ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు

సినిమా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఒకే టిక్కెట్ ధర అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సామాన్య ప్రేక్షకుడికి లాభం చేకూర్చేందుకే ఈ నిర్ణయం అని ప్రభుత్వం చెప్తోంది. అయితే దీనిపై వివాదం ఎందుకు రాజుకుంది?

ఏపీ సర్కారు ఇటీవల ఆన్‌లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను 01.12.2021న ప్రకటించింది.

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు రేట్లను నిర్దేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం తక్కువ ధర రూ.5 కాగా, ఎక్కువ ధర రూ. 250గా ఉంది.

సినిమా వెండి తెరను దాటి బుల్లి తెర, తాజాగా ఓటీటీ రూపంలోకి మారి అరచేతిలోని సెల్ ఫోన్‌కు చేరింది. అయినా కూడా పెద్ద తెరపై థియేటర్లలో సినిమా చూడటం సగటు ప్రేక్షకుడికి మంచి వినోదం. ఆ వినోదం అందించడమే కోసమే మేం సినిమాలు తీసేది అని సినీ పరిశ్రమ చెప్తుంటే... ఆ వినోదాన్ని కోరుకునే సగటు ప్రేక్షకుడు దోపిడీకి గురికాకూడదనే టిక్కెట్లపై నియంత్రణ అంటున్న ప్రభుత్వాల మాటలతో చర్చ మొదలై....వివాదంగా మారుతోంది.

సినిమా

ఫొటో సోర్స్, Reuters

వివాదానికి మూలమైన జీవోలో ఏముంది

సినిమా థియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 35 జారీ చేసింది. దీని ప్రకారం ఉన్న రేట్ల కంటే ఎక్కువ వసూలు చస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మల్టీప్లెక్స్‌లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేటు రూ.250 మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ.100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ.60. ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. ప్రభుత్వ ధరల ప్రకారం కనిష్ఠంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5 కూడా ఉంది.

జీవో

“ప్రాంతం ఏదైనా...అయా ప్రాంతాలకు ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరల ప్రకారం సినిమాలు వేయలేమని థియేటర్ల యాజమాన్యాలుగా మేం భావిస్తున్నాం. ఇలాగైతే చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా...మొత్తం సినిమా పరిశ్రమే దెబ్బతింటుంది. ఇక పెద్ద సినిమాకైతే కోలుకోలేని దెబ్బ కిందే లెక్క. చిన్న సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు దెబ్బతింటారు. చిన్న సినిమా పది కోట్లతో అయిపోతుంది. కానీ భారీ సినిమా తీయాలంటే 200 కోట్లు పెట్టాల్సిన రోజులు ఇవి. అన్ని సినిమాలకి ఒకే ధర అంటే ఎగ్జిబిటర్లకు బాగానే ఉంటుంది. నిర్మాతలు నష్టపోతారు. అలా జరిగితే క్రమంగా పెద్ద సినిమాలు తీయడం మానేస్తారు. అలాగని చిన్న సినిమా చేయలేరు. ఎందుకంటే స్టేటస్ ఫీలింగ్ వస్తుంది. దాంతో క్రమంగా సినీ పరిశ్రమ కుప్పకూలిపోతుంది” అని విశాఖలోని కిన్నెర థియేటర్ యాజమాని పి. సాంబమూర్తి బీబీసీతో అన్నారు.

సాంబమూర్తి

“అసలు అంత పెట్టి తీయాల్సిన అవసరమేముందని కొందరు అడుగుతారు. క్వాలిటీ, గ్రాఫిక్స్ లేకపోతే... మన సినిమా ఎదగదా? అని కూడా అంటారు. అన్నీ ఉండాలి. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా ఉండాలి. సినిమాకు తగ్గట్టు రేట్లను నిర్ణయించుకునే అధికారం ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి కల్పిస్తే... జాయింట్ కలెక్టర్ సమక్షంలో అయా సినిమాకి టిక్కెట్ల ధర నిర్ణయించి లెక్క చూపించగలం. ఇది పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వానికి కచ్చితమైన లెక్కలు చేరుతాయి. తద్వారా పన్నుల చెల్లింపు కూడా సక్రమంగా జరుగుతుంది. ఇది నిర్మాతకి, ప్రభుత్వానికి ఇద్దరికీ లాభం” అని సాంబమూర్తి చెప్పారు.

విశాఖలోని థియేటర్

పెద్ద సినిమా చూస్తారు...చిన్న సినిమాని చూడరు

“తెలుగు సినిమాకు పెద్ద సీజన్ సంక్రాతి. ఈ సీజన్ కోసం పెద్ద సినిమాలు 10 వరకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పండగ సీజన్‌లో ఏ సినిమాకైనా ఒకటే రేటంటే ప్రేక్షకులు పెద్ద సినిమాలను వంద రూపాయలకు హ్యాపీగా చూస్తారు. కానీ చిన్న సినిమాలు చూడరు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధేశ్యామ్, భీమ్లానాయక్ వంటి సినిమాలను వంద రూపాయలకే చూసి...మళ్లీ ఏదైనా చిన్న సినిమాకి వంద రూపాయలు టిక్కెట్ కొనమంటే కొనరు. ధరను పోల్చి చూస్తారు. దాంతో చిన్న సినిమాయే కదా ఓటీటీలో చూడొచ్చులే అని ఊరుకుంటారు. అదే చిన్న సినిమాకి కోలోకోలేని దెబ్బ అవుతుంది. పరోక్షంగా చిన్న సినిమా చనిపోయినట్లే. లో బడ్జెట్ మూవీస్‌కు రూ.100 టిక్కెట్ పెట్టి, పెద్ద సినిమాకి 150, రూ.200 ఇలా కొంచెం పెంచి... ఏదో ఒకటి ఫిక్స్ చేస్తే ప్రొడ్యూసర్లు, ఇండస్ట్రీ కూడా బతుకుతుంది” అని సిని పరిశ్రమకు చెందిన ప్రసాదరెడ్డి అన్నారు. ప్రసాద రెడ్డి విశాఖలో సంగం, శరత్ ధియేటర్లకు యాజమాని.

ప్రసాదరెడ్డి

“అలా కాకుండా ప్రభుత్వం మొండిగా ఇవే ధరలు అంటే అది ఇరువుకి మంచిది కాదు. ఇప్పుడు 15 భారీ సినిమాలు తయారవుతున్నాయి. మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని ఆపలేరు. ఆ తర్వాత ఒక్క భారీ సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టరు. ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. వంద రూపాయల్లోనే అన్నీ అయిపోవాలంటే సాధ్యమయ్యే పని కాదు”అని ప్రసాదరెడ్డి చెప్పారు.

బీ,సీ సెంటర్లలో ఇబ్బంది

‘‘ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కార్పొరేషన్ ఏరియాలలో ఫర్వాలేదు. కానీ బీ, సీ సెంటర్లలలో రేట్లతోనే ప్రొడ్యూసర్‌కు ఇబ్బంది. సినిమా ఎక్కడైనా ఒకటే. కానీ ప్రాంతాలు వారీగా లెక్కలేసి రేట్లు నిర్ణయిస్తే... నిర్మాత నష్టపోతాడు. పైగా ఇప్పుడు బీ, సీ సెంటర్లలో సైతం అద్భుతమైన క్వాలిటీతో థియేటర్లను నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితతుల్లో క్వాలిటీని బట్టి అయా థియేటర్లలో రేట్లను నిర్ణయించాలి. ఇది కొంత వరకు ఉపయోగకరం. మల్టీప్లెక్సుల్లో కూడా ఇది వర్తింప చేయాలి. విశాఖ, విజయవాడ, తిరుపతి మల్టీప్లెక్సులకి... శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కర్నూలు వంటి జిల్లాల మల్టీప్లెక్సులకి ఒకే రేటుని నిర్ణయించడం బాగాలేదు. అది ప్రేక్షకుడికి అదనపు భారమే. విశాఖలో రూ.250 పెట్టి, శ్రీకాకుళంలో కూడా అదే ధరంటే ఇబ్బందే. ప్రభుత్వం ఆలోచించి...కొన్ని సవరణలు చేస్తే బాగుంటుంది” అని జగదాంబ థియేటర్ మేనేజన్ సురేశ్ అన్నారు.

సినిమా

ఫొటో సోర్స్, Reuters

ఇది కక్షపూరిత చర్యే…

ప్రభుత్వం వరసగా సినిమా పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుందని సాంబమూర్తి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే సినిమా పరిశ్రమని నిబంధనల చట్రంలో ఇరికించేస్తున్నారని, ఇది అంత మంచి పని కాదని అన్నారు.

“టికెట్ ధర నియంత్రణ ప్రత్యక్షంగా అనుకోండి, పరోక్షంగా అనుకోండి...ఇది పరిశ్రమపై కక్ష్య కట్టినట్టే ఉంది. చక్కగా వెళ్తున్న సినిమా ఇండస్ట్రీని ధరల నియంత్రణ పేరుతో, అన్‌లైన్ టికెటింగ్ అని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కరోనా దెబ్బతో, ఓటీటీలతో పరిశ్రమ చాలా నష్టపోయింది. సినిమా హాలు బయట సినిమా వేస్తున్నట్లే పోస్టరుంటుంది. కానీ లోపల సినిమా వేయడం లేదు చాలా చోట్ల. ఎందుకంటే సినిమా వేస్తే అయ్యే ఖర్చుతో పోల్చితే... టికెట్ల ద్వారా వచ్చేది చాలా తక్కువ. పచ్చిగా చెప్పాలంటే ఫినాయిల్ ఖర్చు కూడా రావడం లేదు. బూస్టింగ్ ఇచ్చే భారీ సినిమాలు వస్తే... జనాలు ధియేటర్లకు వస్తారు. కానీ ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలతో సినిమాలు తీస్తున్న వారు కూడా వెనుకడుగేయాల్సిన పరిస్థితి ఉంది” అని సాంబమూర్తి చెప్పారు.

బలవంతపెట్టడం లేదు కదా...

‘‘మంచి క్వాలిటీ, కంటెంట్‌తో సినిమా వస్తే రేట్లు పెంచినా ప్రేక్షకులు సినిమాకి వస్తారు. పైగా సినిమాకి రమ్మని...లేదా ఇంత టిక్కెట్ ఉంది కొనమని బలవంతం చేయడం లేదు కదా. మరెందుకు ప్రభుత్వం సామాన్య ప్రేక్షకుడి మేలు కోసమేనంటూ సినిమా పరిశ్రమని బలి చేస్తుంది’’అని సాంబమూర్తి ప్రశ్నించారు.

“సినిమా పరిశ్రమలో ఏవరితోనైనా ప్రభుత్వానికి గొడవలో, వివాదాలో ఉంటే...వారితో చర్చంచి పరిష్కరించుకోవాలి. అంతే కానీ మొత్తం పరిశ్రమనే కష్టాలపాలు చేయడం తగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పెద్ద సినిమాలు కూడా ఓటీటీనే ఆశ్రయించాల్సి వస్తుంది. స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు సైతం నారప్ప, దృశ్యం-2 వంటి సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేశారు. రెండు సినిమాలు హిట్టే. అవే థియేటర్‌లో విడుదలై ఉంటే పరిశ్రమకు ఊతమొచ్చేది. ముందు ఏ సినిమా అయినా థియేటర్‌కు రావాలి, ఆ తర్వాతే ఓటీటీకి ఇవ్వాలి. దానికి నిబంధనలు ఉన్నాయి. అవి పాటించడం లేదు” సాంబమూర్తి చెప్పారు.

సినిమా

ఫొటో సోర్స్, Getty Images

బెనిఫిట్ షోల ఆదాయమే కీలకం

తెలుగు సినిమా బడ్జెట్ పది కోట్లే ఎక్కువనుకునే స్థాయి నుంచి నేడు వందల కోట్ల స్థాయికి చేరింది. సినిమాలపై క్రేజ్, హీరోలకున్న ఫాలోయింగ్ వీటిని ఆధారంగా చేసుకుని భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. భారీ సినిమాల ఆదాయానికి ప్రధాన వనరు బెనిఫిట్ షోలే. భారీ సినిమాలకు... ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకున బెనిఫిట్ షోల పేరుతో టిక్కెట్ రేటును భారీగా పెంచి అమ్ముతుంటారు.

పైగా భారీ సినిమాలకు షోల సంఖ్యను కూడా పెంచుకుంటారు. ఇలా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. అలాగే సినిమా విడుదలైన తొలి రెండు వారాల వరకు స్పెషల్ రేటు పెట్టి టికెట్లు అమ్ముతారు. దీంతో బడా సినిమాలకు ఉన్న క్రేజ్ ఆ సినిమాకు ఆదాయం తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం ఇటు బెనిఫిట్ షోలు, అటు ప్రత్యేక ధరలలను రాష్ట్ర ప్రభుత్వం అమోదించలేదు.

“గతంలో సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించుకునేందుకు ప్రభుత్వాలే అనుమతి ఇచ్చేవి. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. మరో వైపు టిక్కెట్ల ధరను ఏ సినిమాకైనా ఒకే విధంగా నిర్ణయించడం కారణంగా భారీ సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల నిర్మాతలు ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారీగా నష్టపోతారు. అదే సమయంలో జీఎస్టీ ఎగ్గొడుతున్నారని టిక్కెట్లను ప్రభుత్వమే అమ్ముతుందంటూ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. టిక్కెట్ల ధరను జాయింట్ కలెక్టర్ ఆధర్యంలో నిర్ణయించి... అలాగే అమ్మితే... ప్రభుత్వాన్ని మోసం చేసే అవకాశం ఉండదు. ఎన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయే దాని ప్రకారం టాక్స్ కడతారు. తప్పించుకునే అవకాశం ఉండదు. ఇలాంటివి పరిశీలించాలి. అన్ని సినిమాలకు ఒకే ధర అనడం సరికాదు”అని విశాఖలోని జగదాంబ ధియేటర్ మేనేజర్ సురేశ్ అన్నారు.

సినిమా

ఫొటో సోర్స్, Getty Images

టాలీవుడ్ ఏమంటోంది

సినిమా టిక్కెట్ల అన్‌లైన్ విధానంలో అమ్మకాలు, టిక్కెట్ ధరల నియంత్రణ అంశాలపై టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు వివిధ సందర్భాల్లో స్పందించారు.

ఒక వైపు ప్రభుత్వంతో పేచీ పెట్టుకోవడం, మరో వైపు వందల కోట్ల పెట్టుబడులు...ఈ విషయంలో బడా నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

సినిమా టిక్కెట్ల ధర నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం తాను నిర్మించిన 'ఆర్ఆర్ఆర్'పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటామని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు.

సినిమా టికెట్ల ధరలపై పునరాలోచించుకోవాలని సీఎం జగన్‌కు సినీ హీరో చిరంజీవి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అలాగే సురేశ్ మూవీస్ అధినేత, ప్రొడ్యూసర్ సురేశ్ బాబు కూడా అన్‌లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వం తీసుకున్నది సరైనదని చెప్పలేమని అన్నారు. అలాగే అన్ని సినిమాలకు ఒకటే ధర నిర్ణయిస్తే...కనీసం థియేటర్‌ కరెంట్ బిల్లుల డబ్బులు కూడా రావన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పేలా లేవని, అసలు సినిమా రిలీజ్ చేసే పరిస్థితే ఉండకపోవచ్చనని అందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసమని చెప్పడం కూడా కరెక్ట్ కాదని... సినిమా రిలీజైన రెండు రోజుల తర్వాత బ్లాక్ టిక్కెట్లకు డిమాండ్ ఉండదన్నారు.

ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనం ఏంటని గతంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యణ్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం సినీ పరిశ్రమను భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

సినిమా

ఫొటో సోర్స్, CGV

ప్రభుత్వం ఏమందంటే...

“థియేటర్ల యజమానులు, సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించాం. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఆన్‌లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారు. అలా సినిమా పరిశ్రమ కోరిక మేరకు ఆ విధానాన్ని ప్రభుత్వం పరిశీలించి... ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పైగా సినిమా టికెట్ల విషయంలో పన్ను ఎగవేత జరుగుతోంది. అలాగే ఇష్టారాజ్యంగా షోల సంఖ్యను పెంచేసుకుంటున్నారు. ఇక నుంచి, ఏపీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా.. కేవలం నాలుగు షోలు మాత్రమే ఉంటాయి. అదనపు షోలకు అవకాశం లేదు. అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర ఉంటుంది. గతంలో పెద్ద హీరో సినిమాలకు రూ.200 నుంచి 500 రూపాయలకు పైగా అమ్మిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పద్ధతులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. థియేటర్ల వద్ద బ్లాక్ టిక్కెట్ల దందాని కూడా అరికట్టవచ్చు. ఆన్‌లైన్ విక్రయాలతో వచ్చే సొమ్మును రియల్ టైమ్‌లోనే థియేటర్ల యజమానులకు బదిలీ చేస్తాం. ఏపీ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ద్వారా ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌ నిర్వహిస్తాం. దీనిపై సినీ పెద్దలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు”అని మంత్రి పేర్ని నాని చెప్పారు.

సినిమా

ఫొటో సోర్స్, Getty Images

రెండు తెలుగు రాష్ట్రాలు, ఒకే సినిమా...

తెలుగు సినిమా ఏదైనా ఏపీ, తెలంగాణ రెండు చోట్లా విడుదల అవుతుంది. అయితే ఏపీలో, తెలంగాణలో సినిమా నిబంధనల్లో తేడాలు ఉన్నాయి. దీంతో ఏదో ఒక రాష్ట్రంలోనే సినిమాని విడుదల చేసే పరిస్థితి లేదు. అలా చేస్తే నిర్మాతలు నష్టపోతారు.

“కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. కోవిడ్ రెండు దశల్లో కూడా సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడే కోలుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ పెద్ద సినిమాలతో ఊపొస్తుందనుకునే లోపు కొత్త నిబంధనలు, వివాదాలతో అంతా అయోమయంగా ఉంది. ప్రేక్షకులు మొదట హ్యాపీగానే ఫీలవుతారేమో కానీ చివరగా వారికి నష్టమే. ముందు పెద్ద సినిమాకు టిక్కెట్ ధర తక్కువగా ఉండటం బాగుంటుంది. కానీ అదే ధర చెల్లించి చిన్న సినిమా చూసేందుకు ఇష్టపడరు. దాంతో క్రమంగా ముందు చిన్న సినిమా, ఆ తర్వాత పెద్ద సినిమా రెండూ దెబ్బతింటాయి. ప్రభుత్వం ఆలోచించి...మరోసారి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది” అని విశాఖలోని చిన్న చిత్రాల నిర్మాత ఆర్. రమణమూర్తి బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)