'చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కుప్పకూలింది' -ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు మూడో విడతలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అభిమానులకే మెజారిటీ సర్పంచ్ పీఠాలు దక్కాయని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గుడ్‌బై చెప్పారంటూ సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
కుప్పం నియోజక వర్గంలో 89 పంచాయితీలుండగా, అందులో 74 చోట్ల వైసీపీ అభిమానులు గెలిచారని, టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒకచోట గెలుపొందారని ఈ కథనం వెల్లడించింది.
గుంటూరు జిల్లాలో మూడో విడతలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 78 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. లెక్కింపు అనంతరం ఈ మూడు స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలిచారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలకు గాను 85లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రెండు విడతల్లో మాదిరే బుధవారం మూడో విడతలోనూ పల్లె ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టారని సాక్షి కథనం తెలిపింది.
మూడో విడతలోనూ 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుచుకున్నారని ఈ కథనం వెల్లడించింది.
''చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెదేపా కుప్పకూలింది. 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అధికారంలోకి 18 నెలలైనా ఏమీ చేయలేకపోయారంటూ ముఖ్యమంత్రిపై ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేశ్ లకు కుప్పం పరిధిలోని పంచాయతీ ఫలితాలు చెంపపెట్టు'' అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పేర్కొంది.
''మూడు విడతల ఎన్నికల్లో వైసీపీకి 90శాతం అనుకూలంగా ఫలితాలు వచ్చాయి'' అని మంత్రి బొత్స వ్యాఖ్యానించినట్లు ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, YSRCPARTY
'విశాఖ ఉక్కుపై మనకు అధికారం లేదు'
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ సంస్థ అని.. దానిపై రాష్ట్రానికి ఎటువంటి అధికారం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
అందరూ కోరుతున్నట్లుగానే ప్రతిపక్షంతో కలిసి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేస్తామని హామీ సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.
శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొనడానికి బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాడుతున్న అఖిలపక్ష నాయకులతో విమానాశ్రయంలోనే సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో... సీపీఎం, సీపీఐ, సీఐటీయూ తదితర సంఘాల నాయకులు పలు డిమాండ్లు సీఎం ముందుంచారు.
కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని కార్మిక నాయకులు కోరారు. గతంలో కొన్ని బ్లాకులు కేటాయించారని, వాటిని రెన్యువల్ చేయాల్సి ఉందని, ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఎన్‌ఎండీసీలో విలీనం చేయాలని ఇంకొందరు.. పోస్కోను విశాఖలో అడుగుపెట్టనివ్వొద్దని మరికొందరు కోరారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీకి రాసిన లేఖను చూపించారు. ‘‘విశాఖ కర్మాగారానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. నిరుపయోగంగా ఉన్న భూములను లేఅవుట్లుగా వేసి విక్రయించాలి. అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. వాటిని ప్లాంట్‌లో పెట్టుబడులుగా పెడితే సమస్యలన్నీ తీరిపోతాయని భావిస్తున్నాను’’ అని అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

షర్మిల సలహాదారులుగా మాజీ ఉన్నతాధికారులు
తెలంగాణలో పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న వై.ఎస్. షర్మిల మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కుమార్ సింహలను తన సలహాదారులుగా నియమించుకున్నారని ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది.
వీరిద్దరిలో ప్రభాకర్‌రెడ్డి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం కార్యాలయంలో పని చేశారు. అలాగే ఉదయ్ కుమార్ సింహా వై.ఎస్. కాలంలో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా ఉన్నారు.
ఇక జిల్లాల వారీగా వైసీపీ, ఇతర పార్టీల నుంచి తనను కలవడానికి వస్తున్న అభిమానులు, నాయకులతో చర్చిస్తున్న షర్మిల ప్రత్యేకంగా మధ్దతుదారుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.
ఉమ్మడి జిల్లాల వారీగా మండలాలు, నియోజకవర్గాలతో కూడిన జాబితాను రూపొందిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణకు చెందిన ఎంఆర్‌పీఎస్, మాలమహానాడు నేతలు కూడా బుధవారంనాడు షర్మిలను కలిసిన వారిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వంద దాటిన పెట్రోలు –గత ప్రభుత్వాలే కారణమన్న ప్రధాని మోదీ
దేశంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పెట్రో ధరలు పెరిగాయని, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ పట్టణంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.13కు చేరిందని నమస్తే తెలంగాణ ఒక కథనం ఇచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.99.90కు చేరగా, లీటరు డీజిల్ రూ. 90.35కు పెరిగిందని ఈ కథనం పేర్కొంది.
బుధవారం కూడా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 25 పైసలు చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా తొమ్మిది రోజులుగా పెరిగిన ధరలను కలిపి లెక్కిస్తే లీటరు పెట్రోల్‌పై రూ.2.59, డీజిల్‌పై రూ.2.82 పెరిగింది.
ఇంధన ధరలు పెరుగడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి గత ప్రభుత్వాల తప్పిదాలే కారణమని ప్రధాని మోదీ అన్నట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.
‘విదేశాల నుంచి ఇంధనాల దిగుమతిని తగ్గించుకోవడంపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. దీనికి కారణంగానే ఈ రోజు సామాన్య పౌరుడు ఇబ్బంది పడుతున్నాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడానికి గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలే కారణం’ అని ప్రధాని అన్నట్లు ఈ కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- ధోనీ వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూశారా? కడక్‌నాథ్ కోళ్లు, స్ట్రాబెర్రీలు..
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- 'రసాయన దాడి': సిరియా, రష్యాలను హెచ్చరిం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









