నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?

విజయ్ సేతుపతి

ఫొటో సోర్స్, GUILLAUME SOUVANT/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విజయ్ సేతుపతి
    • రచయిత, ఎ. విజయానంద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళ నటుడు విజయ్ సేతుపతిపై, మహా గాంధీ అనే మరో నటుడు పరువు నష్టం దావా వేశారు. చెన్నైలోని సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

"బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి అనుచరులు చేసిన దాడిలో నా చెవి పూర్తిగా పోయింది. శాశ్వత చెవుడు వచ్చింది. నా పరువు తీశారు" అని మహా గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గాంధీని ఎగిరెగిరి కొడుతున్నట్లు కనిపిస్తోంది

ఫొటో సోర్స్, SCREENSHOT

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

అసలేం జరిగింది?

నవంబర్ 2న బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతికి, మహా గాంధీకి మధ్య జరిగిన గొడవ సినీ పరిశ్రమలో కలకలం రేపింది.

ఆ రోజు విమానాశ్రయంలో విజయ్ సేతుపతితో మాట్లాడేందుకు వచ్చిన గాంధీ, సేతుపతిపై దాడి చేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది.

"గాంధీ మత్తులో ఉన్నారని" విజయ్ సేతుపతి వైపు వాళ్లు చెప్పారు.

అయితే, విజయ్ సేతుపతిపై గాంధీ దాడి చేయలేదని, ఆయన మేనేజర్ జాన్సన్‌పై దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.

కాగా, ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో అప్పుడు ఎలాంటి కేసూ నమోదు కాలేదు.

ఇప్పుడు విజయ్ సేతుపతి, జాన్సన్‌లపై గాంధీ పరువు నష్టం దావా వేశారు.

"వైద్య పరీక్షల నిమిత్తం మైసూర్ వెళ్లేందుకు నవంబర్ 2వ తేదీ రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చినప్పుడు, అనుకోకుండా అక్కడ విజయ్ సేతుపతిని కలిశాను. సినీ పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలకుగాను ఆయనకు అభినందనలు చెప్పాలనుకున్నాను. అందుకు ఆయన నిరాకరించారు. పైగా, కులం పేరుతో బహిరంగంగా నన్ను అవమానించారు" అని గాంధీ పిటిషన్‌లో పేర్కొన్నారు.

రూ. 3 కోట్లు చెల్లించాలని డిమాండ్

దీనికి సంబంధించి, గాంధీ తరపు న్యాయవాది ఇన్ఫాంట్ దినేష్‌తో బీబీసీ మాట్లాడింది.

"గాంధీకి వెన్నెముక సమస్య ఉండడంతో వైద్య పరీక్షల కోసం మైసూరు వెళ్లారు. అనుకోకుండా విమానాశ్రయంలో విజయ్ సేతుపతిని చూశారు. వారిద్దరి మధ్య అపార్థాలు చోటుచేసుకున్నాయి. బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నప్పుడు విజయ్ సేతుపతి పక్కనే ఉన్న స్నేహితుల్లో ఒకరు మహా గాంధీ చెవి మీద కొట్టారు. దాంతో, గాంధీ 30 సెకండ్ల పాటు షాక్‌లో ఉండిపోయారు. మళ్లీ కొట్టబోతే, గాంధీ ఎదురుతిరిగారు. ఈ వీడియో బయటికొచ్చింది. విజయ్ సేతిపతిపై గాంధీ దాడి అంటూ ప్రచారం చేశారు. కానీ, వాస్తవంలో జరిగింది వేరు" అని దినేష్ తెలిపారు.

"ఈ ఘటనలో ఆయన చెవి పూర్తిగా దెబ్బతింది. ఇక ఆ చెవి పనిచేయదని డాక్టర్లు చెబుతున్నారు."

బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన దాడికి సంబంధించిన ఫుటేజీని అందించాలని మహా గాంధీ సమాచార హక్కు చట్టం కింద విమానాశ్రయ అధికారులను అభ్యర్థించారు.

"ఈ ఘటన తరువాత, విజయ్ సేతుపతి చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యక్తి మత్తులో ఉన్నారని చెప్పారు. దీనివల్ల గాంధీ ప్రతిష్టకు భంగం కలిగింది. దానితో పాటు, ఆయన ఆరు సినిమాల్లో నటించే అవకాశాలను కోల్పోయారు. అందుకే సైదాపేట కోర్టులో రూ. 3 కోట్ల పరువు నష్టం దావా వేశాం" అని దినేష్ చెప్పారు.

మహా గాంధీ

ఫొటో సోర్స్, MAHA GANDHI

ఫొటో క్యాప్షన్, మహా గాంధీ

కులం కోణం

కులం పేరుతో అవమానించారని మహా గాంధీ పిటిషన్‌లో పేర్కొన్నారా? అని లాయర్ దినేష్‌ని అడిగాం.

"దీన్ని రాజకీయం చేయడం గాంధీ ఉద్దేశం కాదు. కానీ, విజయ్ సేతుపతి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గాంధీ మద్యం మత్తులో ఉన్నారని ఆరోపించారు."

"సంఘటన జరిగిన రోజు ముత్తురామలింగ తేవర్ జయంతి వేడుకలను సందర్శించడానికి వెళ్తున్నారా అని గాంధీ, సేతుపతిని అడిగారు. దానికి సేతుపతి ఇచ్చిన సమాధానం గాంధీకి బాధ కలిగించింది. నేను కూడా నీ కులం వాడిని అనుకుంటున్నావా? అని సేతుపతి అడిగారు. ఇది నిజం. తరువాత, తన అనుచరులకు చెప్పి గాంధీని కొట్టించారు" అని దినేష్ వివరించారు.

విజయ సేతుపతి పక్షం వాదన ఏమిటి?

విజయ్ సేతుపతి లాయర్ నర్మద సంపత్‌ను బీబీసీ సంప్రదించింది.

"బెంగళూరు విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా, కొన్ని అపార్థాల కారణంగా సేతుపతి మేనేజర్ జాన్సన్‌తో వాగ్వివాదం జరిగిందని, దీనిపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయనని విమానాశ్రయం పోలీసులకు గాంధీ లిఖితపూర్వకంగా చెప్పారు. ఇప్పుడు పరువు నష్టం దావా వేసి మాకు తీవ్ర ఆందోళన కలిగించారు. మేము కూడా గాంధీపై తగిన రీతిలో పరువు నష్టం కేసు పెట్టాలని ఆలోచిస్తున్నాం" అని లాయర్ సంపత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)