క్రిప్టోకరెన్సీ చట్టం గురించి ఎందుకింత గందరగోళం? కీలక ప్రశ్నలు... సమాధానాలు

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలోక్ జోషి
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఒక చట్టం తీసుకువస్తోందనే విషయం వినగానే చాలా మందికి ఉపశమనం లభించాల్సింది. కానీ దానికి విరుద్ధంగా జరిగింది.

క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో కలకలం రేగుతోంది. అప్పుడప్పుడూ వస్తున్న వార్తలను చూస్తుంటే ఈ గందరగోళం కొనసాగుతుందనే అనిపిస్తోంది.

మీరు ఆటల్లో టాస్ వేయడం చూసే ఉంటారు. కానీ పిల్లలు అప్పుడప్పుడూ టాస్ కోసం నాణేన్ని ఎగరేయడానికి బదులు కింద నేల మీద దాన్ని గిరగిరా తిప్పుతారు.

ఆ నాణెం ఎంతసేపు, ఎంత గట్టిగా శబ్దం చేస్తూ గిరగరా తిరుగుతుంది, అది ఎప్పుడు పడిపోతుంది అనేది నాణెం బరువు, నేల ఎంత చదునుగా ఉందనేదాన్ని బట్టి ఉంటుంది.

బిట్ కాయిన్‌ది కూడా ప్రస్తుతం గిరగిరా తిరిగే ఆ నాణెం పరిస్థితే. ఇది ఎప్పటివరకూ అలా తిరుగుతూనే ఉంటుందో చెప్పడం చాలా కష్టం.

దీని గురించి ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ప్రభుత్వం దీనిపై చాలా విషయాలు స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ముసాయిదా బిల్లు తసుకురాగానే దీనిపై ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి.

కానీ, ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రశ్నలు వెల్లువెత్తడానికి పూర్తి అవకాశం ఉంది. అంటే, ఏ గందరగోళానికి తెరపడుతుందని ఆశిస్తారో, అది బహుశా మరింత పెరిగిపోవచ్చు. అందుకే ఈ నాణెం ఎప్పటివరకూ గిరగిరా తిరుగుతుందో తెలీదు.

రిజర్వ్ బ్యాంక్

ఫొటో సోర్స్, Reuters

రెండు విషయాలు ధ్రువీకరించారు

క్రిప్టోకరెన్సీ బిల్లు ప్రవేశపెట్టడానికి పార్లమెంట్ విషయసూచికలో ప్రభుత్వం ఇచ్చిన వివరణను బట్టి, ఈ బిల్లు పేరును బట్టి మనకు ఇక్కడ రెండు విషయాలు జరగాలన్నది స్పష్టమవుతోంది.

ఒకటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీ మీద నిషేధం విధించడం, రెండోది భారత రిజర్వ్ బ్యాంక్ వైపు నుంచి వచ్చే ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ ఎలా ఉంటుంది, అది ఎలా నడుస్తుందనే నిబంధనలు నిర్ణయించడం.

రిజర్వ్ బ్యాంక్ ఒక డిజిటల్ కరెన్సీ తీసుకొస్తుంది. అది ఎలా నడుస్తుంది, ఎంత డిజిటల్‌గా ఉంటుంది, ఎంత కరెన్సీ ఉంటుందనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు త్వరలోనే మన ముందుకు వస్తాయి.

ఎందుకంటే, ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, అంటే తర్వాత నెలకే రిజర్వ్ బ్యాంక్ తన కరెన్సీ పైలెట్ అంటే పరీక్షించడం ప్రారంభిస్తుంది. దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక్కడ మరో కీలక ప్రశ్న కూడా ఉంది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీని అడ్డుకునే చర్యలు ఎలా ఉంటాయి. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీగా దేనిని పరిగణిస్తారు. బిల్లు విషయసూచికలో ఇచ్చిన వివరాల ప్రకారం ప్రభుత్వ మినహాయింపు లభించే క్రిప్టోకరెన్సీలో ఏవేవి ఉంటాయి. దేని ఆధారంగా ఈ మినహాయింపులు ఇస్తారు?

క్రిప్టోకరెన్సీ

ఫొటో సోర్స్, Reuters

ప్రశ్నల్లో దాగిన మెలికలు

ఈ ప్రశ్నల్లో మరి కొన్ని మెలికలు కూడా దాగున్నాయి. కానీ, వాటిని తెలుసుకునే ముందు మనం మొదట అసలు క్రిప్టోకరెన్సీ ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.

డిక్షనరీలో క్రిప్టో అనే పదానికి 'గూఢ' లేదా 'రహస్యమైన' అనే అర్థం ఉంది. అంటే దీనిని తెలుగులో గూఢ ద్రవ్యం అనవచ్చు.

గూఢలిపి శాస్త్రం(క్రిప్టోగ్రఫీ) అనేది కూడా బహుశా చాలా మంది వినుండకపోవచ్చు. కానీ, ఈ మొత్తం వ్యాపారం అంతా దీనిపై, అంటే క్రిప్టోగ్రఫీ లాంటి థియరీపై ఆధారపడి ఉంది.

క్రిప్టోగ్రఫీ అనేదానిని సులభంగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే 'దాచగలిగే కళ'. అలాగే క్రిప్టోకరెన్సీ అనే థియరీలో డిజిటల్ ఫైళ్లనే డబ్బుల్లా ఉపయోగిస్తారు.

ఈ డిజిటల్ ఫైళ్లను 'గూఢలిపి'(క్రిప్టోగ్రఫీ) పంక్తుల్లో సృష్టిస్తారు. ఇది, చాలా క్లిష్టమైన కోడ్‌లా ఉంటుంది. ఇక్కడ లావాదేవీలు సురక్షితంగా జరిగేలా డిజిటల్ సంతకం ఉపయోగిస్తారు.

అంటే నిజంగా డీల్ జరిగింది అని తీసుకునేవారికి కూడా అనిపించేలా, రహస్యమైన కరెన్సీ తన దగ్గరకు చేరింది అని వారికి ఉపశమనం లభించేలా చేస్తారు.

వీడియో క్యాప్షన్, క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? నగదు, క్రిప్టో కరెన్సీ చెల్లింపులకు మధ్య తేడా ఏంటి?

వినడానికి ఇదంతా బాగానే ఉంటుంది. కానీ, ఇక్కడే మీలో అసలు దీని ఉనికి లేదంటే అందులో మీ డబ్బు పెట్టడం సురక్షితమా అనే రకరకాల సందేహాలు, ప్రశ్నలు వెల్లువెత్తుతాయి.

కానీ, గత ఐదేళ్లలో 8 వేల శాతం సంపాదన అనేది వినగానే చాలా మందిలో ఆ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. లాభాల ఆశలు మిణుకుమిణుకుమంటాయి.

ఫలితంగానే భారత్‌లో లక్షలు కాదు కోట్ల మంది ఇలాంటి క్రిప్టోకరెన్సీల్లో డబ్బులు పెట్టేశారు. అలా ఎంతమంది, ఇందులో ఎంత డబ్బు చిక్కుకుపోయింది అనేదానిపై విశ్వసనీయమైన గణాంకాలేవీ వెలుగులోకి రావడం లేదు.

కానీ, క్రిప్టోకరెన్సీ వ్యాపారం తరఫున గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తా పత్రికల్లో వస్తున్న ఫుల్ పేజీ ప్రకటనల్లో దేశంలోని కొన్ని కోట్ల మంది పెట్టుబడిదారులు దాదాపు రూ.6 లక్షల కోట్ల డబ్బు క్రిప్టోకరెన్సీలో పెట్టారని చెబుతున్నారు.

6 లక్షల కోట్లు అంటే అది చాలా పెద్ద మొత్తం. దేశ జీడీపీలో మూడు శాతం. గత బడ్జెట్‌లో దాదాపు ఐదో భాగం.

నిజంగా, దేశంలో ఇంత మొత్తం క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిగా పెట్టారా? ఈ ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ వ్యాపారం ఆన్‌లైన్ అయినప్పటికీ, ఒక విధంగా అది అండర్‌గ్రౌండ్ వ్యాపారం కూడా.

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, EPA

ఎన్నోసార్లు ప్రభుత్వ సంకేతాలు

పత్రికల్లో ఈ ప్రకటనల కింద క్రిప్టోకరెన్సీ ఎక్చేంజీల పేర్లు కూడా ఉన్నాయి. వాటిలో పైన ఇంటర్‌నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బీఎసీసీ(బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్) పేరుంది.

బీఏసీసీ భారత్‌లో క్రిప్టోకరెన్సీ వ్యాపారానికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఒక ప్రవర్తనా నియమావళి రూపొందిస్తోంది. ఇందులో ఉండే ఎక్ఛేంజీలు, కంపెనీలు దానిని అనుసరిస్తాయని చెబుతోంది.

కానీ, ఇదంతా ఒక పాత్ర లాంటిది. ఆ ప్రకటనలో అసలు విషయం ఏంటంటే.. అంత మంది పెట్టుబడి పెట్టిన, అంత భారీ మొత్తం భద్రత కోసం ప్రభుత్వం క్రిప్టో వ్యాపారాన్ని రెగ్యులేట్ చేయడానికి పారదర్శక, రెగ్యులేటెడ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అంటే అలాంటి వాతావరణం రూపొందించాలి.

గత కొంత కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకటి కంటే ఎక్కువసార్లు క్రిప్టోకరెన్సీ గురించి ప్రస్తావించారు. ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చించడమే కాదు, ఈ వ్యాపారానికి సంబంధించిన వారిని పిలిపించి వారితో, ఆర్థిక నిపుణులతో సుదీర్ఖ చర్చలు జరిపింది. అందుకే, ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యాపారానికి పచ్చజెండా ఊపాలనే నిర్ణయానికి వచ్చిందేమో అనిపిస్తోంది.

అయితే, ఈలోపు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రమాద ఘంటికలు మోగించారు. దీనిపై దేశంలో ఎలాంటి సీరియస్ చర్చా జరుగుతున్నట్లు కనిపించడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దీనిపై అంత చర్చలు జరిపిన తర్వాత కూడా రిజర్వ్ బ్యాంక్ ఈ అంశంలో అంత ఆందోళన వ్యక్తం చేసిందంటే ఈ విషయం చాలా క్లిష్టమైనదని అర్థం.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Reuters

వ్యాపారం ఆశలు

ఆర్బీఐ నుంచి ఇది తొలి హెచ్చరిక కాదు. ఆర్బీఐ గవర్నర్ ఇంతకు ముందు కూడా ఇదే అంశంపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ అంశంపై సమావేశం జరిగింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చించింది.

క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో ఉన్నవారు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ, టీవీ, రేడియోల్లో కార్యక్రమాలు నడిపిస్తూ, చానళ్లలో పెద్ద పెద్ద కాన్ఫరెన్సులకు ఖర్చుచేస్తూ ఇది ఒక పెద్ద లాభసాటి వ్యాపారం అనే వాతావరణం సృష్టించడానికి వరుస ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చి దాని ప్రకారం నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ పదేళ్ల క్రితం నాటిది అని, క్రిప్టోకరెన్సీ లేకున్నా ఈ టెక్నాలజీ ముందుకు వెళ్లగలదని శక్తికాంత దాస్ చెప్పారు.

భారత్‌లో ప్రజల క్రిప్టోకరెన్సీ పెట్టుబడి గణాంకాలు చాలా పెద్దవి చేసి చూపిస్తున్నారని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీ కొనుగోలు చేసేవారిలో 70 శాతం మంది అందులో రూ.3 వేలు కంటే ఎక్కువ మొత్తం పెట్టడం లేదని కూడా ఆయన చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈ ప్రకటన రాబోవు కాలానికి సంకేతం అనేది సుస్పష్టం. ప్రభుత్వానికి సంబంధించిన వారు, చాలా మంది ఎంపీలు క్రిప్టోకరెన్సీపై చట్టం తీసుకొచ్చే హడావిడిలో కనిపిస్తున్నారు.

దీనికి ఒక కారణం కూడా ఉంది. ఈ వ్యాపారం చాలా వేగంగా పెరుగుతోందని, ఎలాంటి నియమ నిబంధనలూ లేకుండా, ఇది ఇలాగే పగ్గాలు లేకుండా ముందుకెళ్తే, ముందు ముందు ఏదో కష్టకాలం వస్తుందని వారంతా భావిస్తున్నారు.

కానీ, ఇప్పుడు ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ వ్యాపారానికి కళ్లెం వేసే సన్నాహాల్లో ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, BEATA ZAWRZEL/NURPHOTO VIA GETTY IMAGES

ప్రైవేట్, పబ్లిక్ క్రిప్టోకరెన్సీలో తేడాలు

ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీపై నిషేధం విధిస్తామని అయితే సర్కారు స్పష్టం చేసింది.

కానీ, ఇప్పుడు అదే మొదటి సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో ఆ కరెన్సీకి ఎంత ప్రైవసీ లభిస్తుందనే దాని ఆధారంగా ప్రైవేట్, పబ్లిక్ క్రిప్టోకరెన్సీ మధ్య తేడా ఉంటోంది.

ఇక్కడ ఈ వ్యాపారం గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు బ్యాంకుల్లో జరిగినట్లు ఉండవు. అక్కడ మన ఖాతా వివరాలు మన బ్యాంక్ లెడ్జర్ లో నమోదవుతుంది.

కానీ, ఈ వ్యాపారం ఇంటర్నెట్‌లో ఒకరికొకరికి సంబంధించిన ఎన్నో రకరకాల లెడ్జర్లతో నడుస్తుంది. అందులో పరస్పరం సమన్వయం కలిగించే పనిని బ్లాక్ చెయిన్ టెక్నాలజీ చేస్తుంది.

అంటే ఒక ఖాతాలో లావాదేవీలు జరిగినప్పుడు, అది స్వయంగా తన నెట్‌వర్క్‌లోని అన్ని లెడ్జర్ల దగ్గరకూ వెళ్తుంది.

అక్కడ దాని క్రాస్ చెకింగ్ జరుగుతుంది. అంటే ఆ డీల్ పక్కాగా జరిగిందా లేదా తెలుసుకుంటుంది.

అంటే, అక్కడ తప్పుడు ఎంట్రీలు, తప్పుడు లెక్కలు లేదా ఫోర్జరీకి ఎలాంటి అవకాశం లేదని అర్థం. ఒక లెడ్జర్‌లో జరిగిన ఒక డీల్ మిగతా అన్ని లెడ్జర్లతో మ్యాచ్ కాకపోతే, అది తనంతట తానే ఆ డీల్‌ను కాన్సిల్ చేస్తుంది.

అంటే మనం, వాటిలో ఏ ఒక్క లెడ్జర్‌ను చూడగలిగినా, మీకు మొత్తం ఆ నెట్‌వర్క్‌లో జరుగుతున్న అన్నీ డీల్స్ కనిపించగలవు. ఎవరి పర్సులో ఎన్ని బిట్ కాయిన్లు లేదా మిగతా క్రిప్టోకరెన్సీ నాణేలు చేరుతున్నాయి లేదా బయటికి వస్తున్నాయి కూడా చూడచ్చు.

వీడియో క్యాప్షన్, బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

బిట్‌కాయిన్, ఇథీరియమ్, లైట్ కాయిన్ లాంటి కరెన్సీలన్నీ ఇలాగే పనిచేస్తాయి. అక్కడ మీ పేరు, అడ్రస్ కనిపించదు. కేవల మీ డిజిటల్ వాలెట్ పేరు మాత్రమే కనిపించేంత ప్రైవసీ కచ్చితంగా ఉంటుంది.

కానీ, అవసరమైతే దీనిపై దర్యాప్తు తీగ మీ వరకూ చేరవచ్చు. అందుకే ఇలా పనిచేసే కరెన్సీని పబ్లిక్ క్రిప్టోకరెన్సీ అంటారు.

కానీ మరో రకం కరెన్సీ కూడా ఉంది. అవి మొత్తం సమాచారాన్ని బయటపెట్టవు. అక్కడ, మరింత జటిలమైన కోడ్ ఉపయోగించి వాలెట్ అడ్రస్‌తోపాటూ లావాదేవీల వివరాలు కూడా దాచిపెడతారు.

వీటిని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ అంటారు. వీటిలో మొనోరో, జీకాష్, డాష్ లాంటి ఎన్నో పేర్లు ఉన్నాయి.

ఈ నిర్వచనం అంతర్జాతీయ వ్యాపారంలో నడుస్తూ ఉండచ్చు. కానీ, భారత్‌లో పబ్లిక్, ప్రైవేట్‌కు ప్రభుత్వ, ప్రభుత్వేతర అని ఒకే అర్థం ఉంది. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విషయంలో కూడా అదే జరుగుతుందని అనిపిస్తోంది.

అంటే రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ప్రభుత్వంది అయితే, అది చెల్లుతుంది. మిగతా అన్ని ప్రైవేటుగా ఉంటాయి. అంటే అవి నడవవు. అయితే ప్రైవేట్ కరెన్సీపై నిషేధంలో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని ప్రభుత్వ బిల్లు సారాంశంలో ఉంది.

అందుకే, అసలు ఈ మినహాయింపులు ఏంటి, ఏ క్రిప్టోకరెన్సీని నిషేధం నుంచి మినహాయిస్తారు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా ఉంది.

ఏ విదేశీ క్రిప్టోకరెన్సీకి భారత్‌లో చెలామణికి అనుమతులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే నిర్ణయాధికారం ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకే ఇవ్వనుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

అంటే రిజర్వ్ బ్యాంక్ దేనికి మినహాయింపు ఇస్తే అది ప్రభుత్వ, దేనికి పచ్చజెండా చూపించదో వాటిని ప్రభుత్వేతరగా భావిస్తారు.

కొన్ని వర్గాల సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంలో క్రిప్టోకరెన్సీ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తోంది, ఆ టెక్నాలజీ భారత్‌కు ఎంత ప్రయోజనకరంగా నిరూపితం కాగలదు అనేది కూడా కీలక పాత్ర పోషించబోతోంది.

దీనితోపాటూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినవారికి, తమ డబ్బులు వెనక్కు తీసుకోడానికి సమయం కూడా లభిస్తుందని సంకేతాలు వస్తున్నాయి. బిల్లు ముసాయిదాలో ఈ వివరాలు ఉండవచ్చు, లేదా ప్రభుత్వం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి ఏ తేదీ లోపు జనం తమ ఖాతాను క్లియర్ చేయాల్సి ఉంటుందో చెబుతుంది.

దీనివల్ల తాము పెట్టుబడిగా పెట్టిన మొత్తం హఠాత్తుగా మునిగిపోయే ప్రమాదం ఉండదని చాలా మందికి భరోసా లభిస్తుంది. కానీ ఇప్పుడు ఈ చట్టం కళ్లెదుట వచ్చేవరకూ ఏ కాయిన్ మీద నిషేధం విధిస్తారు, దేనిపై ఆర్బీఐ కరుణ చూపుతుంది అనేది స్పష్టం కానంత వరకూ.. వీటిలో డబ్బు పెట్టిన వారికి మనశ్శాంతి లభించడం కష్టమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)