Indian Economy: నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?

ఫొటో సోర్స్, SEAN GLADWELL/GETTY IMAGES
- రచయిత, అలోక్ జోషి
- హోదా, ఆర్థిక విశ్లేషకుడు, బీబీసీ కోసం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూలై, సెప్టెంబర్ మధ్య భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8.4 శాతం పెరిగి రూ.35,73,000 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా, కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందున్న స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకుంది.
2019లో ఏప్రిల్, జూన్ మధ్య జీడీపీ రూ.35,66,000 కోట్లు. అంటే ప్రస్తుత లెక్కలను బట్టి కరోనా పూర్వ పరిస్థితికి చేరుకున్నట్టే. దీని ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం నుంచి బయటపడిందని చెప్పవచ్చా?
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ముందు త్రైమాసికంలో 20.1 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఈ రెండు త్రైమాసికాల్లో ఆర్థికవ్యవస్థ కుదేలై, ఆర్థికమాంద్యంలో పడిపోయింది.
కిందటి ఏడాది మొదటి త్రైమాసికంలో 24.4 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం క్షీణించింది.
కరోనా ముందు పరిస్థితితో పోలిస్తే..
రెండేళ్ల క్రితం పరిస్థితికి ఆర్థికవ్యవస్థ చేరుకుందా లేదా అన్నదే అసలు లెక్క. చేరుకుందని స్థూల గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ రెండు త్రైమాసికాల్లో నమోదైన వృద్ధి రేటు ప్రపంచంలోని పెద్ద దేశాల వృద్ధి రేటుకు సమీపంలో ఉంది.
కాబట్టి, ఆర్థికవ్యవస్థ వేగం ఊహించిన దానికంటే మెరుగ్గా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో వృద్ధి రేటు 7.9 శాతం ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అంటే, వృద్ధి వేగం కొనసాగుతోందని అర్థం.
అయితే, మొత్తం ఆర్థికవ్యవస్థ అభివృద్దిని అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు సరిపోవు. జీడీపీ నంబర్లు బావుంటే అంతా బాగున్నట్లు కాదు. ఇందులో ఆందోళనపరిచే కొన్ని విషయాలు దాగి ఉన్నాయి.

ఫొటో సోర్స్, BORIS JOVANOVIC/GETTY IMAGES
గమనించాల్సిన అంశాలేంటి?
ఆర్థికవ్యవస్థలో కనిపించే వృద్ధిలో దేశం మొత్తం సరిసమానంగా పాలు పంచుకుంటోందని చెప్పలేం. ఇదే పెద్ద ఆందోళన. జీడీపీ గణాంకాలను మరింత లోతుగా విభజించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి పెద్ద మద్దతు లభించింది. ఈ ఏడాది త్రైమాసికాల లెక్కలు కూడా ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి కనిపిస్తోంది. గత రెండేళ్లనూ కలిపి చూస్తే మొత్తంగా 7.5 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
అయితే, దీనితో పాటే సేవా రంగం (సర్వీసెస్ సెక్టార్), తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్ రంగం)లో కూడా వృద్ధి కనిపిస్తుందని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు.
మొత్తం మూడు రంగాలను పోల్చి చూస్తే సేవా రంగంలో వృద్ధి నిరాశాజనకంగా ఉంది. అది కనీసం రెండేళ్ల క్రితం స్థితికి కూడా చేరుకోలేదు. జీడీపీలో సేవా రంగం వాటా 57 శాతం. అందుకే ఇది కలవరపెడుతోంది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTY
సేవా రంగంలో వృద్ధి నత్త నడకలు
సేవా రంగం పుంజుకోవట్లేదన్నది ఆందోళన కలిగించే అంశం. అందులో కూడా వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. రెండేళ్ల క్రితంతో పోలిస్తే వీటిల్లో ఇప్పటికీ దాదాపు 10 శాతం క్షీణత కనిపిస్తోంది.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ఈ రంగాలను బాగా దెబ్బతీసింది. వీటిపై విధించిన ఆక్షలను ఆలస్యంగా ఎత్తివేశారు. కొన్నింటిపై ఆంక్షలను ఇప్పుడిప్పుడే తొలగిస్తున్నారు.
అయితే, గత త్రైమాసికంతో పోల్చితే ఈ రంగంలో 34.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ త్రైమాసికంలో కూడా 8.2 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇది శుభ సూచకం.
అయినప్పటికీ, రెండేళ్ల క్రితంతో పోలిస్తే వృద్ధి రేటు తక్కువగానే ఉంది. సేవా రంగంలో చిన్న, మధ్యతరహా వ్యాపారుల వాటా ఎక్కువ. జీడీపీలో వీరి వాటా దాదాపు 17 శాతం. కానీ, ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ 'K షేప్'లో రికవరీ అవుతోందనుకుంటే, ఈ రంగం 'K' దిగువ ధృవాన్ని సూచిస్తోంది.
ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చివరికి కూడా కరోనా పూర్వ స్థితికి చేరుకోలేమని నిపుణులు అంటున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఇది మరింత దిగజారుతుంది.
ప్రజలు డబ్బు ఖర్చు చేస్తున్నారా లేదా?
మరోవైపు, వినియోగం అనుకున్నంత పెరగట్లేదు. ప్రభుత్వం కాకుండా కేవలం ప్రజలు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో 'వ్యక్తిగత వ్యయం' (ప్రయివేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్) తెలుపుతుంది.
ఈ సంవత్సరం వ్యక్తిగత వ్యయం సుమారు 8.2 శాతం పెరిగింది. కానీ, రెండేళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు 10 శాతం క్షీణత ఉంది.
ప్రభుత్వ వ్యయం కూడా రెండేళ్ల క్రితం కంటే దాదాపు 17 శాతం తక్కువగా ఉంది. జీడీపీ గణాంకాల బట్టి, ప్రభుత్వానికి జీఎస్‌టీ లేదా పరోక్ష పన్నుల ద్వారా వస్తున్న రెవెన్యూ కన్నా సబ్సిడీలపై ఎక్కువ ఖర్చు పెడుతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ సబ్సిడీలపై ప్రభుత్వం ఖర్చు పెడుతోంది?
MNREGA కోసం బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం సొమ్ము ఇప్పటికే ఖర్చయి పోయింది. ఇప్పుడు ప్రభుత్వం దీని కోసం పది వేల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించింది. ఇది కూడా సరిపోదని అంచనా వేస్తున్నారు. MNREGA కింద పనికి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోందంటే గ్రామాల్లో ప్రజలకు ఎక్కువ పని దొరకడం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇది ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు కలిగించే విషయమే కాక, దేశంలో అనేక విషయాలు ఇంకా కుదుట పడలేదన్నదానికి సంకేతం. దీని సంకేతాలు మరి కొన్ని చోట్ల కూడా కనిపిస్తున్నాయి. కార్ల విక్రయాలతో పోలిస్తే ద్విచక్ర వాహనాల విక్రయాల రేటు తగ్గుతోంది. అంటే సమాజంలో అట్టడుగు వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అర్థం.
వ్యాపార రంగం మెరుగైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ప్రైవేటు పెట్టుబడి మెరుగయ్యే సూచనలేవీ కనిపించట్లేదు. ఇన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ జీడీపీ గణాంకాలు పెద్దగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం వాటిని గత సంవత్సరంతో పోల్చి చూస్తున్నాం.
ముందు ముందు మార్గం అంత సులభం కాదు. వచ్చే ఏడాది వృద్ధి శాతాలు ఇంత ఉత్తేజాన్ని కలిగించకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- ఈ పక్షి మాంసం కామోద్దీపన కలిగిస్తుందా? అరబ్ షేక్‌లు దీన్ని వేటాడేందుకు పాకిస్తాన్ వస్తున్నారా, మరి నజీమ్‌ను ఎవరు చంపారు
- ఒమిక్రాన్‌ను గుర్తించడమెలా? లక్షణాలేంటి
- సిరివెన్నెల సీతారామశాస్త్రి: ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది?
- ఫోర్బ్స్ మ్యాగజైన్: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒడిశా ఆశావర్కర్ మతిల్దా..
- పాకిస్తాన్లో పెరుగుతున్న ధరలు... 'తక్కువ తినమని' ప్రజలకు మంత్రి సలహా
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలపై ఎందుకు యూ-టర్న్ తీసుకుందంటే...
- సోషల్ మీడియాలో సిక్కుల పేర్లతో సిక్కులపైనే దుష్ప్రచారం... నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టు
- వరదలు, కరవును తట్టుకునే వ్యవసాయం ఇదీ..
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- ఉత్తరాఖండ్‌లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















