హెర్పెస్: ప్రసవం అయిన వెంటనే ఇద్దరు బాలింతల ప్రాణాలు తీసిన ఇన్ఫెక్షన్

సమంత, కింబర్లీ
ఫొటో క్యాప్షన్, సమంత, కింబర్లీ
    • రచయిత, జేమ్స్ కెల్లీ, మైకేల్ బుచానన్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రసవం అయిన వెంటనే హెర్పెస్ ఇన్ఫెక్షన్ సోకి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నుంచే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని బీబీసీ పరిశోధనలో తెలుస్తోంది.

అసలేం జరిగింది?

బ్రిటన్‌లో ఇద్దరు మహిళలకు 2018లో సిజేరియన్ కాన్పు జరిగింది.

అయితే, ఈ రెండు మరణాలకూ ఒకదానికొకటి సంబంధం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఈ మరణాలపై విచారణను తిరిగి చేపట్టాలని మృతుల కుటుంబాలు కోరుతున్నాయి.

ఇన్ఫెక్షన్ మూల కారణాన్ని ఆస్పత్రి కనిపెట్టలేకపోయిందని ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ ట్రస్ట్ చెబుతోంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ కు వైరస్ ఉన్నట్లు తేలలేదని చెబుతోంది.

బ్రిటన్‌లో ప్రసూతి మరణాలు చోటు చేసుకోవడం చాలా అరుదు. అక్కడ 2017-2019 మధ్య కాలంలో 21 లక్షల జననాలు సంభవిస్తే, 191 మంది తల్లులు బిడ్డ పుట్టిన తొలి 6 వారాల్లో మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఆరోగ్యవంతులు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్‌లోని హెచ్‌ఎస్‌వి - టైప్1 స్ట్రెయిన్ సోకి ప్రాణాలు కోల్పోయినట్లు ఎప్పుడూ వినలేదు.

ఈ ఇన్ఫెక్షన్ వల్ల నోటి చుట్టూ లేదా జననేంద్రియాల దగ్గర పుండ్లు వస్తాయి.

2018మే, జులైలో ఈ వైరస్ సోకి ఇద్దరు మహిళలు మరణించారు. ఈ మరణాలకు కారణాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

అయితే, ఈ రెండు మరణాలకూ సంబంధం ఉన్నట్లు ఆయా కుటుంబాలకు తెలపలేదు.

కింబర్లీ శ్యాంప్ సన్ (29 సంవత్సరాలు) తన మూడేళ్ళ కూతురితో కలిసి కెంట్‌లోని విట్‌స్టేబుల్ పట్టణంలో ఆమె తల్లితో కలిసి నివసించేవారు.

"తను ఎప్పుడూ సరదాగా ఉండేది. ప్రేమగా ఉండేది. చాలా మంది స్నేహితులుండేవారు. ఆమె ఒక మంచి అమ్మగా ఉండాలని కోరుకునేది" అని యివేట్ శ్యాంప్‌సన్ బీబీసీకి చెప్పారు.

2018 మే 3న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో మార్‌గేట్‌లోని క్వీన్ మదర్ హాస్పిటల్‌లోని క్వీన్ ఎలిజబెత్ ప్రసూతి వార్డులో చేర్చారు.

"అంతా బాగుంటుందనే అనుకున్నాం. కానీ, పరిస్థితులు మారిపోవడం మొదలయింది. ఎంతకీ బిడ్డ బయటకు రాకపోవడంతో, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు.

ఆమెకు కొడుకు పుట్టాడు. కానీ, కింబర్లీకి రక్తం ఎక్కించాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత తల్లీబిడ్డలను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తామని చెప్పారు. కానీ, ఆమె అప్పటికే భరించలేని నొప్పితో బాధపడుతోంది. నడవడం కూడా కష్టంగా ఉంది. ఆమె తల్లితో కలిసి ఇంటికి వెళ్లారు.

యివేట్ శ్యాంప్‌సన్
ఫొటో క్యాప్షన్, యివేట్ శ్యాంప్‌సన్

ఆమె నొప్పి రోజు రోజుకీ పెరిగిపోయింది. "తినలేకపోయేవారు. నిద్రపోలేకపోయేవారు" అని యివేట్ చెప్పారు.

"కింబర్లీని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు బాక్టీరియా సెప్సిస్ సోకిందని డాక్టర్లు భావించారు. ఆమెను మెటర్నిటీ వార్డులోనే ఉంచి యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. అవి పని చేయకపోగా, ఆమె పరిస్థితి మరింత విషమించింది.

ఆ ఇన్ఫెక్షన్ ఏంటో తెలుసుకునేందుకు చాలా రకాల శస్త్ర చికిత్సలు చేశారు. సరిగ్గా ఆసుపత్రిలో చేరిన 8 రోజుల తర్వాత ఆమెకు యాంటీ వైరల్ డ్రగ్ ఆకి క్లోవిర్ ఇచ్చారు. దీనిని హెర్పెస్ ఇన్ఫెక్షన్ కు చికిత్సగా వాడతారు.

కింబర్లీని లండన్ లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్‌కు బదిలీ చేశారు. అక్కడ ఆమెకు భయంకరమైన హెర్పెస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు.

ఆమె ఇంటెన్సివ్ కేర్ లో ఉండగా, ఇక ఆమెకు కొన్ని గంటలు లేదా రోజుల సమయం మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పినట్లు యివేట్ చెప్పారు.

మే 22న కింబర్లీ మరణించారు.

సమంత, ర్యాన్
ఫొటో క్యాప్షన్, సమంత, ర్యాన్

హెర్పెస్ సోకి మరణించడం చాలా అరుదు. కానీ, ఆరు వారాల తర్వాత సమంత ముల్‌కాహీ (32సంవత్సరాలు) కూడా ఇదే వైరస్ సోకి మరణించారు.

ఆమె ఒక నర్స్. కింబర్లీ ఇంటికి 32 కిలోమీటర్ల దూరంలో ఆమె భర్త ర్యాన్ తో కలిసి నివసించేవారు. వారిది ప్రేమ వివాహం.

వారి తొలి సంతానానికి జన్మ నివ్వడం పట్ల సమంత చాలా ఆసక్తిగా ఉండేవారని సమంత తల్లి నికోలా ఫోస్టర్ చెప్పారు.

వారు ఆనందంగా గడపాల్సిన రోజులు విషాదంగా మారాయి. సమంతకు ప్రసవం కావల్సిన తేదీకి నాలుగు వారాల ముందే నొప్పులు మొదలయ్యాయి. ఆమె యాష్ ఫోర్డ్ లోని విలియం హార్వీ హాస్పిటల్‌లో చేరారు. ఈ హాస్పిటల్‌ను కూడా కింబర్లీ బిడ్డను ప్రసవించిన ట్రస్ట్ నిర్వహిస్తోంది.

17 గంటల పాటు నొప్పులు ఇచ్చిన తర్వాత ఆమె అలిసిపోయారు.

ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు. కానీ, ఆమెకు నొప్పుల సమయంలో రక్త పోటు వల్ల కలిగే ప్రీ ఎక్లాంప్సియా లక్షణాలు కనిపించాయని డాక్టర్లు ఆందోళన చెందారు. దాంతో, వాళ్ళు సమంతను ఆసుపత్రిలోనే ఉంచారు.

మూడు రోజులకు ఆమె పరిస్థితి క్షీణించడం మొదలుపెట్టింది. పొట్ట ఉబ్బిపోయింది. జ్వరం వచ్చి, రక్త పోటు పెరిగిపోయింది.

సమంత కాళ్ళు ఏనుగు పాదాల్లా అయిపోయాయి. సమంతకు కూడా బాక్టీరియా సెప్సిస్ సోకి ఉంటుందని డాక్టర్లు భావించారు. ఆమెకు కూడా యాంటీ బయోటిక్స్ ఇచ్చారు. కానీ, అవి పని చేయలేదు.

నికోలా ఫోస్టర్
ఫొటో క్యాప్షన్, నికోలా ఫోస్టర్

పరిస్థితి విషమించి, ఆమె శరీరంలో భాగాలు ఒకదాని తర్వాత ఒకటి పని చేయడం మానేశాయి. ఆమెను ఇంటెన్సివ్ కేర్‌లో నాలుగు రోజుల పాటు ఉంచారు.

ఆమెకు యాంటీ వైరల్ మందులు ఇవ్వాలని ఒక డాక్టర్ సూచించారు.

"కానీ, ఆమెను రక్షించలేకపోయారు" అని నికోలా చెప్పారు.

సమంత హెర్పెస్ టైప్ 1 ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగి చనిపోయినట్లు పోస్ట్ మార్టమ్ నివేదిక తెలిపింది.

అయితే, ఈ ఇద్దరు మహిళలు జన్మనిచ్చిన బిడ్డలకు మాత్రం వైరస్ సోకలేదు.

ఆ మహిళల వైద్య చరిత్రను చూస్తే, వారికి గతంలో అటువంటి వైరస్ సోకినట్లు లేదు. దాంతో, వాటి నుంచి రక్షణకు వారి శరీరంలో యాంటీ బాడీలు కూడా లేవు.

నెలలు నిండుతున్న కొలదీ గర్భిణుల్లో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దాంతో, వైరస్ వేగంగా సోకి ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

సాధారణంగా హెర్పెస్ వైరస్ శరీరాన్ని తాకడం ద్వారా గాని, లేదా వైరస్‌తో సంక్రమణ జరగడం వల్ల కానీ సోకుతుంది.

  • 25 సంవత్సరాలు వచ్చే నాటికి 70 %మంది వయోజనుల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
  • కొందరికి నోటి దగ్గర కురుపులు వస్తే, మరి కొందరికి జననేంద్రియాల దగ్గర వస్తాయి.
  • కానీ, మూడింట రెండు వంతుల మందికి తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.

ఆధారం: హెర్పెస్ వైరస్ అసోసియేషన్

ఈ మహిళలిద్దరూ మరణించిన ఒక సంవత్సరం తర్వాత ఆసుపత్రి వైద్యాధికారి కట్రీనా హెప్ బర్న్ నుంచి ఈ కేసుల పై న్యాయ విచారణ జరగదని చెబుతూ లేఖలందాయి.

ఇవి రెండూ ఒకే లాంటి కేసులు. కానీ, ఒకదానితో ఒకటి సంబంధం లేదని పేర్కొన్నాయి. ఈ మహిళలు ఆసుపత్రిలో చేరకముందే హెర్పెస్ సోకిందని మరణాలను పరిశోధించిన పెథాలజిస్ట్ చెప్పారు. ఆయన నిర్ణయాన్నే ఆ లేఖ ధృవీకరించింది.

ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ ట్రస్ట్
ఫొటో క్యాప్షన్, ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ ట్రస్ట్

2019లో బీబీసీ ఈస్ట్ కెంట్ హాస్పిటల్ ప్రసూతి విభాగాన్ని పరిశీలన చేయడం మొదలుపెట్టింది. ఈ పరిశోధనను మరొక శిశువు హ్యారీ రిచ్ ఫోర్డ్ మరణం గురించి విచారణ ప్రారంభం కాక ముందే మొదలుపెట్టింది. ఈ శిశువు మరణంతో పాటు ట్రస్ట్ ఆసుపత్రిలో మెటర్నిటీ విభాగంలో చోటు చేసుకున్న మరి కొన్ని మరణాలను కూడా పూర్తిగా నివారించి ఉండవచ్చు.

దీంతో, మెటర్నిటీ విభాగం పని తీరు పై సమీక్ష చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ కేసుల గురించి పరిశోధన చేస్తుండగా, బీబీసీకి 2021లో కింబర్లీ, సమంత మరణాలు కూడా ఇదే ట్రస్ట్ లో జరిగినట్లు తెలిసింది.

దీంతో, బీబీసీ వారి కుటుంబాలను కలిసి వివరాలను సేకరించేందుకు ప్రయత్నించింది.

మృతుల కుటుంబాలకు పంపిన పత్రాలను సమీక్షిస్తుండగా , వారికి హెర్పెస్ వైరస్ సోకినట్లు అనుమానాన్ని పబ్లిక్ హెల్త్ కూడా వ్యక్తం చేసింది. కానీ, దాని గురించి వివరాలేమీ లేవు.

ఆ పరిశోధన వివరాలను తెలియచేయమని కింబర్లీ కుటుంబం పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ను సంప్రదించింది. ఈ మరణాల గురించి కొత్త విషయాలను పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ పత్రాలు తెలియచేశాయి.

అందులో పొందుపరిచిన వివరాలు కింబర్లీ సమంత మరణాలకు సంబంధం ఉందని సూచిస్తున్నాయి.

పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సిబ్బందికి, ఈస్ట్ కెంట్ హాస్పిటల్ ట్రస్ట్, కొన్ని ఎన్ హెచ్ ఎస్ విభాగాలు, ఒక ప్రైవేటు ల్యాబ్ మధ్య జరిగిన రెండు ఈ మెయిల్ చెయిన్ లు కనిపించాయి.

ఆ మహిళలు జబ్బు పడిన విధానం, ఈ రెండు వైరస్ లు జన్యుపరంగా ఒకేలా ఉన్నాయా? లేదా ఒకే చోట నుంచి వారిద్దరికీ వైరస్ సోకిందా అనే విషయాన్ని నిర్ధరించేందుకు పెట్టిన ప్రయత్నాలు కనిపించాయి.

అయితే, ఇందులో సంబంధం ఉన్న వారి పేర్లను దాచి పెట్టి ఉంచేందుకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఆ ఈ మెయిల్ లో సమాచారాన్ని కొంత మార్చింది.

అందులో, ఇద్దరి మహిళల ప్రసవాలను ఒకే నర్స్, డాక్టర్ కలిసి నిర్వహించినట్లు ఉంది.

ఈ మరణాలకు సంబంధం ఉండి ఉంటుందని చెప్పేందుకు ఇది ఆధారంగా నిలిచింది.

ఈ వైరస్ జీనోమ్‌ను సీక్వెన్స్ చేసేందుకు ప్రైవేటు ల్యాబ్ సేవలు తీసుకున్నారు.

ఈ రెండు కేసులు ఆపరేషన్ సమయంలో జరిగిన కల్తీ వల్ల జరిగినట్లు ఆ ల్యాబ్ కు సంబంధించినవారు రాశారు. ఆ డాక్టర్ నోటి, జననేంద్రియాల స్వాబ్ ఇమ్మని కోరారు.

అయితే, ట్రస్ట్ ఈ శాంపిళ్లను ఇవ్వలేదు. ఈ సమాచారాన్ని మృతుల కుటుంబాలకు కూడా ఇవ్వలేదు.

వైరస్‌లో పోలికలు ఉన్నట్లు ఈ- మెయిల్‌లో కొంత సమాచారం తెలుపుతోంది.

అయితే, ఒక సంవత్సరం తర్వాత పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌లో ఇలాంటి వైరస్ గత 10 ఏళ్లలో కనిపించిన వైరస్‌తో పోల్చి చూస్తే అరుదుగా కనిపిస్తోందని పేర్కొంది.

ఈ కేసుల్లో న్యాయ విచారణ కొనసాగదని ఆ కుటుంబాలకు ఈ మెయిల్ వచ్చిన తర్వాత కూడా మరణాలను విచారిస్తున్నట్లు ఈ మెయిల్ చూస్తే తెలుస్తోంది.

యూకేలో సెక్సువల్ హెల్త్‌లో 30 సంవత్సరాల పాటు కన్సల్టెంట్‌గా పని చేసిన పీటర్ గ్రీన్‌హౌస్‌ను ఈ కేసులను సమీక్షించమని బీబీసీ కోరింది.

పీటర్ గ్రీన్‌హౌస్
ఫొటో క్యాప్షన్, పీటర్ గ్రీన్‌హౌస్

ఈ కేసులు చాలా అరుదు అని, చాలా అసాధారణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

"ఈ కేసుల్లో ఏమి జరిగిందో నూటికి నూరు శాతం కచ్చితంగా చెప్పలేం. కానీ, ప్రస్తుతం ఉన్న ఆధారాల బట్టీ చూస్తే, వారికి ఆసుపత్రిలో చేరక ముందే హెర్పెస్ సోకినట్లు చెప్పలేం" అని అన్నారు. ఇది పెథాలజిస్ట్ చేసిన వాదనకు భిన్నంగా ఉంది.

వారికి ఆసుపత్రిలోనే ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అన్నారు. ఆ మహిళలకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో సర్జన్ ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.

"ఆపరేషన్ చేసిన డాక్టర్ కు చేతి వేలి చుట్టూ హెర్పెటిక్ వైరస్ ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. దాంతో, అది నేరుగా ఆ మహిళల గర్భంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు" అని చెప్పారు.

దాంతో, అది గర్భంలో వేగంగా వ్యాపించి ఉండవచ్చు. ఆ మహిళలకు హెర్పెస్ ఛాయలు శరీరం పై ఎక్కడా బయటకు కనిపించలేదు.

గోటి చుట్టూ హెర్పెస్ సోకినప్పుడు, వేలి దగ్గర ఉబ్బినట్లు ఉండటం గాని, లేదా పుండ్లు గాని ఉంటాయి. చాలా సార్లు ఇవి పరీక్ష చేసే లోపే మాయమవుతాయి.

"కొన్ని సార్లు ఎటువంటి లక్షణాలు కనిపించవు" అని గ్రీన్ హౌస్ చెప్పారు.

ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్లు చేతులకు గ్లోవ్స్ ధరిస్తారు. కానీ, ఆపరేషన్ సమయంలో వాటికి చిల్లులు కూడా పడి ఉండవచ్చని గ్రీన్ హౌస్ అంటున్నారు.

గ్రీన్ హౌస్ చెప్పిన సిద్ధాంతాన్ని మరొక నలుగురు డాక్టర్లు సమర్ధించారు.

ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ విడుదల చేసిన ప్రకటనలో ఆపరేషన్ చేసిన డాక్టర్ కు హెర్పెస్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ కాలేదని తెలిపింది. కానీ, ఆపరేషన్ సమయంలో ఆయనకు ఎటువంటి పరీక్షలు జరగలేదు.

ఆసుపత్రి పత్రాలను సమీక్షించిన గ్రీన్‌హౌస్ మాత్రం ఇద్దరు మహిళలకు ఒకే చోటు నుంచి వైరస్ సంక్రమించి ఉంటుందని అంటున్నారు.

ఈ మరణాల పట్ల న్యాయ విచారణ జరగాలని మృతుల కుటుంబాలు కోరుతున్నారు.

తల్లి లేకుండా మిగిలిపోయిన బిడ్డల కోసం ఈ విచారణ చేయడం అవసరమని యివేట్ అంటున్నారు.

వాళ్ళ తల్లి మరణానికి కారణం తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆమె అంటున్నారు.

ఈస్ట్ కెంట్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఈ విధంగా రాశారు.

"కింబర్లీ, సమంత మృతికి సంతాపాన్ని తెలియచేస్తున్నాం". 2018లో చోటు చేసుకున్న మరణాలను విచారించేందుకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. ట్రస్ట్, హెల్త్ కేర్, మరింత మంది నిపుణుల విచారణ ఈ ఇన్ఫెక్షన్ మూలకారణాన్ని కనిపెట్టలేమని తేల్చింది"

"ఈ ఆపరేషన్లు చేసిన డాక్టర్ కు చేతి పై ఎటువంటి పుండ్లు గాని, గతంలో వైరస్ సోకిన దాఖలాలు గాని లేవు".

"కింబర్లీ, సమంతకు కనిపించిన లక్షణాల ఆధారంగా చికిత్స అందించాం. మేము వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం. వారికున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మాకు వీలైనంత సహాయం చేస్తాం" అని ప్రకటనలో పేర్కొన్నారు .

ఈ మరణాల గురించి పీటర్ గ్రీన్‌హౌస్ మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారు.

"ఈ మరణాల పై జరిగే పరిశోధన ఆసుపత్రి నియమావళిని మార్చే అవకాశముంది. దాంతో, ముందుగానే వైరస్ ను కనిపెట్టడం వల్ల మరింత మందికి మేలు చేకూరుతుంది. ఈ విషాదం నుంచి ఆశించగలిగే లాభం అదొక్కటే."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)