ఆంధ్రప్రదేశ్: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?

అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో కొన్నేళ్ల కిందటి వరకు సుమారు రూ.150 కోట్ల వ్యాపారం జరిగేది.
ఫొటో క్యాప్షన్, అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో కొన్నేళ్ల కిందటి వరకు సుమారు రూ.150 కోట్ల వ్యాపారం జరిగేది
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం...

‘‘అనకాపల్లి పేరు చెబితేనే బెల్లం గుర్తుకొస్తుంది. దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌. కానీ నేడు గిట్టుబాటు ధరల్లేవు.. రకరకాల ఆంక్షలు.. దళారీల దోపిడీ.. వెరసి బెల్లం తయారీ మానేసి రైతన్నలు వలస బాటపడుతున్నారు. పొట్టకూటి కోసం భవన నిర్మాణ కార్మికులుగా మారిన జమాదులపాలెం రైతన్నల దుస్థితే దీనికి నిదర్శనం. అనకాపల్లి బెల్లం వైభవం.. గత చరిత్రగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన రైతన్నల్లో కనిపిస్తోంది’’ - 2018 ఆగస్టు 31వ తేదీన అనకాపల్లి నియోజకవర్గంలోని మార్టూరి క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తులు నగర్, దర్జీనగర్‌లలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది.

దేశంలోనే రెండో అతి పెద్ద బెల్లం మార్కెట్. ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు. దేశం నలుమూలలకు ఎగుమతులు...ఇవి 120 ఏళ్ల చరిత్ర ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్ పేరిట ఉన్న రికార్డులు.

అనకాపల్లి ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండటం కూడా ఇక్కడ బెల్లం పరిశ్రమ వృద్ధి చెందడానికి ఒక కారణం కాగా, నాణ్యకు తిరుగులేని బ్రాండ్‌గా మారటం అనకాపల్లి బెల్లం ప్రత్యేకత. అయితే, ఏటేటా ఇక్కడి బెల్లం మార్కెట్ పడిపోతోంది. కారణాలు ఏంటి ?

రూ.100 కోట్లకు తగ్గిందంటే...

అనకాపల్లి పరిసరాల్లో బెల్లం గానుగలు తిరుగుతుంటాయి. సీజన్ మొదలు కావడంతో చెరకు వేసిన రైతులు...దానిని గానుగాడించి బెల్లంగా మార్చి మార్కెట్‌కు తీసుకొస్తారు. అయితే, మూడేళ్ల కిందటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న బెల్లం మార్కెట్, క్రమంగా కళ తప్పుతోంది.

ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు బెల్లం మార్కెట్ సీజన్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సీజన్ మొదలైనా...మార్కెట్ లో మాత్రం పెద్దగా సందడి కనిపించడం లేదు.

"నిజానికి గత పదేళ్ల నుంచి పెద్దగా వ్యాపారం జరగకున్నా...మూడేళ్లుగా అది తీవ్రస్థాయికి చేరింది. ప్రతి ఏటా అనకాపల్లి బెల్లం మార్కెట్ లో రూ.150 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. అయితే అది రూ.100 కోట్లకు తగ్గితే మార్కెట్ నష్టాల్లో నడుస్తుందనే లెక్క'' అని బెల్లం మార్కెట్ కార్యదర్శి రవి కుమార్ బీబీసీతో అన్నారు.

గత మూడేళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని రవి కుమార్ వెల్లడించారు.

''2016-17 సీజన్‌లో అత్యధికంగా రూ.146 కోట్ల వ్యాపారం జరిగింది. 2018 నుంచి 2021 మార్చి సీజన్ వరకు రూ. 91 కోట్ల నుంచి రూ. 77 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది అది కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. చెరకు పంట విస్తీర్ణం తగ్గడం, పసుపు తెగులు వ్యాపించడం లాంటి కారణాలున్నాయి. గతంలో జిల్లాలో 45 వేల హెక్టార్లుండే చెరకు విస్తీర్ణం ప్రస్తుతం 34వేల హెక్టార్లకు పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు చెరకు మీద ఆసక్తి చూపడం లేదు" అని ఆయన విశ్లేషించారు.

లాభాలు తగ్గుతుండటంతో రైతులు కూడా పంట వేయడంపై ఆసక్తి చూపడం లేదు.
ఫొటో క్యాప్షన్, లాభాలు తగ్గుతుండటంతో రైతులు కూడా పంట వేయడంపై ఆసక్తి చూపడం లేదు

32 ఎకరాల్లో షుగర్ బౌల్ ఆఫ్ ఏపీ

అనకాపల్లి బెల్లం మార్కెట్ విస్తీర్ణం 32 ఎకరాల్లో ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ తర్వాత, దేశంలో అతి పెద్ద బెల్లం మార్కెట్ ఇదే. 120 సంవత్సరాల కిందట ఏర్పాటైంది.

నర్సీపట్నం, అనకాపల్లి, మాడుగుల, యలమంచిలి, చోడవరం, పెందుర్తి నియోజక వర్గాల పరిధిలో రైతులు ఎక్కువగా చెరకు పండిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులకు అందుబాటులో ఉండే విధంగా బెల్లం మార్కెట్ అనకాపల్లిలో ఏర్పాటు చేశారు.

12 నుంచి 16 కేజీల బరువుల్లో బెల్లం దిమ్మెలు తయారు చేసి రైతులు మార్కెట్ కు తరలిస్తారు.

"అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను షుగర్ బౌల్ ఆఫ్ ఏపీగా పిలుస్తారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటుగా అటు తెలంగాణ, ఇటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు మా బెల్లం ఎగుమతి అవుతుంది. అనకాపల్లి మార్కెట్‌కు వచ్చే బెల్లంలో 80శాతానికి పైగా దేశంలోని ఇతర రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది'' అని అనకాపల్లి బెల్లం వ్యాపారుల సంఘం ప్రతినిధి మళ్ల సత్యనారాయణ అన్నారు.

అయితే, ఈ మార్కెట్ నుంచి విదేశాలకు ఎగుమతులు ఉండవు. దీనికి కారణం ఇక్కడి బెల్లంలో నీటి శాతం ఎక్కువగా ఉండటమేనని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ధరతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే అమెరికా, జర్మనీ దేశాల మార్కెట్లలోకి అనకాపల్లి బెల్లం అడుగు పెట్టలేదు.

దేశంలో బెల్లం ధర పెరిగి పోతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు.

''2011-12లో 2.07 లక్షల టన్నుల బెల్లంతో చేసిన పదార్థాలు విదేశాలకు ఎగుమతయ్యాయి. 2013-14లో ఇది 2.66 లక్షల టన్నులకు పెరిగింది. టాంజానియా, మలేషియా, ఒమన్‌, కెనడా దేశాలు మన దేశం నుంచి బెల్లం దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే మహారాష్ట్ర నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతోంది" అని సత్యనారాయణ వెల్లడించారు.

అనకాపల్లి బెల్లం మార్కెట్
ఫొటో క్యాప్షన్, అనకాపల్లి బెల్లం మార్కెట్

కమిటీకి డబ్బులు...ఆన్‌లైన్ ట్రేడింగ్

రైతులకు చెరకు మీద ఆసక్తి తగ్గుతుండటంతో దిగుబడి పడిపోయింది. ఫలితంగా బెల్లం తయారీ కూడా బాగా తగ్గిపోతోంది. ఈ ఏడాది (2020-21) సీజన్ ఇప్పటి వరకు మార్కెట్ కు కేవలం 16.64 లక్షల దిమ్మెలు మాత్రమే వచ్చాయి. రూ.77 కోట్ల వ్యాపారం మాత్రమే సాగింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్ కు ఇంత తక్కువ సరుకు రావడం ఇదే తోలిసారి.

కరోనా ప్రభావం, చెరకు సాగు తగ్గడం, పంటకు తెగుళ్లు సోకడం వంటి కారణాలతో యార్డుకు వచ్చే బెల్లం దిమ్మలు తగ్గుతున్నాయి.

"గతంలోకంటే ఇప్పుడు మార్కెట్ కు బెల్లం వేయడం బాగా తగ్గించేశాం. మార్కెట్ కమిటీ సెస్ ఎక్కువగా ఉంది. మేమే మార్కెట్‌కు పట్టుకెళ్లి బెల్లం అమ్మి, మళ్లీ కమిటీకి డబ్బులు కట్టాలంటే కష్టంగా ఉంటోంది. అందుకే, మా దగ్గరకు వచ్చే షావుకార్లకే నేరుగా బెల్లంగా అమ్మేస్తున్నాం. మార్కెట్లో లక్షకు వెయ్యి రూపాయల చొప్పున్న సెస్ వసూలు చేస్తున్నారు. ఇక బెల్లం పౌడర్లు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నాయి. దీంతో దిమ్మెలను కొనేవారి సంఖ్య తగ్గుతోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్ కూడా ఇబ్బందిగానే మారింది. సిండికేట్‌గా మారి, వాళ్లకు నచ్చిన ధరకే రైతులు బెల్లం అమ్మేలా వ్యాపారులు నియంత్రించగలుగుతున్నారు" అని బెల్లం రైతు ఆదిశంకర్ బీబీసీతో అన్నారు.

నల్లరంగు బెల్లానికి డిమాండ్ తక్కువ.
ఫొటో క్యాప్షన్, నల్లరంగు బెల్లానికి డిమాండ్ తక్కువ

సవాల్ గా మారిన 'సైజు'

అనకాపల్లి బెల్లం రైతులు సాధారణంగా 12 నుంచి 16 కేజీల చొప్పున్న బెల్లం దిమ్మెలు తయారు చేస్తారు. కొందరు 13, 14 కేజీల వారీగా కూడా చేస్తారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ కు వచ్చే బెల్లం దిమ్మెలన్నీ దాదాపు ఇవే సైజుల్లో ఉంటాయి.

అయితే ప్రస్తుతం ఈ సైజు కూడా అనకాపల్లి బెల్లానికి శాపంగా మారింది. అసలు దిమ్మెల రూపంలో ఉండటమే ఒక సమస్యగా మారుతోంది.

''ఖరీదు కాస్త ఎక్కువే అయినా బెల్లం పౌడరు కొనేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. పౌడరు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుంది. అందుకే వ్యాపారులు కూడా బెల్లం పౌడరు కొనేందుకే ఇష్టపడుతున్నారు'' అని యలమంచిలికి చెందని రైతు వై. రమణ బీబీసీతో అన్నారు.

బెల్లంతో పోల్చుకుంటే, పౌడర్ అమ్మకాలే వేగంగా జరుగుతున్నాయని, అందువల్ల, మార్కెట్‌కు వచ్చేది తక్కువ దిమ్మలే అయినా అవి కూడా అమ్ముడుపోని పరిస్థితి కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు.

''మేం 12 నుంచి 16 కేజీల మధ్య బెల్లం దిమ్మెలు తయారు చేస్తాం. కానీ, అయిదారు కేజీల దిమ్మెలు కావాలని వ్యాపారులు అడుగుతున్నారు. అలా చేస్తే మాకు ఖర్చులు పెరిగిపోతాయి. మంచి బెల్లం అయితే 10 కేజీలు రూ.290 నుంచి రూ.350 వరకు అమ్ముతారు. కానీ, అది కూడా నష్టమే. అందుకే చెరుకు వేయాలంటేనే భయంగా ఉంది'' అని రమణ అన్నారు.

వీడియో క్యాప్షన్, భవిష్యత్తులో ఆకలి తీర్చేది సముద్రపు నాచేనా
అనకాపల్లి లోని చెరుకు పరిశోధనా కేంద్రం
ఫొటో క్యాప్షన్, అనకాపల్లి లోని చెరుకు పరిశోధనా కేంద్రం

నల్లబెల్లం...తెల్లబెల్లం...

మార్కెట్‌లో బెల్లానికి ఎంత మంచి రంగు ఉంటే అంత మంచి సరుకుగా పరిగణిస్తారు. రంగు బెల్లానికి మంచి గిరాకీ ఉంటుంది. దాంతో తయారీదారులు బెల్లానికి తెల్లరంగు వచ్చే విధంగా రసాయన పదార్థాలు కలుపుతారు. ఇది నిల్వసామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. రసాయనాలు కలపడం వలన బెల్లంలో నీరు చేరి త్వరగా పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు.

''బెల్లం బంగారు రంగులో కనిపించేందుకు సోడియం, హైడ్రోజన్‌ సల్ఫేట్‌ వంటి రసాయనాలను వినియోగిస్తారు. ఇటువంటి బెల్లం ప్రమాదకరం. క్వింటాల్‌ బెల్లం తయారీలో 7 గ్రాములకు మించి సల్ఫర్‌ వినియోగించకూడదు. సల్ఫర్ పెరిగిన కొద్దీ బెల్లంలో తేమ పెరుగుతుంది. అనకాపల్లి మార్కెట్‌కు వచ్చే బెల్లంలో 10శాతం వరకు తేమ ఉంటుంది. ఎంత తేమ ఎక్కువగా ఉంటే బెల్లం అంత త్వరగా నీరుగారిపోతుంది. దాంతో సూక్ష్మక్రిములు కూడా చేరతాయి. ఈ కారణాలతో విదేశాలకు మన బెల్లాన్ని ఎగుమతి చేయలేకపోతున్నాం" అని అనకాపల్లి బెల్లం పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీకే జగన్నాధరావు చెప్పారు.

రసాయనాల వాడకం ఎక్కువగా ఉండటంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. ఇది అనకాపల్లి బెల్లం నాణ్యతకు మచ్చ తెస్తోంది. అలాగని నల్లబెల్లం తయారు చేద్దామంటే మార్కెట్ లో ఆ రంగు బెల్లానికి గిరాకీ ఉండటం లేదని రైతులు చెబుతున్నారు.

పౌడరు రూపంలో బెల్లం రావడం కూడా అనకాపల్లి మార్కెట్ పై ప్రభావం చూపుతోంది.
ఫొటో క్యాప్షన్, పౌడరు రూపంలో బెల్లం రావడం కూడా అనకాపల్లి మార్కెట్ పై ప్రభావం చూపుతోంది

‘ప్రభుత్వం ఆదుకోవాలి’

రంగు, పరిమాణం, ఆన్‌లైన్ మార్కెటింగ్, రసాయనాల వినియోగం, పంట విస్తీర్ణం తగ్గడం, ఇలాంటివన్నీ అనకాపల్లి బెల్లం అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రైతులు క్రమంగా చెరకు పంటకు దూరమవుతున్నారు. దీంతో బెల్లం మార్కెట్ తన ప్రభని కోల్పోతోంది.

"మళ్లీ అనకాపల్లి బెల్లం మార్కెట్ లో రూ.100కోట్ల వ్యాపారం చూడాలంటే ప్రభుత్వం రంగంలోకి దిగాలి. బెల్లం దిమ్మెలను చిన్నచిన్న దిమ్మెలుగా తయారు చేసేందుకు యంత్రాలు సమకూర్చాలి. చెరకు పంట వేసే వారికి ప్రొత్సాహకాలు ఇవ్వాలి. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో సిండికేట్ అవుతున్న వ్యాపారులపై దృష్టి పెట్టాలి'' అన్నారు బెల్లం మార్కెట్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ.

''అవసరమైన సబ్సిడీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించకపోతే అనకాపల్లి బెల్లం మార్కెట్ ఘనమైన చరిత్ర చరిత్రగానే మిగిలిపోతుంది'' అని లక్ష్మీనారాయణ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఒకవైపు ఆకలికేకలు, మరోవైపు ఆహార వృథా

ఉప ఉత్పత్తుల తయారీపై దృష్టి - అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

చెరుకు నుంచి బెల్లం మాత్రమే కాకుండా బెల్లం నుంచి వివిధ రకాలైన ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి పెట్టామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

బెల్లం నుంచి లిక్విడ్ బెల్లం, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర తినే పదార్థాలు తయారు చేసేందుకు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే అనకాపల్లి చెరుకు పరిశోధన కేంద్రంలో ఒక యూనిట్ పనిచేస్తుందని తెలిపారు.

ప్రస్తుతం బెల్లం దిమ్మల కంటే బెల్లంపొడికే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున బెల్లంపొడి తయారు చేసేందుకు అనుకూలంగా ఉండే విధంగా బెల్లం దిమ్మెలు తక్కువ సైజులో తయారు చేసేందుకు రైతులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

దీని కోసం మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బెల్లం తయారీని పెంచే విధంగా చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు సబ్సిడీలను అందిస్తామని అమర్నాథ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)