‘ఫేస్‌బుక్ ప్రొటెక్ట్’ ఫీచర్: 5 క్లిక్‌లలో యాక్టివేట్ చేసుకోండిలా...

facebook protect

ఫొటో సోర్స్, facebook

    • రచయిత, రామకృష్ణ వరికూటి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'మరో 15 రోజుల్లో ఫేస్‌బుక్ ప్రొటెక్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. లేదంటే మీ అకౌంట్ నుంచి మిమ్మల్ని లాగవుట్ చేస్తాం'.

ఇటీవల కొందరు ఫేస్‌బుక్ యూజర్లకు తరచూ ఇలాంటి అలర్ట్ వస్తోంది.

ఆ నోటిఫికేషన్ పట్టించుకొని, అది చెప్పినట్లు ఫేస్‌బుక్ ప్రొటెక్షన్‌ను యాక్టివేట్ చేసుకుంటే సరి.

లేదంటే మిమ్మల్ని లాగిన్ కానివ్వమనేది దాని సారాంశం.

ఫేస్‌బుక్ ప్రొటెక్ట్

ఫొటో సోర్స్, facebook

ఇంతకీ ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ అంటే ఏమిటి?

ఇదొక సెక్యూరిటీ ఫీచర్. ఫేస్‌బుక్ ఖాతాలకు లేదా పేజీలకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు దీన్ని తీసుకొచ్చామని సంస్థ చెబుతోంది.

సమాజంలోని కొందరు వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను రకరకాల కారణాలతో హ్యాకర్లు టార్గెట్ చేస్తుంటారు.

రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రీడాకారులు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు వంటి వారు ఈ జాబితాలో ఉంటారు.

2019లో బాలీవుడ్ నటుడు అమితాభ్ బచ్చన్ ట్విటర్ అకౌంట్‌ను కొందరు హ్యాక్ చేసి, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే భారతీయ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై వాట్సాప్ ద్వారా నిఘా పెట్టారనే వార్తలను వింటున్నాం.

ఇలా హై రిస్క్ ఉన్న ఖాతాలను మరింత సేఫ్‌గా ఉంచేందుకు తీసుకొచ్చిన ఫీచరే Facebook Protect.

ఫేస్ బుక్

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎలా పని చేస్తుంది?

ఇది ప్రధానంగా రెండు విధాలుగా ఖాతాలకు అదనపు భద్రత కల్పిస్తుంది.

మొదటిది లాగిన్... హ్యాకర్లు పాస్‌వర్డ్స్ దొంగిలించి మీ ఖాతాల్లోకి లాగిన్ అవ్వకుండా ఉండేందుకు టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ ఉంటుంది.

అంటే అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే ప్రతిసారి మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

ఇక రెండోది హ్యాకింగ్ నుంచి రక్షణ... నిరంతరం అకౌంట్ సెక్యూరిటీని మానిటర్ చేస్తూ హ్యాకింగ్ ప్రమాదాలను పసిగడతామని ఫేస్‌బుక్ చెబుతోంది.

ఫేస్ బుక్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వాడలేమా?

ఫేస్‌బుక్ ప్రొటెక్ట్‌ను ఎనేబుల్ చేయడం తప్పనిసరి అని సంస్థ చెబుతోంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు.

ప్రస్తుతానికి ఎవరి ఖాతాలకు హ్యాకింగ్ ముప్పు ఎక్కువగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని తప్పనిసరి చేస్తున్నారు.

ఇటువంటి వారిని గుర్తించి ఫేస్‌బుక్ నోటిఫికేషన్ పంపుతుంది. నోటిఫికేషన్ వచ్చిన 15 రోజులలోపు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోకుంటే మీరు లాగిన్ కాలేరు.

యాక్టివేట్ చేసుకుంటేనే లాగిన్ కాగలరని ఫేస్‌బుక్ అంటోంది.

నాకెందుకు నోటిఫికేషన్ రాలేదు?

ముందు చెప్పుకున్నట్లు ప్రస్తుతానికి అందరికీ ఈ ఫీచర్ అందుబాటులో లేదు.

విడతల వారీగా తాము యూజర్లను ఈ ఫీచర్ పరిధిలోకి తీసుకొస్తామని ఫేస్‌బుక్ చెబుతోంది.

ఫేస్‌బుక్ ప్రొటెక్ట్

ఫొటో సోర్స్, facebook

ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?

ఫేస్‌బుక్ నుంచి సెక్యూరిటీ నోటిఫికేషన్ వచ్చిన వారు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. వచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఫేస్‌బుక్ ప్రొటెక్ట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అయినా చేయొచ్చు.

1)ఫేస్‌బుక్ ఖాతాలోకి కంప్యూటర్ ద్వారా లాగిన్ అయి ఉంటే కుడివైపు పైన ప్రొఫైల్ ఐకాన్ వరుసలో చివరిన Account అనే ఆప్షన్ ఉంటుంది.

2)దాని మీద క్లిక్ చేసి Settings & Privacyలోకి వెళ్లాలి.

(మొబైల్ యాప్ యూజ్ చేసే వాళ్లు రైట్‌ సైడ్ టాప్‌లో ఉండే మూడు గీతలను టచ్ చేసి, ఆ తరువాత కిందకు స్క్రాల్ చేస్తే Settings & Privacy కనిపిస్తుంది)

3)Settings & Privacy పై క్లిక్ చేసి Settings అనే ట్యాబ్‌లోకి వెళ్లాలి.

4) అక్కడ మీకు లెఫ్ట్‌లో Security and Login అనే ట్యాబ్‌పై క్లిక్ చేస్తే Facebook Protect అనే ఫీచర్ కనిపిస్తుంది.

(మొబైల్ యాప్‌లో అయితే Settings & Privacyలోకి వెళ్లాక Password and Security అనే ట్యాబ్‌పై టచ్ చేస్తే Facebook Protect వస్తుంది)

5)Nextను క్లిక్ చేసి స్క్రీన్ మీద కనిపించే సూచనలను ఫాలో అయితే సరిపోతుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి చెక్ చేసినప్పుడు స్టేటస్ On అని ఉంటే Facebook Protect ఫీచర్ యాక్టివేట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)