ఈటల రాజేందర్ భూ కబ్జా వాస్తవమేనన్న మెదక్ కలెక్టర్.. తమ భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటన్న జమున - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FACEBOOK/EATALA RAJENDER
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట శివారులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్ సుమారు 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ చెప్పినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ''జమున హేచరీస్ మొత్తం 56 మంది రైతుల భూములను కబ్జా చేయగా బాధితుల్లో 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒకరు ఓసీ వర్గానికి చెందినవారు ఉన్నారని మెదక్ జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఈ భూములను తిరిగి తమకు ఇప్పించాలని బాధిత రైతులు కోరినట్టు వెల్లడించారు. సోమవారం ఆయన మెదక్ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు.
మాసాయిపేట మండలం అచ్చంపేటలోని సర్వే నంబర్ 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేటలోని సర్వే నంబర్ 97లో మొత్తం 77.33 ఎకరాల సీలింగ్, అసైన్డ్ (ప్రభుత్వ) భూములను జమున హేచరీస్ కబ్జా చేసినట్టు వివరించారు.
అసైన్డ్ భూముల (బదిలీ, నిషేధ) చట్టం- 1977 నిబంధనలను ఉల్లంఘించి కబ్జాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. సదరు అసైన్డ్, సీలింగ్ భూముల్లో రోడ్లు వేసి, రైతులను వారి భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వెల్లడించారు.
కబ్జా వ్యవహారంపై గత ఏప్రిల్‌లోనే తమకు అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపినట్టు కలెక్టర్ తెలిపారు. అయితే, జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించడంతో ప్రాథమిక నివేదికతో సంబంధం లేకుండా డిటైల్డ్ సర్వే చేయాలని కోర్టు ఆదేశించిందని, కోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో విచారణ చేపట్టారని తెలిపారు.
ప్రాథమిక నివేదికలో 65 ఎకరాలు కబ్జా చేసినట్టు తేలిందని, డిటైల్డ్ సర్వే ప్రకారం కబ్జా విస్తీర్ణం 70.33 ఎకరాలుగా ఉన్నట్టు వెల్లడైందని వివరించారు.
కబ్జా చేసిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దపెద్ద పౌల్ట్రీ షెడ్లను నిర్మించారని తెలిపారు. వ్యవసాయేతర భూ మార్పిడి అనుమతులు పొందకుండా సర్వే నంబర్లు 78,81,130లో భారీ పౌల్ట్రీషెడ్‌లు, ప్లాట్‌ఫారాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారని వివరించారు.
హకీంపేటలోని సర్వే నంబర్ 111లో పౌల్ట్రీ ఫీడ్ నిల్వ చేయడానికి చేపట్టిన నిర్మాణం, అచ్చంపేటలోని సర్వే నంబర్ 130లో భారీ ఎత్తున పౌల్ట్రీ షెడ్ల నిర్మాణాలు, సర్వే నంబర్ 81లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధిత స్థానిక పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని కలెక్టర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.
కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుంది -ఈటల రాజేందర్ సతీమణి
జమునా హ్యాచరీస్ భూ కబ్జా వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మీడియా సమావేశంలో స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై ఈటల రాజేందర్ సతీమణి జమున స్పందించారు.
కలెక్టర్ టీఆర్ఎస్ కండువా కప్పుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. 70 ఎకరాలు ఆక్రమించుకున్నామంటోన్న కలెక్టర్‌పై ఖచ్చితంగా కేసులు పెడతామని హెచ్చరించారు.
''మా వ్యాపారాలకు అనుమతులు ఇవ్వదొద్దని పెద్దలు చెప్పారని అధికారులే అంటున్నారు. చాలా మంది మంత్రుల పౌల్ట్రీ ఫాంలకు పొల్యూషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా?. టీఆర్ఎస్‌లో ఈటల ఉన్నప్పుడు ఒకలా.. బయటకొచ్చినాక మరొకలా వ్యవహరిస్తున్నారు. మా భూముల్లో పెద్ద షెడ్డులు వేసుకుంటే తప్పేంటి?'' అని జమున ప్రశ్నించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను భవిష్యత్తులో ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

ఫొటో సోర్స్, YSRCP/FACE BOOK
విజయసాయి పీఏనంటూ వైసీపీ నేతకే టోకరా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఏనంటూ ఆ పార్టీ నేతకే టోకరా ఇచ్చాడో వ్యక్తి. బాధితుడు సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''పాతగుంటూరులోని లక్ష్మీనగర్‌కు చెందిన నాగం వెంకటమోహన్ వైసీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సంయుక్త కార్యదర్శి.
గతేడాది జూలైలో విశాఖపట్నంలోని ఎంపీ విజయసాయిరెడ్డి కార్యాలయానికి వెళ్లగా, అక్కడ జి.నాగేంద్రబాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రోగ్రామర్‌గా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటానని నాగేంద్రబాబు చెప్పడంతో మోహన్ అతని ఫోన్ నెంబరు తీసుకున్నారు.
'బ్యాక్‌లాగ్ పోస్టులు ఇప్పిస్తా.. తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి' అని నాగేంద్రబాబు ఆశ కల్పించడంతో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రమణ, మరో వ్యక్తికి ఆ ఉద్యోగాలు ఇప్పించాలని మోహన్ కోరారు.
ఇందుకోసం మూడు విడతల్లో రూ.2 లక్షలు నాగేంద్రబాబుకు ఇచ్చారు. తర్వాత ఉద్యోగం కోసం ఫోన్లు చేయగా 'మీ విషయం కలెక్టర్‌తో మాట్లాడాలి.. త్వరలోనే పని అయిపోతుంది' అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు.
ఆ తర్వాత ఆరు నెలలుగా ఫోన్ తీయకపోవడంతో మోహన్ విశాఖలోని విజయసాయిరెడ్డి కార్యాలయంలో ఆరా తీయగా ఆ పేరు కలిగిన వ్యక్తులు ఎవరూ లేరని సమాధానం వచ్చింది.
అంతలోనే అతనికి నాగేంద్రబాబు ఫోన్ చేసి.. 'నా గురించి ఆరా తీయాల్సిన అవసరం లేదు. నీ నుంచి తీసుకున్నది లక్షే. కొంచెం టైమ్ ఇస్తే ఆ మొత్తం ఇచ్చేస్తా. నా గురించి విచారించినా, ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటా' అని బెదిరించాడు.
నాగేంద్రబాబు ఫేస్‌బుక్, వాట్సప్ ఖాతాలకు ప్రొఫైల్ పిక్‌గా పోలీసు దుస్తులతో ఉన్న ఫొటో పెట్టుకున్నాడని కూడా ఎస్పీకి అందజేసిన ఫిర్యాదులో మోహన్ పేర్కొన్నట్లు'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
టీకా వేసుకున్న వారికే నెలజీతం, రేషన్ బియ్యం
కరోనా వ్యాక్సీన్ తీసుకున్న వారికి మాత్రమే రేషన్ బియ్యం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్లు చెబుతున్నట్లు ''వెలుగు'' పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ''బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్లే కుటుంబ సభ్యుడు.. తాను మాత్రం టీకా వేసుకున్నట్లు చూపెడితే సరిపోదు. ఇంట్లో వాళ్లందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని సర్టిఫికెట్లు చూపిస్తేనే బియ్యం ఇస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా టీకా తీస్కోకపోతే, అక్కడే టీకా వేయిస్తున్నారు. గత మూడ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లందరూ ఇదే ఫాలో అవుతున్నారు.
తమకు పైఅధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, ఆ మేరకే నడుచుకుంటున్నామని రేషన్ డీలర్లు చెబుతున్నారు.
మరోవైపు ఉద్యోగులు వ్యాక్సిన్ వేస్కుంటేనే వచ్చే నెల జీతం జమ చేస్తామంటూ వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు ఇంటర్నల్ సర్క్యులర్లు జారీ చేస్తున్నారు.
ఎవరైనా ఇతర కారణాల వల్ల వ్యాక్సిన్ వేయించుకోకపోతే, దానికి సంబంధించి డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తేవాలంటున్నారు.
తాజాగా టీకా వేస్కున్న ఉద్యోగులకే డిసెంబర్ జీతం ఇస్తామంటూ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎండీ సోమవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
కాగా, ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు మొదట్లోనే స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేశారు. అయితే చాలామంది వేయించుకోలేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే జీతం ఇస్తామని చెప్పడంతో టీకా కోసం ఉద్యోగులు పరుగులు పెడుతున్నట్లు'' వెలుగు కథనం పేర్కొంది.

ఇక '104' వైద్యసేవలుండవ్
పల్లె రోగులకు సేవలందించిన సంచార వైద్యవాహనం '104' సేవలను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని 'సాక్షి' వెల్లడించింది.
''గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అక్కడే నెలనెలా వైద్యపరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా మందులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం '104' వాహన సేవలను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రతినెలా 20వ తేదీ వరకు నిర్దేశిత గ్రామాల్లో ఈ వాహనాలు సంచరిస్తుంటాయి. ఆ సంచార వైద్యవాహనంలో వైద్యుడు, ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు.
ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ, అందులో పనిచేస్తున్న దాదాపు 1,250 మంది ఉద్యోగులను ఆ శాఖలోనే ఇతర పథకాల పరిధిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే అమలులో ఉన్న జీవనశైలి వ్యాధుల నివారణ పథకం ద్వారా ఇంటింటికీ మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు, త్వరలో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో '104'సేవలను నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారని'' సాక్షి కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- వానాకాలం ధాన్యం సేకరణ తెలంగాణలో 16 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 62 వేల మెట్రిక్ టన్నులు - కేంద్రం
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









