కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికీ స్క్రీనింగ్.. లక్షణాలుంటే పరీక్ష - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రమంతా జల్లెడ పట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని.. ప్రతి ఇంటికీ వెళ్లి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ 'స్ర్కీనింగ్' చేయాలని తీర్మానించిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ సందర్భంగా కుటుంబంలోని వారి ఆరోగ్య సమాచారాన్ని మొత్తం సేకరిస్తారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నట్లు తేలితే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. 90 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 'స్ర్కీనింగ్' పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
కొవిడ్ నివారణపై సోమవారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈసమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
''వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్నీ పూర్తిస్థాయిలో స్ర్కీనింగ్ చేయాలి. 104 వాహనాల ద్వారా తిరుగుతూ.. అనుమానం ఉన్నవారి నుంచి శాంపిల్స్ తీసుకోవాలి. కరోనా వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్న మధుమేహం, బీపీలాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు కూడా ఇవ్వాలి. ప్రతి నెల కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్య సేవలు, స్ర్కీనింగ్ జరిగేలా చూడాలి. ఆ వివరాలను వ్యక్తిగతంగా క్యూఆర్ కోడ్‌లో ఆరోగ్య కార్డులో పొందుపరచాలి'' అని ముఖ్యమంత్రి ఆదేశించారు. జ్వరాలు ఎక్కువగా ఉండే వర్షాకాలమంతా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్దేశించారు.

తెలంగాణ: 'బీమా చేయించి మరీ భర్తను హత్యచేసిన భార్య'
''మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడు.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విసిగి వేసారిన భార్య అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. అయితే.. కుటుంబ పెద్దను హత్య చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించిన ఆమె.. రూ. 20 లక్షలకు బీమా చేయించి మరీ ఘాతుకానికి పాల్పడింది'' అని పోలీసులు తెలిపినట్లు సాక్షి ఒక కథనంలో వివరించింది.
సాక్షి కథనం ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగిన ఈ హత్యా ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
పోలీసులు చెప్పినదాని ప్రకారం.. పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న భార్యతో కలసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దోబీగా పనిచేసేవాడు. లాక్‌డౌన్‌తో పాఠశాలను మూసివేయగా ఖాళీ మద్యం సీసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన వీరన్న భార్యను వేధించడం.. కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదు. దీంతో యాకమ్మ భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు చెన్నారావుపేటలో నివాసం ఉండే వీరన్న సోదరి, బావల సహకారం కోరింది. వారు అంగీకరించడంతో అందరూ కలసి హత్యకు పథక రచన చేశారు.
తొలుత గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ.20 లక్షలకు వీరన్న పేరిట బీమా చేయించారు. తర్వాత ఈ నెల 19వ తేదీన నెక్కొండ ప్రాంతంలో సైకిల్‌పై ఖాళీ మద్యం సీసాలను విక్రయించేందుకు వీరన్న వెళ్లగా.. ఆ సమాచారాన్ని తన బావకు అందజేసింది. అతడు సాయంత్రం నెక్కొండలో వీరన్నను కలిసి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని హత్యాతండాకు బయలుదేరాడు. మధ్యలో మద్యం తాగి తమ వ్యవసాయ భూమి వద్దకు రాత్రి 11.45 గంటలకు తీసుకెళ్లాడు.
అప్పటికే వీరన్న భార్య, సోదరి బుజ్జి అక్కడ ఉన్నారు. అందరూ కలసి వీరన్నకు తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బతికి ఉన్నాడన్న అనుమానంతో ముఖంపై బండరాయితో కొట్టి పక్కనే ఉన్న కెనాల్‌లో పడేశారు. అనంతరం మిగతావాళ్లు వెళ్లిపోగా.. హతుడి భార్య తన భర్తను ఎవరో హత్య చేశారని నటించడం మొదలు పెట్టింది.
ఈ కేసులో పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ పి.కిషన్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా అనుమానం రావడంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ హత్య తామే చేశామని వారు అంగీకరించారు. దీంతో నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మామూనూర్ ఏసీపీ శ్యాంసుందర్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు ప్రశాంత బాబు, నర్సింగరావు, సురేష్‌తో పాటు, కానిస్టేబుళ్లను సీపీ రవీందర్ అభినందించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్లాస్మా దాత ముసుగులో ఢిల్లీ స్పీకర్‌కే టోకరా!
అతగాడు ఒక మోసగాడు! తానొక వైద్యుడిని అని చెప్పుకుంటాడు! తనకు కరోనా వచ్చి తగ్గిందని చెబుతాడు! అవసరమైన వారికి తాను ప్లాస్మా దానం చేస్తానని నమ్మబలుకుతాడు! ప్లాస్మా కోసం ఎవరైనా సంప్రదిస్తే.. ప్రయాణ ఖర్చులకు తన ఖాతాలో పైసలు వేయమంటాడు! ఒక్కసారి ఖాతాలో పైసలు పడ్డాయంటే ఖతం అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది! బాధితులకు మోసపోయామని గ్రహిస్తారు! ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎంతో మందిని అతడు మోసం చేశాడు.
అబ్దుల్ కరీం రానా అనే యువకుడు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుడిగా, ప్లాస్మా దాతగా చెప్పుకుంటూ పలువురిని మోసం చేశాడని.. ఆఖరికి ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ సైతం ఇతడి వలలో పడ్డారని పోలీసులు వెల్లడించినట్లు 'నవ తెలంగాణ' ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. తనకు ఇటీవల కరోనా వచ్చి తగ్గిందని, ప్లాస్మా దానం చేస్తానని చెబుతూ.. సోషల్ మీడియాలో ప్లాస్మా దాతల కోసం వెతికే వారే లక్ష్యంగా కరీం రానా మోసాలకు పాల్పడ్డాడు. ప్రయాణ ఖర్చుల పేరుతో పలువురి నుంచి పైసలు గుంజి పత్తాలేకుండా పోయేవాడు.
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్‌ను కూడా కరీం రానా మోసం చేశాడు. తన బంధువుకు ప్లాస్మా చికిత్స చేయించడం కోసం కరీం రానాను సంప్రదించిన స్పీకర్.. అతడు రవాణా ఖర్చులకు డబ్బు వసూలు చేసి ముఖం చాటేయడంతో ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్పీకర్ ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు కరీం రానాను అరెస్ట్ చేశారు. అతను ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేశాడనే వివరాలను రాబడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు? ః
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది? దలైలామాకు ఆశ్రయమిచ్చిన భారత్.. చైనా వాదనకు అంగీకరించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








