ఇథియోపియా: తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ముందుండి యుద్ధాన్ని నడిపించిన ప్రధాని అబీ అహ్మద్

ఫొటో సోర్స్, FANA BROADCASTING CORPORATE
- రచయిత, ఫరూక్ చోథియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు యుద్ధంలో ముందు నిల్చుని పోరాటం చేసేవారు. వారిలాగే ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ కూడా టిగ్రే తిరుగుబాటుల దారులకు వ్యతిరేకంగా ముందుండి పోరాటం చేశారు.
అబీ అహ్మద్‌ను పదవి నుంచి దించేస్తామని టిగ్రే తిరుగుబాటుదారులు ఒక దశలో బెదిరించారు. కానీ, ఆయన నేతృత్వంలోని ఇథియోపియా సైన్యం టిగ్రే సంక్షోభాన్ని ఎదుర్కొంది.
2019లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రధాని అబీ అహ్మద్, అసాధారణ రీతిలో టిగ్రే సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం మిలటరీ దుస్తులు ధరించి కొండల్లో, గుట్టల్లో నడుస్తూ, బైనాక్యులర్‌తో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తూ, తన సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగాలిస్తూ అనేక వీడియోల్లో, ఫొటోల్లో కనిపించారు.
"చరిత్రలో నిలిచిపోవాలనుకునే ఇథియోపియా కన్నబిడ్డలు ఇప్పుడే ముందుకొచ్చి మీ దేశం కోసం పోరాడండి. ముందు వరుసలో కలుద్దాం".. ఇదీ ప్రధాని అబీ ఇచ్చిన నినాదం.
టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్)కు వ్యతిరేకంగా బలగాలను కూడదీయడంలో ప్రధాని అబీ నిర్ణయం కీలకపాత్ర పోషించిందని చెప్పడానికి సందేహమేమీ లేదని నార్వేలోని ఓస్లో న్యూ యూనివర్శిటీ కాలేజీలో కాన్‌ఫ్లిక్ట్ స్టడీస్ ప్రొఫెసర్ జెటిల్ ట్రోన్‌వోల్ అన్నారు.
"ఆయన ముందు వరుసకు దగ్గరగా ఉన్నారుగానీ యుద్ధభూమిలో నిల్చుని పోరాడడం లేదని ఫొటోలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆయన తీసుకున్న నిర్ణయం ఫలించింది" అని ఆయన అన్నారు.
"ఆ చర్య సైన్యాధికారుల్లో ధైర్యాన్ని నింపింది. ఇథియోపియన్ జాతీయవాదాన్ని పెంపొందించింది. హేలీ గెబ్ర్‌సెలాస్సీ లాంటి స్పోర్ట్స్‌స్టార్స్, హీరోలు ముందుకొచ్చి యుద్ధానికి మద్దతు తెలిపారు. ఎంతోమంది ఇథియోపియన్ పౌరులు సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపించారు." అని ప్రొఫెసర్ జెటిల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AC
డ్రోన్ దాడులు
టీపీఎల్ఎఫ్‌కు తగిలిన ఎదురుదెబ్బలు చాలా పెద్దవే. రాజధాని ఆడిస్ అబాబా నుంచి 130 కిమీ దూరంలో ఉన్న డెబ్రే బిర్హాన్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలను టిగ్రే టీపీఎల్ఎఫ్ సాయుధులు ఆక్రమించుకున్నారు. కానీ, ఇథియోపియా సైన్యం వాళ్లని 400 కి.మీ వెనక్కి వెల్దియాకు తరిమికొట్టింది.
దాంతో, తిరుగుబాటుదారులు ఏ2 హైవేపై తమ కీలక స్థావరాలను కోల్పోయారు. ఈ హైవే టిగ్రేలో వారి బలమైన స్థావరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికార పీఠంతో కలుపుతుంది.
ఓ పక్క ప్రధాని అబీ నేలపై తన సేనలను సమీకరిస్తే, మరో పక్క చైనా, టర్కీ, ఇరాన్‌ల నుంచి తీసుకొచ్చిన డ్రోన్‌లు ఆకాశం నుంచి టిగ్రే తిరుగుబాటుదారులను దూరంగా తరిమికొట్టాయని ప్రొఫెసర్ ట్రోన్‌వోల్ అన్నారు.
"చైనాకు చెందిన వింగ్ లూంగ్ II అత్యధిక సైనిక సామర్థ్యం కలిగిన డ్రోన్‌లు. యుద్ధభూమిలో ట్యాంకులను, భారీ ఫిరంగిదళాలను దెబ్బతీయడంలో, సైన్యంపై బాంబులు వేసి చెదరగొట్టడంలో ఇవి సహాయపడతాయి" అని వెల్లడించారు.
అదే సమయంలో, యుద్ధం విరమించుకోవాలని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు తెచ్చిన ఒత్తిడిని ఇథోపియన్ ప్రభుత్వం ప్రతిఘటించింది.
పాశ్చాత్య శక్తులు టీపీఎల్ఎఫ్ మిత్రదేశాలని ఆరోపించింది. ఇథియోపియన్ రన్నింగ్ లెజెండ్ గెబ్ర్‌సెలాస్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
"ఇరాక్, సిరియా, యెమెన్, లిబియా ఎలా నాశనం అయ్యాయో లేదా విచ్ఛిన్నమయ్యాయో మనం చూశాం. కానీ, 12 కోట్ల జనాభా కలిగిన దేశం ఇథియోపియా. మా దేశాన్ని అస్థిరపరిచే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొడతాం. మా ఆఫ్రికన్ సోదరులు, సోదరీమణులు మాకు మద్దతు ఇస్తారని నాకు తెలుసు. శతాబ్దాలుగా మేమంతా వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం" అని ఆయన ప్రభుత్వ మీడియాతో అన్నారు.
ఆఫ్రికన్ దేశాలు, అలాగే పాశ్చాత్య దేశాలకు ప్రత్యర్థులుగా ఉన్న ఇతర దేశాల మద్దతును కూడగట్టుకునేందుకు అబీ తన వాక్చాతుర్యానికి ఉపయోగించారని ప్రొఫెసర్ ట్రోన్‌వోల్ అభిప్రాయపడ్డారు.
"యుద్ధ ప్రారంభంలో, టీపీఎల్ఎఫ్‌ను కుట్రదారులని అబీ పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా చట్టాన్ని అమలుచేశారు. కానీ, ఆ తరువాత తన పంథాను మార్చి టీపీఎల్ఎఫ్‌ను సామ్రాజ్యవాద శక్తులకు ప్రతినిధులని పేర్కొన్నారు. దాంతో, ఆఫ్రికా దేశాల అంగీకారం, మద్దతు ఇథియోపియాకు లభించింది. అలాగే, పూర్వ కాలపు చక్రవర్తుల్లా ఇథియోపియా కీర్తి కోసం అబీ పోరాడారు"

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాపులారిటీ పెరిగింది
ఇథియోపియా ప్రభుత్వాన్ని పడగొడతామని శపథాలు చేసిన టీపీఎల్ఎఫ్‌ను 19వ శతాబ్దంలో ఇటాలియన్ ఆక్రమణదారులతో పోల్చారు అబీ. అమ్హారా జాతి నుంచి వచ్చిన ఆధునిక ఇథియోపియా స్థాపకుడు మెనెలిక్ II చక్రవర్తి సైన్యం 1896లో ప్రసిద్ధ అడ్వా యుద్ధంలో ఇటాలియన్ ఆక్రమణదారులను తరిమికొట్టింది.
"ప్రపంచానికి వాస్తవాలు విప్పి చెప్పడంలో నా ఇథియోపియన్ ప్రజల పాత్ర ప్రశంసనీయం. ఐక్యతతో ఈ పురాతన దేశం ఎదుర్కొంటున్న ముప్పులన్నింటినీ మనం అధిగమించగలం. అడ్వా బిడ్డలుగా ఇథియోపియాను చురుకుగా ముందుకు తీసుకెళదాం" అని అబీ ట్వీట్ చేశారు.
టీపీఎల్ఎఫ్ ఒక గెరిల్లా ఉద్యమం. ఇది 1991లో ఇథియోపియాలో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత రెండు దశాబ్దాల పాటూ టీపీఎల్‌ఎఫ్ దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది.
టీపీఎల్‌ఎఫ్ 2019 వరకు ఇథియోపియా రాజకీయాల్లో ప్రభావవంతంగా ఉంది. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ కొత్త పార్టీని స్థాపించినప్పుడు, టీపీఎల్‌ఎఫ్ ప్రభుత్వంలో చేరేందుకు తిరస్కరించింది.
టీపీఎల్‌ఎఫ్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అబీ ప్రచారం ప్రారంభించినప్పుడు, తమ బలమైన కోట టిగ్రేకు మరలింది. అక్కడి నుంచి గత ఏడాది తిరుగుబాటు ప్రారంభించింది. అబీ తీసుకొచ్చిన సంస్కరణలపై ధ్వజమెత్తింది.
తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నప్పుడు అబీ పాపులారిటీ తగ్గుతూ వచ్చిందని, అలాంటి సమయంలో ఆయన పోరాటంలో ముందునిల్చోవడంతో ఇథియోపియన్ ప్రజల అభిమానాన్ని తిరిగి పొందారని బ్రిటన్‌లో ఉన్న హార్న్ ఆఫ్ ఆఫ్రికా విశ్లేషకుడు అబ్దుర్రహ్మాన్ సయ్యద్ అన్నారు.
"తన ఇల్లు విడిచి, సైన్యంతో కలిసి పోరాటంలో ముందు వరుసలో నిల్చోవడం ద్వారా ఇథియోపియా కోసం ప్రాణాలైనా అర్పించగలననే సందేశాన్ని దేశ ప్రజలకు పంపారు." అని ఆయన పేర్కొన్నారు.
"అబీకి ఇథియోపియా రాజులు, వారి చరిత్ర అంటే చాలా మక్కువ. ఇథియోపియాకు ఏడవ రాజుగా తాను అవతరిస్తానని వాళ్ల అమ్మ జోస్యం చెప్పినట్లు ఓ ప్రసంగంలో ఆయన చెప్పారు. పూర్వం రాజులు ముందు నిలబడి సైన్యన్ని నడిపించేవారు. అబీ కూడా అలాగే చేశారు."
నోబుల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి ఇలాంటి పోరాట శైలిని ఎంచుకోవడం అసాధారణమని ట్రోన్‌వోల్ అన్నారు.
"బరాక్ ఒమాబా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత నోబుల్ శాంతి బహుమతిని పొందారు. కానీ, ఆ తరువాత అఫ్గానిస్తాన్‌పై డ్రోన్ దాడిని చేపట్టారు. అయితే, ఆయన వైట్ హౌస్‌లో వార్ రూమ్‌లో కూర్చునే పర్యవేక్షించారు. కానీ, యుద్ధంలో ఫ్రంట్ లైన్‌కు దగ్గరగా వెళ్లిన మొదటి వ్యక్తి అబీ అహ్మద్" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కీలక రహదారిని చేజిక్కించుకునేందుకు పోరాటం
తొలుత అబీ నవంబర్ చివర్లో తూర్పు వైపుకు వెళ్లారు. అప్పటికే, అక్కడ అఫార్ ప్రాంతంలో ఇథియోపియా ప్రత్యేక దళాలు, ఆర్మీ బలగాలు టీపీఎల్ఎఫ్‌పై పోరాటంలో నష్టాన్ని చవిచూశాయి.
"అఫార్‌లు, ట్రిగ్రేయన్లకు పొరుగువారు. సంప్రదాయకంగా వారిని యోధులుగా పరిగణిస్తారు. దాదాపు ప్రతీ అఫార్ వ్యక్తి దగ్గరా 15 ఏళ్ల వయసు నుంచే తుపాకీ ఉంటుంది. వాళ్లు టీపీఎల్ఎఫ్‌ను తీవ్రంగా ప్రతిఘటించారు. ముఖ్యంగా, మొదటిసారి అఫార్ మహిళలు ఈ పోరాటంలో పాల్గొన్నారు" అని అబ్దుర్రహ్మాన్ చెప్పారు.
"అఫార్‌లో టీపీఎల్ఎఫ్ సాయుధులు చేసిన దురాగతాల పట్ల అఫార్‌లకు చాలా కోపం ఉంది. పోరాటంలో ఇది కీలకమైన మలుపు’’ అని అబ్దుర్రహ్మాన్ అభిప్రాయపడ్డారు.
"ఇథియోపియాలో జిబౌటీ పోర్టు ఆర్థికంగా ఎంతో కీలకమైన ప్రాంతం. టీపీఎల్ఎఫ్, జిబౌటీ సరిహద్దులను చేరుకోకుండా అఫార్ పోరాటం నిలువరించింది" అని ఆయన వివరించారు.
"ఆ సరిహద్దులకు వెళ్లే రహదారిపై టీపీఎల్ఎఫ్ కనుక పట్టు సాధించి ఉంటే ఇథియోపియా ఆర్థిక వ్యవస్థ కూలబడేది. సరుకులు ఆడిస్ అబాబాకు చేరేవి కావు. అలాగే, రాజధానిపై టిగ్రేయన్లు ఆధిపత్యం పొందే అవకాశాలు పెరిగుండేవి."
పోరాటం నుంచి రెండు వారాల తరువాత అబీ అహ్మద్ ఈ వారమే తన కార్యాలయానికి తిరిగి వచ్చారు. అమ్హారా ప్రాంతంలో మరి కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో సైన్యానికి నాయకత్వం వహించేందుకే యుద్ధభూమికి వెళ్లినట్లు ప్రకటించారు.
అయితే, తమ వంతుగా చారిత్రాత్మక చర్చి పట్టణం లాలిబెలాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు టీపీఎల్ఎఫ్ తెలిపింది. అబీ అహ్మద్ తన దేశంలో పాపులారిటీ సంపాదించుకుని ఉండొచ్చుగానీ ప్రపంచ స్థాయిలో తన ప్రతిష్టను దిగజార్చుకున్నారని ట్రోన్‌వోల్ అభిప్రాయపడ్డారు.
"నోబుల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి అంతిమ లక్ష్యం శాంతి స్థాపన కావాలి. కానీ, కాల్పుల విరమణకు అబీ ఒప్పుకోలేదు. అంతే కాకుండా, ఆయన సైన్యం విస్తారంగా దురాగతాలకు పాల్పడింది." అన్నారాయన.
అయితే, పోరాటం చేయడం తప్ప అబీకి మరో మార్గం లేదని, లేదంటే టీపీఎల్ఎఫ్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అబ్దుర్రహ్మాన్ అభిప్రాయపడ్డారు. "ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. కానీ, తనను పడదోయడం అంత సులువు కాదని అబీ అహ్మద్ నిరూపించారు."
ఇవి కూడా చదవండి:
- అబీ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం.. ఏటీఎంల గురించి వారికి తెలియదు
- ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌కు నోబెల్ శాంతి పురస్కారం
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- మానవ పరిణామ క్రమంలో భాగమైన కోతి ఇదేనా
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- 2021లో ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినవి ఇవే
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండా, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, ఈ ఉద్రిక్తతలకు కారణమేంటి?
- చైనాను ఆపడం ఇప్పుడు అమెరికాకు ఎందుకంత కష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








