‘‘ప్రోటోకాల్ కాదయ్యా! నీకు తెలవకపోతే పో.. గెటవుట్.. నడువ్’’

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఫొటో సోర్స్, facebook/PuvvadaAjaykumar

ఫొటో క్యాప్షన్, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ తెలుగు

‘‘ప్రోటోకాల్ కాదయ్యా! నీకు తెలవకపోతే పో.. పో మరి. గెటవుట్.. ఔట్.. నడువ్’’

"ఎవడయ్యా వీడు? ఎవరయ్యా పోలీస్ ఉంది ఇక్కడ? నకరాలు దొబ్బుతున్నారు. ఓ పక్క జనాల ప్రాణాలు పోతుంటే నీకు ప్రోటోకాల్ కావాలా?"

"ఎవడయ్యా వాడు? కేసు పెట్టాల వాని మీద! కేసు పెట్టాల వాని మీద! యూజ్ లెస్ ఫెలో! యూజ్ లెస్ ఫెలో!’’

ఈ మాటలన్నీ ఓ మంత్రిగారు ఒక సభలో అన్నవి.

ఈ మాటల్లో ప్రోటోకాల్ అనే పదాలు లేకపోతే అవి ఏ దొంగనో, న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోన్న వ్యక్తిపైనో చేసిన వ్యాఖ్యల్లా ఉంటాయి.

కానీ అసలు విషయం వేరే ఉంది.

రెండు రోజుల కిందట ఖమ్మం రూరల్ మండంలంలోని మద్దులపల్లి గ్రామంలో ఒక సభ జరిగింది. అక్కడ ఉన్న కాలేజీని కోవిడ్ సెంటర్‌గా మారుస్తున్నారు. ఆ భవనం ప్రారంభోత్సవం పక్కనే టెంటు వేసి కార్యక్రమం పెట్టారు.

సభలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ ఉన్నారు. నిబంధనల ప్రకారం గ్రామ సర్పంచిని కూడా సభ వేదికపై కూర్చోబెట్టాలి. కానీ సర్పంచ్ మినహా మిగిలిన వారంతా ఉండడంతో, సర్పంచిని కూడా వేదికపైకి ఆహ్వానించాలంటూ స్థానిక నాయకుడైన సుధాకర్ అనే వ్యక్తి ఎదురుగా ఉన్న మంత్రిని కోరారు.

అంతే, వెంటనే మంత్రి గారికి కోపం వచ్చి పై మాటలన్నీ అన్నారు.

దీంతో సదరు సుధాకర్ సరే, ‘‘కేసు పెట్టండి సర్’’ అనుకుంటూ సభ లో నుంచి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ తిరగబడతారో అనుకున్నారో ఏమో, మంత్రి గారి ఆదేశాలతో పోలీసులు అతని వెంటే నడిచి దూరంగా వెళ్లే వరకూ కూడానే ఉన్నారు.

ప్రేక్షకుల్లో ఒకరిగా కూర్చున్న సర్పంచి, అలాగే సభలో పాల్గొన్నారు. ఆ తరువాత కూడా ఆమెను వేదికపైకి పిలవలేదు.

కుల విమోచన పోరాట సమితి కేవీపీఎస్ ఆందోళన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కుల విమోచన పోరాట సమితి కేవీపీఎస్ ఆందోళన

‘‘ఇంతకుముందెప్పుడూ అలా జరగలేదు. మంత్రి గారు మొన్న వచ్చారు. అంతకు రెండు రోజుల మందే సమాచారం వస్తే సభా ప్రాంగణం అంతా మా పంచాయితీ సిబ్బందిని పంపించి శుభ్రం చేయించాం. అధికారులు సమాచారం ఇచ్చారు. వార్డు మెంబర్లు అందరూ రండి అంటేనే వచ్చాం.

రిబ్బన్ కట్ చేశాక గదులన్నీ తిరుగుతున్నప్పుడు నేను కూడా ఎంపీపీ వాళ్లతోనే తిరిగాను. మిగతా వారు స్టేజీపై కుర్చీల్లో కూర్చున్నారు. నేను ఎదురుగా మొదటి వరుసలో కూర్చున్నాను. మాలతీదేవీ గారు (వైద్యాధికారి) పేర్లు చదివారు. నా పేరు లేదు. దీంతో మా ఊరి అతను లేచి సర్పంచి గారిని వేదికపైకి పిలవాలి కదా అన్నారు.’’ అంటూ జరిగిన ఘటన వివరించారు సర్పంచ్ కిర్లపూడి సుభద్ర.

‘‘ఆ మాటలు విని ఏమనాలో అర్థం కాలేదు. అయోమయం అయింది. మంత్రి గారు ఇలా మాట్లాడేసరికి ఏం పాలుపోలేదు.

తరువాత కొందరు నన్ను పిలిచి ఘటన గురించి నువ్వేమంటావని అడిగారు. అది ఆయన విచక్షణకు వదిలేస్తున్నా. నేనేం కామెంట్ చేయలేను అన్నాను.

మంత్రిగారు, ఆ తరువాత కూడా సర్పంచి మీరూ రండి అన్నా బాగుండేది. ఆయన నా భార్యను పిలవకపోయినా మేం మౌనంగానే ఉన్నాం’’ అన్నారు సర్పంచి భర్త కర్లపూడి వెంకటేశ్వర్లు.

కుల విమోచన పోరాట సమితి కేవీపీఎస్ ఆందోళన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కుల విమోచన పోరాట సమితి కేవీపీఎస్ ఆందోళన

‘‘మేం ఎవరికీ చెప్పుకోలేదు. అవమానం అయినా మాట్లాడలేదు. మీడియా అక్కడ ఉండడంతో అందరికీ తెలిసింది. మూడు రోజుల నుంచి అందరూ ఫోన్లు. ఇదో ఇబ్బంది అయింది ఇప్పుడు.’’ అన్నారు సుభద్ర.

‘‘మా ఊరి సర్పంచి కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేశారు. రిబ్బన్ కటింగ్ తరువాత అక్కడ వేదికపై అందరూ కూర్చున్నారు కానీ మా సర్పంచిని పిలవలేదు. మర్చిపోయి ఉంటారు అని నేను గుర్తు చేద్దామనుకున్నాను. ఆయన రెట్టించే సరికి నేను ప్రోటోకాల్ సర్ అని అన్నాను. వేదికపై చాలా మంది ఉన్నారు. వారందరి విషయంలో రాని కోవిడ్ సమస్య మా సర్పంచి విషయంలోనే ఎందుకు వచ్చింది? నేను ఇప్పటికీ అనేది ఒకటే. ఆయన మా దళిత సర్పంచిని అవమానించారు. క్షమాపణ చెప్పాలి.’’ అన్నారు ఆ ఘటనలో మంత్రి చేత మాటలు పడ్డ, అదే గ్రామానికి చెందిన సుధాకర్.

ఆ గ్రామంలో దళిత సర్పంచికి అవమానం జరిగిందంటూ కుల విమోచన పోరాట సమితి కేవీపీఎస్ ఆందోళన చేపట్టింది. మండల అధికారి (ఎంపీడీవీ) వచ్చి సర్ది చెప్పి ధర్నా విరమింపచేశారు.

ఇక్కడ మరో విషయం సభలో పాల్గొన్న నాయకుల్లో సర్పంచి కర్లపూడి సుభద్ర మినహా అంతా టీఆర్ఎస్ వారు కాగా, ఆమె మాత్రం సీపీఎంకు చెందిన వ్యక్తి.

అయితే మంత్రి పువ్వాడ అజయ్ కూడా మరో కమ్యూనిస్టు పార్టీ కుటుంబం నుంచే వచ్చారు. కాకపోతే ఆయనెప్పుడూ కమ్యూనిస్టు పార్టీలో పనిచేయలేదు.

కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్

ఫొటో సోర్స్, facebook/puvvada ajay kumar

కమ్యూనిస్టు కుటుంబం... అది తప్ప మిగతా ప్రధాన పార్టీల్లో పనిచేసిన అనుభవం

54 ఏళ్ళ అజయ్ కుమార్ ఖమ్మం శాసన సభ నుంచి గెలిచారు. ఆయన 2012లో వైయస్సార్సీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

2013లో కాంగ్రెస్ లో చేరి, 2014 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తుమ్మల నాగేశ్వర రావును ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు.

2016లో టిఆర్ఎస్ లో చేరారు. 2018లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి నామా నాగేశ్వర రావును ఓడించి రెండోసారి గెలిచారు.

ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదివారు. తండ్రి స్థాపించిన మమత మెడికల్ కాలేజీ వ్యవహారాలు చూస్తున్నారు. టిఆర్ఎస్ లో కేటీఆర్ కి అత్యంత సన్నిహితులుగా పేరుపొందారు.

ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వర రావు భారత కమ్యూనిస్టు పార్టీ – సీపీఐలో ప్రముఖ నాయకులు.

ఆయన కూడా అదే ఖమ్మం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేశారు.

ఖమ్మంలో పేరొందిన మమత మెడికల్ కాలేజీ ఈయన స్థాపించిందే. రెండుసార్లు ఎమ్మెల్సీగా కూడా చేశారు.

ఈ అంశంపై స్పందన కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌నీ, ఆయన కార్యాలయాన్నీ బీబీసీ సంప్రదించింది. స్పందన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)