కులాంతర వివాహం చేసుకున్న జంటపై 28 ఏళ్ల తర్వాత దాడి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కులాంతర వివాహం చేసుకున్న జంటపై 28 ఏళ్ల తర్వాత దాడి చేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
కర్ణాటకలో రోన్‌తక్ ప్రాంతంలో 28 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్న ఒక జంటపై భర్త తరఫు బంధువులు దాడికి పాల్పడ్డారు. భర్త అగ్ర కులానికి చెందినవాడు కాగా, భార్య వాల్మీకి కులానికి చెందిన వ్యక్తి. ఈ కారణంతోనే భర్త బంధువులు వారిపై దాడికి పాల్పడ్డట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడిలో భార్య గాయపడినట్లు వారు చెప్పారు.
బెంగళూరుకు 385 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదగ్ జిల్లా రోన్ తాలూకాలో జూలై 8న ఈ సంఘటన జరిగింది. తమ పేర్లు బయటికి చెప్పొద్దని విజ్ణప్తి చేయడం వల్ల ఈ విషయం బయటికి రాలేదని పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలో వెనుకబడిన కులాలపై దాడులు పెరుగుతున్నాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌పై దాడులు జరిగినట్లు 2,327 కేసులు నమోదు అయ్యాయని కర్ణాటక ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు 54శాతం పెరిగాయట. ఈ విషయాన్ని స్వయంగా నేషనల్ క్రైం బ్యూరో తెలిపింది. వాస్తవానికి నమోదు అవుతున్న కేసులు చాలా తక్కువని, నమోదు కానీ దాడులు అనేకమని అధికారులు చెబుతున్నారు’’ అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO
తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై రేపు క్యాబినెట్ ముందుకు నివేదిక
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయని నమస్తే తెలంగాణ ఓ వార్త ప్రచురించింది.
‘‘ఉద్యోగ ఖాళీలపై ఆర్థికశాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ఆదివారం ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం నిర్వహించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమావేశమయ్యారు.
32 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల వివరాలను ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు ఆర్థికశాఖకు అందించారు. ఆ వివరాలను ఆర్థికశాఖ మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచనుంది.
50వేల ఉద్యోగాలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించటంతో పోస్టుల భర్తీపై కొంతకాలంగా శాఖలవారీగా కసరత్తు జరుగుతోంది.
తాజాగా ఆర్థికశాఖ పూర్తి వివరాలను సేకరించింది. పదోన్నతుల ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలి, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం.
అధికారులు అందించే నివేదికపై క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందిస్తారు. ఆ వెంటనే ఉద్యోగాల భర్తీకి కమిషన్ వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది’’ అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ అంబులెన్సులో లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు వైద్యురాలు
ఊపిరితిత్తులు పాడైపోయిన స్థితిలో ఉన్న ఒక వైద్యురాలిని చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆదివారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని రామ్‌మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఆర్‌ఎమ్‌ఎల్‌ఐఎంఎస్)కు చెందిన పీజీ రెసిడెంట్ వైద్యురాలు డా.శారదాసుమన్(32)కు ఏప్రిల్ 14న కోవిడ్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అప్పటికే ఆమె ఎనిమిది నెలల గర్భవతి.
పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై పెట్టి మే 1న అత్యవసర శస్త్రచికిత్స చేసి బిడ్డను కాపాడారు. ప్రసవం తరువాత ఆమెను ఎక్మో సపోర్ట్ మీద ఉంచారు. అయినా ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో ఆర్‌ఎమ్‌ఎల్‌ఐఎంఎస్ డైరెక్టర్ డా.సోనియా నిత్యానంద్.. వెంటనే ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఊపిరితిత్తులను మార్చడం తప్ప మరో అవకాశం లేదని వారు తేల్చారు.
ఆ వైద్యురాలి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో.. స్వయంగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన తక్షణం స్పందించి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో హైదరాబాద్, చెన్నై నగరాల్లోని నాలుగు ఆసుపత్రులను సంప్రదించారు.
ఇప్పటికే పలు సందర్భాల్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని తెలుసుకుని, నగరంలోని కిమ్స్‌ను ఎంచుకున్నారన్నారు.
లైఫ్‌సపోర్ట్ అంబులెన్స్ ద్వారా లఖ్‌నవూలోని విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్సులో నగరానికి తీసుకొచ్చినట్లు వివరించారు’’ అని ఈనాడు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








