ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?

- రచయిత, లారా బికర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పదేళ్ల కిందట, పెద్దగా పరీక్షలేమీ ఎదుర్కోకుండానే 27 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల్లో ఆయన గురించి వచ్చినన్ని కథనాలు మరే ఇతర నాయకుడి గురించీ రాలేదు. మరి ఈ పదేళ్ల కాలంలో కిమ్ జోంగ్ ఉన్ పరిపాలన ఎలా సాగింది? ఉత్తర కొరియా ప్రజలు ఏమనుకుంటున్నారు?
అది 2011 డిసెంబర్ 19....ప్యాంగ్యాంగ్ వీధులు రోదనతో నిండిపోయాయి. స్కూల్ యూనిఫారంలో ఉన్న విద్యార్థులు మోకాళ్లపై కూలబడి ఏడుస్తున్నారు. మహిళల ముఖాల్లో చెప్పలేని బాధ. తమ "ప్రియతమ నాయకుడు" కిమ్ జోంగ్ ఇల్ ఇక లేరు అనే వార్తను కఠిన నియంత్రణలో ఉండే ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. 69 ఏళ్ల వయసులో కిమ్ జోంగ్ ఇల్ మరణించారు.
ఆ సమయంలో అందరి కళ్లూ ఒకే ఒక వ్యక్తి పైన నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా కొరియా విశ్లేషకులందరూ ఆ వ్యక్తి గురించి రాసేందుకు ఆతృతపడ్డారు. ఆయనే కిమ్ జోంగ్ ఉన్.
27 ఏళ్ల వయసులోనే ఉత్తర కొరియా అధ్యక్ష పీఠానికి వారసుడిగా అవతరించారు. కానీ, ఆయన దేశాన్ని ముందుకు నడిపించగలరని ఎవరూ భావించలేదు. వయసు లేదు, అనుభవం లేదు. అలాంటి వ్యక్తికి ఒక దేశాన్ని పాలించే సత్తా ఉంటుందని ఎవరు ఊహిస్తారు?
దేశంలో సైనిక తిరుగుబాటు వస్తుందని, లేదా ఉత్తర కొరియా ఉన్నత వర్గాలు అధికారాన్ని స్వాధీనం చేసుకుంటాయని చాలామంది ఊహించారు. కానీ, ఈ యువ నియంతను ప్రపంచం తక్కువ అంచనా వేసింది.
కిమ్ జోంగ్ ఉన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, "కిమ్ జోంగ్-ఉనిజం" అనే కొత్త శకానికి నాంది పలికారు.
ప్రత్యర్థుల నిర్మూలన మొదలుపెట్టి, వందలాది మరణశిక్షలను అమలుచేసి, ఆ తరువాత విదేశీ వ్యవహారాలపై దృష్టి సారించారు కిమ్. నాలుగు అణు పరీక్షలు,100 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం, అమెరికా అధ్యక్షుడితో చర్చలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు.
అణ్వాయుధాల అభివృద్ధి లక్ష్యంగా కిమ్ చేసిన ప్రయత్నాలు ఉత్తర కొరియాకి భారమయ్యాయి. ఇప్పుడు ఆ దేశం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల కిందటి కన్నా మరింత పేదదేశంగా, మరింత ఒంటరిగా మిగిలిపోయింది.
ఈ దశాబ్ద కాలంలో కిమ్ పాలనలో ఉత్తర కొరియా ఏం సాధించింది? ఉత్తర కొరియాను విడిచిపెట్టినవారు ఏమంటున్నారు? ఆ దేశ అగ్ర దౌత్యవేత్తలతో సహా ఎవరెవరు ఏమన్నారు?

ఓ కొత్త ప్రారంభం
అప్పట్లో కిమ్ జియుమ్ హ్యోక్ విద్యార్థి. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి మరణించిన రోజు ఆయన చేసిన పని ఆయన ప్రాణాలు తీసుండేది. కిమ్ జోంగ్ ఇల్ మరణించిన రోజున ఆయన అందరికీ పెద్ద పార్టీ ఇచ్చారు. "ముప్పు ముంచుకొస్తుందని తెలుసు. కానీ, అప్పుడు మేం చాలా సంతోషపడ్డాం." అని హ్యోక్ అన్నారు.
జియుమ్ హ్యోక్ అంచనా ప్రకారం ఒక యువ అధ్యక్షుడు, స్కీయింగ్, బాస్కెట్‌బాల్ అంటే మక్కువ ఉన్న వ్యక్తి కావాలి. అధికారంలోకి రావడం అంటే కొత్త ఆలోచనలు, సరి కొత్త మార్పుకు నాంది పలికినట్టు. "కిమ్ జోంగ్ ఉన్ గురించి మాకు చాలా అంచనాలు ఉండేవి. యూరోప్‌లో చదువుకుని వచ్చారు. ఆయన ఆలోచనలు మా తరం ఆలోచనల్లాగే ఉంటాయని అనుకున్నాం" అన్నారాయన.
జియుమ్ హ్యోక్ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. అప్పట్లో బీజింగ్‌లో చదువుతూ ఉండేవారు. ఆ రోజుల్లో బీజింగ్‌లో చదువుకోవడం ఉన్నత స్థాయి కుటుంబాలకు మాత్రమే సాధ్యమయ్యేది.
చైనాలో జీవితం ఆయనకు కొత్త ప్రపంచాన్ని చూపించింది. అభివృద్ధిని కళ్లకు కట్టి చూపించింది. తన దేశం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు.
"మొదట్లో నమ్మలేకపోయాను. మా దేశం గురించి పశ్చిమ దేశాలు అబద్ధాలు ఆడుతున్నాయనుకున్నా. కానీ, నా మెదడు, హృదయం రెండూ విడి విడిగా ఆలోచిచడం మొదలుపెట్టాయి. ఇంక ఏ వార్తలూ చూడక్కర్లేదని నా బుద్ధి నిరోధించింది. కానీ మరింత లోతుగా చూడాలని నా మనసు చెప్పింది."
ఉత్తర కొరియాలో 2.5 కోట్ల జనాభాపై కఠిన నియంత్రణ ఉండేది. కాబట్టి, వారికి బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలీదు. ప్రపంచం తమ దేశం గురించి ఏమనుకుంటోందో కూడా తెలీదు.
తమ నాయకుడు అత్యంత ప్రతిభావంతుడని, అలాంటి వ్యక్తికి తాము విధేయులుగా ఉండాలని భావించారు. చిన్న వయసులోనే అధికారానికి వారసుడైన తమ నేతలో ఏదో కొరత ఉందన్నది జియుమ్ హ్యోక్ అభిప్రాయం.
సంశయాత్మలు
కిమ్‌కు వారసత్వంగా అధికారం చేజిక్కిందిగానీ పాలనకు అనర్హుడని ప్యాంగ్యాంగ్ అధికార వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. తండ్రి నుంచి కుమారుడికి అధికారం బదిలీ కావడం పట్ల తన సహోద్యోగులు విసుగు చెందారని కువైట్‌లోని ఉత్తర కొరియా మాజీ రాయబారి ర్యూ హ్యూన్ వూ బీబీసీకి చెప్పారు.
"హా....మళ్లీ మరో వారసుడా‘‘.. ఇదీ నా మొదటి స్పందన. వారసత్వంతో ఉత్తర కొరియా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఉన్నత వర్గాల్లో, మేం కొత్తదనాన్ని కోరుకున్నాం. కొత్తగా వేరేది రాకూడదా? అని అనుకున్నాం."
1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబమే ప్రభుత్వాన్ని నడుపుతోంది. వారి వంశం పవిత్రమైనదని ఆ దేశ ప్రజలు భావించారు. ఇది రాజవంశానికి చట్టబద్ధత కల్పించే మార్గం.
"'అంటే, మనం సదా మన ప్రియతమ నాయకుల సేవలోనే ఉండిపోతామన్నమాట ', '27 ఏళ్ల కుర్రాడికి దేశాన్ని పాలించడం ఏం తెలుస్తుంది? ఇది అసంబద్ధం '...ఇలాంటి మాటలు అప్పట్లో వినిపించాయి." అని హ్యూన్ అన్నారు.

ఒక భరోసా
ఉత్తర కొరియన్లు ఇక ఎప్పటికీ "తమ బెల్ట్‌లను బిగించాల్సిన అవసరం లేదని" 2012లో ఓ ప్రసంగంలో, వారి కొత్త నాయకుడు హామీ ఇచ్చారు. 1990లలో వందల వేల ప్రాణాలను బలిగొన్న ఘోరమైన కరువును ఎదుర్కొన్న దేశానికి, తమ కొత్త నాయకుడు ఇచ్చిన హామీ ఊపిరిలూదింది. ఇక ఆహర కొరత, కష్టాలు ఉండవని ఆశించారు.
అంతర్జాతీయ పెట్టుబడులు పెరిగేందుకు మార్గాన్ని సులభతరం చేయాలని విదేశీ కార్యాలయ అధికారులను ఆదేశించారు. దేశంలోని కూడా మార్పులు రావడం కొందరు గమనించారు. ఉత్తర కొరియాలోనే తయారైన సరుకులు సూపర్‌మార్కెట్లో ఎక్కువగా కనిపించడం గమనించానని ఆ దేశంలోని తూర్పు తీరానికి చెందిన డ్రైవర్ యూ సియోంగ్ జు చెప్పారు.
"వాస్తవానికి, చైనా నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల కన్నా ఉత్తర కొరియాలో తయారైన వాటి రుచి, ప్యాకింగ్, సరఫరా మెరుగ్గా ఉండడం గమనించాం. అది నిజంగా చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది." అన్నారు సియోంగ్ చెప్పారు.
ప్రక్షాళన
ప్రజలకు మేలు చేస్తానని కిమ్ హామీ ఇచ్చారుగానీ ప్రత్యర్థులకు కాదు. ముఖ్యంగా కిమ్ మేనమామ జాంగ్ సాంగ్ థేక్ మిత్రరాజ్యాలతో చేతులు కలిపి శక్తివంతమైన నెట్‌వర్క్‌ను సమీకరించారు.
దేశానికి ఉత్తరం వైపు, చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న ఓ వ్యాపారి చోయ్ నా రే ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తమ దేశానికి జాంగ్ సాంగ్ థేక్ కొత్త నాయకుడిగా అవతరించగలడని ఆయన భావించారు.
"చైనాతో సరిహద్దులు తెరుచుకుంటాయని, విదేశాలకు స్వేచ్ఛగా వెళ్లవచ్చని మాలో చాలామంది ఆశించారు." అన్నారాయన.
"జాంగ్ సాంగ్ థేక్ అధ్యక్షుడైతే దేశానికి ఆర్థికంగా చాలా మార్పులు తీసుకురాగలరని ఆశించాం. అయితే, ఈ మాటలు మేం బయటకు చెప్పలేదు. కానీ, మాకు ఆశలైతే ఉండేవి"
ఇలాంటి వదంతులను అణిచివేయాలి. కాబట్టి, జాంగ్ సాంగ్ థేక్ "మలిన పదార్థం" అని, "కుక్క కన్నా హీనం" అని ప్రచారం మొదలెట్టారు. ఆ తరువాత, "పార్టీ ఏకీకృత నాయకత్వాన్ని" అణగదొక్కారని ఆరోపించి ఆయన్ను ఉరితీశారు. దాంతో, నిర్దయుడైన యువ నేత తెరపైకి వచ్చారు.
మొత్తం గుప్పిట్లోకి..
ఈ ప్రక్షాళన నుంచి తప్పించుకోవడానికి అనేకమంది సరిహద్దు దాటి చైనాకు, చివరికి దక్షిణ కొరియాకు పారిపోయారు. ఈ పలాయనాలను ఆపాలని కిమ్ నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల చుట్టూ ముళ్ల కంచెలు లేచాయి.
ఆ సమయంలో హా జిన్ వూ బ్రోకర్‌గా గా పని చేస్తుండేవారు. దాదాపు 100 మందిని ఉత్తర కొరియా నుంచి బయటకు తీసుకురాగలిగారు. "దేశానికి ప్రత్యేక సరిహద్దు భద్రతా దళం ఉంది. సరిహద్దు దాటడానికి ప్రయత్నించేవారిని కాల్చి చంపమని వారికి ఆదేశాలు ఇచ్చారు. అందుకు వారి మీద నేరం మోపరు."
"ఈ పని మొదలెట్టినప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ, ఇది నా బాధ్యత అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచీ ఉత్తర కొరియాపై అనుమానాలు ఉన్నాయి. జంతువు కన్నా హీనంగా బతకడానికి ఇక్కడ ఎందుకు పుట్టాను? స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు అనుకునేవాడిని. ప్రాణాలకు తెగించి ఈ పనిలోకి దిగాను."
చివరకు, ఆయన్ని కూడా లిస్ట్‌లో పెట్టారు. ఇక దేశం విడిచి పారిపోక తప్పలేదు. హా జిన్ వూ తల్లిని జైలు శిబిరంలో బంధించారు. అక్కడ పెట్టిన చిత్రహింసలకు ఆమెకు పక్షవాతం వచ్చింది.
ఇది ఇప్పటికీ జిన్ వూను వెంటాడుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Reuters
మిస్టర్ పాపులర్
ఓ పక్క అసమ్మతి తెలిపినవారిని, ప్రత్యర్థులను అణచివేస్తున్నప్పటికీ, కిమ్ తన తండ్రి కన్నా స్నేహపూర్వకంగా, ఆధునికంగా కనిపించేవారు. ఆధునిక యువతి రి సొల్ జును వివాహమాడారు. వివిధ పట్టణాలను, గ్రామాలను సందర్శించినప్పుడు నవ్వుతూ, చేతులూపుతూ, కౌగలించుకుంటూ ఫొటోల్లో కనిపించేవారు. రోలర్ కోస్టర్స్ రైడింగ్, స్కీయింగ్, గుర్రాలపై స్వారీ చేసేవారు.
వీరి జంట సౌందర్య సాధనాల ఫ్యాక్టరీలను సందర్శించింది. విలాసవంతమైన వస్తువులను ప్రదర్శించేవారు. అయితే, ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలకు మాత్రం "ఆధునికంగా" కనిపించడం నిషేధం.
స్మగ్లింగ్ చేసిన దక్షిణ కొరియా డీవీడీల్లో చూపించినట్లు ఆధునికంగా ఉండాలని యూన్ మి సో కోరుకునేవారు. చెవులకు కమ్మలు, మెడలో నెక్లెస్, జీన్స్ ధరించాలని ఆశపడేవారు.
"ఈ నియమాలను పాటించలేదని నన్ను ఒకసారి పబ్లిక్‌లో నిలబెట్టి తిట్టారు. నీకు సిగ్గులేదా, ఇంత అవినీతికి ఎలా పాల్పడ్డావు అంటూ నేను ఏడ్చేవరకూ తిట్టారు."
కిమ్ జోంగ్ ఉన్ భార్యలాగే హ్యూన్ యంగ్ కూడా ఒక సింగర్. అయితే, ఆమె పాటలన్నీ ఉత్తర కొరియా నాయకుడిని కీర్తించడానికే పాడాల్సి వచ్చేది. ఆమె తిరగబడడానికి ప్రయత్నించారు. కానీ, అణగదొక్కేశారు. "నేను కళాత్మకంగా చేయాలనుకున్నదేదీ చేయనివ్వలేదు. ఉత్తర కొరియా సంగీతంలో చాలా నియంత్రణ, నిర్బంధం ఉండేది. నేను చాలా బాధలు పడ్డాను."
"విదేశీ ప్రభావానికి భయపడి ప్రభుత్వం దీన్ని నియంత్రిస్తోంది. తమ పాలనపై తమకే నమ్మకం లేదని ఈ నిబంధనలు సూచిస్తున్నాయి. "
దక్షిణ కొరియా కే-పాప్ వీడియోలను చూసినందుకు లేదా పంపిణీ చేసినందుకు గత దశాబ్దంలో కనీసం ఏడుగురికి మరణశిక్ష విధించారు.
విదేశీ ప్రభావం "ప్రమాదకరమైన క్యాన్సర్" లాంటిదని కిమ్ పేర్కొన్నారు. పైగా, ముప్పు ఎంతో దూరంలో లేదు.
టిక్ టాక్ బూమ్
ఉత్తర కొరియా చేసిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలన్నీ ప్రపంచంవ్యాప్తంగా వార్తల్లోకెక్కాయి. కానీ, అనుకున్నంతగా స్వదేశంలో దాని గురించి ఎవరూ గర్వపడలేదు. "ప్రజల రక్తమాంసాలు పిండేస్తూ, ఆయుధాలు అభివృద్ధి చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు" అని దేశం నుంచి పారిపోయిన ఒక వ్యక్తి చెప్పారు.
"దీన్ని విజయంగా మేం భావించలేదు. మేం సంపాదిస్తున్న సొమ్మంతా వాటి మీద ధారపోస్తున్నారు. వాటిమీద ఇంత ఖర్చు అవసరమా అని అనుకున్నాం." అన్నారాయన
2016 ప్రాంతంలో విదేశీ కార్యాలయంలో రాయబారి ర్యూకి కొత్త ఆదేశాలు జారీ చేశారు. "ఉత్తర కొరియాకు అణ్వాయుధాలు ఎందుకు అవసరమో వివరించి వాటిని సమర్థించాలి. అందరికీ వాటి ప్రయోజనం విప్పి చెప్పాలి." అన్నది ఆ సందేశం
దౌత్యవేత్తలు దీని గురించి మాట్లాడటం ద్వారా అంతర్జాతీయ సమాజంలో దీన్ని సాధారణీకరించాలన్నదే ఆలోచన. కానీ, అలా జరగలేదు.
రాకెట్ మ్యాన్ చేసిన జూదం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య పెరుగుతున్న ఘర్షణ పరిస్థితులు ఎట్టకేలకు వ్యూహాత్మకంగా ముగిశాయి. పాశ్చాత్య మీడియాలో కిమ్‌ను చెడిపోయిన పిల్లాడిలా చిత్రీకరిస్తారు. అలాటిది, కిమ్, అమెరికా అధ్యక్షుడితో కలిసి ఆత్మవిశ్వాసంతో వేదిక పంచుకున్నారు.
సింగపూర్‌లో వీరిద్దరి హ్యాండ్‌షేక్ ఫొటోలోలను ఉత్తర కొరియా వార్తాపత్రికలు మొదటి పేజీల్లో ప్రచురించాయి. కానీ, అణు కార్యక్రమాన్ని అరికట్టడానికి ఆంక్షలు మొదలయ్యాయి.
అయితే, ప్యాంగ్యాంగ్‌కు అవతల ఈ మొత్తం వ్యవహారంపై వచ్చిన స్పందలన్నింటినీ అణచివేశారు.
"దాని అర్థాన్ని విశ్లేషించే సామర్థ్యం మాకు లేదు. ఆ సమావేశం మెరుగుదలకు దారితీస్తుందో లేదో మాకు అర్థం కాలేదు" అని వ్యాపారి చోయ్ నా రే చెప్పారు.
కానీ ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని, ఆంక్షల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఇదంతా ఒక ప్రదర్శన అని రాయబారి ర్యూ అభిప్రాయపడ్డారు.
"ఉత్తర కొరియా ఈ ఆయుధాలను ఎప్పటికీ వదులుకోదు. ఎందుకంటే ఇది తమ పాలన మనుగడకు ముఖ్యమని భావిస్తున్నారు"

ఫొటో సోర్స్, Reuters
కోవిడ్ సంక్షోభం
2020 జనవరిలో పక్క దేశం చైనాలో కరోనావైరస్ విజృంభించింది. దాంతో, ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేసింది. ప్రజలకే కాదు వాణిజ్యానికి కూడా తలుపులు మూసేసింది.
ఆహారం, మందులు లోపలికి అనుమతించలేదు. ఉత్తర కొరియా వాణిజ్యంలో 80 శాతం చైనా నుంచే వస్తుంది.
"కోవిడ్ నుంచి చాలా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోంది. ధరలు పెరిగిపోయాయి. జీవించడం కష్టమైపోయింది. నా తల్లిదండ్రులకు ఆహారం దొరుకుతోందిగానీ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చాలా ఒత్తిడిగా ఉంది. పరిస్థితి తీవ్రంగా ఉంది" అని ఒకప్పుడు ఉత్తర కొరియాలో డ్రైవర్‌గా పనిచేసిన జు సియోంగ్ చెప్పారు.
దేశంలో కొందరు ఆకలితో అలమటిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇది "అతిపెద్ద సంక్షోభం" అని కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ప్రకటించారు. ఒక ప్రసంగంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. ఆయన నుంచి ఇది ఎవరూ ఊహించలేదు.
చాలావరకు మందులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవలసి వస్తోందని అక్కడి మాజీ డాక్టర్ కిమ్ సంగ్ హుయ్ తెలిపారు. కరెంట్ లేకుండా, సర్జన్లు లేకుండా ఆపరేషన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఒక్కోసారి డాక్టర్లు చేతులకు గ్లౌవ్స్ కూడా లేకుండా చికిత్స చేయాల్సి వచ్చింది.
"ఈ ద్వీపకల్పంలో రెండు దేశాలూ ఎంత భిన్నంగా ఉన్నాయో కదా అనిపిస్తుంటుంది. రోగుల, వైద్యుల మానవ హక్కులకు హామీ ఇచ్చే భావి ఉత్తర కొరియా రావాలని ఆశిస్తున్నాను." అన్నారు సియోంగ్.
మహమ్మారికి నార్త్ కొరియా సన్నద్ధం కాలేదు. కోవిడ్‌తో ఎంతమంది మరణించారో లెక్కలు లేవు.

ఫొటో సోర్స్, AFP
కిమ్ ఆరాధన
ప్రస్తుతం నార్త్ కొరియాలో పరిస్థితులు చూసి, దేశంలో తిరుగుబాటు వస్తుందని దేశం నుంచి పారిపోయినవారు ఆశించారు. కానీ, సుదూరంలో కూడా అలాంటి సంకేతాలు కనిపించట్లేదు.
దేశ ప్రజల్లో కిమ్ కుటుంబం పట్ల ఆరాధన ఇంకా స్థిరంగానే ఉన్నట్టు ఉంది. ప్రభుత్వం పడిపోతుందన్న అంచనాలన్నీ తప్పని నిరూపణ అయ్యాయి.
సుమారు 70 సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఉత్తర కొరియా సరిహద్దులు తెరుచుకోవాలని, ప్రజలు స్వేచ్ఛగా విదేశాలకు ప్రయాణించగలగాలని బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చినవారిలో చాలామంది ఆశిస్తున్నారు. తమ కుటుంబాలను మళ్లీ కలుసుకోవాలని ఆశపడుతున్నారు.
వీళ్లు దేశం నుంచి బయటికొచ్చేశారు కాబట్టి కిమ్ జోంగ్ ఉన్ పాలన గురించి గొంతెత్తి చెప్పగలరు. కానీ ఆ దేశంలోనే చిక్కుకున్న కుటుంబాలు ఆ పని చేయలేవు.
"నా ప్రాణాలకు తెగించి నా కోసం నేను పాడుకున్నాను. కానీ, ఉత్తర కొరియాలో ఉన్నవాళ్లు ఆ కోరికను తమ మనసులోనే చంపేసుకోవాలి" అని సింగర్ హ్యూన్ హాంగ్ అన్నారు.
తన పాలన 10వ వార్షికోత్సవం నాటికి కిమ్ జోంగ్ ఉన్ పెద్ద సంక్షోభంలో చిక్కుకుని ఉన్నారు. వారి దగ్గర డజన్ల కొద్దీ అణ్వాయుధాలు ఉన్నాయిగానీ, దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు ప్యాంగ్యాంగ్‌ను సందర్శించిన తరువాత, సియోల్ మధ్యలో భారీ పోస్టర్ అతికించారు. కే-పాప్ చిహ్నమైన లవ్ సింబల్‌ను చేతి వేళ్లతో చూపిస్తున్న కిమ్ ఫొటో అది.
అవే చేతి వేళ్లతో తన దేశ ప్రజల భవిష్యత్తును కిమ్ మార్చగలరని అప్పట్లో నేను రాశాను. వారికి స్వేచ్ఛా స్వతంత్రాలను ఇవ్వొచ్చు. ఆయనకు ఆ శక్తి ఉంది. కానీ , దానికి బదులుగా, 2.5 కోట్ల ఉత్తర కొరియా జనాభా ప్రపంచానికి మునుపటి కన్నా మరింత దూరంగా జరిగిపోయారు.
(బీబీసీకి ఇంటర్వ్యూలు ఇచ్చినవారంతా ప్రాణాలకు తెగించి ఉత్తర కొరియా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం సౌత్ కొరియా, అమెరికాలలో నివసిస్తున్నారు. వారి కుటుంబాలకు ప్రమాదకరం కాకూడదని కొందరి పేర్లను మార్చాం)
ఇలస్ట్రేషన్స్: గెర్రీ ఫ్లెచర్
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియాలో గ్యాస్ మాస్క్‌లతో పరేడ్ ఎందుకు నిర్వహించారంటే...
- ఒమిక్రాన్: వ్యాక్సీన్ అంటే ఏంటి, దీన్ని ఎలా తయారుచేస్తారు?
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు మిగతా దేశాలకు ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి
- ప్రధాన మంత్రే స్వయంగా మిలటరీ దుస్తులు ధరించి యుద్ధ రంగంలో దిగారు
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ చెప్పిన ‘ఘోర పరిస్థితి’ ఏమిటి.. కరోనా మరణాలేనా
- దేశంలో కండోమ్‌ల వాడకం ఎందుకు పెరిగింది? - జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5
- ఉత్తర కొరియా గూఢచర్య కార్యక్రమాల కోసం జపాన్ బీచ్‌లో అమ్మాయిల కిడ్నాప్
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- ఎల్టీటీఈ ప్రభాకరన్: హీరోనా... విలనా?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ అంతుచిక్కని నిర్మాణం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








