మాంట్ బ్లాంక్‌ మీద రత్నాల పెట్టె దొరికితే పోలీసులకు ఇచ్చాడు... ఎనిమిదేళ్ళకు అందులో అతడికి సగమిచ్చారు

మౌంట్ బ్లాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఆల్ఫ్స్ పర్వతాలలోని మాంట్ బ్లాంక్ అధిరోహిస్తుండగా పొరపాటున తూలి ఒక రత్నాల పెట్టెపై పడిన ఓ పర్వతారోహకుడికి ఇప్పుడు అందులో సగభాగం ఇస్తున్నారు.

కెంపులు, పచ్చలు, నీలమణులు ఉన్న ఒక పెట్టె మాంట్ బ్లాంక్‌పై దశాబ్దాల కిందట కూరుకుపోయింది. 2013లో మౌంట్ బ్లాంక్ ఎక్కుతున్న ఓ పర్వతారోహకుడికి అది దొరికింది.

భారతదేశానికి చెందిన ఓ విమానం సుమారు 50 ఏళ్ల కిందట ఆల్ఫ్స్ పర్వతాలలో కూలిపోయింది. ఈ రత్నాల పెట్టె అందులోని ఎవరైనా భారతీయ ప్రయాణికులకు చెందినది కావొచ్చనుకున్నారు.

2013లో ఈ పెట్టెను చూసిన ఆ పర్వతారోహకుడు దాన్ని పోలీసులకు అప్పగించారు.

ఆ పెట్టెలో వందల సంఖ్యలో విలువైన రత్నాలు ఉండగా అందులో సగం ఇప్పుడు ఆ పర్వతారోహకుడికి బహుమతిగా ఇచ్చారు.

మిగతా సగం చమోనిక్స్ స్థానిక అధికారులు తీసుకున్నారు. అప్పటి విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఎవరివైనా కావొచ్చన్న అంచనాతో భారత్‌లో వాటి యజమాని ఎవరో తెలుసుకోవడానికి చమోనిక్స్ అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు.

రత్నాలు రెండు భాగాలుగా చేసి పంచారని.. ఒక్కో భాగం విలువ 1,50,000 యూరోలు ( భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.27 కోట్లు) ఉంటుందని చమోనిక్స్ మేయర్ ఎరిక్ ఫార్నియర్ 'ఏఎఫ్‌పీ' వార్తాసంస్థతో చెప్పారు.

మాంట్ బ్లాంక్‌పై రెండుసార్లు భారతదేశ విమానాలు కూలిపోయాయి. 1950లో ఓ విమానం కూలిపోయి 48 మంది చనిపోయారు. 1966లో మరో విమానం కూలినప్పుడు 117 మంది మృతి చెందారు.

ఈ రత్నాల పెట్టె 1966లో ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తూ కూలిపోయిన విమానంలోని ప్రయాణికులలో ఎవరిదైనా కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఆ ప్రమాదం తరువాత మౌంట్ బ్లాంక్‌పై చాలాసార్లు మానవ అవశేషాలు, ప్రయాణికుల బ్యాగులు దొరికాయి.

దౌత్య పత్రాలు, వార్తాపత్రికలు, క్యాలెండర్లు ఉన్న ఓ బ్యాగు 2012లో దొరికింది.

భారత అణు పితామహుడిగా ఖ్యాతిగాంచిన హోమీ జె బాబా కూడా ఆ 1966 విమాన ప్రమాదంలోనే మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)