ఒక్క జూమ్ కాల్‌‌తో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన సీఈవో

జూమ్ కాల్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాకు చెందిన ఒక సంస్థ యజమాని, 900 మంది ఉద్యోగుల్ని జూమ్ కాల్‌ ద్వారా ఒకేసారి తొలగించారు.

''ఒకవేళ మీరు ఈ సమావేశంలో ఉన్నట్లయితే, ఉద్యోగాలు కోల్పోయిన వారిలో మీరు కూడా ఉన్నట్లే'' అని గృహరుణాల సంస్థ బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ తన ఉద్యోగులతో చెప్పారు.

''చివరిసారి ఇలా చేసినప్పుడు నేను ఏడ్చాను'' అని జూమ్ సమావేశంలో గార్గ్ తన ఉద్యోగులతో చెప్పారు.

''మనం అభివృద్ధి సాధిస్తే బావుండు అని నేను అనుకున్నా. ఈ న్యూస్ భిన్నంగా ఉండాలని నేను కోరుకున్నా'' అని ఆయన పేర్కొన్నారు.

సిబ్బంది పనితీరు, ఉత్పాదకత, మార్కెట్‌లో మార్పులు తదితర కారణాలతోనే బెటర్.కామ్ సిబ్బందిలో 15 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అయితే గతవారం పెట్టుబడిదారుల నుంచి బెటర్.కామ్‌కు అందిన 750 మిలియన్ డాలర్ల నగదు గురించి ఆయన జూమ్ కాల్‌లో ప్రస్తావించలేదు.

విశాల్ గార్గ్

ఫొటో సోర్స్, BETTER.COM

ఫొటో క్యాప్షన్, బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అయింది. దీనిపై పలువురు స్పందిస్తున్నారు.

ఇది ఒక కఠినమైన, భయంకరమైన చర్య. ప్రత్యేకించి క్రిస్మస్ సమీపిస్తోన్న తరుణంలో ఇది మరింత కఠినమైనదని వ్యాఖ్యానిస్తున్నారు.

''ఉద్యోగుల్ని తొలగించడం అనేది ఉద్వేగపూరితమైన, కలత చెందే అంశం. ప్రత్యేకించి వారిని తొలగిస్తోన్న సమయం పరంగా మరింత ఉద్వేగపూరితమైనది'' అని బెటర్.కామ్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కెవిన్ ర్యాన్ బీబీసీతో అన్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతోన్న గృహయాజమాన్య మార్కెట్‌లో లాభదాయకమైన బ్యాలెన్స్ షీట్‌తో పాటు నిబద్ధులైన సిబ్బంది అవసరమని ఆయన పేర్కొన్నారు.

తమ కంపెనీలో పనిచేయకుండా ఇతర ఉద్యోగులకు భారంగా మారిన వారిని, 8 గంటలు పనిచేయాల్సిన చోట కేవలం 2 గంటలు మాత్రమే విధులు నిర్వర్తిస్తోన్నవారిని మాత్రమే ఉద్యోగాల నుంచి తొలగిస్తోన్నట్లు గార్గ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు ఫార్చూన్ మేగజైన్ ధ్రువీకరించింది.

ఇళ్ల కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా, మరింత సమర్థంగా జరిగేలా సాంకేతికతను ఉపయోగించే ఈ కంపెనీ విలువ దాదాపు 6 బిలియన్ డాలర్లు.

గార్గ్ శైలిపై గతంలో చాలా విమర్శలు వచ్చాయి. ఆయన తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌ను గతేడాది ఫోర్బ్స్ సంపాదించింది.

ఆ మెయిల్‌లో గార్గ్ తన ఉద్యోగులపై ''మీరు చాలా నెమ్మదస్తులు. మీరు మూగ డాల్ఫిన్ల సమూహంలా ఉన్నారు. దీన్ని ఆపండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు'' అని అసహనం వ్యక్తం చేశారు.

విశాల్ గార్గ్ ట్వీట్

ఫొటో సోర్స్, TWITTER

''ఒక సంస్థను నడిపించే పద్ధతి ఇది కాదు''

''ఒక సంస్థను నడిపించే పద్ధతి ఇది కాదు'' అని యూకేలోని లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ బిజినెస్ స్టడీస్ లెక్చరర్ గెమ్మా డేల్ అన్నారు.

ఇలాంటి సామూహిక తొలగింపులు యూకేలో చట్టబద్ధం కాదని ఆమె చెప్పారు.

''అమెరికాలో ఇలాంటి నిబంధన లేదు కాబట్టి, మీరు భారీ తొలగింపులు చేపట్టొచ్చని అనుకోకూడదు''

''ఇలాంటి పనులు చేయడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా సానుభూతిగా, మర్యాదపూర్వకంగా ఉండే మార్గాలను ఎంచుకోవాలి''

''ఉద్యోగులతో పాటు సంస్థకు కూడా ఇలాంటి నిర్ణయాలు ప్రమాదకరంగా మారతాయి. ఇప్పుడు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇది ఒక సంకేతంగా మారుతుంది. భవిష్యత్‌లో తమ పట్ల కంపెనీ ఎలా వ్యవహరిస్తుందో అనేదానికి ఉద్యోగులు దీన్ని సంకేతంగా భావిస్తారు''

''కంపెనీ ప్రమాణాలను అందుకోలేని సిబ్బంది పట్ల వ్యవహరించేందుకు కొన్ని సరైన పద్ధతులు ఉంటాయి. ఉద్యోగుల పరంగా తగు చర్యలు తీసుకునే హక్కు యజమానులకు ఉన్నప్పటికీ... నైతికంగా, చట్టబద్ధంగా ఈ పనులను చేసే మార్గాలుంటాయి'' అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, ఈమెయిల్‌లో చేసిన పొరపాటు, ఆ 250 మందిని ప్రమాదంలో పడేసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)