మోదీ, పుతిన్‌ల స్నేహం భారత్, రష్యాల సంబంధాలను కొత్త దారి పట్టించనుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనస్తాసియా స్టోగ్నీ
- హోదా, బీబీసీ రష్యన్, మాస్కో
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సమావేశం కీలకం కానుంది.
పుతిన్ చాలా అరుదుగా ప్రయాణాలు చేస్తారు. కాబట్టి, ఆయన భారత పర్యటన లాంఛనప్రాయం కాదని తెలుస్తోంది.
2021లో పుతిన్ ఒకే ఒక్కసారి రష్యా బయట అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసేందుకు ఆయన జెనీవా వెళ్లారు.
ఈ నేపథ్యంలో, రష్యా ఎందుకు భారతదేశానికి ఇంత ప్రాముఖ్యమిస్తోంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
రష్యా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉన్నాయి?
భారత్, రష్యాల మధ్య సుదీర్ఘ కాలంగా స్థిరమైన, స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగుతున్నాయి.
పుతిన్, మోదీ చివరిసారిగా 2018 అక్టోబర్‌లో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పలు అంశాలపై మోదీ అభిప్రాయం తెలుసుకోవడానికే పుతిన్ భారత పర్యటనకు వస్తుండవచ్చని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధానంగా వచ్చిన మార్పు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ల ప్రభుత్వం ఏర్పడడం.
తాలిబాన్లు "యోగ్యమైన" పాలకులేనని రష్యా అంగీకరించింది. అయితే, ఈ మార్పు ప్రాంతీయంగా పాకిస్తాన్ స్థానాన్ని బలోపేతం చేసింది. దాంతో, భారతదేశం మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ అంశంలో భారతదేశానికి భరోసా అందిస్తామని ఇటీవలే రష్యా పునరుద్ఘాటించింది.
మరోవైపు, క్వాడ్ పునరుద్ధరణతో భారత్, అమెరికా వైపు మొగ్గు చూపుతుండడం రష్యాను కలవరపెట్టే అంశం.

ఫొటో సోర్స్, REUTERS
క్వాడ్ సభ్య దేశాలైన అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇటీవలే సమవేశమై కోవిడ్ సహకారం, దక్షిణ సముద్రంలో చైనా ఆధిపత్యం తగ్గించడం మొదలైన అంశాలపై చర్చించాయి.
క్వాడ్‌ను "ఆసియన్ నాటో"గా రష్యా అభివర్ణించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) యూరోప్‌లో రష్యాకు ప్రధాన శత్రువు.
అమెరికా, చైనా గొడవలో భారత్, రష్యాలు చెరోవైపు నిలిచే అవకాశం ఉంది.
రష్యాకు చైనాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. సైద్ధాంతిక చరిత్ర, అమెరికాపై అపనమ్మకం సహా పలు అంశాల్లో ఆ రెండు దేశాలకూ పొత్తు కుదురుతుంది.
అయితే, చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా ఎదురునిలవడమనేది భారత్‌కు మేలు చేసే అంశం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పుతిన్, మోదీల మధ్య వ్యక్తిగత స్నేహం
రష్యా ఆందోళన చెందడం సహజమేనని విదేశాంగ నిపుణుడు అలెక్సీ జఖారోవ్ అన్నారు.
భారత్ విషయంలో రష్యాకు సొంత భౌగోళిక రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి.
తమ విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించేందుకు భారతదేశంతో "ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం" ఏర్పరచుకోవడం కీలకం అని వేసవిలో విడుదలైన తాజా సెక్యూరిటీ డాక్ట్రిన్‌లో రష్యా పేర్కొంది.
అయితే, ఇందులో కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయి.
ఇటీవల కాలం వరకు భారతదేశం ప్రధానంగా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేది.
అయితే, గత ఏడాది రష్యా ఆయుధాల దిగుమతిలో భారత్ వాటా 50 శాతం పడిపోయింది.
దీన్ని బట్టి, ఆయుధాల కొనుగోలు కోసం భారత్ మరో విక్రేతను ఆశ్రయిస్తోందని స్పష్టమవుతోంది.
కాగా, పుతిన్‌కి, మోదీకి మధ్య ఉన్న వ్యక్తిగత సత్సంబంధాలు ఈ విభేదాలను తొలగించడానికి సహాయపడతాయని ఆశిస్తున్నారు.
గత కొన్నేళ్లగా ఇద్దరు నాయకులూ పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నారు.
"స్నేహితుల కోసం త్యాగం చేయడం" అనే అరుదైన లక్షణం పుతిన్‌లో ఉందని, దాన్ని తాను ఎంతో గౌరవిస్తానని ఇటీవల మోదీ రష్యన్ న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్‌కు తెలిపారు.
అంతే కాకుండా, పుతిన్‌తో స్నేహం చేయడం చాలా సులువని, తమ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని మోదీ చెప్పారు.
అయితే, ఈ సానుకూల దృక్పథమంతా ఆచరణలో కనిపిస్తుందా అనేది మరో ప్రశ్న.
ముఖ్యంగా, తమ ఇతర భాగస్వాములు అసంతృప్తి చెందకుండా, సమతుల్యతను సాధించడానికి ఇరు దేశాలూ చేసే ప్రయత్నాల నేపథ్యంలో, వీరి మధ్య స్నేహం ఎంతవరకు ఆచరాణత్మకంగా మారుతుందనేది ప్రశ్న.
"రష్యా, భారత్‌ల మధ్య సంబంధం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలాంటిది. కానీ, వారికి పిల్లలు లేరు" అంటూ రష్యన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ డైరెక్టర్ ఆండ్రీ కోర్టునోవ్ జోక్ చేశారు.
ఈ రెండు దేశాల మధ్య మంచి, స్థిరమైన సంబంధాలు ఉన్నాయిగానీ, వాటి ఫలితాలు మాత్రం ఇటీవల కాలంలో కనిపించలేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- వికలాంగులకు మోడల్స్‌గా అవకాశాలు వస్తాయా?
- జై భీమ్: IMDb రేటింగులో గాడ్‌ఫాదర్‌ను అధిగమించిన భారతీయ సినిమా
- అసలు కాలుష్యం కంటే టీవీ చానళ్లలో చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- త్రిపుర: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్‌లో అందుబాటులోకి
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












