ట్విటర్ ఆల్గారిథం తెల్లని ముఖాలు, అమ్మాయిల ముఖాల పట్ల పక్షపాతం చూపిస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మనం ఒక ఫొటో అప్‌లోడ్ చేయగానే, దాన్ని కాప్ర్ చేసి చిన్నగా చూపిస్తుంది. ఆ ఫొటో మీద క్లిక్ చేస్తే పూర్తి చిత్రం కనిపిస్తుంది. మన అకౌంట్‌లోకి వచ్చేవారికి క్రాప్ అయిన ఇమేజే కనిపిస్తుంది. అది ఆసక్తికరంగా అనిపిస్తే, అప్పుడు వాళ్లు ఫొటో మీద క్లిక్ చేసి పూర్తి చిత్రాన్ని చూస్తారు.
ఇలా ఫొటోలను కత్తిరించేందుకు ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు అంతర్గతంగా ఒక అల్గారిథం ఉంటుంది.
ట్విటర్‌లో ఉండే అలాంటి ఫొటో ఎడిట్ అల్గారిథం లేదా ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథం, ప్రధానంగా తెల్లగా, సన్నగా ఉన్నవారి ముఖాలను, యువత ముఖాలను చూపించడానికే మొగ్గు చూపుతుందని ఒక పరిశోధకుడు కనుగొన్నాడు.
ఫొటో క్రాపింగ్ అల్గారిథంలో పక్షపాతాలను కనుగొనేందుకు ట్విటర్ నిర్వహించిన ఒక పోటీలో బోగ్డాన్ కులినిక్ అనే వ్యక్తి 3,500 డాలర్ల మొదటి బహుమతి గెలుచుకున్నారు.
నల్లని ముఖాలకు వ్యతిరేకంగా క్రాపింగ్ అల్గారిథంలో పక్షపాతం ఉన్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ట్విటర్ చేసిన ఒక పరిశోధనలో తేలింది.
ఫలితంగా, ఫొటోలను ఎడిట్ చేసే విధానాలను ఆ సంస్థ సవరించింది. యూజర్లే తమ ఫొటోలను ఎడిట్ చేసుకుంటే మేలని భావించి ఈ సవరణలు చేసినట్లు ట్విటర్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
సాలియెన్సీ అల్గారిథం
ఈ ఫొటో క్రాపింగ్ అల్గారిథంను "సాలియెన్సీ అల్గారిథం" అంటారు.
ట్విటర్‌లో ఫొటో అప్‌లోడ్ చేయగానే తెల్లగా ఉన్న వారి ముఖాలు బాగా కనిపించేలాగ, నల్లగా ఉన్నవారి ముఖాలు కత్తిరించేసి లేదా దాచేసి ప్రివ్యూ చూపిస్తున్నట్లు కనుగొన్నారు.
ఇదే క్రాపింగ్ విధానం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, సెనేటర్ మిచ్ మెక్‌కానెల్ విషయంలో కూడా కనిపిస్తుంది. వివిధ జాతులకు చెందిన వ్యాపారవేత్తల ఫొటోలు గమనించినా ఇదే వ్యూహం కనిపిస్తుంది.
అలాగే, తెల్లజాతి వారి ముఖాల విషయంలో ఈ అల్గారిథం 4 శాతం పక్షపాతం చూపిస్తున్నట్లు ట్విటర్ సొంత పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనల ఫలితంగా, "ఎవరి ఫొటోలను వారే క్రాప్ చేసుకోవడం మేలని" ట్విటర్ భావించినట్లు ఆ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ రుమ్మన్ చౌదరి తెలిపారు.
మహిళలకు లేదా మహిళల ముఖాలకు ప్రాధాన్యం
ఈ "అల్గారిథం-బయాస్ బౌంటీ కాంపిటీషన్"ను ట్విటర్ జూలైలో ప్రారంభించింది.
సాధారణంగా సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ కంపెనీ కోడ్‌లలో ఉండే బగ్‌లు కనుగొనేందుకు ఇలాంటి పోటీలు పెడుతుంటాయి. బగ్‌లు కనిపెట్టడం ద్వారా కోడింగ్ విధానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇదొక అభ్యాసం.
అదే రీతిలో ట్విటర్ పెట్టిన అల్గారిథం-పక్షపాతం పోటీలో కులినిక్ ఫొటో క్రాపింగ్ పక్షపాతాన్ని కనుగొన్నారు.
కులినిక్, లూసాన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇంజినీరింగ్ లాబొరేటరీలోని స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ విద్యార్థి.
ట్విటర్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలను ముందే ఎడిట్ చేసి వాటి "సాలియెన్సీ" పెంచితే.. అంటే ముఖాలను తెల్లగా లేదా యవ్వనంగా కనిపించేట్లు లేదా కాస్త స్త్రీ ముఖకవళికలు వచ్చేట్లు చేసి అప్‌లోడ్ చేస్తే క్రాపింగ్ పక్షపాతాన్ని తప్పించుకోవచ్చని కులినిక్ కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కులినిక్‌కు మొదటి బహుమతి ప్రకటిస్తూ, "బ్యూటీ ఫిల్టర్లు వాడి అల్గారిథం ఎలా పనిచేస్తుందో మనం కనిపెట్టవచ్చు. వాస్తవ ప్రపంచ పోకడలను, సామాజిక అంచనాలను ఈ అల్గారిథమ్స్ ఎలా ప్రతిబింబిస్తాయో పరిశీలించవచ్చు" అని ట్విటర్ పేర్కొంది.
మహిళల నేతృత్వంలోని టొరంటో విశ్వవిద్యాలయం స్టార్ట్ అప్ "హాల్ట్ ఏఐ"కి ఈ పోటీలో రెండవ బహుమతి లభించింది.
"ఫొటోలను ఎడిట్ చేసే విధానం ఒక నిర్దిష్ట వర్గాన్ని అణగదొక్కగలదు. ఉదాహరణకు వృద్ధులు, వికలాంగుల ఫొటోలు చాలావరకు క్రాప్ అయిపోతాయి" అని హాల్ట్ ఏఐ కనిపెట్టింది.
తారాజ్ రీసెర్చ్ వ్యవస్థాపకులు రోయా పక్జాద్ మూడవ బహుమతిని గెలుచుకున్నారు.
మీమ్స్‌లో ఇంగ్లిష్ కన్నా అరబిక్ వచనం ఎక్కువగా క్రాప్ అయ్యేలా ట్విటర్ అల్గారిథం ఉందని రోయా కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ 19: భారత్ కోసం ప్రార్థించిన పాకిస్తాన్ ట్విటర్ - ఏఐ పరిశోధన
- ట్విటర్ వర్సెస్ కేంద్రం: అనేక ప్రశ్నలు సంధించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- వెంకయ్య నాయుడు: భారత ఉప రాష్ట్రపతి ట్విటర్ బ్లూ టిక్ ఎందుకు తొలగించారు?
- ఈమె లేఖలకు బాలీవుడ్ టాప్ స్టార్లు సంతోషంగా సమాధానం ఇచ్చేవారు
- సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని హత్యలు చేసిన 'ట్విటర్ కిల్లర్'కు మరణ శిక్ష
- ‘మోదీతో కలిసి తింటే ఎంతో బాగుండేది’: సమోసాలు తయారు చేసి ట్వీట్ చేసిన ఆస్ట్రేలియా ప్రధాని
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- ఇడ్లీని అవమానించేలా చరిత్రకారుడి ట్వీట్.. దక్షిణ భారతీయుల ఆగ్రహం








