అరారియా గ్యాంగ్ రేప్: ‘‘మోటార్ సైకిల్ నేర్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేశారు.. కోర్టులో న్యాయమూర్తి నన్నే కోప్పడ్డారు’’

సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో లైంగిక హింసకు వ్యతిరేకంగా బలమైన చట్టాలు ఉన్నాయి. కానీ పుస్తకాలలో ఏం రాశారు? వాస్తవంలో ఏం జరుగుతోంది?

అత్యాచార ఘటనలో తనకు జరిగిన అన్యాయంపై ఒంటరిగా పోరాడుతున్న ఒక యువతికి న్యాయస్థానాలు, పోలీసులు, ఈ సమాజం ఎంతవరకు భరోసా ఇవ్వగలవు? ఒక అత్యాచార బాధితురాలికి పోలీస్‌స్టేషన్‌లో, సమాజంలో ఎదురైన అనుభవాలేంటి?

బిహార్‌లోని అరారియాలో అత్యాచార బాధితురాలు, ఆమె ఇద్దరు స్నేహితురాళ్లను ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో జైలుకు పంపారు. కోర్టులో న్యాయమూర్తి ముందు స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేస్తున్న సమయంలో జరిగిన గొడవ దీనికి కారణం.

ఈ సంచలనాత్మక కేసులో అత్యాచార బాధితురాలికి 10 రోజుల తరువాత బెయిల్ లభించింది. కానీ అమ్మాయికి సాయం చేసిన ఇద్దరు స్నేహితులు కల్యాణి, తన్మయ్‌లు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. వారి ఇంట్లోనే బాధితురాలు పని చేసేది.

బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలైన తర్వాత మొదటిసారి బీబీసీతో మాట్లాడిన బాధితురాలు సంఘటన జరిగిన తీరును వివరించారు.

ఈ కథ వింటే అత్యాచార ఘటనల్లో బాధితులైన మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లడానికి ఎందుకు భయపడతారో అర్ధమవుతుంది.

సింబాలిక్ ఇమేజ్

గ్యాంగ్‌ రేప్‌ తర్వాత....

నా పేరు ఖుషి (పేరు మార్చారు). జులై 6 రాత్రి గ్యాంగ్‌రేప్‌కు గురైన తర్వాత బయటి ప్రపంచానికి తెలిసిన నా పేరు ఇది.

నేను 10 రోజులు జైలులో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాను. నాపై అత్యాచారం జరిగిందని మీకు తెలుసు. కానీ నేను కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

నాకు అండగా నిలబడిన కల్యాణి, తన్మయ్‌లు కూడా జైలుకు వెళ్లారు. వారిద్దరు నాకు న్యాయం జరగడం కోసం పోరాడారని అందరికీ తెలుసు. కానీ వారినీ జైలులో పెట్టారు.

జులై 10 మధ్యాహ్నం సమయంలో మేం అరారియా మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళవలసి వచ్చింది. సెక్షన్‌ 164 కింద న్యాయమూర్తి స్టేట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంది. కల్యాణి, తన్మయ్‌, ఇంకొంతమందితో నేను కాలినడకన అరారియా జిల్లా కోర్టుకు చేరుకున్నా.

నేను పెద్దగా చదువుకోలేదు. కానీ 22 సంవత్సరాల వయస్సునాటికే చాలా సంఘటనలు చూశాం. వాటి నుంచి చాలా నేర్చుకున్నా. నేను తన్మయ్‌, కల్యాణీ వాళ్లింట్లో పని చేస్తాను.

వారు ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. వారితో పని చేయడం వల్ల న్యాయం ముందు అందరూ సమానమేనని, చట్టం దృష్టిలో అందరికీ న్యాయం పొందగలమని అర్ధం చేసుకున్నా. కానీ ఆ రోజు న్యాయమూర్తి ముందు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి చాలా భయపడ్డా.

ఇలస్ట్రేషన్

నేను కోర్టులో నిలబడ్డా

నేను కోర్టులోకి వచ్చినప్పుడు, అతను అక్కడ ఉంటారని ఊహించలేదు. మోటార్‌ సైకిల్ నేర్పిస్తానని ఆ రోజు రాత్రి నన్ను నిందితుల దగ్గరకు తీసుకెళ్లిన వ్యక్తి నా ఎదురుగా నిలబడ్డారు.

అత్యాచారం జరిగిన రోజు రాత్రి నేను సాయం కోసం అతన్ని పిలుస్తూనే ఉన్నా. కానీ నన్ను అక్కడ వదిలేసి పారిపోయాడు.

నాకు స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్లు బాయ్‌ఫ్రెండ్స్‌ కారు. నాకు సైక్లింగ్‌ వచ్చు. ఆ అబ్బాయి మోటార్‌ సైకిల్‌ నేర్పుతానని నాకు చెప్పారు. నాకు కూడా నేర్చుకోవాలని ఉంది. కొన్ని రోజులు బాగానే నేర్పారు. జులై 6 రాత్రి డ్రైవింగ్‌ నేర్పిస్తానని నన్ను వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళారు.

ఆ తరువాత నాకేం జరిగిందో అందరికీ తెలుసు. అందుకే నేను కోర్టుకు రావాల్సి వచ్చింది.

అతను అక్కడ కోర్టులో నిలబడి ఉండటాన్ని చూశా. అతని తల్లి కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు రాత్రి జరిగిన గొడవలన్నీ నా కళ్ల ముందు మెదిలాయి.

కోర్టులో వారి ముందు ఇవన్నీ చెప్పాలా? నా స్టేట్‌మెంట్‌ను వేరే ప్రదేశంలో తీసుకోవడం వీలుకాదా? ఇలా నా మనసులో అనేక ఆలోచనలు ముసురుకొన్నాయి. త్వరగా స్టేట్‌మెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను.

కన్ను

ఫొటో సోర్స్, Getty Images

నా స్టేట్‌మెంట్ త్వరగా అవుతుందా?

నా తల తిరిగిపోతోంది. ఎండలో మూడు నాలుగు గంటలు నిలబడి వేచి ఉండాల్సి వచ్చింది. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. ఆ రాత్రి నాపై అత్యాచారం జరిగిన తరువాత నేను ఎంత బాధ పడ్డానో జ్ఞాపకం వచ్చింది. నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోడం నాకు ఇష్టం లేదు.

నాపై అత్యాచారం జరిగిందంటే ఎంత చెడ్డపేరు వస్తుందో తెలుసు. కుటుంబం, సమాజం ఏమనుకుంటుంది ? సైకిల్ నేర్చుకోవడం, మోటార్‌ సైకిల్ నడపడం, స్వేచ్ఛగా తిరగడం, నా స్నేహితురాలితో కలిసి సినిమాకు వెళ్లడం తప్పా? నాపై అత్యాచారానికి కారణాలు ఇవేనా?

నా మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అంతకు ముందు కూడా చాలా జరిగింది. నేను చదువురాని దానినని, సైకిల్‌ తొక్కుతానని, స్మార్ట్‌ఫోన్‌ వాడతానంటూ స్థానికులు నన్నే తప్పుబట్టారు. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే, ఫిర్యాదు చేయకపోతే ఈ కుర్రాళ్లు ఇంకా వేధిస్తారని నా అత్తయ్య చెప్పారు.

అఘాయిత్యం

ఫొటో సోర్స్, ANDRÉ VALENTE / BBC

అందుకే ధైర్యం చేశా

నాకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని భావించాను. నేను పనిచేసే ఇంటి యజమానులైన కల్యాణి, తన్మయ్‌ కూడా పోలీసు కేసు పెట్టాలని చెప్పారు. అప్పటికి నాలుగు రోజులుగా ఎంతో క్షోభను అనుభవించాను. ఇక భరించలేను. అందుకే ధైర్యం చేశాను.

కానీ ఆరోజు గంటల కొద్దీ కోర్టులో వేచి ఉండి, ఎదురుగా ఆ అబ్బాయిని చూసేసరికి నాకు చాలా భయం, చిరాకు కలిగాయి. నా స్థానంలో మీరున్నా అంతే అనిపించేది.

ఆ రోజు అత్యాచార ఘటనను అప్పటికే పోలీసులకు అనేకసార్లు వివరించి చెప్పాను. దానికి బాధ్యులెవరో కూడా చెప్పాను.

ఒక పోలీసు నా కేసును అందరి ముందు చదివి వినిపించారు. నేను ఎవరి మీదయితే ఫిర్యాదు చేశానో ఆ వ్యక్తి కుటుంబం నాతో మాట్లాడటానికి ప్రయత్నించింది.

పెళ్లి చేసుకోడానికి సిద్ధమని వారు ప్రతిపాదించారు. నాపై చాలా ఒత్తిడి పెట్టారు. నేను కుంగిపోయాను. ఆరోగ్యం దెబ్బతింది. నాకు జరిగిన అన్యాయం ప్రతి పేపర్‌లో పేరు, అడ్రస్‌తో సహా వచ్చాయి.

వీటి నుంచి మాకు విముక్తి లేదా? అత్యాచారం గురించి మళ్లీ మళ్లీ ఎందుకు చెప్పుకోవాలి? నా విషయాలన్నీ ఎందుకు చెప్పాలి? ప్రతి వీధివీధికి నా గురించి తెలిసిపోతుంది. నా పరువుపోతుందని భయపడ్డాను.

చేతులు

ఫొటో సోర్స్, Getty Images

జడ్జిగారు మండిపడ్డారు

ఆ రోజు కోర్టు దగ్గర నన్ను ఒక వ్యక్తి ముందు నిలబెట్టారు. అతను నా ముఖం మీద వస్త్రాన్ని తొలగించమని అడిగారు.

తర్వాత నన్ను చూసి " నేనే ఈమెను గుర్తుపట్టాను. ఆమె సైకిల్‌ తొక్కుతూ కనిపిస్తారు. అప్పుడప్పుడు నేను తనతో మాట్లాడాలనుకునేవాడిని. కానీ మాట్లాడ లేదు'' అని అన్నారు.

అతను ఏం చేప్పాలనుకుంటున్నారో నాకు అర్ధం కాలేదు. కోర్టులో గంటల తరబడి ఎదురు చూసిన తర్వాత మమ్మల్ని న్యాయమూర్తి మమ్మల్ని లోపలికి పిలిచారు. అప్పుడు ఆ గదిలో నేను, వారు మాత్రమే ఉన్నాం. అలాంటి దుర్భరమైన వాతావరణంలో నేను ఎప్పుడూ లేను.

ఇప్పుడేం చేయాలి? కల్యాణి, తన్మయ్‌ ఎక్కడికెళ్లారు? అని నేను ఆందోళనకు గురయ్యాను.

జడ్జిగారు నేను చెప్పింది మొత్తం రాసుకున్నారు. తర్వాత దాన్ని చదవడం మొదలు పెట్టారు. అప్పుడు ఆయన ముఖానికి మాస్క్‌ ఉంది. మాస్క్ వల్ల ఆయన ఏం చదువుతున్నారో నాకు అర్ధం కాలేదు.

అర్థం కావడం లేదని, మాస్క్‌ తీసేసి చదవమని అడిగినా ఆయన అలా చేయలేదు. చివరకు స్టేట్‌మెంట్ మీద సంతకం చేయమన్నారు.

నేను చదువుకున్న దాన్ని కాకపోవచ్చు. కానీ నేను చెప్పింది కాగితం మీద లేకపోతే సంతకం పెట్టకూడదని తెలుసు. అందుకే సంతకం చేయను అని చెప్పా. కల్యాణిని పిలిస్తే ఆమె చదివి వినిపిస్తుందని, అప్పుడు సంతకం చేస్తానని చెప్పా.

కానీ జడ్జి కోప్పడ్డారు. "నువ్వు నా మాటల్ని కూడా నమ్మవా ? పొగరుబోతువైన నీకు మర్యాద కూడా తెలియదా"అని అన్నారు.

స్టాప్

ఫొటో సోర్స్, Getty Images

మా వేదన ఎవరూ వినలేదు.

నా మనస్సు మొద్దుబారింది. నేనేమైనా తప్పు చేశానా ? " మిమ్మల్ని నమ్ముతాం. కానీ మీరు చదివింది నాకు అర్థం కాలేదు'' అన్నాను. నాకు అర్ధంకాని విషయాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత లేదా ?

నేను భయపడిపోయాను. కల్యాణి దగ్గరికి పరుగెత్తాను. అప్పుడు జడ్జి పోలీసులను, సిబ్బందిని పిలిచారు. కల్యాణిని కూడా పిలిపించారు. మేం అంతా లోపలికి వచ్చాం. న్యాయమూర్తి ఇంకా కోపంగానే ఉన్నారు. నేను, కల్యాణి ఆయన్ను క్షమించమని అడిగాం.

కానీ ఎవరూ నా మాట వినలేదు. నన్ను పొగరుబోతు అమ్మాయి అని పదేపదే తిట్టారు. మీరు ఆమెకు మర్యాద నేర్పించ లేదా అని కల్యాణిని కూడా కోప్పడ్డారు.

న్యాయమూర్తి నా వేదన వింటారని అనుకున్నా. కల్యాణి, తన్మయ్‌ కూడా న్యాయమూర్తికి వివరించే ప్రయత్నం చేశారు. ఖుషీకి స్టేట్‌మెంట్ అర్ధం కాలేదని, ఆమెకు మళ్లీ వివరించాలని న్యాయమూర్తిని కోరారు. ఆయన కోపంతో "నాకు చాలా పని ఉంది. మీరు ఇక్కడ కనిపించకండి'' అని అన్నారు.

అఘాయిత్యం

ఫొటో సోర్స్, Getty Images

మేం ఈ పోరాటాన్ని ఆపం

నేను నిరుపేదను కాకపోయినట్లయితే నా మాటలు వినేవారు ? అంతే కదా. నా గొంతు పెద్దది కావచ్చు. నేను పెద్దగా మాట్లాడతా. కానీ మాట్లాడటం ఎలా తప్పవుతుంది? స్టేట్‌మెంట్‌ అర్ధం కాలేదు కాబట్టి సంతకం చేయనని చెప్పాను. అది తప్పెలా అవుతుంది?

ఆ హాల్లో చాలా శబ్దం వస్తోంది. నాకు వినబడటం లేదని చెప్పాను. కానీ వీడియోలు తీస్తున్నానని, ప్రభుత్వ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తున్నామని మాపై ఆరోపణలు చేశారు. మమ్మల్ని జైలుకు పంపారు. నేను దానికి కూడా సిద్ధపడ్డాను. నాకు పది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. కానీ నాకు అండగా ఉన్న వారికి బెయిల్ ఇవ్వలేదు.

మేం అధికారులపై దాడి చేశామని, వారి దగ్గరున్న స్టేట్‌మెంట్‌ను చించేశామని మాపై పెట్టిన కేసులో ఆరోపించారు. అసలు జడ్జిగారు మా విజ్జప్తిని పట్టించుకున్నారా?

‘‘మాకు న్యాయం కావాలి. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపం’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)