నాగాలాండ్ హింస: 70 ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ ఉద్యమ చరిత్ర ఏంటి?

నాగాలాండ్ హింస

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుబీర్ భౌమిక్
    • హోదా, కోల్‌కతా

నాగాలాండ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 14 మంది సామాన్య పౌరులు మృతి చెందడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాష్ట్రంలో నిరససలు వెల్లువెత్తుతుండటంతో వాటిని నియంత్రించడానికి ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతో పాటు అక్కడ కర్ఫ్యూను విధించారు.

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం ఈ హింసాత్మక ఘటన జరిగింది. కూలీలను తిరుగుబాటుదారులుగా పొరబడిన భారత గస్తీ దళం వారిపై కాల్పులు జరిపింది. ఇందులో ఆరుగురు మృతి చెందారు.

''గుర్తింపులో జరిగిన పొరపాటు''గా ఆర్మీ పేర్కొనగా, స్థానిక ప్రజలు ఆర్మీ వాదనను ఖండించారు.

ఆర్మీ చర్యతో కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు, అక్కడ మోహరించిన సైన్యంతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవానుతో పాటు ఏడుగురు సామాన్య పౌరులు మరణించారు. ఆదివారం మధ్యాహ్నం కూడా నిరసనకారులు, ఆర్మీ క్యాంపుపై దాడి చేయగా, ఒక పౌరుడు చనిపోయారు.

ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసు విచారణకు అత్యున్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)ను నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నాగాలాండ్ హింస

ఫొటో సోర్స్, CAISSI MAO

ఇటీవల కాలంలో అత్యంత హింసాత్మక ఘటన

నాగాలాండ్‌లో ఇటీవల సంవత్సరాలలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో తాజా ఘటన ఒకటిగా నిలిచింది.

నాగాలాండ్‌ సుదీర్ఘ కాలంగా తీవ్రవాదం, హింస వంటి అంశాలతో సతమతమవుతోంది.

అక్కడి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని భారత భద్రతా దళాలపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు.

వీడియో క్యాప్షన్, నాగాలాండ్‌: సైన్యం ఆపరేషన్‌లో 14 మంది గిరిజనుల మృతి

భారత ఆర్మీలో ఒక భాగమైన అస్సాం రైఫిల్స్ సైనికులు, శనివారం మయన్మార్‌తో సరిహద్దుల్లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ జరిపారు.

ఆ ప్రాంతంలో తీవ్రవాదుల కదలిక గురించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకే భద్రతా దళాలు సైనిక చర్యకు పూనుకున్నాయని భారత ఆర్మీ పేర్కొంది.

తీవ్రవాదులు తరచుగా భారత సైన్యంపై దాడి చేసి, ఆ తర్వాత మయన్మార్‌లోకి ప్రవేశించి తప్పించుకుంటారని ఆర్మీ వెల్లడించింది.

వారాంతంలో తమ కుటుంబంతో గడపడానికి వెళ్తోన్న బొగ్గు గని కార్మికులతో కూడిన వాహనంపై సైనికులు కాల్పులు జరిపారు.

ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే సైన్యం కాల్పులు జరిపిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమకు సహకరించకపోవడంతోనే తీవ్రవాదులుగా భావించి కాల్పులు జరిపినట్లు సైన్యం చెబుతోంది.

నాగాలాండ్ హింస

ఫొటో సోర్స్, Getty Images

'గుర్తింపులో జరిగిన పొరపాటు'

ఈ పొరపాటును 'తప్పుడు గుర్తింపు కేసు'గా ఆర్మీ పేర్కొంటోంది.

''ఇది నిజంగా తప్పుడు ఐడెంటిటీ కేసు. ఆదివారం స్థానిక మూక, ఆర్మీ శిబిరాన్ని తగలబెట్టినప్పుడు అందుకే బలగాలు సంయమనం పాటించాయి. వారిపై కాల్పులు జరపలేదు'' అని భద్రతా విశ్లేషకులు జైదీప్ సైకియా అన్నారు.

కానీ నిపుణులు మాత్రం... 'తప్పుడు గుర్తింపు' అనేది 'విశ్వసనీయ సమాచార లేమి'ని బయటపెట్టిందని పేర్కొంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి జరిపే ఆపరేషన్లపై కూడా ఇది సందేహాలను రేపుతోందని అంటున్నారు.

అమాయక పౌరులను చంపడం, గాయపర్చడం సైనికుల ఉద్దేశంగా స్పష్టంగా తెలిసినట్లు భద్రతా దళాలపై నాగాలాండ్ పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్కొన్నారు.

''ఇది చాలా భయంకరమైనది, దిగజారుడు చర్య. ఏఎఫ్ఎస్‌పీఏ చట్టం కింద భద్రతా దళాలకు లభించిన సార్వత్రిక రక్షణ అనేది ఈ సమస్యాత్మక ప్రాంతంలో న్యాయానికి ప్రధాన అడ్డంకిగా ఉంది'' అని ఈశాన్య భారతదేశం గురించి రాసిన సంజయ్ హజారికా అన్నారు.

వాస్తవానికి, ఏఎఫ్‌ఎస్‌పీఏ లేదా భద్రతాదళాల ప్రత్యేక అధికారాల చట్టం అనేది వివాదాస్పద చట్టం. దీని ప్రకారం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్య తీసుకునే హక్కు సాయుధ దళాలకు ఉంటుంది. సైనిక చర్య సందర్భంగా లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు సామన్యులు మరణిస్తే ఈ చట్టం ప్రకారం సైనికులకు మినహాయింపు ఉంటుంది.

'నకిలీ హత్యల'కు తావిస్తోందని, తరచుగా ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని విమర్శకులు పేర్కొంటున్నారు.

నాగాలాండ్ హింస

ఫొటో సోర్స్, CAISSI MAO

1950ల నుంచే పోరాటం

నాగాలాండ్‌లో 1950ల నుంచే సాయుధ పోరాటం జరుగుతోంది. నాగా ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతోంది. నాగాలాండ్‌కు పొరుగు రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు మయన్మార్‌లో నాగా ప్రజలు అధికంగా నివసిస్తోన్న ప్రాంతాలతో కలిసి ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

1975లో కుదిరిన ఒప్పందం అనంతరం, అతిపెద్ద తిరుగుబాటు సమూహం అయిన 'నాగా నేషనల్ కౌన్సిల్' ఆయుధాలు విడిచిపెట్టింది.

కానీ మరో గ్రూపు 'నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్) ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ప్రత్యేక ప్రాంతం కోసం పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. చైనా నుంచి శిక్షణ, ఆయుధాలను పొందిన యోధులు ఈ ఎన్‌ఎస్‌సీఎన్‌లో ఉన్నారు.

కానీ, 1997లో టి. ముయివా సారథ్యంలోని ఎన్‌ఎస్‌సీఎన్‌ గ్రూపునకు చెందిన కీలక వర్గం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించింది.

2015లో ఇరుపక్షాలు ఒక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం డిమాండ్‌పై చర్చల్లో అస్పష్టత నెలకొంది. ఎందుకంటే ఆ డిమాండ్లను అంగీకరించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు.

ఎన్‌ఎస్‌సీఎన్ వర్గానికి చెందిన తిరుగుబాటుదారుల గురించి భారత సైన్యం వెదుకుతోన్న సమయంలోనే శనివారం నాటి ఘటన జరిగింది. కేంద్రానికి, ముయివా వర్గానికి మధ్య జరిగిన చర్చలను ఈ వర్గం వ్యతిరేకిస్తోంది. మయన్మార్‌లోని సాంగిగ్ స్థావరం నుంచి ఈ వర్గం దాడులకు తెగబడుతోంది.

నాగాలాండ్ హింస

ఫొటో సోర్స్, AFP

మయన్మార్ సరిహద్దులో క్రియాశీలకంగా పలు తిరుగుబాటు గ్రూపులు

భారత్, మయన్మార్ మధ్య 1,643 కి.మీ దూరం ఉంటుంది. ఇది సుదీర్ఘ పరిమితిలాగే కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ భాగం పర్వతాలు ఉంటాయి. వీటికి రెండు వైపులా అనేక వేర్పాటువాద తిరుగుబాటు సమూహాలు స్థావరాలను ఏర్పరచుకున్నాయి.

అలాంటి సంస్థల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కూడా ఒకటి. ఇది మణిపూర్‌లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గతనెలలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై పీఎల్ఏ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఆర్మీ కల్నల్ ఆయన భార్య, మైనర్ కొడుకుతో పాటు నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

తమ కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత భద్రతా బలగాలు పట్టుదలగా ఉన్నాయని కొందరు అంటున్నారు.

తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి కాలం చెల్లిన పద్ధతులను ఆర్మీ అనుసరిస్తోందని కొందరు నమ్ముతున్నారు. బలవంతంగా భూభాగంపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని వారు భావిస్తున్నారు.

''విశ్వసనీయ రహస్య సమాచారాన్ని'' పొందడం కోసం ఆర్మీ, అక్కడి ప్రజల హృదయాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)