కుటుంబాలకు చెందిన వారెవరైనా గతంలో ప్రభుత్వ హౌసింగ్ పథకం ద్వారా గ్రామాల్లో ఇల్లు నిర్మించుకుని ఉంటే... వాళ్లు రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే అలాంటి వారికి డిసెంబరు పెన్షన్ ఇవ్వొద్దు'' అని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లను ఆదేశించారు.
అంతేకాదు... ఇవి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలని, వీటిని బేఖాతరు చేస్తే సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ మొత్తాన్ని సిబ్బంది నుంచి రాబడతామని కూడా స్పష్టం చేస్తున్నట్లు'' ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

తెలంగాణలోని 6 వర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్
తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాయాల్లో ఇకపై కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను అమలుచేయనున్నట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.
''ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల తరగతులతోపాటు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలను ఒకేసారి నిర్వహించనున్నారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకానున్న విద్యా క్యాలెండర్‌ను ఈ నెల 16న విడుదలచేసే అవకాశాలున్నాయి.
ఆరు వర్సిటీలకు వేర్వేరు అకడమిక్ క్యాలెండర్లను అమలుచేస్తుండటంతో తలెత్తుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు.
మంగళవారం తన అధ్యక్షతన జరిగిన అన్ని యూనివర్సిటీల వీసీల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
ఆరు వర్సిటీల్లో ప్రవేశాలకు కామన్ పోస్టుగ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్స్ (సీపీగెట్) నిర్వహిస్తుండగా.. తాజాగా ఒకే అకడమిక్ క్యాలెండర్‌ను అమలుచేస్తామన్నారు.
ఇప్పటికే డిగ్రీ కోర్సులకు సైతం కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలుచేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారని'' నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, TSRTCHQ/FACEBOOK
ఆర్టీసీ డిపోలను మూసే ఆలోచన లేదు: సజ్జనార్
టీఎస్‌ఆర్టీసీ బస్సు డిపోలను మూసేసే ఆలోచన తమకు లేదని సంస్థ ఎండీ సజ్జనార్ స్పష్టం చేసినట్లు 'వెలుగు' పేర్కొంది.
''అయితే, ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బంది మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.
'ప్రజలు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ వైపు మళ్లుతున్నారు. యాజమాన్య నిర్ణయాల వల్ల సంస్థకు వచ్చే ఆదాయంతోపాటు ఓఆర్ కూడా పెరిగింది.
భూములు అమ్మాలనే ఆలోచన ఆర్టీసీకి లేదు.1,359 రూట్లలో బస్సులను పునరుద్ధరించాం. బస్సులు అవసరమైన చోట లోకల్ డీఎం, ఆర్ఎంలు సర్వే చేస్తున్నారు.
కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువగా, మరికొన్ని చోట్లు ఎక్కువగా ఉంది. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డీఎంను సంప్రదించాలి. జోగులాంబ వెళ్లినప్పుడు భక్తులు బస్సు కావాలని అడిగారు. వచ్చే శనివారం నుంచి జోగులాంబకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు నడుస్తుంది' అని సజ్జనార్ అన్నట్లు వెలుగు కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- యూరోపియన్ దేశాల్లో కోవిడ్ ఆంక్షలపై తిరగబడుతున్న జనాలు.. రెచ్చగొడుతున్న 3 అంశాలు..
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








