క్రెగ్ రైట్: 12ఏళ్ల మిస్టరీ వీడినట్లేనా? బిట్ కాయిన్‌ను కనిపెట్టిన సతోషీ నకమోటో ఈయనేనా? మీరు తెలుసుకోవాల్సిన 8 అంశాలు

క్రెగ్ రైట్
ఫొటో క్యాప్షన్, కంప్యూటర్ సైంటిస్ట్ క్రెగ్ రైట్.. బిట్ కాయిన్‌ను సృష్టించింది తానేనని చెబుతున్నారు

బిట్ కాయిన్‌ను తానే కనుగొన్నట్లు చెబుతున్న కంప్యూటర్ సైంటిస్ట్ క్రెగ్ రైట్ ఒక కోర్టు కేసు గెలవడంతో లక్షల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీ ఆయన సొంతమైంది.

క్రెగ్ రైట్ తన మాజీ వ్యాపార భాగస్వామి డేవ్ క్లీమాన్‌కు ఆ మొత్తంలో సగం చెల్లించాలన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది.

కోర్టు తాజా తీర్పుతో ఇప్పుడు 54 బిలియన్ డాలర్ల (రూ.4 లక్షల కోట్ల పైనే) విలువైన 11 లక్షల బిట్ కాయిన్లు క్రెగ్ రైట్ సొంతం అయ్యాయి.

అయితే, మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కింద ఆయన డేవ్ క్లీమాన్ కుటుంబానికి 100 మిలియన్ డాలర్లు (రూ.750 కోట్లు పైనే) చెల్లిస్తారు.

క్రెగ్ రైట్, డేవ్ క్లీమాన్ కలిసి బిట్ కాయిన్ మైనింగ్ చేసి మొదటి బిట్ కాయిన్‌ను ఉనికిలోకి తీసుకొచ్చారని, కానీ రైట్ దానిని దొంగిలించారని క్లీమాన్ కుటుంబం ఆరోపించింది.

కంప్యూటర్ సెక్యూరిటీ నిపుణుడు డేవ్ క్లీమాన్ 2013లో చనిపోయారు.

ఈ క్రిప్టో కరెన్సీ గురించి సతోషీ నకమోటో అనే పేరుతో 2008లో ఒక శ్వేతపత్రం ప్రచురించారు. బిట్ కాయిన్ గురించి కూడా అందులో వర్ణించారు.

2009 నుంచి బిట్ కాయిన్ ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిని సృష్టించింది ఎవరు? అన్నది మిస్టరీగానే ఉంది.

వీడియో క్యాప్షన్, బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

1. ఇప్పుడు ఏం జరిగింది?

ఆ సతోషీ నకమోటో తానేనని 2016 నుంచి రైట్ చెప్పుకుంటున్నారు. అయితే ఇది వివాదాస్పదమైంది.

రైట్ మీద క్లీమాన్ కుటుంబం చేసిన దాదాపు అన్ని ఆరోపణలనూ తాజాగా మియామీ కోర్టులోని జ్యూరీ తోసిపుచ్చింది.

జ్యూరీ వంద మిలియన్ డాలర్ల మేధో సంపత్తి హక్కులను అందించినందుకు, డేవ్ సృష్టించినదానిలో ఆయనకు న్యాయమైన వాటా దక్కేలా సాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని క్లీమాన్ తరఫు న్యాయవాదులు ఒక ప్రకటనలో చెప్పారు.

కోర్టు తాజా తీర్పుతో విప్లవాత్మకమైన బిట్ కాయిన్ సృష్టికర్త తానేనని నిరూపితమైందని రైట్ అన్నారు.

"అది నేనేనని జ్యూరీ స్పష్టంగా గుర్తించింది. లేదంటే ఇంత మొత్తం నాకు దక్కేది కాదు. ఇది ఒక మంచి పరిణామం. కోర్టు నన్ను పూర్తిగా సమర్థించినట్లు అనిపిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఆస్ట్రేలియాలో క్రెగ్ రైట్ ఇంటి దగ్గర ఆదాయ పన్ను అధికారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలో క్రెగ్ రైట్ ఇంటి దగ్గర ఆదాయ పన్ను అధికారులు

2. బిట్ కాయిన్ సృష్టించింది తనేనని క్రెగ్ రైట్ నిరూపించారా

బిట్ కాయిన్ సృష్టించింది తానేనని చెబుతున్న క్రెగ్ రైట్ వాదనలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన వాదనలపై సోషల్ మీడియాలో, వివిధ వేదికలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది ఆయన వాదనలను బలపరచడానికి తగిన ఆధారాలు లేవని భావిస్తున్నారు.

2016 మే 2న బిట్ కాయిన్ విర్చువల్ కరెన్సీని సృష్టించింది తానేనని ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్త క్రెగ్ రైట్ బహిరంగంగా ప్రకటించారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సతోషీ నకమోటో పేరు వెనకున్న వ్యక్తిని తానేనని ఆయన చెప్పారు.

ఈ వర్చువల్ కరెన్సీ వచ్చిన మొదట్లో క్రిఫ్టోగ్రాఫర్లు, డెవలపర్లతో ఉన్న ఈ-మెయిల్ ఎక్చేంజీలలో బిట్ కాయిన్ల గురించి కలలుకనే వారందరూ సతోషీ నకమోటో అనే పేరు ఉపయోగించారు.

బిట్ కాయిన్ ఫౌండేషన్ చీఫ్ సైంటిస్ట్ గవిన్ అండ్రసన్, అదే సంస్థకు చెందిన ఆర్థికవేత్త, ఫౌండింగ్ డైరెక్టర్ జాన్ మటోనిస్.. రైట్ వాదనలను సమర్థించారు.

గవిన్ ఆండ్రీసన్
ఫొటో క్యాప్షన్, గవిన్ ఆండ్రసన్

3. క్రిఫ్టోగ్రఫీ గురించి ఆధారాలు అందించారా

బిట్ కాయిన్ నిపుణులకు, బీబీసీకి, ఎకానమిస్ట్‌కు క్రెగ్ రైట్ కొన్ని ప్రదర్శించి చూపించారు.

సతోషీ నకమోటోకు చెందినవిగా భావిస్తున్న బిట్ కాయిన్ బ్లాక్స్‌ నుంచి ప్రైవేట్ కీస్ ఉపయోగించి ఒక సందేశం సంతకం చేయడానికి రైట్ ఎలక్ట్రమ్ బిట్ కాయిన్ వాలెట్ వాడారు.

అయితే, ఇలాంటి ప్రదర్శనలు మేనేజ్ చేసినవి కావచ్చని, దానికి ఆయన తన సొంత లాప్‌టాప్, సాఫ్ట్ వేర్ ఉపయోగించడం కూడా సరికాదని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

అయితే, ఆండ్రీసన్‌కు ప్రదర్శన ఇచ్చినపుడు రైట్ దగ్గరే ఉన్న ఒక షాపు నుంచి ఒక కొత్త విండోస్ లాప్‌టాప్ కొనుగోలు చేసి దానిలో ఎలక్ట్రమ్ వాలెట్ ఇన్‌స్టాల్ చేశారు.

తర్వాత ఒక ఏకపక్ష సందేశాన్ని సైన్ చేశాడు. గవిన్‌కు ఇష్టమైన అంకె 11. ఆయన సైన్ చేసిన ఆ మెసేజ్‌ను యూఎస్‌బీ స్టిక్‌లో ఉంచారు. దాన్ని తర్వాత కొత్త లాప్‌టాప్‌లో చెక్ చేశారు. రైట్ చేసిన ఆ సంతకం చెల్లుబాటు అయినట్లు అందులో తేలింది.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

4. ఇది ఎక్కడి వరకూ వెళ్తుంది

బిట్ కాయిన్ రంగంలోని ఇద్దరు కీలక నిపుణులతోపాటూ చాలా మంది సతోషి క్రెగ్ రైటే అని భావిస్తుంటే, మరికొందరు తనే సతోషీ అనడానికి ఆయన చూపిస్తున్న ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయని అంటున్నారు.

బిట్ కాయిన్ సృష్టికర్త మేమేనని చెప్పుకోడానికి ఆ ఆధారాలను ఎవరైనా ఉపయోగించవచ్చని డెవలపర్ పాట్రిక్ మెకెంజీ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, బిట్ కాయిన్ మైనింగ్ ఫ్యాక్టరీ చూద్దాం రండి

5. దీన్ని ఎలా పరిష్కరించవచ్చు

ప్రారంభ బ్లాక్‌లలో లాక్ చేసి ఉన్న కొన్ని బిట్ కాయిన్లను ఖర్చు చేసి, వాటిపై తన కంట్రోల్ ఉన్నట్లు క్రెగ్ రైట్ నిరూపించుకోవాలని బీబీసీ ప్రతినిధి రోరీ సెలాన్ జోన్స్ సహా చాలా మంది ఆయనకు సూచించారు.

ఇప్పుడు చూపిస్తున్న ఆధారాలు ఆ బిట్ కాయిన్స్ చేరడానికి రైట్‌కు ప్రైవేట్ కీస్ యాక్సెస్ ఉందనేది మాత్రమే చూపుతోందని, ఆయనే సతోషీ అనేది చెప్పడం లేదని కొందరు విమర్శిస్తున్నారు.

సతోషీ గుర్తింపు చుట్టూ గందరగోళం ఉందని, బిట్ కాయిన్ ప్రారంభించినప్పుడు దానిపై పనిచేసిన ఒక చిన్న డెవలపర్స్ గ్రూప్ ఆ పేరు పెట్టుకుందని మరికొందరు అంటున్నారు.

అదే గ్రూపులో రైట్, హాల్ ఫిన్నీ, డేవిడ్ క్లీమాన్ ఉన్నారు. ఆ గ్రూపులో సజీవంగా ఉన్న ఒకే ఒక సభ్యుడు రైట్ ఇప్పుడు తనే సతోషినని చెప్పుకోవచ్చు.

కానీ, దానిని కచ్చితంగా నిరూపించడానికి ఉపయోగించే మొత్తం డేటాను ఆయన యాక్సెస్ చేయలేరు.

క్రెగ్ రైట్ మరిన్ని ఆధారాలు చూపించాలని ఎకనమిస్ట్ బహిరంగంగా పిలుపునిచ్చింది. దీనికి సమాధానంగా అది త్వరలో జరుగుతుంది అని రైట్ పీఆర్ ఏజెన్సీ చెప్పింది.

"ప్రారంభ బ్లాక్‌లోని బిట్ కాయిన్స్ తరలించడం ద్వారా రాబోవు రోజుల్లో రైట్ తానే సతోషి అని, బిట్ కాయిన్ సృష్టికర్తనని చెప్పే మరిన్ని ఆధారాలు సమర్పిస్తారు" అని అది చెప్పింది.

బిట్ కాయిన్ యజమాని ఎవరో నిర్థరించుకునేందుకు, పదేపదే దాన్ని వాడకుండా నిరోధించేందుకు బిట్ కాయిన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్‌ను వాడుతుంది

ఫొటో సోర్స్, OLIVIER LE MOAL

ఫొటో క్యాప్షన్, బిట్ కాయిన్ యజమాని ఎవరో నిర్థరించుకునేందుకు, పదేపదే దాన్ని వాడకుండా నిరోధించేందుకు బిట్ కాయిన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్‌ను వాడుతుంది

6. సతోషి అని వేరే ఎవరైనా చెప్పుకుంటున్నారా

ఇప్పటివరకూ ఎవరూ లేరు. బిట్ కాయిన్ అంటే ఆసక్తి ఉన్నవారు, జర్నలిస్టులు దీనిని సృష్టించిన సతోషి ఎవరనేది తెలుసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.

చివరికి 2015 డిసెంబరులో విర్చువల్ కరెన్సీలో క్రెగ్ వైట్ ప్రమేయం ఉన్నట్టు చూపించే కొన్ని ఈమెయిళ్లు, పత్రాలు వైర్డ్, గిజ్మోడోకు చేతికి చిక్కాయి. దీంతో సతోషీ ఆయనే కావచ్చని అవి చెప్పాయి.

ఈ పత్రాలు, మెయిళ్లు క్రెగ్ వైట్ నుంచి చోరీకి గురయ్యాయి.

తమకు దొరికిన ఆధారాలను పరిశీలించిన వైర్డ్ "రైట్ బిట్ కాయిన్‌ కనిపెట్టుంటారు, లేదా తనే కనిపెట్టినట్లు నమ్మించాలనుకునే తెలివైన మోసగాడు అయ్యుంటారు" అని రాసింది.

7. ఎందుకు బయటపెట్టారు

ఆస్ట్రేలియా పన్ను అధికారులకు తన దగ్గర పెద్ద మొత్తంలో బిట్ కాయిన్స్ ఎందుకున్నాయో వివరించడానికి ఆయనకు ఇది ఒక దారి అయ్యుంటుందని విమర్శకులు భావిస్తున్నారు.

తను చెల్లించాల్సిన పన్నులకు సంబంధించి ఆస్ట్రేలియా టాక్స్ కార్యాలయం ఆడిట్ నిర్వహిస్తోందని రైట్ చెబుతున్నారు.

కానీ, బిట్ కాయిన్స్‌ గురించి అర్థం చేసుకోవడం, వాటిని విలువను మదింపు వేయడం ఏటీఓకు కష్టంగా మారింది.

8. ఇది ఎందుకంత ముఖ్యం

ఎందుకంటే, బిట్ కాయిన్ అనేది ఒక టెక్నాలజీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, దాని కంటే ఎక్కువ.

కొంతమంది దీనిని విషపూరితం అంటున్నారు. బిట్ కాయిన్ పెట్టుబడిని 'మంటల్లో దూకి చనిపోవడం'గా వర్ణిస్తున్నారు.

కానీ, క్రెగ్ రైట్ సహా చాలా మంది దీనిని మరింత సాధారణ చెల్లింపుల వ్యవస్థగా మార్చాలని కోరుకుంటున్నారు.

క్రెగ్ రైటే సతోషీ అనేది నిరూపితమైతే ఈ చర్చకు ఒక వైపు బలం చేకూరుతుంది.

నిజానికి, తాను మౌనంగా ఉన్న ఇన్నేళ్లూ ఖాళీగా ఉండలేదని రైట్ చెబుతున్నారు.

ఆ సమయంలో బిట్ కాయిన్, దాని అంతర్లీనంగా ఉండే బ్లాక్ చెయిన్ అకౌంటింగ్ సిస్టమ్‌ను ఎలా విస్తరించాలనేదానిపై ఆలోచిస్తున్నానని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)