ఈమె లేఖలకు బాలీవుడ్ టాప్ స్టార్లు సంతోషంగా సమాధానం ఇచ్చేవారు

ఫొటో సోర్స్, TWITTER/@SAMJAWED65
- రచయిత, అలియా నజ్కీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ చిన్నతనంలో మీ తాతయ్యలు, బామ్మలు "ఆరోజుల్లో…" అంటూ తమ కాలంనాటి విషయాలు గుర్తు చేసుకోగానే.."అబ్బా సోది మొదలెట్టారు" అని మీరు చాలాసార్లు అనుకునే ఉంటారు.
నిజానికి, ఆరోజుల్లో ఇప్పుడు ఉన్నట్లు మన జీవితాన్ని సులభంగా మార్చేసిన మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా లాంటి సౌకర్యాలు, ఆధునిక వస్తువులు ఏవీ అందుబాటులో లేవు.
కానీ, ఇటీవల ట్విటర్‌లో వైరల్ అయిన వరుస ట్వీట్లు భారత్‌లోని కొన్ని వేల మందిని నిజంగా ఆ రోజుల్లోకి తీసుకెళ్లాయి.
ఆల్ట్ న్యూస్ అనేది భారత్‌లోని ఒక ఫాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్. దాని వ్యవస్థాపకుల్లో ఒకరు శామ్ జావేద్. శామ్ సేస్ పేరుతో ఉన్న తన ట్విటర్ హాండిల్లో ఆమె ఈ వారం మొదట్లో వరుస ట్వీట్లు చేశారు.
చనిపోయిన తమ అత్తయ్య గురించి ఆమె చేసిన ట్వీట్లు భారత్‌లో ట్రెండయ్యాయి.
శామ్ అత్తయ్య మెహరున్నీసా నజ్మా 15 ఏళ్ల క్రితం 2006లో చనిపోయారు. ఆమెకు సంబంధించిన వస్తువులు కొన్నేళ్లవరకూ బేస్‌మెంటులో ఉన్న ఒక స్టోర్ రూంలో ఎక్కడో ఉండిపోయాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇటీవల అక్కడ తనకు దొరికిన ఆల్బం ద్వారా ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడిందని శామ్ ట్వీట్ చేశారు.
నజ్మాకు సినిమాలంటే చాలా ఇష్టం. అది తన తల్లికి ఇష్టం లేకపోయినా, ఖాళీగా ఉన్నప్పుడు ఆమె అప్పటి బాలీవుడ్ టాప్ స్టార్లకు పెద్ద పెద్ద లెటర్లు రాసేవారు.
అప్పటి అగ్ర తారల నుంచి నజ్మాకు వచ్చిన లెటర్లు, వారు ఆటోగ్రాఫ్ చేసిన ఫొటోలతో ఆ ఆల్బం మొత్తం నిండిపోయి ఉందని శామ్ చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER/@SAMJAWED65
అభిమానులు ముద్దుగా ఇండియన్ 'ఎల్విస్ ప్రెస్లీ'గా పిలుచుకునే షమ్మీ కపూర్ నజ్మాకు ఇంగ్లిష్‌లో లెటర్ రాశారు. "నేను నీ అభిమాన నటుడినని తెలిసి, చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
భారత సినీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన హీరోల్లో ఒకరైన ధర్మేంద్ర ఆమెకు స్వదస్తూరీతో హిందీలో సమాధానం ఇచ్చారు. మదర్ ఇండియా స్టార్ సునీల్ దత్ నజ్మాకు ఉర్దూలో లేఖ రాశారు.
నజ్మా రాసిన లేఖలకు బదులిచ్చిన తారల లిస్టు ఇక్కడితో ఆగిపోదు. కామినీ కౌశల్, సాధనా, ఆశాపరేఖ్, సైరాబాను, తబస్సుమ్, సురయ్యా, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్.. ఇలా అప్పట్లో హిందీ సినీరంగాన్ని ఏలిన ఎంతోమంది అగ్ర తారల నుంచి ఆమెకు లేఖలు వచ్చాయి.
మనం వారు రాసిన ఆ లేఖల్లోకి వెళ్లే ముందు, అసలు నజ్మా ఎవరో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, TWITTER/@SAMJAWED65
నజ్మా 1930లో దిల్లీలో జన్మించారు. ఆమె తండ్రిది పంజాబ్. తల్లి బర్మా సంతతి వారు. ఆమెకు ఇద్దరు సోదరిలు, ఒక సోదరుడు ఉండేవారు. చిన్నప్పుడే వాళ్ల నాన్న చనిపోయారు.
దీంతో ఆమె కుటుంబం అంతా రాజస్థాన్‌లోని టోంక్ నవాబు సాదత్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన తమ మేనత్త ఇంట్లో నివసించేది. అక్కడే నజ్మా పెరిగారు.
అందరూ పెద్దవాళ్లయ్యాక, నజ్మా మిగతా తోబుట్టువులు ఉన్నత చదువుల కోసం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వెళ్లిపోయారు. కానీ నజ్మాకు చదువు కంటే హిందీ సినిమాలు చూడ్డం, సిలోన్ రేడియోలో పాటలు వినడం, అభిమాన నటులకు పెద్ద పెద్ద లేఖలు రాయడం అంటే ఇష్టంగా ఉండేది.
నజ్మాకు 20 ఏళ్లు రావడంతో పెళ్లి చేశారు. దాంతో, పెళ్లి తర్వాత తారలకు లేఖలు రాసే ఆమె అలవాటు అటకెక్కింది.
కానీ హిందీ సినిమాలంటే ఉన్న ప్రేమ మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
"మా అత్తయ్య చాలా మంచి వారు. ఆమెకు సినిమాలంటే ఉన్న ఇష్టం గురించి, సినీ తారలకు ఆమె రాసే లేఖల గురించి మాకు అందరికీ తెలుసు" అని శామ్ చెప్పారు.
"నా పోస్టులు వైరల్ అయ్యాకే, మాకు అందరికీ ఒక విషయం తెలిసొచ్చింది. ఆమె రాసిన లేఖలు, ఫొటోల సేకరణ నిజంగా ఒక అమూల్యమైన నిధి అని నేను అప్పటివరకూ గుర్తించలేకపోయాను" అన్నారు శామ్.
నజ్మాకు పెళ్లైన 8 ఏళ్లకే భర్త చనిపోయారు. తర్వాత ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన తోబుట్టువులతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు పిల్లలు కూడా లేరు. కానీ, తన మేనకోడలంటే ప్రాణం. వయసు పైబడిన తర్వాత కూడా సినిమాలంటే ఆమెకు ఉన్న ఇష్టం అలాగే కొనసాగింది.
నజ్మా అప్పటి ఆల్బంలోకి ఒకసారి తొంగి చూస్తే..

ఫొటో సోర్స్, TWITTER/@SAMJAWED65
అప్పట్లో లేఖలు రాసే అభిమానులకు ఒక్క ముక్క సమాధానం కూడా ఇవ్వలేనంత బిజీ బిజీగా ఉండే పెద్ద స్టార్లలో ఒకరైన సునీల్ దత్ నజ్మాకు ఉర్దూలో ఓపికగా ఒక లేఖ రాశారు. అది కూడా స్వదస్తూరీతో.
తనకు లేఖ రాస్తున్నది ఒక యువతి అని ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక పెద్దమనిషి తరహాలో నజ్మాను సోదరిగా సంబోధించేవారు.
ఒకసారి కాదు అలా చాలాసార్లు రాశారు. సునీల్ దత్ ఆమెను అలా 'సిస్టర్-జోన్'లో ఉంచినందుకు, అప్పట్లో నజ్మాకు ఎలా అనిపించుంటుందో నాకు తెలీదు. కానీ, అది ఒక అమూల్యమైన లేఖ. దానిని ఆయన చక్కటి ఉర్దూలో రాశారు. అందులో కొన్ని పదాలకు ఆయన హిందీ పర్యాయపదాలు కూడా రాశారు.
తర్వాత మనం ధర్మేంద్ర రాసిన లేఖ దగ్గరికి వద్దాం.
ఆయన దాన్ని హిందీలో రాశారు. దానితోపాటూ తన ఫొటో కూడా పంపించారు. అది చదివితే, నజ్మా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాసినట్టు అనిపించింది.

ఫొటో సోర్స్, TWITTER/@SAMJAWED65
దానికి సమాధానంగా ఆయన "మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నాను. మీ లేఖ చూసి నా మనసు సంతోషంతో నాట్యం చేసింది. మీకు నా ఆటోగ్రాఫ్‌తో ఒక ఫొటో కూడా పంపిస్తున్నాను. ఇట్లు... మీ ధర్మేంద్ర" అని రాశారు.
ఆ లెటర్ చూడగానే అప్పట్లో నజ్మా మనసు ఎంత పులకించి పోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.

ఫొటో సోర్స్, TWITTER/@SAMJAWED65
నేను బయటపెట్టని లేఖల్లో తబస్సుమ్ నుంచి వచ్చిన ఒక లెటర్ కూడా ఉందని శామ్ జావేద్ చెప్పారు. "నిజానికి అది చాలా వ్యక్తిగతం, వారిద్దరి మధ్యా సుదీర్ఘంగా సాగుతున్న బంధం గురించి అది చెబుతుంది" అన్నారు.
నజ్మా రేడియో సిలోన్‌కు కూడా అభిమాని. ఆ రేడియో స్టేషన్ పెట్టే దాదాపు ప్రతి పోటీలో ఆమె పాల్గొనేవారు. కొన్నిట్లో గెలిచారు కూడా.
ఆమె కలెక్షన్‌లో భారత ప్రముఖ గాయనీగాయకులు ఆటోగ్రాఫ్ ఇచ్చిన కొన్ని పొటోలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఆమె రేడియో పోటీల్లో బహుమతిగా గెలుచుకున్నారు.
బుధవారం శామ్ ఆ లేఖలు పోస్ట్ చేసిన తర్వాత బాలీవుడ్ అభిమానులు వాటిని చదివి ఆశ్చర్యపోయారు.
వీరిలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా జోనస్ కూడా ఉన్నారు. వాటిని అప్‌లోడ్ చేసినందుకు ఆమె శామ్‌కు థాంక్స్ కూడా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఇది చాలా ప్రత్యేకం. ఆమె కలెక్షన్ అంతా చదువుతుంటే చాలా బాగా అనిపించింది. షేర్ చేసినందుకు థాంక్స్" అన్నారు.
ట్విటర్‌లో తన ట్వీట్లు వైరల్ కావడంతో నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ తనను సంప్రదించిందని, నజ్మా కలెక్షన్‌ను భద్రపరుస్తామని చెప్పిందని శామ్ చెప్పారు.
కానీ, తన తండ్రితో మాట్లాడిన తర్వాతే దాని గురించి ఒక నిర్ణయం తీసుకోగలనని ఆమె చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








