గూగుల్: డూమ్‌స్క్రోలింగ్, స్క్విడ్ గేమ్ - 2021లో ప్రజలు అత్యధికంగా సెర్చ్ చేసినవి ఇవే

ఫొటో సోర్స్, Netflix
గూగుల్‌లో ఈ ఏడాది అత్యధికంగా వెతికిన కొన్ని అంశాల జాబితాను ఆ సంస్థ వెల్లడించింది. 2021లో జరిగిన, వెతికిన కీలక సంఘటనల గురించి ఈ జాబితా తెలుపుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన సెర్చ్ ఇంజిన్‌గా పేరు తెచ్చుకున్న 'గూగుల్', ప్రజలు అత్యంత ఎక్కువగా వెతికిన ప్రశ్నలు, సంఘటనలకు సంబంధించిన జాబితాను ప్రతి ఏడాది చివర్లో విడుదల చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
డూమ్ స్క్రోలింగ్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో మనం 2021 ఏడాదిలోకి అడుగుపెట్టాం. అదే సమయంలో గూగుల్‌లో 'డూమ్‌స్క్రోలింగ్' అనే పదాన్ని ఎక్కువగా వెతికారు.
డూమ్‌స్క్రోలింగ్ అంటే మరిన్ని చెడు వార్తల కోసం ఫోన్‌ను అదేపనిగా ఉపయోగించడం.
ప్రపంచవ్యాప్తంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 'డూమ్‌స్క్రోలింగ్' అనే పదాన్ని వెతికారని... ముఖ్యంగా జనవరి నెలలో అత్యధికంగా దీని గురించి శోధించారని గూగుల్ వెల్లడించింది.
ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు అనిశ్చితిని, ఒత్తిడిని ఎదుర్కొన్నారు. సరిహద్దుల్లో ఆంక్షలు విధించడంతో పాటు విమాన ప్రయాణాలు నిలిపేశారు. లాక్‌డౌన్‌లను అమలు చేశారు.
ఆ పరిస్థితుల్లో ప్రజలు కోవిడ్-19 తాజా సమాచారం, స్థితిగతులు తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌కి వచ్చేవారు. సరిగ్గా దీన్నే 'డూమ్‌స్క్రోలింగ్' అంటారు. కానీ దీని అర్థం తెలియని చాలామంది ప్రజలు 'డూమ్‌స్క్రోలింగ్' అనే పదాన్ని గూగుల్‌లో ఎక్కువగా వెతికారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక ఆరోగ్యం
2021లో 'మానసిక ఆరోగ్యం' గురించి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వెతికారు. ఐసోలేషన్‌లో ఉండటం, కరోనాతో తమకు ప్రియమైన వారు దూరం కావడంతో ఏర్పడిన ఒంటరితనం కారణంగా 'మెంటల్ హెల్త్' అనే అంశం ఈ ఏడాది అత్యధిక మంది దృష్టికి వచ్చింది.
మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మానసిక ఆరోగ్యాన్ని ఎలా నయం చేసుకోవాలి? అనే అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గతంలో ఎప్పుడూ లేనంతగా గూగుల్‌లో వెతికారు.
మానసిక ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువ దృష్టి సారించారనడానికి సంకేతంగా... 'బాడీ పాజిటివిటీ', 'అఫిర్మేషన్ (ప్రతిజ్ఞ) అనే పదాలతో పాటు వ్యతిరేక ఆలోచనలను అధిగమించడానికి సానుకూల వ్యాఖ్యల్ని కూడా అధికంగా వెదికినట్లు తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులు
మన ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా, మన గ్రహం శ్రేయస్సు గురించి కూడా ప్రజలు ఆలోచించారు.
'ఇడా' అనే హరికేన్ మొదలుకొని కరవుతో పాటు కార్చిచ్చులు... ఇలా ఈ ఏడాదంతా వాతావరణ మార్పుల తాలూకూ దుష్ప్రభావాలను ప్రపంచమంతా చూసింది.
మునుపెన్నడూ లేని విధంగా.. జీవించడానికి మెరుగైన మార్గాలు, పచ్చదనం అనే అంశాల గురించి ప్రజలు వెదికినట్లు గూగుల్ డేటా ప్రకారం తెలుస్తోంది. 'పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి', 'సుస్థిరతను ఎలా సాధించాలి' అనే ప్రశ్నల్ని కూడా గతంలో కంటే ఎక్కువగా వెతికారు.
అంతేకాకుండా ప్రసిద్ధి చెందిన నగరాలతో పాటు ద్వీపాలకు చెందిన ప్రజలు కూడా 'వాతావరణ మార్పుల ప్రభావం' గురించి అత్యధికంగా శోధించారు.
వాతావరణ మార్పులతో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటైన 'ఫిజీ' గురించి కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక అంశాలు
కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ భద్రత, ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తానే ఒక యజమానిగా బతకాలనే ఆసక్తి ప్రజల్లో పెరిగింది.
2021లో కొత్త వ్యాపార మార్గాలు, అవకాశాల గురించి ప్రజలు అన్వేషించారు. 'ఉద్యోగం ఎలా సంపాదించాలి?' అనే ప్రశ్న కన్నా 'వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి' అనే ప్రశ్ననే గూగుల్‌లో అత్యధికంగా వెతికారు.
'డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్' నివేదిక ప్రకారం, ఒక్క అమెరికాలోనే అక్టోబర్‌లో 40 లక్షల మందికి పైగా ఉద్యోగాలను వదిలిపెట్టారని తెలిసింది.
కరోనా సృష్టించిన పరిస్థితుల కారణంగా కొంతమంది ప్రజలు, తమ ప్రాధామ్యాలను మార్చుకున్నారు. ఉత్తమమైన జీతం ఇచ్చే ఉద్యోగాలు లేదా స్థిరమైన కెరీర్‌ను కొనసాగించే అవకాశాల వైపుకు మళ్లారు.
ఎన్‌ఎఫ్‌టీ గురించి
ఆర్థిక అంశానికి సంబంధించిన మరో అంశం కూడా ఎక్కువగా గూగుల్ శోధనలో నిలిచింది. అదే ఎన్‌ఎఫ్‌టీ.
నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్‌ఎఫ్‌టీ) అనేది డిజిటల్ ఇమేజెస్ లేదా ఆర్ట్‌వర్క్. వీటికి యాజమాన్య హక్కులు పొందడానికి 'టోకనైజ్' చేస్తారు. ఇలా చేసి వీటి క్రయవిక్రయాలు జరుపుతారు.
కొంతకాలంగా ఇవి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కానీ ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే, ఎన్‌ఎఫ్‌టీలకు సంబంధించి చేసిన తొలి ట్వీట్ 29 లక్షల మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీంతో ఎన్‌ఎఫ్‌టీ గురించి ఉత్సాహం అందరిలో తారాస్థాయికి చేరింది.
డిజిటల్ అస్సెట్ గురించి మరింత తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకే 'ఎన్‌ఎఫ్‌టీలను ఎలా తయారు చేయాలి?' అనే పదాన్ని అత్యధికంగా వెతికారు.

ఫొటో సోర్స్, Netflix
కొరియన్ డ్రామా
ఈఏడాది అందరూ ఎక్కువగా ఇళ్లలోనే గడపడంతో, టీవీ చూసేందుకు కావాల్సినంత సమయం చిక్కింది.
నెట్‌ఫిక్స్‌లో ప్రసారమైన దక్షిణ కొరియా వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' గురించి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో వెదికారు.
జీవితాన్నే మార్చే ప్రైజ్‌మనీ గెలుపొందడం కోసం ప్రాణాంతక గేమ్‌లు ఆడే కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ఈ స్టోరీ అందరినీ విస్మయపరిచింది. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూశారు.
రాయల్ సెలబ్రిటీస్
బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మర్కెల్ మార్చిలో తొలిసారి టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. వారు రాజకుటుంబాన్ని వదిలిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే. యూఎస్ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ప్రే ఈ ఇంటర్వ్యూ చేశారు.
వీరిద్దరు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ, ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ హిస్టరీలోనే అత్యధికంగా వెతికిన ఇంటర్వ్యూగా నిలిచింది.
బ్రిటిష్ రాజకుటుంబంతో, వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఈ జంట బహిర్గతం చేసింది. తమ కుమారుడు 'ఆర్చీ' చర్మపు రంగుపై తలెత్తిన చర్చల గురించి ఈ జంట చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షికలకు ఎక్కాయి.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్
- ప్రధాని మోదీ ప్రారంభించనున్న కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలేంటి
- భారత్‌కు తాలిబాన్ల ప్రశంసలు, మరింత సాయం కావాలని వినతి
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’పై ఐసీఎంఆర్ నిపుణులు ఏమన్నారంటే..
- చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చారు.. పగలు రెక్కీ, అర్థరాత్రి దోపిడీ
- మధులిక రావత్: సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షురాలు
- ‘నా కళ్లతో నేను ఒక్క వ్యక్తినే చూశా.. ఆయన కాలిపోతున్నారు’ - బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదం ప్రత్యక్ష సాక్షి
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- తిరుపతి: 2015లో కుండపోత వర్షాలు పడినా రాని వరదలు ఇప్పుడెందుకొచ్చాయి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








