తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే ప్రాణాంతకంగా ఉంటుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బికీ మోర్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కోవిడ్ కన్నా మరింత ప్రాణాంతకమైనవి కావొచ్చని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒకరైన ప్రొఫెసర్ డామ్ సారా గిల్బర్ట్ హెచ్చరించారు.
మహమ్మారులను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని, దాని కోసం నిధులు కేటాయించాలని గిల్బర్ట్ అన్నారు.
అభివృద్ధికి భంగం కలగకుండా, ముందే సన్నాహాలు చేసుకోవాలని సూచించారు.
ఒమ్రికాన్ వేరియంట్‌పై వ్యాక్సీన్ల ప్రభావం తక్కువగా ఉండొచ్చని హెచ్చరించారు.
ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలు తెలిసేవరకు అప్రమత్తంగా ఉండాలని గిల్బర్ట్ అన్నారు.
"వైరస్ మన జీవితాలకు, జీవనోపాధికి ముప్పు కలిగించడం అనేది ఇక్కడితో ఆగిపోదు. నిజం ఏమిటంటే, తదుపరి వైరస్ ఇంత కన్నా ఘోరంగా ఉండొచ్చు. అది ఇంతకన్నా పెద్ద అంటువ్యాధిగా పరిణమించవచ్చు లేదా మరింత ప్రాణాంతకం కావొచ్చు. లేదా రెండూ కావొచ్చు."
"మనం ఎదుర్కున్నదంతా ఎదుర్కుని, ఆర్థిక నష్టాలు భరించి, మళ్లీ నిలదొక్కుకోవడం అంటే మహమ్మారి సంసిద్ధతకు నిధులు కేటాయించలేదని అర్థం. ఇలా మళ్లీ జరగకుండా చూసుకోవాలి."
"ఇంతవరకు మనం సాధించిన అభివృద్ధి, సంపాదించిన జ్ఞానం కోల్పోకూడదు” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది'
ఒమిక్రాన్ వేరియంట్ గురించి మాట్లాడుతూ.. దాని స్పైక్ ప్రోటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు ఉన్నాయని ప్రొఫెసర్ గిల్బర్ట్ అన్నారు.
"ఇదే కాకుండా ఈ వేరియంట్‌లో పలు రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల వ్యాక్సీన్లు లేదా పాత వైరస్‌ల వలన పెరిగిన యంటీబాడీస్ ఒమిక్రాన్ సంక్రమణను నిరోధించడంలో అంత ప్రభావం చూపించకపోవచ్చు."
"దీని గురించి మనకు మరింత సమాచారం లభించేవరకు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలి."
"అయితే, ఇంఫెక్షన్‌పై వ్యాక్సీన్ల ప్రభావం తక్కువగా ఉంటుంది అంటే వ్యాధి తీవ్రతరం అయిపోతుంది లేదా మరణాలు సంభవిస్తాయని కాదు." అన్నారు.
మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌ల తయారీ, మందుల పంపిణీ వేగవంతంగా జరిగిందని, ఇది ప్రమాణంగా మారాలని, మొత్తంగా ఇంఫ్లుయెంజా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఒక సార్వత్రిక ఫ్లూ టీకా అభివృద్ధి చేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. దక్షిణాఫ్రికాతో సహా పలు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకను నిలిపివేశాయి.
బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా నైజీరియాను రెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఆ దేశంలో కేసులు పెరుగుతుండడంతో విమానాల రాకపై నిషేధం విధించింది.
అయితే, ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని నిపుణులు అంటున్నారు.
"ఇదే వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తే కొద్ది రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను అధిగమిస్తుందని" బ్రిటన్‌కు చెందిన 'సైంటిఫిక్ పాండమిక్ ఇంఫ్లుయెంజా గ్రూప్ ఆన్ మోడలింగ్' సభ్యుడు ప్రొఫెసర్ వూల్‌హౌస్ బీబీసీతో చెప్పారు.
గత ఆదివారానికి బ్రిటన్‌లో 86 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. భారతదేశంలో అధికారికంగా 23 కేసులు వెలుగుచూశాయి.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- ‘తెలంగాణలో ఏ క్షణమైనా ఒమిక్రాన్ కేసులు.. ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్’
- కరోనావైరస్: mRNA వ్యాక్సీన్ తీసుకుంటే సూపర్ హ్యూమన్ అయిపోతారా?
- దిల్లీలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు
- కోవిడ్‌తో యూరప్‌లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కోవిడ్-19: ఒమిక్రాన్, డెల్టా, డెల్టా ప్లస్, ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లు అంటే ఏమిటి... ఇవి వ్యాక్సీన్లకు లొంగుతాయా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








