రియల్ ఎస్టేట్ వెంచర్‌లో తవ్వుతుంటే లంకెబిందెలు, అందులో అమ్మవారి ఆభరణాలు దొరికాయి: ప్రెస్ రివ్యూ

లంకె బిందెలో ఆభరణాలు

ఫొటో సోర్స్, UGC

జనగామ జిల్లా పెంబర్తిలో విలువైన ఆభరణాలున్న లంకె బిందె బయటపడినట్లు ఈనాడు దిన పత్రిక వార్తాకథనం ప్రచురించింది.

జనగామ మండలం పెంబర్తి గ్రామంలో గురువారం బంగారు, వెండి ఆభరణాలున్న పురాతన కాలంనాటి లంకెబిందె బయటపడింది.

రెవెన్యూ అధికారులు, పోలీసులు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ శివారు కీసరకు చెందిన మెట్టు నరసింహ కుటుంబ సభ్యులు కొద్దికాలం క్రితం పెంబర్తిలో 11 ఎకరాల భూమి కొన్నారు. అందులో స్థిరాస్తి వెంచర్‌ వేయడానికి గురువారం చదును చేస్తుండగా పెద్దబండల కింద రాగి బిందె బయటపడింది.

అందులో దేవతా విగ్రహాలకు అలంకరించే బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఏసీపీ వినోద్‌కుమార్‌, తహసీల్దారు రవీందర్‌ అక్కడకు చేరుకొని పరిశీలించారు.

ఆభరణాలు మట్టితో కలిసిపోయి ఉండడంతో వాటిని శుభ్రపరిచి, పంచనామా చేశారు. అమ్మవారి విగ్రహాలకు ఉండే బంగారు బుట్టలు, కమ్మలు, వెండి గొలుసులు, కడియాలు బయటపడ్డాయి.

మొత్తం 19 తులాల బంగారు, 1.7 కిలోల వెండి ఆభరణాలు, 6.5 గ్రాముల పగడాలు, 1200 గ్రాముల రాగి బిందె లభించినట్లు తహసీల్దార్‌ రవీందర్‌ వెల్లడించారని ఈనాడు రాసింది..

ఆభరణాలను కలెక్టరు ఆధ్వర్యంలో భద్రపరిచారని ఈనాడు వివరించింది.

వకీల్ సాబ్

ఫొటో సోర్స్, FB/Vakeel Saab

'వకీలు సాబ్' టికెట్ల పెంపుపై ఆదేశాలు ఇవ్వని ఏపీ ప్రభుత్వం

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం ప్రీమియర్ షో, టికెట్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండా ఆపేసిందని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నటించిన 'వకీల్‌సాబ్‌' చిత్రంపై రాజకీయ క్రీనీడ పడింది. కొత్త చిత్రాల విడుదల సమయంలో ఇప్పటి వరకు కొనసాగిన సంప్రదాయానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండానే బ్రేకులు వేసింది అని పత్రిక రాసింది.

కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్‌ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది.

శుక్రవారం వకీల్‌సాబ్‌ చిత్రం విడుదలకు మొత్తం రంగం సిద్ధమైంది. అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్‌ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు భావించారు.

కొంతమంది ఏడో తేదీన ప్రీమియర్‌ షోల టికెట్లను పలు థియేటర్లలో విక్రయించారు.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ఒక ప్రకటన విడుదల చేశారు. వకీల్‌సాబ్‌ చిత్రానికి ప్రీమియర్‌ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదని స్పష్టం చేశారని పత్రిక చెప్పింది.

ఒకవేళ ఎక్కడైనా అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ప్రీమియర్‌ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీనిపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ థియేటర్‌ వద్ద ఆందోళనకు దిగారు.

ఇటీవల విడుదలైన నితిన్‌ చిత్రం 'రంగ్‌ దే'కు టికెట్‌ ధరలను పెంపును అనుమతించిన రాష్ట్రప్రభుత్వం.. వకీల్‌సాబ్‌ చిత్రానికి అడ్డంకులు ఎందుకు పెడుతోందని నిలదీశారు.

ఇంకోవైపు.. జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటనతో ఎగ్జిబిటర్లు కూడా డైలమాలో పడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు గిట్టుబాటు ఉండదని నిర్మాతలు, పంపిణీదారులు అంటున్నారని ఆంధ్రజ్యోతి రాసింది.

గాంధీనగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన గలాటా నేపథ్యంలో థియేటర్ల వద్ద పరిస్థితులు ఏ క్షణాన ఎలా మారతాయోనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని పత్రిక వివరించింది.

ప్రైవేటు టీచర్లకు తెలంగాణ సాయం

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

ప్రైవేటు టీచర్లకు టీఆర్ఎస్ సర్కారు సాయం

కరోనా వల్ల మూతపడిన స్కూళ్లు తెరిచేదాకా తెలంగాణలో ఉన్న ప్రైవేటు స్కూల్ టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ వార్తా పత్రిక చెప్పింది.

కరోనా దెబ్బకు కకావికలమైన ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచింది.

జీతాల్లేక తిండికి సైతం తన్లాడుతున్న వారిని అదుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

స్కూళ్లు మళ్లీ తెరిచే వరకూ వారికి నెలకు రూ.2 వేల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలోల రేషన్‌బియ్యం పంపిణీచేయాలని అధికారులను గురువారం ఆదేశించారని పత్రిక రాసింది.

ఈ నెల నుంచే సహాయాన్ని అందించడంతోపాటు.. మళ్లీ పాఠశాలలు తెరిచేంత వరకూ కొనసాగించాలని స్పష్టంచేశారు.

ఆపదలో ఉన్నవారి కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.

అర్హులైనవారు బ్యాంక్‌ ఖాతా, ఇతర వివరాలతో వారివారి జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారుచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారని నమస్తే తెలంగాణ రాసింది.

సీఎం నిర్ణయంతో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్ల్లోని సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్ధి చేకూరనున్నది.

రూ.2వేల ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం సుమారు 30 కోట్లు వెచ్చించనున్నది. ఇదికాక బియ్యం పంపిణీ ఖర్చు ప్రభుత్వానికి అదనం అని పత్రిక వివరించింది.

హనుమంతుడి జన్మస్థానం

హనుమంతుని జన్మస్థానం తిరుమల అని నిరూపించనున్న టీటీడీ

హనుమంతుడి జన్మస్థానం తిరుమలే అని టీటీడీ ఉగాది రోజున ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధం అవుతోందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

‘‘అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకుగాను గతేడాది డిసెంబర్‌లో పండితులతో టీటీడీ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీతో గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు.

అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ సభ్యులు ఈవోకు తెలిపార’’ని సాక్షి రాసింది.

శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీ ప్రకారం నిర్థరించిన అంశాలను కమిటీ సభ్యులు ఈవోకు వివరించారని పత్రిక చెప్పింది.

ఈవో మాట్లాడుతూ..తిరుమల ఇక నుంచి హనుమంతుని జన్మస్థానంగా కూడా గుర్తింపు పొందనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని ఉగాది పర్వదినం రోజున జ్యోతిష్య శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా ప్రజలకు తెలపాలని కోరారు.

హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకురావాలని ఆయన చెప్పారని సాక్షి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)