జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో అనుమానితుడి అరెస్ట్- News Reel

ఫొటో సోర్స్, Reuters
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న ఒక సౌదీ వ్యక్తిని ఫ్రాన్స్‌లో అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఖలీద్ ఎద్ అల్ ఒతైబి అనే వ్యక్తిని మంగళవారం చార్లెస్ డి గల్లె విమనాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించింది.
ఖషోగ్జీ హత్య కేసులో టర్కీ కోరుతున్న 26 మంది సౌదీలలో అల్ ఒతైబి ఒకరు.
ఈ 33 ఏళ్ల సౌదీ మాజీ రాయల్ గార్డ్ సొంత పేరుతోనే ప్రయాణం చేస్తున్నారని, ఆయన్ను అదుపులోకి తీసుకుని నిర్బంధంలో ఉంచారని ఆర్‌టీఎల్ రేడియో తెలిపింది.
సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే ఖషోగ్జీ, 2018లో టర్కీలోని సౌదీ కాన్సులేట్‌లో దారుణ హత్యకు గురయ్యారు.
వాషింగ్టన్ పోస్ట్ పత్రిక మాజీ జర్నలిస్ట్ అయిన ఖషోగ్జీని సౌదీకి తిరిగి తీసుకురావాలనే బాధ్యత అప్పగించిన ఓ బృందమే ఆయన్ను హత్య చేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది..
అయితే, సౌదీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఏజెంట్లు ఈ పనిచేశారని టర్కీ అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, Getty Images
రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణ శిక్ష, 33 రోజుల్లోనే తీర్పు ఇచ్చిన కోర్టు
గుజరాత్‌లోని సూరత్‌లో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు గుడ్డు యాదవ్(35)కి మరణ శిక్ష విధిస్తూ సూరత్‌లోని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సెషన్స్ కోర్టు రికార్డు స్థాయిలో 33 రోజుల్లోనే తీర్పు వెలువరించడం గమనార్హం.
"సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే సూరత్ పోలీసులు నిందితుడు గుడ్డు యాదవ్‌ను అరెస్టు చేశారు. అతడిని పట్టుకోవడానికి 100 మంది పోలీసులు పగలు రాత్రి శ్రమించారు. బాధిత కుటుంబానికి కోర్టు న్యాయం చేసింది. రికార్డు సమయంలో తీర్పు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.'' అని బీబీసీ ప్రతినిధి భార్గవ్ పారిఖ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా చెప్పారు.
సూరత్‌లోని పండేసర ప్రాంతంలో గుడ్డు యాదవ్ ఒక చిన్నారిని తీసుకుని వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత, గుడ్డు యాదవ్ ఆమెను హతమార్చాడు. తరువాత ఆమె మృతదేహాన్ని ఖాళీ స్థలంలో పడేశాడని పోలీసులు తెలిపారు. 7 రోజుల్లోనే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








