వానాకాలం ధాన్యం సేకరణ తెలంగాణలో 16 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 62 వేల మెట్రిక్ టన్నులు - కేంద్ర ప్రభుత్వం : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/trspartyonline
ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) ధాన్యం సేకరణకు సంబంధించి పంజాబ్, హరియాణాల తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ధాన్యం సేకరించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించిందని సాక్షి సహా ప్రధాన పత్రికలు పేర్కొన్నాయి.
నవంబర్ 30వ తేదీ వరకు తెలంగాణలో 16.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీని విలువ రూ. 3,163.40 కోట్లుగా ఉందని కేంద్రం తెలిపింది.
దీనిద్వారా 2.27 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొంది.
అత్యధికంగా పంజాబ్‌లో 9.24 లక్షల మంది రైతుల నుంచి రూ. 36,623 కోట్ల విలువైన 1.86 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, హరియాణలో 3 లక్షల మంది రైతుల నుంచి రూ. 10,839 కోట్ల విలువైన 55.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపింది.
ఏపీలో 62,266 మెట్రిక్ టన్నులే..
ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4,455 మంది రైతుల నుంచి రూ. 122 కోట్ల విలువైన 62,266 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించినట్లు వివరించింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరణ కార్యక్రమం సజావుగా సాగుతోందని వెల్లడించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యం మొత్తం 2.90 కోట్ల మెట్రిక్ టన్నులు ఉండగా, కనీస మద్దతు ధరగా రూ. 57,032.03 కోట్లు చెల్లించినట్లు కేంద్రం తెలిపింది.

కొనుగోలు కేంద్రం వద్ద రైతుకు గుండెపోటు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
''ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్దిపడగ గ్రామానికి చెందిన వడ్లూరి రాములు(42) అదే గ్రామంలో మరో వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
గ్రామంలో పాలమాకుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 10 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చాడు.
ధాన్యంలో తేమ శాతం రావడం కోసం రోజూ ఆరబెడుతూ అక్కడే ఉండిపోయాడు. గురువారం సాయంత్రం అతడి సీరియల్ నంబర్ రావడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అతనికి బార్దాన్ సంచులు ఇచ్చి ధాన్యం నింపాలని చెప్పారు.
ఆరబోసిన ధాన్యాన్ని దగ్గరికి చేసి నింపుతున్న క్రమంలో రాములుకు చాతీలో నొప్పి వచ్చింది. కొద్దిసేపటికి తేరుకుని మళ్లీ పనుల్లో నిమగ్నం కాగా గుండెపోటు వచ్చింది.
వెంటనే 108 అంబులెన్స్‌లో రాములును చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాములుకు భార్య లతతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నట్లు 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ వేలమూ హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు కాసుల వర్షం కురిపిస్తోందని 'ఈనాడు' తెలిపింది.
''తొలిరోజు ఈ-వేలంలో అధికారుల అంచానాలను దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతం కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి.
రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01 లక్షల రికార్డు ధర పలికాయి.
ఒక ప్లాటును కనిష్టంగా రూ. 53 వేలకు పాడారు. చదరపు గజానికి రూ. 35వేల నిర్ధారిత ధర ఉండగా... ఉదయం సెషన్లో ఓ ప్లాట్ అత్యధికంగా చదరపు గజానికి రూ. 77 వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ. 1.01 లక్షల ధరలు పలికాయి. సగటున గజానికి రూ. 71,815 ధర వచ్చింది.
మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది.
ప్రవాసీయులుతో పాటు స్థానిక రియాల్టర్లు నువ్వా నేనా అన్నట్లుగా ధరలు పెంచుకుంటూ పోయారు.
తొలిరోజు 19వేల చదరపు గజాల వేలంలో రూ. 141.61 కోట్లు రాగా, శుక్రవారం మిగిలిఉన్న 1.15 లక్షల చ. గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ. 60 వేల దాకా వచ్చినా సుమారు రూ. 900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ భగాయత్ భూముల వేలం రెండో దశలో గరిష్టంగా చదరపు గజానికి రూ. 79 వేలు, కనిష్టంగా రూ. 30 వేలు పలకగా.... ఈ సారి అనూహ్యంగా చదరపు గజం రూ. లక్షను దాటిందని 'ఈనాడు' తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతుండటం, ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు కోరినట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.
''మాస్క్ పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా వేయాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని పోలీస్‌శాఖను కోరినట్టు చెప్పారు. శ్రీనివాసరావు గురువారం మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 11 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
అదనంగా ఇతర దేశాల నుంచి వచ్చేవారిలో 2 శాతం మంది శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరుపుతున్నామని తెలిపారు.
బుధవారం బ్రిటన్, సింగపూర్ నుంచి వచ్చిన 325 మందికి పరీక్షలు చేయగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏండ్ల మహిళకు పాజిటివ్ రావటంతో టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపామని, నివేదిక వచ్చిన తర్వాతే డెల్టా వేరియంటా? ఒమిక్రాన్ వేరియంటా? అనేది తేలుతుందని పేర్కొన్నారు.
వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయని నిరూపణ అయిన నేపథ్యంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా గడువు పూర్తయినా రెండో డోస్ టీకా తీసుకోలేదని, వీరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
అన్నిరకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలని సూచించారు.
రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని పేర్కొన్నారు. ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి, కొత్త వేరియంట్ తయారుకాదని శ్రీనివాసరావు అన్నట్లు 'నమస్తే తెలంగాణ' రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, UGC
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నట్లు 'సాక్షి' కథనం తెలిపింది.
''డిసెంబర్ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2014-15 నుంచి 2018-19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా... ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది.
ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి.
సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్‌సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది.
దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు.
ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు.
ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి.
ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది.
ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కినట్లు 'సాక్షి' వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్‌రివ్యూ
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








