పంచాయతీ ఎన్నికలు: పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్లిపోతావు, రాజకీయాలు నీకెందుకన్నారు.. సర్పంచ్ అయ్యాను

ఫొటో సోర్స్, SNEHAL KALBHOR
- రచయిత, శ్రీకాంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఈ రాజకీయాలు నీకెందుకు? ఎన్నికల్లో పోటీ చేసి ఏం సాధిస్తాననుకుంటున్నావ్? మహా అయితే ఇంకో అయిదేళ్లు ఈ ఊరిలో ఉంటావు. తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిపోతావు. నీకెందుకు ఇవన్నీ.. అని మా ఇంట్లో పెద్దవాళ్లు అంటుండేవారు. వారిని ఒప్పించి రాజకీయాల్లో అడుగుపెట్టాను. గెలిచాను."
21 ఏళ్ల స్నేహల్ కల్భోర్ మహారాష్ట్రలోని పుణె జిల్లా ఖాడ్కి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
మహారాష్ట్రలో 14 వేల 234 గ్రామ పంచాయతీలకు తాజాగా ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. చాలా చోట్ల యువ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో స్నేహల్ కల్భోర్ ఒకరు.
తన చదువును గ్రామ అభివృద్ధికి, మహిళల సాధికారత కోసం ఉపయోగిస్తానని స్నేహాల్ బీబీసీతో చెప్పారు. స్నేహల్ ప్రస్తుతం ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
"నా ప్రత్యర్థి మహిళా అభ్యర్థులు వయసులో నా కంటే పెద్దవారు. కానీ, వారు చదువుకోలేదు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను, మహిళల కోసం, యువతకు మెరుగైన విద్య కోసం నేను ఏం చేయగలను అనేది ప్రచారంలో వివరించి, మా గ్రామ ప్రజలను ఒప్పించాను" అని స్నేహల్ చెప్పారు.

ఫొటో సోర్స్, SNEHAL KALBHOR
గ్రామంలో మహిళలకు ఆరోగ్యం సదుపాయాలు, యువతకు మెరుగైన విద్య అందించడం లక్ష్యంగా పెట్టుకున్నానని స్నేహల్ తెలిపారు.
"మా ఊరిలో మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. రుతుస్రావం సమయంలో వారికి అందుబాటు ధరలకు శానిటరీ ప్యాడ్లు అందించడానికి ప్రయత్నిస్తాను. మా ఊరికి బస్సు రోజుకు రెండు సార్లే వస్తోంది. అది ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. బస్సుల సంఖ్య పెంచి ఆ సమస్య కూడా తీర్చాల్సి ఉంది" అని ఈ యువ సర్పంచ్ వివరించారు.
"రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పదలచుకున్నాను. మహిళలు తమంతట తాముగా రాజకీయాలు నేర్చుకోవచ్చు. మన గ్రామ పంచాయతీ, రాష్ట్రం, దేశం ఎలా పనిచేస్తుందో వారు తెలుసుకోవచ్చు. మా ఊరిలోని మహిళలందరూ గ్రామ పంచాయతీకి రావాలని కోరాను. ఇక్కడ మేం ఎలా పనిచేస్తున్నామో మీరే పరిశీలించండి అని చెప్పాను. నా విధుల్లో మా కుటుంబ సభ్యులను జోక్యం చేసుకోనివ్వను" అని ఆమె తెలిపారు.
"మహిళలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తాం. స్కిల్ ఇండియా ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను కూడా మా గ్రామానికి ఆహ్వానించి యువతకు, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయమని వారిని అభ్యర్థిస్తాం" అని స్నేహల్ చెప్పారు.

ఫొటో సోర్స్, SNEHAL KALBHOR
ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే లేదా ఎంపి స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు, "నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాను. అయితే, ప్రస్తుతానికి సర్పంచ్ అవ్వడం నాకు పెద్ద బాధ్యత" అని స్నేహల్ అన్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీ స్నేహితులు ఏమన్నారు? అని అడిగినప్పుడు, "నీకు ఇది చక్కని అవకాశం అని నా స్నేహితులు చెప్పారు. మాకు ఈ అవకాశం రాలేదు. మా గ్రామంలో మాకు మద్దతు లేదు, మా ఇంట్లో వాళ్లు రాజకీయాలను ప్రోత్సహించరు. నీకు అవకాశం వచ్చింది, ధైర్యంగా ముందుకెళ్లు అని సూచించారు. ఇప్పుడు నన్ను చూసి వారంతా సంతోషిస్తున్నారు. అమ్మాయిలు రాజకీయాల్లోకి వెళ్ళవచ్చని నేను వారి కుటుంబాలను కూడా ప్రేరేపించాను" అని ఆమె వివరించారు.
స్నేహల్ ప్రస్తుతం సర్పంచ్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. ఆ తరువాత గ్రామంలో శిక్షణా శిబిరాలను నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- మహిళల ఉద్యోగాలను ఆటోమేషన్ మింగేస్తుందా?
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- ఆరెస్సెస్‌కు, అమ్మాయిలకు మధ్య ఈ ఘర్షణ ఎందుకొచ్చింది?
- కాలేజీ పాఠమట.. కట్నంతో లాభమట!
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









