కరోనావైరస్: mRNA వ్యాక్సీన్ తీసుకుంటే సూపర్ హ్యూమన్ అయిపోతారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిమ్ స్మెడ్లీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఎంఆర్‌ఎన్‌ఏ (mRNA) వ్యాక్సీన్ల గురించి శాస్త్రీయ ప్రపంచంలో కొంత మందికి పరిచయం ఉంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అనా బ్లాక్‌నీ ఎంఆర్‌ఎన్ ఏ వ్యాక్సీన్ గురించి 2019లో ప్రసంగం ఇచ్చినప్పుడు, అది వినేందుకు హాజరైన సభ్యులను వేళ్ళ పై లెక్కించవచ్చు. కానీ, ఈ రోజు ఆమెకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆమె సైన్స్ కమ్యూనికేటర్ ప్రొఫైల్‌కు టిక్‌టాక్‌లో 2,53,000 మంది ఫాలోవర్లు, 37 లక్షల లైక్స్ ఉన్నాయి. ఒక తరంలో ఒక్కసారి మాత్రమే జరిగే శాస్త్రీయ అభివృద్ధి పరిణామ సందర్భంలో ఉన్నానని ఆమె అంగీకరిస్తారు. ఈ శకానికి ఆమె ఆర్‌ఎన్‌ఏఐసెన్స్ అనే పేరును పెట్టవచ్చని అంటారు. కోవిడ్ మహమ్మారి తర్వాత చాలా మందికి అనేక శాస్త్రీయ పదాలతో పరిచయం కలిగింది. వాటితో పాటు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్ గురించి కూడా చాలా మంది విని ఉంటారు. ఫైజర్ బయోఎన్‌టెక్, మోడర్నా తయారు చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్‌ను చాలా మంది తీసుకున్నారు కూడా. కానీ, బ్లాక్‌నీ 2016లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో పి.హెచ్‌డి తీసుకునే నాటికి "ఇదెప్పటికైనా పని చేస్తుందా అనే సందేహం చాలా మందికి ఉండేది". కానీ, ఎంఆర్‌ఎన్‌ఏ రంగం విస్తృతంగా పెరుగుతోంది. ఇది వైద్యరంగంలోనే ఒక కీలకమైన మార్పు తేబోతోంది" అని ఆమె చెప్పారు.
అయితే, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు క్యాన్సర్, హెచ్‌ఐవి, ఉష్ణప్రాంతాల్లో తలెత్తే అనేక రోగాలకు చికిత్సగా పని చేస్తాయా? వీటి వల్ల మనిషికి అపారమైన రోగ నిరోధక శక్తి చేకూరుతుందా? మెసెంజర్ రైబో న్యూక్లియక్ యాసిడ్‌ను కుదించి ఎంఆర్‌ఎన్‌ఏ అని పిలుస్తారు. ఒకే ఒక్క తీగలా ఉండే ఈ కణం డిఎన్‌ఏ నుంచి కణజాలంలోని ప్రోటీన్ తయారు చేసే యంత్రాంగానికి జెనెటిక్ కోడ్‌ను తీసుకుని వెళుతుంది. ఎంఆర్‌ఎన్‌ఏ లేకుండా, జెనెటిక్ కోడ్‌ను ఉపయోగించలేం. ప్రోటీన్లు తయారు కావు, శరీరం పని చేయదు. డిఎన్‌ఏ బ్యాంకు కార్డు అయితే, ఆర్‌ఎన్‌ఏ ఆ కార్డు రీడర్‌లా పని చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కసారి ఏదైనా వైరస్ కణజాలంలోకి చేరితే, అది సొంతంగా ఆర్‌ఎన్‌ఏను విడుదల చేస్తుంది. కణాల మీద దాడి చేసి వైరల్ ప్రొటీన్ల రూపంలో వైరస్ కాపీలను సృష్టిస్తుంది. దీంతో ఇది రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తుంది. నిర్జీవమైన వైరస్ ప్రోటీన్లు యాంటీజెన్లను శరీరంలోకి ఎక్కించడం ద్వారా సంప్రదాయ వ్యాక్సీన్లు పని చేస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్రేరేపించి వైరస్‌ను గుర్తించేలా చేస్తాయి. అయితే, ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్ల విషయానికొచ్చేసరికి యాంటీజెన్‌ను శరీరంలోకి పంపించాల్సిన అవసరం లేదు. అదే దీని ప్రత్యేకత. దానికి బదులు ఈ వ్యాక్సిన్లు ఎం ఆర్ ఎన్ ఏ గా మార్చిన యాంటీజెన్ జెనెటిక్ కోడ్‌ను వినియోగిస్తాయి. ఇది అసలైన వైరస్ మాయా రూపం. దాంతో సహజమైన యాంటీబాడీల తయారీకి శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. ఆ తర్వాత కృత్రిమ ఎంఆర్‌ఎన్‌ఏ శరీరంలో సహజంగా ఏర్పడిన ఎంజైముల ద్వారా మాయమైపోతుంది. దాంతో, శరీరంలో యాంటీబాడీలు మాత్రమే మిగులుతాయి. సంప్రదాయ వ్యాక్సిన్లతో పోలిస్తే వీటిని వేగంగా తయారు చేయవచ్చు. ఇవి సురక్షితం, చౌక. వీటి తయారీ కోసం కొన్ని లక్షల కోడిగుడ్ల పై ప్రమాదకరమైన వైరస్‌లను పెంచేందుకు భారీ బయో సురక్షిత ల్యాబ్‌ల అవసరం ఉండదు. యాంటీజెన్ ప్రోటీన్లను సీక్వెన్స్ చేసేందుకు ఒక్క ల్యాబ్ సరిపోతుంది. ఆ ప్రక్రియను ప్రపంచమంతటికీ ఒక్క ఈ-మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఆ సమాచారాన్ని ఉపయోగించి ఒక ల్యాబ్‌లో కొన్ని లక్షల డోసుల ఎంఆర్‌ఎన్‌ఏ ను 100 మిల్లీలీటర్ల టెస్ట్ ట్యూబ్ లో తయారు చేయవచ్చు" అని బ్లాక్ నీ చెప్పారు. ఈ ప్రక్రియ అంతా పని చేయడం ప్రస్తుతం కళ్లెదుటే చూస్తున్నాం. జనవరి 10, 2020లో చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లో జూనోసిస్ ప్రొఫెసర్ జాంగ్ యోంగ్‌జెన్ కోవిడ్-19 జీనోమ్‌ను సీక్వెన్స్ చేసి ఆ మరుసటి రోజే ప్రచురించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కోవిడ్-19 ను మహమ్మారిగా గుర్తిస్తూ ప్రకటన చేసింది. జాంగ్ తయారు చేసిన సీక్వెన్స్ ఆధారంగా మార్చి 16న ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్ తొలి దశ క్లినికల్ ట్రయిల్స్ మొదలయ్యాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఫైజర్, బయో ఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సీన్‌ను డిసెంబరు 11, 2020న ఆమోదించింది.
మనుషులకు ఇవ్వగలిగే తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ గా చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా, క్లినికల్ ట్రయల్స్‌లో 95శాతం సామర్ధ్యాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. డిసెంబరు 18 నాటికి మోడర్నా తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్‌కు కూడా ఆమోదం లభించింది. గతంలో చాలా తక్కువ కాలంలో పూర్తి చేశారని చెప్పిన గవద బిళ్ళల వ్యాక్సీన్ తయారీకి కూడా నాలుగేళ్లు పట్టింది. కానీ, మోడర్నా, ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సీన్ల తయారీకి కేవలం 11 నెలలే పట్టింది. ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సీన్ తయారీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వెనుక పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన కాటలిన్ కరికో, డ్రూ వీస్‌మన్ కృషి ఉంది. వీరిద్దరూ ఇటీవల 2021 లాస్కార్ అవార్డును కూడా పొందారు. ఇది అమెరికాలో బయో మెడికల్ రీసెర్చ్ రంగంలో ఇచ్చే అత్యున్నత బహుమతి. 2019లో కూడా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు విడుదల కావడానికి మరో ఐదేళ్లు పడుతుందని ఊహించారు. అయితే, కోవిడ్ మహమ్మారి దీని తయారీని వేగవంతం చేసి ఒక దశాబ్దం ముందే ప్రజలకు అందేలా చేసింది. "ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు 95 శాతం సమర్ధవంతంగా పని చేయగలవని ఎంఆర్‌ఎన్‌ఏ శాస్త్రీయ ప్రపంచంలో కూడా ఎవరూ ఊహించలేదు" అని కార్నెజీ మెలన్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ కాథరిన్ వైట్‌హెడ్ అన్నారు. అయితే, ప్రస్తుతం మాత్రం వీటి వల్ల సాధ్యమయ్యే పనులు చాలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇది వైరల్ గ్లైకో ప్రోటీన్‌గా పని చేయడంతో, దీంతో మరే ఇతర వ్యాక్సీన్లను తయారు చేయవచ్చు? దీనికి మించి మనమేం చేయవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
ఆర్ఎన్‌ఏ ప్రొటీన్ల గురించి పరిశోధన నిర్వహించేందుకు రోచెస్టర్ యూనివర్సిటీలో బయాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డ్రాగనీ ఫు పరిశోధన శాలకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నుంచి నిధులను జారీ చేశారు. ప్రస్తుతం మనం కోవిడ్ 19 కోసం ఎంఆర్‌ఎన్ ఏ వ్యాక్సీన్ 1.0ను చూస్తున్నాం. 2.0 విడుదల చేస్తే అది సార్స్, హెచ్‌ఐవి లాంటి వాటితో పోరాడేందుకు పని చేస్తుంది. కోవిడ్ కంటే ముందే హెచ్‌ఐవి కోసం ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లను తయారు చేసే పనిలో ఉన్నారు. వీటితో పాటు జికా, హెర్పెస్, మలేరియా వైరస్‌లకు కూడా ఇది పని చేయవచ్చని ఫు చెప్పారు. "అంతేకాకుండా ఆటో ఇమ్మ్యూన్ డిసీజెస్‌కు కూడా పని చేస్తుంది" అని ఆయన అన్నారు. "భవిష్యత్తులో ఎంఆర్‌ఎన్‌ఏతో చేసే చికిత్సలు వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఉదాహరణకు ఇన్ఫలమేషన్ తగ్గించేందుకు ఇవి బాగా పని చేయవచ్చు. దాంతో, ఇది మరిన్ని రోగాలకు చికిత్స సాధ్యం అవ్వచ్చు" అని అన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏ శరీరంలోకి చేరగానే నాశనం కాకుండా ఉండేందుకు లిపిడ్‌లు అవసరమవుతాయి. లిపిడ్‌లను అన్‌సంగ్ హీరోస్ అని అంటారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన యిజౌ డాంగ్ లిపిడ్ పరిశోధనల్లో నిపుణులు. 2018లో ఈ లిపిడ్ డెలివెరీలో నైపుణ్యం సంపాదించి 2018లో ఆమోదం పొంది ఉండకపోతే, 2020 నాటికి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చి ఉండేవి కావు. "కొత్త లిపిడ్ డెలివెరీ మెళకువలను ఎంఆర్‌ఎన్‌ఏ తో మేళవించడం వల్ల జన్యుపరమైన లోపాలు, క్యాన్సర్ ఇమ్మ్యునోథెరపీ, ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు పని చేస్తాయేమో తెలుసుకునేందుకు కోవిడ్ 19 కంటే ముందు చాలా అధ్యయనాలు జరిగాయి" అని డాంగ్ చెప్పారు . యాంటీజెన్ ఉంటూ ప్రోటీన్‌ను సీక్వెన్స్ చేయగలిగితే, ఇది సైద్ధాంతికంగా పని చేస్తుంది. లిపిడ్ డెలివెరీ, ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ , వ్యాక్సీన్లు , చికిత్సల్లో చోటు చేసుకున్న అభివృద్ధి వల్ల బయో ఎంఆర్‌ఎన్‌ఏ థెరపీ సిస్టిక్ ఫైబ్రోసిస్, సెలోరోసిస్, ఆంకాలజీ, గిలీడ్ సైన్సెస్ హెచ్‌ఐవి, గుండె జబ్బులకు కూడా చికిత్సగా పని చేసే అవకాశం ఉంది. జర్మన్ స్టార్ట్‌అప్ ఎత్రిస్ ఆస్ట్రాజెనెకాతో కలిసి తీవ్రమైన శ్వాసకోశ రోగాలకు, ఉబ్బసానికి ఎంఆర్‌ఎన్‌ఏ థెరపీలను అభివృద్ధి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉష్ణప్రాంతాల్లో తలెత్తే రోగాలకు కూడా కొన్ని పరిష్కారాలను కూడా వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జికా, చికన్ గినియా లాంటి వాటికి కూడా మోడర్నా రెండవ దశ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయి. ప్రపంచంలో పేద జనాభా ఎక్కువగా ఈ రోగాలకు గురవుతూ ఉంటారు. అయితే, ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి ఈ వ్యాధులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫ్లూ (జలుబు) కోసం తయారు చేసిన వ్యాక్సీన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది" ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంగా 290,000 - 650,000 మరణాలు చోటు చేసుకుంటున్నాయి. "భవిష్యత్తులో ఇన్ఫ్లుయెంజా కు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు వచ్చే అవకాశముంది" అని వైట్ హెడ్ చెప్పారు. వీటిని కొన్నేళ్లుగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్ ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా (ఏ) కోసం అయిదు క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా, అందులో ఒకటి ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. క్యాన్సర్ చికిత్స కోసం కూడా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్లు పని చేస్తాయేమోనని అనేక ఔషధ తయారీ సంస్థలు పరిశీలిస్తున్నాయి. "క్యాన్సర్ కణాల ఉపరితలం పై కొన్ని మరకాలుంటాయి. ఇలాంటి మరకలు మిగిలిన కణాలకు ఉండవు" అని బ్లాక్ నీ అన్నారు. "శరీరంలోని ఆ కణాలను గుర్తించి నాశనం చేసేందుకు రోగనిరోధక శక్తికి శిక్షణ ఇవ్వవచ్చు. ట్యూమర్ కణాల పై ఏ విధమైన ప్రోటీన్లు ఉన్నాయో గుర్తించి దానిని వ్యాక్సీన్ గా వాడవచ్చు" అని చెప్పారు. "ఈ పరిశోధనలో ట్యూమర్‌ను బయటకు తీసి, దానిని సీక్వెన్స్ చేసి, దాని ఉపరితలం పై ఏముందో కనిపెట్టి, ప్రత్యేకంగా వ్యాక్సీన్లను తయారు చేయవచ్చు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంఆర్‌ఎన్‌ఏ 2.0 ద్వారా క్యాన్సర్, హెచ్‌ఐవి, ఇతర రోగాలకు చికిత్సను గనక అందుబాటులోకి తెస్తే, ఇక 3.0 తో మరిన్ని రోగాలకు చికిత్స సాధ్యం కావచ్చు. అయితే, శరీరం యాంటీ బయోటిక్‌లకు స్పందించే గుణాన్ని కోల్పోతుందేమో ఆందోళన కూడా ఆధునిక వైద్యానికుంది. "అయితే, సి డిఫిసిల్ లాంటి బ్యాక్టీరియా యాంటీజెన్‌తో పోరాడేందుకు వ్యాక్సీన్ తయారు చేసే ఆలోచన కూడా చేయవచ్చు" అని బ్లాక్‌నీ అంటారు. అయితే, వీటి గురించి ఇంకా ట్రయల్స్ మొదలవ్వలేదు. వీటి ద్వారా అనేక సాధారణ రోగాలకు కూడా చికిత్స చేసే అవకాశాలను పరిశీలించవచ్చు. ఆసియా ప్రాంతాల్లో చాలా మందికి ఉండే లాక్టోజ్ ఇంటోలెరన్స్ లాంటి వాటికి కూడా చికిత్సను కనిపెట్టవచ్చని ఫు అంటారు. "లాక్టోస్‌ను విడగొట్టే ప్రోటీన్‌ను తెలుసుకోలేకపోతున్నాను. భవిష్యత్తులో దీనిని ఎవరైనా కనిపెట్టవచ్చు. ఇది ప్రాణాలకు ముప్పు కలిగించే సమస్య కాదు. కానీ, ఇది కూడా జరుగుతుందని ఊహిస్తున్నాను" అని అన్నారు. పిసిఎస్‌కె 9 అనే ప్రోటీన్ అధికస్థాయిలో ఉండే వారికి కొలెస్టరాల్ శాతం అధికంగా ఉండి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి ఎలుకల పై ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో 95 శాతం ప్రోటీన్ స్థాయిలను తగ్గించవచ్చని తేలిందని డాంగ్ చెప్పారు. ఇది ఈ పరిశోధన ముందుకు సాగేందుకు సరైన సూచన అని అన్నారు. అయితే, ఎంఆర్‌ఎన్‌ఏ అపారమైన రోగ నిరోధక శక్తిని అందిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే ఈ వ్యాక్సీన్ల వాడకం వల్ల శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి అత్యధికంగా జరిగినట్లు కోవిడ్ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్ల వల్ల తెలిసింది. ఇవి కోవిడ్-19 లో చాలా రకాల వేరియంట్‌లను తటస్థం చేయగలిగినట్లు తెలిసింది. కొన్ని రకాల ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను కలిపి ఒకే ఒక్క సింగిల్ బూస్టర్ వ్యాక్సీన్ ఇచ్చేందుకు కూడా వాడవచ్చని చెబుతున్నారు. ఇది క్యాన్సర్, వైరస్‌లను ఒకే సారి హతం చేస్తుందని అంటున్నారు. అయితే, ఇప్పటికి ఇది కేవలం ఊహ మాత్రమే. వీటి గురించి చాలా ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ, వీటి పై చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం మనకు బూస్టర్ షాట్లు అవసరముంది. వీటి వల్ల అరచేతికి హాని కలగవచ్చు. ఒక్కొక్కసారి వీటి వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. అమెరికాలో ప్రతీ 10 లక్షల మందిలో 2-5 మందికి ప్రతికూల ప్రభావాలు కనిపించినట్లు తెలిసింది. "అలాగే, యాంటీబాడీలు, కణజాల పనితీరు ఎంత కాలం ప్రభావవంతంగా ఉంటుందో కూడా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని బ్లాక్‌నీ అన్నారు. "ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్ల ద్వారా టీ-కణాల ప్రతిస్పందన సానుకూలంగానే ఉన్నట్లు సూచనలున్నాయి. కానీ, ఈ ట్రయల్స్ కేవలం ఒకటిన్నర ఏడాది పాతవి మాత్రమే కావడంతో, రోగ నిరోధక శక్తి ఎన్ని రోజులుంటుందనే విషయం పై పెద్దగా అవగాహన లేదు. చాలా మంది ప్రతీ ఏడాది వ్యాక్సీన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపరు" అని అన్నారు. అయితే, ఈ ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టేందుకు బ్లాక్‌నీ పరిశోధన శాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫు, డాంగ్ , వైట్ హెడ్, బ్లాక్‌నీ ఆర్‌ఎన్‌ఐసెన్స్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. "టిక్ టాక్ వీడియోల ద్వారా వ్యాక్సీన్ల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడమే నా లక్ష్యం" అని బ్లాక్‌నీ అన్నారు. " నీ వల్లే నేను నా భాగస్వామి వ్యాక్సీన్ పొందగలిగాం" అని అంటూ చాలా మంది సందేశాలు పంపిస్తూ ఉంటారు. "ఆ మాటలు నన్ను ప్రభావితం చేస్తాయి" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పు రూ. 1,10,010 కోట్లు - ప్రెస్ రివ్యూ
- చైనీస్ ఫుడ్: '8,000 రెస్టారెంట్లలో ఆహారం రుచి చూశాక నాకు తెలిసిందేంటంటే...'
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








