సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు

రఘురామకృష్ణం రాజు

ఫొటో సోర్స్, Raghurama krishnam raju/fb

ఆంధ్రప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ల కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు రకరకాల సమీకరణాలతో పార్టీలు మారుతున్నారు. ఇలా పార్టీలో మారిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త కనుమూరి రఘురామ కృష్ణం రాజు ఒకరు.

ఐదేళ్లలో ఆయన నాలుగు పార్టీలు మారారు. కాంగ్రెస్ మినహాయిస్తే ఏపీలో అన్ని ప్రధాన పార్టీల కండువాలను ఆయన కప్పుకున్నారు.

ఇటీవల టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన తాజాగా వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

2014 ఎన్నికల్లో ఆయన మొదట వైసీపీ‌లో చేరారు. ఆ తరువాత పార్టీ మారుతూ వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. ఆయనది విభజన రాగమని ఆరోపించారు. అందులో భాగం కాకూడదనే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు.

రఘురామకృష్ణం రాజు

ఫొటో సోర్స్, ugc

ఆ తర్వాత ఆయన బీజేపీలోకి జంప్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆ పార్టీని వీడారు.

మే 2018లో ఆయన టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు కింద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన గౌరవాన్ని కాపాడతానని చెప్పారు.

ఇప్పుడు ఆయన మళ్లీ వైసీపీకి వచ్చారు. విభజన హామీలు నెరవేర్చే సత్తా కేవలం వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని అన్నారు. ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. జగన్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందని తెలిపారు.

చలమలశెట్టి సునీల్

ఫొటో సోర్స్, Sunil/fb

‘ఓడినా వైసీపీలోనే ఉంటా... చంద్రబాబుతోనే అభివృద్ధి’

కాకినాడకు చెందిన పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్ కూడా ఇదే తరహాలో పార్టీలు మారారు.

2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. కాకినాడ పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పల్లం రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో వైసీపీలోకి మారారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు.

తర్వాత వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అన్నింటా అభివృద్ధి చెందుతోందని అన్నారు. బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పారు.

గత ఎన్నికల్లో ఓడిపోతానని సర్వేలు వెలువడినప్పటికీ వైసీపీలోనే ఉన్నానని, రాజకీయాల్లో విలువలతో ఉండాలనే ఆ పార్టీలో కొనసాగానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)