జగన్: 'ప్రతి కుటుంబానికీ మేలు జరిగేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో' -ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, www.ysrcongress.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన తొలి సంతకాలకే దిక్కు లేకుండా పోయిందని, అలాంటి వ్యక్తి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తారా అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారని సాక్షి తెలిపింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, అనంతపురం జిల్లా రాయదుర్గం, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో బహిరంగ సభల్లో ప్రసంగించారు.
చంద్రబాబు ప్రజల భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచన చేసేవారే అయితే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేవారా, ప్యాకేజీకి ఒప్పుకునేవారా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేవారా, కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును లాక్కునేవారా, మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములు, దళితుల భూములు, గుడి భూములు దోచుకునేవారా అని జగన్ ప్రశ్నించారు.
ప్రజల బాగోగుల గురించి చంద్రబాబు ఆలోచించేవారే అయితే ఆరోగ్యశ్రీని నీరుగార్చేవారా, రాష్ట్రంలో స్కూళ్లను, ఆసుపత్రులను తన మనుషులకు అప్పగించేవారా అని ఆయన అడిగారు.
నాలుగైదు రోజుల్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ మేలు జరిగేలా ఇది ఉంటుందని జగన్ చెప్పారు.
కేసీఆర్‌కు దమ్ముంటే ఖమ్మం నుంచి పోటీచేయాలి: షబ్బీర్ అలీ
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, inctelangana.in
‘‘ఖమ్మం జిల్లా ప్రజల అభిప్రాయాన్ని కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నావు. నీకు దమ్ముంటే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయ్. ప్రజాభిప్రాయమేంటో తెలుస్తుంది'' అని కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం హైదరాబాద్ కాంగ్రెస్ భవన్‌లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు, కార్పొరేషన్ పదవులు, వీలైతే మంత్రి పదవి ఆశ చూపి కేసీఆర్ టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ‘ఫెడరల్ ఫ్రంట్’ అన్న కేసీఆర్... పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి జాతీయ పార్టీ స్థాపిస్తానని అంటున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీని తిట్టే కేసీఆర్.. దిల్లీ వెళ్లి ఆయన కాళ్లు పట్టుకుంటారని ఆరోపించారు.
చంద్రబాబు అహంభావి: కేటీఆర్
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహంభావి అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Taraka Rama Rao - KTR
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కింద పనిచేశారని చంద్రబాబు అనటంలోనే అహంభావం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఎవరూ ఎవరికీ బానిసలు కాదు. మనది ప్రజాస్వామ్యం. సీఎం కింద మంత్రులు పనిచేయరు.. సీఎంతో కలిసే మంత్రిమండలి పనిచేస్తుంది. ఆ ఇంగితం లేకపోతే ఆయన ఖర్మ’’ అని వ్యాఖ్యానించారు.
సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణభవన్‌లో మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఏపీ రాజకీయాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదన్న కేటీఆర్.. ఏపీ ఎన్నికల్లో జోక్యంచేసుకోబోమని స్పష్టంచేశారు. చెప్పుకోవటానికి చేసిందేమీలేక.. చంద్రబాబు తమపై పడి ఏడుస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు చంద్రబాబును ఇంటికి పంపటం ఖాయమని తమకు సమాచారం ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికపై కాంగ్రెస్ నాయకుల విమర్శలను కేటీఆర్ తప్పుబట్టారు. ‘‘ఈ రోజు అరుస్తున్న గొంతులు.. మా పార్టీ వారిని చేర్చుకున్నప్పుడు ఎక్కడికిపోయాయి? కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించారా? మా పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకుపోయారు. మీకో నీతి, మాకో నీతా’’ అని ప్రశ్నించారు.
సైబర్ మోసాలపై రూ.50 వేల బీమా
సైబర్ మోసాలపై బీమా కవరేజీ అందించేందుకు వీలుగా ఐసీఐసీఐ లాంబార్డ్, మొబిక్విక్ సంస్థలు చేతులు కలిపాయని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు 50 వేల రూపాయల బీమా కవరేజీని అందించడం కోసం ఈ రెండు సంస్థలు భాగస్వాములయ్యాయి.
బ్యాంకు ఖాతాలు, డెబిట్/క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లను వినియోగించుకుని ఆన్‌లైన్‌లో జరిగే మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే సైబర్ బీమాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. యాప్ ద్వారా నెలకు 99 రూపాయల చొప్పున చెల్లించి 50 వేల రూపాయల మొత్తానికి సైబర్ బీమా తీసుకోవచ్చని తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- మొబైల్ డేటా: ప్రపంచంలో అత్యంత చౌక భారతదేశంలోనే... మున్ముందు ధరలు పెరిగిపోతాయా...
- జనసేన పార్టీ అభ్యర్థుల తాజా జాబితా
- లోక్‌సభ ఎన్నికలు... ముఖ్యమైన తేదీలు 8 చార్టుల్లో..
- 'ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తా' -కేసీఆర్
- న్యూజీలాండ్‌లో మసీదులపై 'ఉగ్రవాద దాడి', 49 మంది మృతి, వీరిలో ఒకరు హైదరాబాదీ
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- మీ కంప్యూటర్‌పై కేంద్రం కన్నేస్తోందా? ఇందులో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








