బిట్‌కాయిన్: క్రిప్టో కరెన్సీల భవితవ్యాన్ని భారత్ ఎప్పుడు నిర్ణయిస్తుంది

ఫొటో సోర్స్, REUTERS/DADO RUVIC
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత కొన్నేళ్లుగా డిజిటల్ కరెన్సీ పాపులారిటీ పెరుగుతోంది. బ్లాక్ చెయిన్ సాఫ్ట్‌వేర్ ద్వారా దీనిని ఉపయోగించవచ్చు.
ఈ డిజిటల్ కరెన్సీ ఎన్‌క్రిప్టెడ్. అంటే కోడెడ్‌గా ఉంటుంది. అందుకే దానిని క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు.
ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కరెన్సీని ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు నియంత్రిస్తాయి. కానీ క్రిప్టో కరెన్సీ విషయంలో అలా జరగదు. దాని నియంత్రణ పూర్తిగా దాన్ని కొనుగోలు-అమ్మకాలు జరిపేవారి చేతుల్లో ఉంటుంది.
చాలా దేశాల్లో ప్రభుత్వాలు దీనిని చట్ట విరుద్ధమని భావించడానికి, దీనిని ఒక విధంగా నియంత్రించాలని ప్రయత్నించడానికి కారణం అదే.
భారత్, చైనా, అమెరికా లాంటి దేశాలకు భిన్నంగా దక్షిణ అమెరికాలోని ఎల్‌సాల్వెడార్ ఇప్పుడు దీని వినియోగానికి చట్టపరంగా ఆమోదముద్ర వేసింది.
అయితే క్రిప్టో కరెన్సీతో చట్టపరంగా లావాదేవీలు జరపడానికి టెక్నాలజీ సాయం అందించాలని ఎల్‌సాల్వెడార్ ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, దీనికి వరల్డ్ బ్యాంక్ నిరాకరించింది. క్రిప్టో కరెన్సీ పారదర్శకతకు సంబంధించి ఆందోళనలు ఉన్నట్టు చెప్పింది.
మరోవైపు క్రిప్టోకరెన్సీ మనీ ల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి చైనా ఇప్పటివరకు 1100 మందిని అరెస్ట్ చేసింది.
డిజిటల్ కరెన్సీకి ఉన్న పాపులారిటీ దృష్ట్యా చైనా ఆ రంగంలో కూడా ప్రవేశించింది. అయితే సాధారణంగా క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వాల నియంత్రణ ఉండదు. కానీ చైనా ప్రారంభించిన డిజిటల్ కరెన్సీపై పూర్తిగా అక్కడి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది.
డిజిటల్ యువాన్ నిజానికి సంప్రదాయ యువాన్ కరెన్సీకి డిజిటల్ రూపమే. గత ఏడాది చైనాలో కొన్ని నగరాల్లో దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అమెరికా కూడా డిజిటల్ డాలర్ లాంచింగ్ గురించి ఆలోచిస్తోంది.

ఫొటో సోర్స్, NURPHOTO
భారత్‌లో క్రిప్టో కరెన్సీ
క్రిప్టో కరెన్సీ కొనుగోలు-అమ్మకందారుల కోసం భారత్‌లో ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్ఛేంజ్ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో గత కొన్ని రోజులుగా వజీర్ఎక్స్ అనే పేరు హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
ఫెమా చట్టం అంటే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ కింద రూ.2,971 కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు లెక్కలు చూపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ.. వజీర్ఎక్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ నిశ్చల్ శెట్టిని కోరింది.
వజీర్ఎక్స్ తన వినియోగదారుల నుంచి 'నో యువర్ కస్టమర్'(కేవైసీ) అంటే వినియోగదారుల వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు తీసుకోవడం లేదని ఈడీ ఆరోపించింది.
కొంతమంది చైనా పౌరులు తమ డబ్బు జమ చేయడానికి వజీర్ఎక్స్‌ను ఉపయోగించినట్లు ఈడీ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వజీర్ఎక్స్ వ్యవస్థాపకుడు శెట్టి దీనిపై మూడు ట్వీట్స్ చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటూ ఈడీకి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
క్రిప్టో కరెన్సీ గురించి భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ మార్గదర్శకాలు లేదా నియమ నిబంధనలు లేవు. అందుకే వజీర్ఎక్స్ కేసులో ఇప్పుడు కేవైసీ నిబంధనలు పాటించలేదని మాత్రమే నోటీసులు పంపించారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టవచ్చు. వర్చువల్ కరెన్సీని రెగ్యులేట్ చేయడంపై ఎస్సీ గార్గ్ కమిటీ ప్రభుత్వానికి తన రిపోర్ట్ అందించింది. దానితోపాటు ప్రభుత్వం దగ్గర వివిధ మంత్రిత్వ శాఖల ఒక జాయింట్ కమిటీ రిపోర్ట్ కూడా ఉంది.
భారత్‌లో క్రిప్టో కరెన్సీని నిషేధించాలని ఈ నివేదికల్లో సలహా ఇచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. కానీ, వర్చువల్ కరెన్సీలను కేవలం రెగ్యులేట్ చేస్తామని, వాటిపై నిషేధం ఉండదని మార్చిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలు ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వం సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఏంటనేది దీనిపై బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతే తెలుస్తుంది.

ఫొటో సోర్స్, REUTERS/MURAD SEZER
క్రిప్టో కరెన్సీ అంటే..
ప్రపంచంలో రూపాయి, డాలర్, యూరో లాంటి కరెన్సీల్లాగే గత 10-12 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కరెన్సీలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాపులారిటీ, సంఖ్య రెండూ వేగంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యువతలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి.
స్థూలంగా క్రిప్టోకరెన్సీ అంటే వర్చువల్ లేదా డిజిటల్ డబ్బు అని చెప్పొచ్చు. అవి టోకెన్ లేదా డిజిటల్ నాణేల రూపంలో ఉంటాయి. ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణతో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీని డిజైన్ చేశారు.
అలాంటి కరెన్సీల్లో ఇప్పుడు ఎక్కువ చర్చ బిట్‌కాయిన్ గురించే జరుగుతోంది. గత వారం ఒక బిట్‌కాయిన్ విలువ రూ.30 లక్షలు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల బిట్‌కాయిన్లు చెలామణిలో ఉన్నాయి. అందులో 2 వేలు భారత్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.
బిట్‌కాయిన్ల ధరలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. మరికొన్ని నెలల్లో వీటి విలువ 50శాతం పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం అది రూ.30 లక్షలు దాటి రూ.75 లక్షలు వరకూ పెరగచ్చని చెబుతున్నారు.
ఇలాంటి ఎన్‌క్రిప్టెడ్ లేదా కోడెడ్ కరెన్సీలు దాదాపు నాలుగు వేలు ఉన్నాయి. కానీ సామాన్యులకు మాత్రం ఒక్క బిట్‌కాయిన్ గురించే తెలుసు.
భారత్‌లో సామాన్యులకు దీని గురించి చాలా తక్కువ సమాచారం తెలుసు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం గూగుల్ ట్రెండ్స్ గమనిస్తే.. బిట్‌కాయిన్ అంటే ఏంటి అని సెర్చ్ చేసేవారి సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. అంటే దీనిపై ప్రజల ఆసక్తి చాలా పెరిగింది.

ఫొటో సోర్స్, REUTERS/MURAD SEZER
క్రిప్టో, బ్లాక్ చెయిన్
క్రిప్టో కరెన్సీ 'బ్లాక్ చెయిన్' అనే టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రవీణ్ విశేష్ సింగపూర్‌లో ఒక పెద్ద హెజ్డ్ ఫండ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్. ఆయన వ్యాపారం పూర్తిగా కరెన్సీ లావాదేవీలతో ముడిపడి ఉంటుంది.
"బ్లాక్ చెయిన్ భవిష్యత్ టెక్నాలజీ ప్లాట్‌ఫాం. ఇది క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిగే ఒక వేదిక. బ్లాక్‌చెయిన్ సమాచారం మొత్తం రికార్డ్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది. దానిలో సమాచారం మార్చడం, హ్యాక్ చేయడం దాదాపు అసంభవం" అని ఆయన చెప్పారు.
థాయ్‌లాండ్ రాజధాని బాంకాక్‌లో లియోనార్డ్ కుకోస్ కూడా క్రిప్టో కరెన్సీ వృద్ధికి మద్దతిస్తారు. పెట్టుబడి పెడుతుంటారు. ఆయన అందులో చాలా చురుగ్గా ఉంటారు. కుకోస్.. బ్లాక్ చెయిన్ లాంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ నిపుణులు కూడా.
"అర్థమయ్యేలా చెప్పాలంటే బ్లాక్ చెయిన్ అనేది ఒక ప్రత్యేక డేటాబేస్. దానిని డిస్ట్రిబ్యూటెడ్ ఖాతా అంటారు. దానిని మార్చడం, హ్యాక్ చేయడం లేదా ఫ్రాడ్ చేయడం అసాధ్యం. అలా ఉండేలా డిజిటల్ లావాదేవీలను అది రికార్డ్ చేస్తుంటుంది" అన్నారు.
"ఆ కంప్యూటర్లను నోడ్ అంటారు. ప్రధానంగా ప్రతి లావాదేవీని ధ్రువీకరించడం, వాటిని నమోదు చేయడం వాటి పని. ప్రతి ఒక్కటీ నోడ్ కావచ్చు. అయినప్పటికీ నెట్‌వర్క్ మీద పూర్తి నియంత్రణ ఉండకపోవచ్చు. అందుకే బ్లాక్‌చెయిన్ ఒక వికేంద్రీకృత వ్యవస్థ" అని అన్నారు.
క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. వాటికి విడదీయరాని బంధం కూడా ఉంది.
బ్లాక్‌చెయిన్ ఒక విస్తరించిన లెడ్జర్ అకౌంట్. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీని ఆ ఖాతాకు తగ్గట్టు డిజైన్ చేశారు. బిట్‌కాయిన్ తన బ్లాక్‌చెయిన్ లేకుండా ఉనికిలో ఉండలేదు. అయితే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని క్రిప్టోకరెన్సీతోపాటూ వేరే పనులకు కూడా ఉపయోగిస్తున్నారు.
క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్ ఒక్కటే కాదు.. ఇథెరియమ్, టీథర్, కార్డానో, పోల్కాడాట్, రిపల్, డోజ్‌కాయిన్ లాంటి చాలా చలామణిలో ఉన్నాయి. ప్రతి ఏటా వీటిలో బిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతుంటాయి.
అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్లో మొట్టమొదట వచ్చిన, అత్యంత ఖరీదైనది, పాపులర్ అయింది మాత్రం బిట్‌కాయిన్. దీనిని 2003లో లాంచ్ చేశారు.
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ జూన్ 19 నాటికి దాదాపు రూ.30 లక్షల రూపాయలు ఉంది.
ఇటీవల టెస్లా కార్లకు చెల్లింపులు బిట్‌కాయిన్ కరెన్సీతో స్వీకరించలేమని ఆ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ ప్రకటనతో బిట్‌కాయిన్ విలువ రూ.45 లక్షల నుంచి రూ.25 లక్షలకు పడిపోయింది. అది ఇప్పుడే మళ్లీ మెల్లగా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
నమ్మకం లేకపోతే నోట్లు కూడా కాగితాలే
క్రిప్టో కరెన్సీకి ప్రస్తుతం నమ్మకం అనే కష్టం ఎదురవుతోంది. ప్రభుత్వాలు దీనిని సందేహంగా చూస్తున్నాయి. దీనిని సంప్రదాయ కరెన్సీకి ముప్పుగా చెబుతున్నాయి.
"నా వరకు ప్రభుత్వాలు క్రిప్టో కరెన్సీని వ్యతిరేకించడానికి మొదటి కారణం ఏంటంటే, ఆ మార్కెట్లను నియంత్రించడంలో ఉన్న అసమర్థత. మౌలిక సదుపాయాల కొరత, మార్కెట్లో నిబంధనల లోపం వల్ల ప్రభుత్వాలు వాటిని నియంత్రించలేకపోతున్నాయి" అని భారత మూలాలున్న ప్రవీణ్ విశేష్ చెప్పారు.
"క్రిప్టో కరెన్సీ విషయంలో వాటి వాస్తవిక విలువ తక్కువగా ఉంటుందని సాధారణంగా అందరూ భావిస్తారు. ఉదాహరణకు కొంతమంది బిట్‌కాయిన్‌కు వాస్తవిక విలువ లేదని, చివరకు దానికి అసలు ఏ విలువా లేకుండా పోతుందని చెబుతుంటారు. వాటికి ఏ ప్రభుత్వం గ్యారంటీ లేదని వాళ్లు భావిస్తారు" అని లియోనార్డో కుకోస్ అంటారు.
"అమెరికాలో ఒక 100 డాలర్ల నోటు ముద్రించడానికి 14 సెంట్లు ఖర్చవుతుంది. అంటే మిగతా విలువ ఎక్కడి నుంచి వస్తుంది. సమాధానం నమ్మకం. కరెన్సీని వినియోగించే మనం దాని వాస్తవిక విలువ విషయంలో సంప్రదాయ కరెన్సీని నమ్ముతాం. ఆ నమ్మకం అనేది లేకపోతే అది ఒట్టి కాగితం మాత్రమే" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS/ARND WIEGMANN
క్రిప్టో కరెన్సీ అక్రమ వినియోగం
క్రిప్టో కరెన్సీ వల్ల మరో ముప్పు కూడా ఉందని, దానిని మనీ ల్యాండరింగ్, స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం ఖర్చు చేయవచ్చని భావిస్తున్నారు.
కానీ బ్లాక్ మనీ వెనకేయడానికి, తీవ్రవాద కార్యక్రమాలకు కూడా సంప్రదాయ కరెన్సీని ఉపయోగిస్తున్నారని క్రిప్టో కరెన్సీ మద్దతుదారులు చెబుతున్నారు.
ఈ క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడానికి ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల దగ్గర ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు లేవని ప్రవీణ్ విశేష్ అంటున్నారు.
"తీవ్రవాదానికి అందించే నిధులు, అక్రమ లావాదేవీలపై చాలా కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా నిఘా పెట్టాయి. ప్రతి లావాదేవీకి వివరాలు, విదేశీ కరెన్సీ విషయంలో కారణాలు కూడా చెప్పాల్సి వస్తోంది. ఇందులో కేవైసీ, యాంటీ-మనీ ల్యాండరింగ్ పాలసీ లాంటి విధానాలు కూడా ఉన్నాయి. అయితే క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే అలాంటి విధానాలేవీ లేవు" అన్నారు.
నిజానికి, ఇదంతా కంట్రోల్‌కు సంబంధించిన విషయం అని లియోనార్డో చెబుతున్నారు.
బిట్‌కాయిన్‌కు ఉన్న చాలా ప్రత్యేకతల్లో ఒకటి ఏంటంటే ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తికి మధ్య ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది. దానిపై ప్రభుత్వాలు లేదా సెంట్రల్ బ్యాంకుల నిఘా అవసరం లేదు. అందువల్ల కూడా ప్రభుత్వాలు ఈ కరెన్సీకి భయపడుతున్నాయి. ఇదంతా కంట్రోల్ చేయడం అనేది ఒక గేమ్. నియంత్రణ అంటే పవర్ అని అర్థం" అన్నారు.
అందుకే బహుశా చైనా క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అమెరికా దానిని అణచివేయాలని ఆలోచిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
క్రిప్టో కరెన్సీని ఎలా నమ్మాలి
పెద్ద సంస్థలు, బ్యాంకులు మెల్ల మెల్లగా దీనిని ఉపయోగించడం మొదలైతే, దీని వినియోగం కూడా అంతకంతకూ విస్తరిస్తుందని, దీనిపై ఒక నమ్మకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
"క్రిప్టో కరెన్సీని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒక దశాబ్దం పట్టింది. కానీ, దానితో పోలిస్తే సంప్రదాయ కరెన్సీ అలా చెలామణిలోకి రావడానికి ఇంకా ఎక్కువ సమయమే పట్టింది" అని లియోనార్డో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ధరలో హెచ్చుతగ్గులు ప్రధాన బలహీనత
క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో డబ్బులు పెట్టడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే వాటి ధరలు ఎప్పుడూ పడుతూ లేస్తూ ఉంటాయి.
సంప్రదాయ కరెన్సీ విలువల్లో కూడా అప్పుడప్పుడూ చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
"టర్కీ లిరా, రష్యా రూబుల్ లాంటి కరెన్సీలు చాలా అస్థిరంగా ఉంటాయి. కొత్తగా ఆవిర్భవించే చాలా ఉత్పత్తుల్లాగే క్రిప్టో కరెన్సీ కూడా చాలా అస్థిరంగా ఉంది" అని ప్రవీణ్ విశేష్ అన్నారు.
"చాలా రకాలుగా రాబోవు దాశాబ్దాల్లో సంప్రదాయ బ్యాంకింగ్ విధానాలతో పోలిస్తే, రుణాలు తీసుకోవడం, రుణాలు ఇవ్వడం లాంటి వ్యాపారాలు, దిగుమతులు, ఎగుమతులు లాంటి వాణిజ్య పద్ధతులు చాలా భిన్నంగా ఉండవచ్చు" అంటారాయన.
క్రిప్టో కరెన్సీ స్వీకరించడం పెరుగుతోందని లియోనార్డో చెప్పారు.
"క్రిప్టో కరెన్సీ సంస్కృతి పెరగడం వెనుక ఒక పెద్దకారణం ఉంది. దీనిని ఆర్థిక సంస్థలు స్వీకరించడం మొదలయ్యింది. పేపాల్ లాంటి ఆర్థిక సంస్థలు బిట్ కాయిన్ లావాదేవీలను అనుమతించి వాటి పురోగతికి దారులు వేస్తున్నాయి" అని లియోనార్డో చెప్పారు.
కానీ, క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడో, మరి కాసేపట్లోనో పేలిపోయే ఒక బుడగలాంటిదని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: ఆంగ్ సాన్ సూచీపై అత్యంత తీవ్రమైన అభియోగాలు
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- ఇరాన్ ఎన్నికలు: హసన్ రౌహానీ తరువాత అధ్యక్ష పదవిని చేపట్టేదెవరు?
- నిరసనకారులపై కాల్పులు జరిగిన రోజు రాత్రి విందులో పాల్గొన్న మియన్మార్ ఆర్మీ జనరల్స్
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- మియన్మార్‌లో ‘సరోంగ్ విప్లవం’: మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- కరోనావైరస్ మృతుల విషయంలో ఇరాన్ ఎందుకు వాస్తవాలను దాచి పెడుతోంది...
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








