పసిఫిక్ మహా సముద్రంలో 'బ్లాక్ హోల్'... ఏమిటీ మిస్టరీ?

ఫొటో సోర్స్, Google Maps
పసిఫిక్ మహా సముద్రం మధ్యలో కనిపించిన విచిత్రమైన 'బ్లాక్ హోల్' మిస్టరీ చివరకు వీడింది.
గత నెలలో డేగ కళ్ళతో గూగుల్ మ్యాప్స్‌ను చూసిన ఒక సోషల్ మీడియా యూజర్ పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఒక నల్లని మచ్చ ఉన్నట్లు గుర్తించారు.
దాంతో, అదేమై ఉంటుందోనని ఊహిస్తూ రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి.
అయితే, దీనిని చివరకు జనసంచారం లేని వస్టాక్ దీవిగా గుర్తించారు. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి దేశ పరిధిలోకి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
గూగుల్ మ్యాప్స్‌ను చూస్తున్న సమయంలో ఒక సోషల్ మీడియా యూజర్ పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఒక విచిత్రమైన 'బ్లాక్ హోల్' ఉండటాన్ని గమనించారు.
అయితే, ఈ బ్లాక్ హోల్ ఇతర దేశాలు, దీవులకు చాలా దూరంగా ఉన్నట్లు కనిపించింది.
ఇది ఆన్ లైన్ లో చాలా మందిని అయోమయానికి గురి చేసింది. దాంతో, అదేమై ఉంటుందో ఊహిస్తూ రక రకాల ఆలోచనలు, సూచనలు చేశారు.
కొందరు దానిని భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతమేమో అని అన్నారు. కొందరు అదేదైనా రహస్య దీవి కానీ, మిలిటరీ స్థావరం కానీ అయి ఉంటుందని భావించారు.
చివరకు ఆ ప్రాంతాన్ని ఆస్ట్రేలియాకు తూర్పున 4000 మైళ్ళ దూరంలో ఉన్న పగడపు దీవిగా గుర్తించారు.
ఈ దీవిలో దట్టమైన అడవులున్నాయి.
ఇక్కడి చెట్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ, ఆకాశం నుంచి చూసేటప్పుడు అవి నల్లగా కనిపించడంతో, గూగుల్ మ్యాప్స్ లో అవి 'బ్లాక్ హోల్'లా కనిపించాయి.

ఫొటో సోర్స్, Blue Planet II, BBC
పసిఫిక్ మహా సముద్రంలో విస్తరిస్తున్న దీవులు
ఒకవైపు సముద్రమట్టం పెరిగే ముప్పు పొంచి ఉన్నప్పటికీ, మరో వైపు పసిఫిక్ మహా సముద్రంలో కొన్ని వందల దీవుల పరిమాణం విస్తరిస్తున్నట్లు ఆక్‌లాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
గత 70 ఏళ్లలో కొన్ని దీవులు పరిమాణంలో 8 శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ మార్పులను గమనించేందుకు వారు శాటిలైట్ చిత్రాలను, ఆ ప్రాంతాల్లో లభించిన సమాచారాన్ని పరిశీలించారు.
పసిఫిక్ మహా సముద్రం, ఇండియన్ ఓషన్‌లో ఉన్న లోతట్టు దీవులు భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్‌ను తట్టుకునేందుకు ఈ ఆధారాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, University of Auckland
డాక్టర్ ముర్రే ఫోర్డ్ కోస్టల్ జియోమార్ఫాలజిస్ట్. ఆయన భూమి ఏర్పాటు, ఆకారం గురించి అధ్యయనం చేస్తారు.
ఈ దీవులు పెరగడానికి కోరల్ రీఫ్ అవక్షేపాలే కారణమని ఆయన చెప్పారు.
"దట్టమైన పగడపు దిబ్బల (కోరల్ రీఫ్) చిత్రాలు చాలా మంది చూసే ఉంటారు. ఆ పగడాల కింద ఒక అస్థిపంజరంలా ఉంటుంది. కెరటాల తాకిడికి అది విరిగే అవకాశం ఉంటుంది. రక రకాల చేపలు పగడాలను నమలడంతో లోపలున్న ఇసుక బయటకు వచ్చేస్తుంది. దీవులు ఏర్పడేందుకు ఇవే పునాదులుగా తయారవుతాయి" అని వివరించారు.
ఇలా ఏర్పడిన కొన్ని దీవులను డాక్టర్ ఫోర్డ్ ఆయన బృందంతో కలిసి కొన్నేళ్లుగా సందర్శిస్తూ ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న మార్పులను రికార్డ్ చేస్తున్నారు.
అలా ఏర్పడిన జెహ్ అనే దీవి తీరం పరిణామం చెందిన విధానాన్ని రెండవ ప్రపంచ యుద్ధం నుంచి శాటిలైట్లు సేకరించిన చిత్రాలు చూపిస్తాయి.
ఈ సమయంలో భూభాగం మారిన విధానం, ఒకప్పుడు పగడపు దిబ్బలున్న ప్రాంతాలు ప్రస్తుతం భూమిగా ఎలా మారాయో ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
"దీవులు అభివృద్ధి చెందాలంటే కోరల్ రీఫ్‌లు ఆరోగ్యకరంగా ఉండాలని అర్ధం చేసుకోవాలి" అని డాక్టర్ ఫోర్డ్ అన్నారు.
రీఫ్ చుట్టూ ఉన్న జీవావరణాలు అంతమయితే, అవి పగడాలను ఉత్పత్తి చేయవు. దాని వల్ల దీవులు ఏర్పడేందుకు గాని, లేదా రీఫ్‌ను ఆవాసాలుగా వాడుకునే జంతువులకు గాని మేలు జరగదు.
"కొన్ని కోరల్ జీవులు చాలా వేగంగా పెరుగుతాయి. కానీ, ఇలా కొత్తగా పెరిగిన వాటిని, చేపలు గాని, లేదా కెరటాలు గాని నాశనం చేయవచ్చు. కానీ, రీఫ్‌లు దృఢంగా ఉంటే, అవి ఇసుకను తయారు చేస్తాయి" అని చెప్పారు.
ఈ ఆవాసాలు వన్యప్రాణులకు కల్పించే రక్షణ చాలా ముఖ్యమైనది. జీవావరణాలకు, వాటి చుట్టూ నివసించే జంతువులు మనుగడ సాగించేందుకు రీఫ్ పటిష్టత చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Alexis Rosenfeld
భవిష్యత్తు ఏంటి?
"ఒక రీఫ్ ఎంత కాలం ఆరోగ్యకరంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కోరల్ బ్లీచింగ్ వల్ల పగడాలు తెల్లగా మారి అంతమయ్యే సమస్యలున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకుంటున్న మార్పులు కారణంగా సముద్రంలో ఆమ్లాలు కూడా పెరుగుతున్నాయి" అని డాక్టర్ ఫోర్డ్ వివరించారు.
"సీఓ 2 ఉద్గారాలను తగ్గించుకుని గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేయాలి. అది అంతర్జాతీయంగా చేయాల్సిన పని. ఇది మనమందరమూ చేయగలం" అని అన్నారు.
కొన్ని దీవులకు విస్తరించే సామర్ధ్యం ఉందని ఆధారాలు లభించినప్పటికీ, పెరుగుతున్న సముద్ర మట్టాల గురించి విచారించవలసిన అవసరం లేనట్లు కాదు. దీని వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దీవులు, అక్కడ నివసించే సమాజాలకు ముప్పు పొంచి ఉంది. దృఢమైన పగడపు దిబ్బలున్న ప్రాంతాల్లో, తగినంత అవక్షేపాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో, దీవులు విస్తరించే అవకాశం ఉంది.
కానీ, పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ఉన్న దీవుల తీరప్రాంతం కోతకు గురవుతూ ముప్పును ఎదుర్కొంటోంది. రీఫ్‌లు అంతమవుతున్న ప్రాంతాల్లో కూడా ఇదే ముప్పు పొంచి ఉంది.
ఏయే దీవులు విస్తరిస్తున్నాయి, ఏవి క్షీణిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా పసిఫిక్ దేశాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే, ఒక ప్రాంతంలో పరిస్థితి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుందని ఈ శాస్త్రవేత్తల బృందం చెబుతున్నారు.
ఈ జీవావరణాల అభివృద్ధి, క్షీణతకు కారణమైన విధానాలను, భవిష్యత్తులో తలెత్తే మార్పుల నుంచి వాటిని రక్షించేందుకు మనమేమి చేయగలమో గుర్తించాల్సిన అవసరం అందరికీ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కేవలం విస్తరిస్తున్న దీవుల అభివృద్ధికి, లేదా తీరప్రాంతాలు కొట్టుకుపోకుండా రీఫ్‌లు కల్పించే భద్రత కోసం మాత్రమే కాదు. ముఖ్యంగా, పగడపు దీవులను ఆవాసంగా చేసుకుని జీవిస్తున్న సముద్ర జీవుల కోసం కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ టీకా: రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
- కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువు
- హెచ్‌పీవీ వ్యాక్సీన్‌తో మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ నివారించవచ్చా?
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














